Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్‌ చిత్రసమీక్ష

tenali ramakrishna BA, BL movie review

చిత్రం: తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్‌
నటీనటులు: సందీప్‌ కిషన్‌, హన్సికా మోత్వానీ, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, ప్రభాస్‌ శ్రీను, పృధ్వీ, రఘుబాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై విజయ, సత్య కృష్ణ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌
నిర్మాణం: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్‌
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌ రెడ్డి, రూప జగదీష్‌
దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి
విడుదల తేదీ: 15 నవంబర్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే..

తెనాలి రామకృష్ణ (సందీప్‌ కిషన్‌) చెట్టు కింద ప్లీడర్‌ లాంటోడు. పాపం కేసుల కోసం నానా తంటాలూ పడుతుంటాడు. తెనాలి రామకృష్ణ తండ్రి మాత్రం, తన కొడుకుని గొప్ప లాయర్‌గా చూడాలనుకుంటాడు. కేసులు దొరక్క, పెండింగ్‌ కేసులు వెతుక్కుని, ఇరు వర్గాల మధ్యా రాజీ కుదుర్చి జేబు నింపుకుంటుంటాడు. ఈ సమయంలో అనుకోకుండా రాజకీయ నాయకురాలు వరలక్ష్మి దేవి (వరలక్ష్మి శరత్‌కుమార్‌) కేసు తెనాలి రామకృష్ణకి దొరుకుతుంది. తన జీవితాన్ని మలుపు తిప్పే కేసు అని భావించి, ఆ కేసుని టేకప్‌ చేసి, వాదించి, గెలిపిస్తాడు కూడా. కానీ, అక్కడే పెద్ద ట్విస్ట్‌. ఆ ట్విస్ట్‌ ఏంటి.? అన్నది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే..

సందీప్‌ కిషన్‌ తాను చెయ్యగలిగిందంతా చేశాడు. స్వతహాగా మంచి నటుడు కావడంతో, అన్ని కోణాల్నీ బాగానే ప్రెజెంట్‌ చేశాడు. సినిమా మొత్తాన్నీ తన భుజాన మోసేందుకు ప్రయత్నించాడు. అయితే, అతని పాత్రను ఇంకా బలంగా రూపొందించి వుండాల్సింది. హీరోయిన్‌ హన్సిక కేవలం గ్లామర్‌కే పరిమతమయ్యింది. వున్నంతలో ఫర్వాలేదన్పిస్తుంది ఆమె పాత్ర.

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఈ సినిమాలో మరో కీలక పాత్ర. ఆమె చాలా బాగా చేసింది. అయితే, ఆమె పాత్రని ఇంకా బాగా తీర్చిదిద్దే అవకాశం వుంది. ఆ ఛాన్స్‌ మిస్సయ్యాడు దర్శకుడు. ప్రభాస్‌ శ్రీను, సప్తగిరి, వెన్నెల కిషోర్‌.. ఇలా తెరపై చాలామంది నటీనటులు కన్పిస్తారు. అయితే, కామెడీ పెద్దగా వర్కవుట్‌ కాలేదు. కథ పరంగా ఇంట్రెస్టింగ్‌ లైనప్‌ వున్నా, కథనం విషయంలో దర్శకుడు డీలాపడ్డాడు. హాస్యం జోడించి కథను పరుగులు పెట్టించాల్సిన దర్శకుడు స్లో నెరేషన్‌తో విసిగించినట్లనిపిస్తుంది. మాటలు ఓకే. సంగీతం కూడా ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణపు విలువలు బాగానే వున్నాయి. ఎడిటింగ్‌ విషయానికొస్తే, కత్తెరకి ఇంకాస్త పదును వుంటే బావుండన్పిస్తుంది. చాలా సాగతీత సన్నివేశాలకు కత్తెర పడాల్సి వుంది.

కామెడీని బేస్‌ చేసుకుని సినిమా తీయాలనుకున్నప్పుడు, ఆ కామెడీని పక్కాగా తీర్చిదిద్దాల్సి వుంటుంది. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్‌ అనే ట్యాగ్‌లైన్‌ వున్న దర్శకుడి చేతిలోనే కామెడీ కిచిడి అయిపోవడం గమనార్హం. కథను ఎలా నడిపించాలి, ఎటు తిప్పి ఏ వైపుకి తీసుకెళ్ళాలో తెలియక దర్శకుడు తడబడ్డాడు. కథనం విషయంలో చాలా పొరపాట్లు కనిపిస్తాయి. సందీప్‌ కిషన్‌ నటన, హన్సిక గ్లామర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ తప్ప, సినిమాలో పెద్దగా ఆకట్టుకునే అంశాలేమీ లేవని నిస్సందేహంగా చెప్పొచ్చు. వున్నంతలో సత్య కృష్ణ కాస్త నవ్వించింది. కొన్ని చోట్ల కామెడీ విరక్తి పుట్టించేస్తుందంటే అతిశయోక్తి కాదేమో. ఓవరాల్‌గా దర్శకుడు ఓ మంచి ఛాన్స్‌ని సద్వినియోగం చేసుకోలేకపోయాడని చెప్పొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే..
తెనాలి రామకృష్ణ.. నవ్వించలేక తడబడ్డాడు

అంకెల్లో చెప్పాలంటే..
2.25/5

మరిన్ని సినిమా కబుర్లు
churaka