Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

మొటిమలు - ఆధునిక చికిత్సా విధానం.! - ..

Acne - Modern Therapy.!

యుక్త వయసు వచ్చిందంటే చాలు, అతి కీలకంగా బాధించే సమస్య మొటిమలు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సరే దాదాపు ఈ సమస్య నుండి తప్పించుకోవడం అసాధ్యమే. అయితే, ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ వాడకం ద్వారా ఈ సమస్యను కొంతమేర నియంత్రణలో ఉంచుకోవచ్చు. కానీ, పూర్తిగా ఉపశమనం పొందలేం. అలా అని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కూడా లేదనే చెప్పాలి. ముఖ్యంగా నేటి యువత ఈ సమస్య బారి నుండి తప్పించుకోవడానికి ఆధునిక వైద్య విధానాలను అనుసరించేందుకు ఆసక్తి చూపుతోంది. ఆ నేపథ్యంలో ఎలాంటి ఆధునిక వైద్య విధానాలు అమలులో ఉన్నాయో బ్రీఫ్‌గా తెలుసుకుందాం. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే, కొన్ని రకాల చికిత్సలు మాత్రమే బ్యూటీ పార్లర్‌లలో చేయించుకోవాలి. నెక్స్‌ట్‌ లెవల్‌ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌ని అత్యాధునిక వైద్య పరికరాలతో, స్పెషలిస్ట్‌లు అయిన వైద్య నిపుణుల సమక్షంలో చేయించుకోవల్సి ఉంటుంది.

యుక్త వయసులో సహజంగా హార్మోన్స్‌ ఇంబాలెన్స్‌ కారణంగా మొటిమలు వస్తాయి. వాటికి తోడు పెరిగిపోతున్న కాలుష్యం ఈ సమస్యను మరింత జటిలం చేస్తోంది. వైద్యుల వద్దకు వెళితే, ముఖ్యంగా టాపికల్‌ రెటినాయిడ్‌ క్రీముల్ని మొటిమలు తగ్గించుకోవడానికి ప్రీమియమ్‌గా సూచిస్తారు. ఆ తర్వాతే అత్యాధునిక వైద్య చికిత్సల వైపు మళ్లిస్తారు. ఆధునిక చికిత్సలు అంటే, మొదటిగా చెప్పుకునేది లేజర్‌ ట్రీట్‌మెంట్‌. ఈ ట్రీట్‌మెంట్‌ ద్వారా మొటిమల నుండి కొంత ఉపశమనం పొందొచ్చు. అయితే, మొటిమలకు కారణమైన నూనె స్రవించే గ్రంధుల్ని నాశనం చేసేందుకు లేజర్‌ రేస్‌ని చర్మంలోకి చొప్పించడం వల్ల ఆ ప్రాంతంలో చర్మం ఎరుపెక్కడం, వాపు రావడం, తోలు ఊడిపోవడం వంటి కొత్త సమస్యల తలెత్తే అవకాశాలు లేకపోలేదు.

లైట్‌ థెరఫీ అనే మరో వైద్య విధానం ద్వారా కూడా మొటిమలు నియంత్రించేందుకు అవకాశముంది. అలాగే కొంతమందిలో తీవ్రమైన నొప్పితో కూడిన చీము గడ్డల్లా మొటిమలు వస్తుంటాయి. వీటి నుండి ఉపశమనం పొందేందుకు యాక్నే చికిత్స అందుబాటులో ఉంది. ఈ గడ్డల్లోంచి బాక్టీరియాని తొలగించడానికి స్టిరాయిడ్స్‌ని ఇంజెక్ట్‌ చేస్తారు. తద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందొచ్చు. కానీ, ఈ చికిత్స వల్ల అక్కడి చర్మం పలచబడిపోతుంది. అర్జెంట్‌గా వెళ్లాల్సిన పార్టీలు, ఫంక్షన్స్‌ కోసం రెడీ అయ్యేందుకు ఈ చికిత్సా విధానం సులువుగా అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు, మొటిమలు పెరగడానికి కారణమైన బాక్టీరియా వృద్ధిని ఆపేందుకు, చర్మంపై మృతకణాలు తొలిగించేందుకు, మొటిమల కారణంగా చర్మంపై పడిన గుంతలు నిర్మూలించుకోవడానికి రకరకాల వైద్య విధానాలు అందుబాటులో ఉన్న మాట వాస్తవమే. కానీ, వైద్య విధానం అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఆ చికిత్స ప్రభావం ఉన్నంత వరకు మాత్రమే అది పని చేస్తుంది. కానీ, ఆ తర్వాత మళ్లీ సమస్య మొదటికొస్తుంది. మొటిమలకు శాశ్వత పరిష్కారం వైద్య విధానంలో లేదనే చెప్పాలి. అందుకే ప్రముఖ నటి డింపుల్‌ బ్యూటీ సాయి పల్లవి మొటిమలతోనే అసలు సిసలు అందముంది అని నిరూపించింది.

మరిన్ని శీర్షికలు
praja padyam