Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscopeoctober 4th to october 10th

ఈ సంచికలో >> శీర్షికలు >>

కర్నాటక తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

karnataka  viharayatralu

( శ్రీరంగపట్నం )

వైష్ణవులకు అతిముఖ్యమైన పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగపట్నం ఒకటి . దీనిని ఆది రంగక్షేత్రం అని వ్యవహరిస్తూ వుంటారు .  ఈ వారం ఆదిరంగక్షేత్రం గురించి చదువుదాం . వైష్ణవుల 108 దివ్యదేశాలలో యిది వొకటి .బెంగుళూరికి సుమారు 125 కిలోమీటర్లదూరంలో  ‘ మండ్య ‘ జిల్లాలో కావేరీనదీ తీరానవున్న అతిపురాతనమైన మందిరం .ఆర్కియాలజీ వారి ప్రకారం ఈ మందిరం క్రీస్తుశకం 984 లో అప్పటి పరిపాలకుడైన తిరుమలయ్య చే నిర్మింపబడింది . పన్నెండవ శతాబ్దం లో హోసల రాజవంశస్థుడైన విష్ణు వర్ధనుజు ఈ కోవెల ప్రాంతాన్ని శ్రీ రామానుజాచార్యులకు గురుకులం నడుపుకోడానికి అనుమతినిచ్చేడు . రామానుజాచార్యులు దీనిని అగ్రహారంగా తీర్చిదిద్దేడు . 1210 లో పరిపాలించిన వీరభల్లాల దేవ్ -2 ఈ మందిరంలో కావలసిన మరమ్మత్తులు చేయించి , కొత్తకట్టడాలను కూడా జోడించేడు .

కోవెల గోపురాలు మంటపాలలో విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళ కనిపిస్తూ వుంటుంది . విజయనగర రాజులు వీటిని నిర్మించి వుండవచ్చు .మొత్తం మందిరం రెండుప్రాకారాలలో వుంటుంది , మొదటి ప్రాకారంలో నవరంగమంటపం , ముఖమంటపం వుంటాయి . ముఖమంటపం పై భాగం శిలాతోరణాలతో అలంకరించి వుంటుంది , మంటప స్థంబాలకు ‘ స్టుకొ ‘ శిల్పకళతో మలచిన విగ్రహాలు వుంటాయి   గర్భగుడిలో విష్ణుమూర్తి ఆది శేషుని పడగల నీడలో పవ్వళించి నట్లు లక్ష్మీదేవి పాదాలవద్ద కూర్చొని వున్నట్లు వున్న విగ్రహం వుంటుంది . శ్రీదేవి , భూదేవి , బ్రహ్మ విగ్రహాలుకూడా గర్భగుడిలో వుంటాయి .

అంతరాలయాలలో నరసింహ , గోపాలకృష్ణ , శ్రీనివాసుడు , హనుమంతుడు , గరుత్మంతుడు , ఆళ్వారుల విగ్రహాలు చూడొచ్చు .శ్రీరంగపట్నం  కావేరీనదీ ద్వీపంలో నిర్మింపబడింది . సాధారణంగా యీ కోవెల దర్శించుకొనే భక్తులు కావేరీ నదీ స్నానం చేసుకొని స్వామి దర్శనానికి వెళతారు . హైదరాలీ టిప్పు సులే్తానుల పరిపాలనలో వారు శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకొని మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించేరు . ఆ కాలంలో యీ మందిరం పూర్తిగా మరుగున పడిపోయింది . కోవెల చాలా మటికి పడగొట్టబడింది . వడయారుల పరిపాలనలో తిరిగి శ్రీరంగం మందిరం పూర్వ వైభవాన్ని పొందింది .

దశరా నవరాత్రులలో ఈమందిరంలో విశేషపూజలు నిర్వహిస్తారు .మకర సంక్రాంతికి ఈ కోవెల రాత్రంతా కూడా తెరచి వుంచుతారు . విశేషంగా భక్తులు వచ్చి మకరసంక్రాంతి పుణ్యకాలంలో స్వామిని దర్శించుకుంటారు . మాకు ఆ అరుదైన అవకాశం లభించింది . పగలైతే రద్దీ యెక్కువని తెలివిగా రాత్రి వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాం , మకరసంక్రాంతి నాటి రాత్రి స్వామిని కోటి దీపాలతో అలంకరిస్తారు , ఆ అలంకరణ శ్రీరంగం వూరంతా వ్యాపిస్తుంది , కోటి దీపాల కాంతిలో స్వామిని దర్శించుకోడం కోసం జనాలు పోటెత్తి వస్తారు , క్యూ వూరుదాటి వుంటుంది , ఆ రోజు మాకు దర్శనం లేదనుకున్నాం , ఓ పోలీసాఫీసరు దయతో క్యూ లైనులో నిలబడక్కరలేకుండా తిన్నగా మంటపాలలోంచి విఐపి దర్శనం లభించింది . కోటిదీపాల కాంతిలో స్వామిని దర్శించుకోడం తలచుకుంటే యిప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది . కోవెల వెలుపల స్వామివారి దారువుతో చేసిన రధం , రధంమీద వున్న శిల్పాలూ కళ్లు చెదిరేటట్టు వుంటాయి . అన్ని వైష్ణవ పర్వదినాలలోనూ విశేష పూజలు నిర్వహిస్తారు .

ప్రస్తుతం యీ మందిరాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియ వారి సంరక్షణలో వుంది .

ముందుగా చెప్పేను కదా ? శ్రీరంగపట్నం హైదరాలీ , టిప్పుసుల్తానుల రాజధాని అని , టిప్పుసుల్తాను కోట కూడా యిక్కడ వుంది , అయితే ఆంగ్లేయులు చేసిన దాడులలో చాలా భాగం పాడయింది . టిప్పు సుల్తాను సమాధికూడా శ్రీరంగపట్నం లో వుంది ఆశక్తి వున్నవారు వాటిని కూడా చూసుకోవచ్చు .

పైన పంచరంగ క్షేత్రాల గురించి రాసేను కదా ? అవి యెక్కడ వున్నాయో వివరాలు తెలుసుకోవాలని మీ కనిపించి వుంటుంది , వాటి వివరాలుకూడా తెలియజేస్తాను . కావేరీ నదీ తీరాన వున్న అయిదు రంగ క్షేత్రాలను పంచరంగ క్షేత్రాలుగా ఆళ్వారులు గుర్తించేరు . ఈ అయిదు క్షేత్రాలను దర్శించుకుంటే మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వారి నమ్మకం . ఆదిరంగ క్షేత్రం శ్రీరంగపట్నం , సారంగపాణి మందిరం కుంభకోణం , పరిమళ రంగనాధ పెరుమాళ్ మైలదుత్తురై , నెల్లూరు రంగనాధ స్వామి కోవెల , శ్రీరంగం . శ్రీరంగం లోని రంగనాథుని అంత్య రంగనాధస్వామి అని అంటారు . శివసముద్రం లో వున్న రంగనాథుని మధ్య రంగనాధ స్వామి అని అంటారు . ఆమధ్య మరెవరో తిరుచ్చిలో మరో రంగనాధ కోవెల వుంది అది పంచరంగక్షేత్రాలలో వొకటి అని అన్నారు , వారు చెప్పినట్లుగా చూసుకుంటే పంచరంగ క్షేత్రాలు యేడు అని తేల్తున్నాయి , మరి నిజానికి యేవేవో ఆళ్వారులు రచించిన గ్రంథాలు చదివిన వారు చెప్పాలి .

వచ్చేవారం చాముండీదేవి కోవెల గురించి చదువుదాం అంత వరకు శలవు .

మరిన్ని శీర్షికలు
book review