Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aacharaalu - Antarardhaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

“కొత్త" - భమిడిపాటి ఫణిబాబు

Problem with NEW

ఆనవాయితీగా ఉండేదానికి 'మార్పు' ఎప్పుడైనా వచ్చిందీ అంటే చాలు అంతా గందరగోళమే. ఈ "కొత్త" అనండి, "మార్పు" అనండి, వీటితో వచ్చే ఈతిబాధల గురించే ఈ వ్యాసం. ఉదాహరణకి మనకి అలవాటు అయిన నటీనటులతో ఏదైనా సినిమా వచ్చిందంటే, ఎవరి అభిమాన నటుడి సినిమాకి వాళ్ళవాళ్ళు ఎగేసుకుని మొదటిరోజు మొదటాటకి వెళ్ళడం ఖాయం. అదే ఏ సహృదయుడైన నిర్మాతో కొత్తనటీనటులతో సినిమా తీశాడనుకోండి, మొదటి వారం అంతా థియేటరు ఖాళీగా ఉంటుంది. ఏదో పత్రికలవారి రివ్యూలో, లేదా ఆ సినిమా చూసివచ్చినవారి నోటిమాటతోనో మొత్తానికి ఆ సినిమాని కూడా చూస్తారు. ఓ నలుగురు చూస్తేనేకదా, ఆ సినిమా హిట్ అయ్యేది.

అలాగే మనం నిత్యం వాడేవస్తువులు కూడా. చిన్నప్పటినుండీ ఇంట్లో నాన్నగారు  ఏదో ఫలానాబ్రాండు వాడడం చూసినందు వలన,ఓ టూత్ పేస్టనండి, ఓ బ్లేడనండి, ఓ హైరాయిలనండి, అంతదాకా ఎందుకూ లోపలవాడే దుస్తులదాకా  పాతవాటికే అలవాటు పడిపోయి, కొత్తవాటి జోలికి ఛస్తే వెళ్ళం. అదేదో " పాపం" అనుకుని, ఏదో పనైపోతోందిగా ఇప్పుడు కొత్తదెందుకూ అని సరిపెట్టేసికుంటాము. కానీ ఈ ఆధునిక యుగంలో ప్రతీ వస్తువూ రోజుకో బ్రాండు చొప్పున వస్తున్నాయి. పాతవాళ్ళ మాటెలా ఉన్నా, యువతరం మాత్రం మార్కెట్ లోకి కొత్తగా ఏదొస్తే దానికే వెళ్తారు.

మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, వాళ్ళింట్లో ఉన్న పసిబిడ్డ ని ఎత్తుకో బుధ్ధేస్తుంది. అదేదో ఆ పిల్లాడంటే ప్రేమా అభిమానమూ కాదు. ఏదో ఆమాత్రం "షో" చేస్తే, ఆ పిల్లాడి తల్లితండ్రులు సంతొషిస్తారనీ, కాఫీతొపాటు టిఫిన్ కూడా పెడతారనీనూ. అదేం కర్మమో కానీ, తీరా ఎత్తుకునేసరికి వాడుకాస్తా కెవ్వుమంటాడు, అక్కడికేదో మనం గిల్లేసినంత హడావిడి చేస్తాడు. దానికి సాయం మన ఇంటావిడ కూడా " అదేవిటండీ వాడిని ఏం చేశారూ.." అంటూ ఓ క్లాసుకూడా తీసికునే అవకాశం ఉంది.  ఈ గొడవంతా పడలేక, ఆ పిల్లనో పిల్లాడినో వాళ్ళ తల్లితండ్రులకి హ్యాండోవరు చేసి ఓ కుర్చీలో కూలబడతాము. పాపం ఈయన ఫీలింగ్స్ ఏమైనా హర్ట్ అయ్యేయేమో అని, " మావాడికి"కొత్త " అండీ, లేకపోతే అసలు ఏడవనే ఏడవడండీ.." అని ఆ ప్రకరణానికి తెర దింపుతారు.

కొత్తగా కట్టిన ఫ్లాట్, అదీ పై అంతస్థులో కొన్నామనుకోండి, వర్షాకాలం దాకా బాగానే ఉంటుంది. నాలుగైదు వర్షాలు పడడంతోనే, గోడలు చెమ్మగిలడం, అక్కడక్కడ బీటలు తీయడమూ ప్రారంభిస్తుంది. అయ్యో లక్షలు పోసికొన్నామూ ఇలా ఉందేమిటీ అని ప్రతీ రోజూ టెన్షనే. దీనికి సాయం ఇంటికొచ్చిన ప్రతీవాడూ సలహా ఇచ్చేవాడే ఫలానా  వాటర్ ప్రూఫ్ కోటింగు వేయించండీ, ఆ బీటల్లో అదేదో "పుట్టీ" పెట్టించండీ అంటూ. ఇంట్లోవాళ్ళ సతాయింపు సరేసరి.

ఏదైనా కొత్తగా ఉద్యోగానికి ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళగానే మొదటి ప్రశ్న- అనుభవం ఉందా- అంటూ. ఎవడైనా ఉద్యోగం ఇస్తేనే కదా అనుభవం వచ్చి ఏడిచేదీ? అది ఆ ఇంటర్వ్యూచేసేవాడికీ తెలుసు, వాడూ అలాటి బాధలు పడ్డవాడేకదా, ఇంకోళ్ళని అలాటి ప్రశ్నలు వేయడం ఓ పైశాచికానందం. కాలేజీల్లో కొత్తగా చేరినవారిని సీనియర్లు ర్యాగింగు చేసినట్టన్నమాట !

ఇంక కొత్త ఊరికి వెళ్ళినప్పుడు వచ్చే కష్టాలు ఇంకో రకం. అద్దెకు కొత్తవారికి ఇవ్వాలంటేఎంతో ఆలోచిస్తేనే కానీ ఇవ్వరు. ఊరికి ఏమూల ఏముందో తెలియదు. సరుకులు చవగ్గా ఎక్కడ దొరుకుతాయో తెలియదు.ఏ కొట్టులోనూ అరువివ్వడు, అంతా రొఖ్ఖమే. పాల వాడకం వాడు ఎడ్వాన్సుగా డబ్బులిస్తేనే కానీ పాల ప్యాకెట్లు ఇవ్వనంటాడు. మనం ఏరాత్రివేళో వస్తూంటే ఆ సందులో ఉండే కుక్కలన్నీ మనవెంట పడతాయి, పాపం వాటికీ మనం "కొత్తే" కదా. ఓ నాలుగురోజులు అలవాటు పడితే అవీ ఊరుకుంటాయిలెండి.

ఇదివరకటి రోజుల్లో ఆఫీసుల్లో Attendance recorders అనేవి ఉండేవికావు. కానీ ఇప్పుడు ఎక్కడచూసినా అవే. కానీ ఎంట్రెన్స్ గేట్ దగ్గరే ఉంటూంటాయి. వాటిలో అదేదో ఓ సారి దూర్చేసి, ఓ నొక్కు నొక్కితే మనం వచ్చిన టైము రికార్డైపోతుందిట. మన ఎటెండెన్స్ వరకూ ధోకా లేదు. మామూలుగా ఏం చేస్తూంటారంటే ప్రొద్దుటే  టైముకే వస్తారు, కానీ అందరితోనూ బాతాఖానీ వేసికుని, సావకాశంగా తన క్యాబిన్ కి చేరుతూంటారు.  వీళ్ళ ఆటలు కట్టిద్దామని కొత్తగా వచ్చిన ఆఫీసరు ఓ అటెండెన్స్ రిజిస్టరు ఒకటి మొదలెట్టారనుకోండి, ఇంక అంతే సంగతులు.

బ్యాంకుల్లో కొత్తగా ఎకౌంటు తెరవాలంటే పడేపాట్లు ఎవరికి తెలియవు?

నగరాల్లో చూస్తూంటాము, ప్రతీరోజూ అలవాటుగా బైక్కుమీదో, కారుమీదో వెళ్ళే రోడ్డు కాస్తా అకస్మాత్తుగా " ఒన్ వే” అయిపోతుంది. మామూలుగా వెళ్తే సడెన్ గా ఏ పోలీసో వచ్చేసి నానా గొడవా చేసేస్తాడు. అలా "ఒన్ వే" అయిపోవడానికి కూడా పెద్ద కారణం ఉండఖ్ఖర్లేదు, అంతకు ముందు రోజు ఏ పోలిసు అధికారో కారులో వెళ్ళడానికి నానా తిప్పలూ పడి ఉంటాడు. కోపం వచ్చేసి మర్నాడు ఆఫీసుకి వచ్చేసి, ఠాఠ్ ఆ రోడ్డుని "ఒన్ వే" చేసేయండి అంటాడు ! ట్రాఫిక్కులు కంట్రోల్ చేయడానికి పేద్ద కారణాలే ఉండఖ్ఖర్లేదు.

అంతదాకా ఎందుకూ మన ఇళ్ళల్లో అవేవో "బొద్దింకలు" లాటివి వస్తూంటాయే, వాటిని పోగొట్టడానికి మార్కెట్ లో ఏవేవో మందులు "లక్ష్మణ రేఖ" లాటివి వస్తూంటాయి. మొదటిరోజు ఎంతో ఓపిగ్గా ఇంటినిండా ముగ్గులు పెడుతూంటాము. మర్నాటి ప్రొద్దుటకి కావాల్సినన్ని బొద్దింకల పార్ధివ దేహాలు పడుంటాయి. ఆ ముచ్చట మాత్రం ఎన్నాళ్ళంటారు,  ఓ నాలుగు రోజులు. తరువాత ఆ మందుకి అలవాటుపడిపోయి, దాన్ని ఓ టిఫిన్ లాగ తింటూంటాయి, పైగా మనెదురుగుండానే !ఇంకో కొత్త మందువస్తుంది.

ప్రతీరోజూ షూస్ వేసికోవడం అంటే ఎవరికైనా శ్రమే కదా. ఏదో ఉద్యోగంలో ఉన్నంతకాలమూ విధాయకం. రిటైరయిన తరువాత చేతినిండా కావాల్సినంత టైమూ. ఊళ్ళో ఉండే స్నేహితుల్నీ, చుట్టాలనీ కలిస్తే వాళ్ళని చూసినట్టూ ఉంటుంది, పైగా రేపెప్పుడో ఈ లోకంనుండి వెళ్ళిపోతే కనీసం ఆ నలుగురైనా వస్తారూ అని. ఉద్యోగంలో ఉన్నంతకాలమూ, వాళ్ళసలు ఉన్నారో ఊడేరో కూడా పట్టించుకోలేదు, అది వేరే విషయం , వదిలేయండి. గుళ్ళూ గోపురాలూ కూడా ఎక్కువవుతాయి. కాళ్ళకి షూస్ వేసికుని ఎక్కడెక్కడకు వెళ్తారూ? ఓసారి తీసినతరువాత ఆ తాళ్ళూ అవీ కట్టుకోవాలంటే మళ్ళీ అదో యజ్ఞం, పైగా ఆ షూస్ గుడి బయట పెడితే దానిమీదే దృష్టంతా. ఈ గొడవలు పడలేక ఓ చెప్పుల జత ఒకటి తీసికుంటాడు. కొత్తదవడంతో అది తప్పకుండా కరుస్తుందే.. ఇంక మన కాలికి వేసికున్న బ్యాండ్ ఎయిడ్ల మాసికలు చూసి, ప్రతీవాడికీ చెప్పఖ్ఖర్లేకుండానే తెలుస్తుంది మాస్టారు కొత్త చెప్పులు కొనుక్కున్నారోచ్ అని !

ఇంట్లో కొత్తగా ఓ పసిబిడ్డ పుట్టాడనుకోండి, ఇంట్లో పురుడూ పుణ్యమూ చూసుకున్న ఇంటి పెద్దావిడ, చక్కగా తన పాత చీర ఒకటి తెచ్చి ఆ పసిపాపకి చుట్టబెడుతారు. కానీ అప్పుడే సావకాశంగా వచ్చిన వియ్యపురాలు మాత్రం, ఎంతో ఘనకార్యం చేసినట్టు అవేవో డయపర్లూ అవీ తెస్తుంది. కానీ పాత చీరలో ఉన్న మెత్తదనం ఈ కొత్త డయపర్లలో ఎక్కడా? అలాగే ఇంటికి ఎవరైనా ఓ అతిథి వచ్చారంటే, స్నానం చేసే బాత్ రూమ్ములో,  బీరువాలోంచి తీసిన గడి విప్పని కొత్త తువ్వాలోటి పెడితే, అది ఇంకక ఆ వచ్చినాయన నానా తిప్పలూ పడతాడు.

చూశారా "కొత్త" లో ఎన్ని తిరకాసులున్నాయో? అలాగని మార్పు అనేది ఉండకూడదని కాదూ, కొద్దిగా ఆలోచించి, వాటిలోని సాధక బాధకాలు కూడా చూసుకోవాలి.

మరిన్ని శీర్షికలు
Navavidha Bhaktulu