(లోకాస్సమస్తాస్సుఖినోభవంతు) ఫేస్ బుక్ సమూహము ఎన్ని సాహిత్య ప్రక్రియలు వచ్చినా ఈనాటికీ పద్యం తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకొంటూనే ఉన్నది. వ్రాసేవారు ఈనాటికీ పద్యాలు వ్రాస్తూనే ఉన్నారు. అనేక పద్య కృతులూ రచనలూ వెలువడుతూనే ఉన్నవి.అయితే పద్యం అంటే ఒక రాజులూ జమీందారుల కాలానికి చెందిన ప్రక్రియ అని,ఈనాటి సమాజాన్ని పద్యం సరిగ్గా ప్రతిబింబించలేదనీ, అంటే పద్యం ఒకింత అభ్యుదయ దృక్పథానికి దూరంగా ఉన్నదనీఒక విమర్శ ఉంది.అయితే అభ్యుదయం అనేది ప్రక్రియనుబట్టి కాక అది నిర్వహించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని నమ్మి, పద్యాన్ని సమకాలీన అవసరాలకు తగ్గట్లుగా వినియోగించుకోవటం, పద్యాన్ని అందరు వ్రాయగలిగేటట్లు చేయటం, పద్యాన్ని ఒక ఉద్యమముగా ప్రచారం చేయటం అనే మూడు ముఖ్యోద్దేశాలతో ప్రజ-పద్యం (ఫేస్ బుక్ సమూహాన్ని) 2017 జనవరి 1 తేదీన వి.ఆర్.గణపతి( విశ్రాంత సీనియర్ మేనేజర్, ఆంధ్రా బ్యాంక్, కరీంనగర్) ఎన్.వి.అనంత కృష్ణ( హైకోర్టు న్యాయవాది, హైదరాబాదు), ఎం.వి.పట్వర్థన్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల,తెలుగు అధ్యాపకుడు, మంచిర్యాల) అను ముగ్గురు మిత్రులు కలసి ప్రారంభించాము. ఈ సమూహం ప్రధాన లబ్దిదారు సమాజము.
మొదటగా సామాజిక పద్య పోటీ పేర రచయతలు తమకు నచ్చిన సామాజికాంశము మీద పద్యరచనలు చేయమని ఆహ్వానించాము. పద్యం సమాజాన్ని పట్టించుకుంటే, పద్యం సమాజానికొరకు కొంత సరళీకృతమైతే ఆ పద్యం ప్రస్తుత సమాజానికి ఉపయుక్తముగా ఉంటుందని భావించి పోటీ నిర్వహిస్తే, అనూహ్యముగా మంచి స్పందన వచ్చి సుమారు 50 మంది పాల్గొన్నారు. సమర్థులైన న్యాయనిర్ణేతలతో వాటిని మూల్యాంకణ చేయించి తగు బహుమతులు అందించటమే కాక, దానిని ‘ప్రజ-పద్యం’ అనే పేరుతో ఒక పుస్తక రూపముగా ప్రకటించి కవులను ప్రోత్సహించుటేకాక, ఉచితముగా పంచటం కూడా జరిగినది. ఈ సమూహములో ఏ పోటీ నిర్వహించినా, పోటీ నియమాలకు లోబడి అడ్మిన్లు కూడా పోటీలో లేకుండానే పాల్గొంటారు.
అటు తరువాత ‘పద్య-పక్షము’ అను పేరుతో ఒక పన్నెండు పక్షముల కాలము, ప్రతి పక్షమునకు ఒక సామాజిక అంశాన్ని సమస్యగా ఇచ్చి ఐదు పద్యాలను అందులో ఒక వృత్తము తప్పక ఉండేలా నిర్ణయించి ఆయా అంశాల మీద వ్రాయుటకు ప్రోత్సహించాము. ప్రతి పక్షములోనూ దాదాపు 60 నుండి 70 మంది కవులు ఎంతో ఉత్సాహముతో పాల్గొన్నారు. ఆ రచనలలో ఎంపిక చేసి, ప్రతి కవివి రెండు పక్షాల పద్యాలు వచ్చేలాగు 12 పక్షాలలో వచ్చిన పద్యాలతో ‘ప్రజ-పక్షము- ఆణిముత్యాలు’ పేరిట పద్య సంకలనముగా వెలువరించాము.
అంతటితో ఆగకుండా అటు తరువాత, ఆనాడు రాజుల కోరిక మేరకు రాచరిక వ్యవస్థకు ఆ యా సంస్కృతులకు ప్రతీకలుగా ప్రబంధాలు వెలువడితే, మరి ఈనాడు సామాన్యుడు వ్రాసుకుంటున్న ప్రబంధాలు ఏవిధముగా ఉండాలి అని ఆలోచించి, ప్రస్తుత సమాజమును పీడిస్తున్న సమస్యలపై సంపూర్ణ విశ్లేషణ, పరిష్కార సూచనలను అందిస్తూ సామాజిక ప్రబంధ రచనకు శ్రీకారము చుట్టాము. సుమారు 29 కవులు ఈ మహత్కార్యములో తమ తమ ప్రబంధాలు వెలయించారు. అడ్మిన్లవి మూడు కలిపి 32 ప్రబంధాలు వెలయించారు. ఈ రకముగా ఏర్పడ్డ నాటి నుండి నేటివరకు కూడా నిరంతరము పద్యాన్ని జన సామాన్యములో ప్రచారం చేయటానికి, పద్యాన్ని సరళీకృతం చేయటానికి, పద్య వ్యాప్తిని పెంచటానికి మా సమూహము చిత్త శుద్ధితో కృషి చేస్తున్నది. పద్య ప్రచారమెందుకంటే అది తెలుగువారి ప్రత్యేకమైన ఆస్తి. దానిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి తెలుగువానిపైనా ఉన్నదన్న భావన. వ్యష్టిగా కొందరు రచయతలు ప్రబంధ రచన చేసి ప్రచురించినారు. కానీ ఒక యజ్ఞముగా, ఒక సామాజిక దృక్పథముతో ఏక కాలములో 32 సామాజిక ప్రబంధములు వెలయించుట సాహితీ చరిత్రలో ఒక మైలురాయి ఘట్టము అని ప్రజ- పద్యం నమ్ముతున్నది.
కేవలం అంతర్జాలములోనే కాకుండా యీ ఉద్దేశాలకు అనుబంధముగా వివిధ నగరాలు, పట్టణాలలో సమావేశాలు నిర్వహిస్తున్నాము. మొదటగా హైదరాబాదులో, పిదప గుంటూరులో, నిర్వహించాము. గుంటూరు సమావేశములో ‘ప్రజాపద్యమ్ డిక్లరేషన్’ అని ఒక చారిత్రాత్మక తీర్మానమును ఆమోదించడం జరిగింది. అందులో పద్యాన్ని సరళతరం చేయాలని, పద్యాన్ని యువతరం కూడా వ్రాసేటట్లుగా ప్రోత్సహించాలని, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చేయటం జరిగింది. అటుతరువాత విశాఖపట్నములోనూ, ఇటీవల వరంగల్లులోను సమావేశాలు నిర్వహించాము. ఈ సంవత్సరము జూన్ నెలలో బెంగళూరు నగరములో కూడా, స్థానిక తెలుగు పద్యకవులతో కలిసి నిర్వహించినాము. అక్కడ 9 శతకాలు కూడ ఆవిష్కరించబడినవి. ఈ సమావేశాలలో ఆయ స్థానిక కవులను కలవటం, వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకొనుటయే కాకుండా, వారి పద్యాలను వినడం, పాల్గొన్న యితర కవుల పద్యాలు వినిపించడం జరుగుతుంది. ఈ రకముగా భావ వినిమయం జరగుటకు ఈ సమావేశాలు ఒక వేదికగా చేసుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలలోను ‘ప్రజ-పద్యం’ పర్యటిస్తూ పద్యం ఒక ఉద్యమంలాగా చేస్తూ ఉన్నది. తమ తదుపరి సమావేశము రాజమహేంద్రవరములో చేయవలసినదిగా ఆహ్వానము వచ్చినది. త్వరలో అది నిర్వహించుకుంటాము.
అలాగే పద్యం వ్రాయాలని ఉత్సాహము ఉన్నా వ్రాయలేని వారికి ఫేస్ బుక్ సమూహములోనే పెద్దలతో సులభోపాయాలు చెప్పటం, వారు పద్య రచనా నైపుణ్యాన్ని సంతరించుకోవటం మా సభ్యులకు అనుభవమే. ఇది ఒక పద్య కుటుంబం. ఇందులో అన్ని వృత్తులవారు, అన్ని వయసులవారు ఉన్నారు. విదేశాలనుంచి కూడా సభ్యులు ఉండి, అవిశ్రాంతముగా పాలుపంచుకుంటున్నారు. ఇది ఒక ఎల్లలు లేని కుటుంబం. ఇక్కడ ప్రతి పద్య సమస్యకు సుమారు 1200 సభ్యుల చేతులు సహాయమందించటానికి సర్వదా సిద్ధముగా ఉంటాయి. ఉదాహరణకు వృత్త రచన కష్టమన్న కొందరు మిత్రులకు ఆ భయం తొలగించటం వారు అద్భుతమైన వృత్తాల రచన చేయటం సభ్యులకు అనుభవం. పూర్వ కవుల వృత్తాల విశ్లేషణ, సందేహ నివృత్తి ఆయా వృత్తాలలోనే ప్రశ్న-సమాధాన విధానముతో నేర్పే ప్రయత్నము. ఇప్పుడు మా సభ్యులకు వృత్తం ఒక భూతము కాదు వారి తోటి మంచి మిత్రుడన్నమాట.
‘ప్రజ-పదం’ తన సమయపాలన, క్రమశిక్షణకు, ఉద్దేశ్యాలకు నిబద్ధతతో కట్టుబడి ఉండుట మారుపేరుగా మా సభ్యులు ప్రశంసిస్తారు. సాహిత్యసభలంటే ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుందన్న సందిగ్ధత మా సభలలో ఉండదు. చెప్పిన సమయానికి సరిగ్గా ప్రారంభించి, ముగించటం ఒక వ్రతము. ఇది నచ్చిన ఎందరో పెద్దలు, లబ్ధప్రతిష్టులైన కవి పండితులు మా సమూహంలో చేరటమే దీనికి ప్రోత్సాహకము, గర్వకారణము కూడా. సమయ పాలన చేయని వారెంత పెద్దవారైనా ఎదురుచూపులు ‘ప్రజ-పద్యమ్’ చేయదు. సమాజ స్పృహకల్గిన ప్రతి కవి ఒక గొప్ప వ్యక్తి అని మా భావన.
పద్యము సమాజానికి తప్పక ఉపయోగపడుతుందని పరిపూర్ణముగా నమ్మి, అనుభవిస్తూ, అందరికి చేర్చే ప్రయత్నములో మేము కృతకృత్యులైనామని, ఇంకా ముందుకు తీసుకెళ్ళగలమని, మా సభ్యులందరూ తమ జీవితానుభవాన్ని రంగరించి మా వెంట వెన్నుదన్నుగా ఉండి ఈ యజ్ఞములో పూర్ణఫలము అందించటమే దీనికి ప్రధాన కారణమని నమ్ముతూ…. ‘పచ్చని పద్యాన్ని ప్రేమిద్దాం’ అని ముందుకు సాగుతున్నాము.
|