Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Problem with NEW

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవీన ‘నవ విధ - భక్తులు.’ - హైమా శ్రీనివాస్

Navavidha Bhaktulu

ఈ ఆధునిక కాలంలో అందరికీ ’నవ విధ‘ భక్తుల గురించీ, [అసలు భక్తిగురించీ] తెలీకపోవచ్చుకానీ, నవీన నవ విధ భక్తులని తెలీకుండానే వాటిలో ఏదో ఒక లేక కొన్ని భక్తుల్లో పడని వారే లేరని ఖచ్చితంగా చెప్పవచ్చు. అసలు భక్తి అంటే భగవంతుని యందు ఉండే 'శ్రధ్ధ' కదా! అలాగే దేనిమీదైనా ఉండే 'తీవ్రమైనశ్రధ్ధ' ను దానిపట్ల భక్తి అని ఎందుకు అనకూడదూ!? 'నవీననవవిధభక్తుల' గురించీ, కొద్దిగా చెప్పుకుందాం ...

1. పనిమనిషి భక్తి.- [పతిభక్తిని మించిన] ఇంట్లోవారికి, ఇంటాయనకూ ఇంట్లోవారికి, ఇంటాయనకూ కూడా పనమ్మాయి తర్వాతే కాఫీ, టిఫినూనూ, మొదటికప్పు ఆదేవతకివ్వకపోతే ఫిల్టర్ డికాక్షన్ పల్చబడిపోతుందాయె! సర్వెంట్ మెయిడ్ లేకుండా గడవదాయె![అమేరికాలో కాదు] కనుక ఆమెకు గౌరవం, మర్యాద, పరామర్సలు దండిగా కురిపించి మెరిపిస్తేనే మర్నాడు హాజరు, లేకపోతే రజాయే! మెయిడ్ పక్కింట్లోంచే 'రాలే' దని చెప్పిస్తుందాయె! ఇంకా ఎక్కువగా చెప్పాల్సిన పన్లేదనుకుంటాను. కనుకే ఇది నవీన భక్తుల్లో దీనికి మొదటిస్థానం ఖాయపర్చుకుందిలెండి.

2.  ‘ఇంటీరియర్ డెకరేషన్ ‘భక్తి [and ఒంటీరియర్ డెకరేషన్ ]— అదే’గృహాలంకరణ’[ ‘దేహాలంకరణ’ భక్తి.!]? ఇంటిని అందంగా అలంకరించుకోడమూ, ఒంటిని అందంగా ఉంచుకోడమూ ఒక భక్తే, అంతా మెచ్చుకుని మేక తోలు కప్పుతుంటే ఎవరైనా ఇట్టే ఆభక్తిలో మొల లోతువరకూ కూరుకుపోయి, ములిగిపోతారు.

3. పాపులారిటీ భక్తి;- ప్రతిమనిషికీ ఆడ మగ, ముసలిముతక, పిల్లపీచు అనేవయో భేదంలేకుండా గుర్తింపుకు పడిచస్తారు, రాజకీయనాయకులనుండీ, స్టూడెంటు లీడర్లవరకూ, పండితులనుండీ పామరుల వరకూ, కధకుల నుండీ, కామెంటీర్సువరకూ [ఇహనటులగురించీచెప్పక్కర్లేదు] గుర్తింపుకోసం పడే తాపత్రయం అంతా ఇంతా కాదు.

4. పదవీభక్తి-- దేవతలరాజైన దేవేంద్రునికే పదవి పోతుందన్నభయంతో ఎవరు తపస్సు చేస్తున్నా రంభ ఊర్వశాదుల ను పంపి, తపోభంగం కావించను ప్రయత్నించేవాడు. ఇహమానవులెంత! పదవంటే అంత తీపిఅందరికీనీ! పదవీ వ్యామోహమో, పదవిలోఉంటే లభించే గౌరవమో, పదవి ఉంటే నల్లధనం మూటలు సంపాదించవచ్చనే ఆశో, .ఏదైతేనేం? ఆకుర్చీ కోసం కుమ్ములాటలు, చివరకు మానవులు పదవికోసం దేవునిక్కూడా ఎరచూపుతున్నారు ముడుపులపేర! హతవిధీ!

5. ' ఛాటింగ్ భక్తి!' – ఇంటర్ నెట్ ఉంటే చాలు, కంప్యూటర్ నాలెడ్జ్ అంతగా లేకున్నా కనిపించిన వారందరితో ఛాటింగ్!!. కాని ఖర్చూలేదు, కాలక్షేపానికి లోటులేదు. ఎంచక్కా కాలం విసుగులేకుండా గడిపేయొచ్చో! ఎంత జొల్లుకబుర్లైనా చెప్పేసుకోవచ్చు! ఎన్నిగొప్పలైనా గోప్యంగా కొట్టేసుకోవచ్చు! టైపింగ్ వస్తేచాలు! ఆతర్వాత ముదిరి పాకానపడి ఏవేవో అఘాయిత్యాలు! ఎందుకొచ్చిన ఖర్మ ఇది!

6. వ్యక్తిపూజభక్తి –[ఫాన్స్ భక్తి ,హీరో వర్షిప్] అటు సినిమానాయకీ నాయకులను, కొంతమంది విలన్స్ నూ ఇష్టపడి పూజిస్తారు, కొన్ని సినిమాలు విడుదలయ్యేఫ్ఫుడు [వెండి] తెరపై కిరంగుల, తళుకు కాయితాలూ, పూలూ విసురుతూనే ఉంటారు, ఈలలు, అరుపులు, కేకలు వంటివి హీరోలపైఉన్న భక్తికి నిదర్శనాలు. ఇహ రాజ కీయనాయకుల ఉపన్యాసాలు జరిగినంతసేపూ కేకలే కేకలు, అరుపులూనూ! చప్పట్ల కు కొదవేలేదు. నాయకులు చెప్పేమాటలు విన్నా, వినకున్నా, అర్ధమైనా, కాకున్నా, ఓటేలేని కుఱ్ఱకారంతా జేజేలు పలుకుతూ, జెండా లెగరేస్తూ అరుస్తుంటారు.

7. బుల్లితెర [సీరియల్] భక్తి.- నవీన నవవిధ భక్తులన్నిట్లోకీ చాలా ప్రాశస్య్తమైనది. బుల్లితెర! ఆ సీరియల్స్ షుమారు నాలుగైదేళ్ళ పాటు  నోట్లోని బబుల్ గం సాగినట్లు సాగుతూనే ఉంటాయి. ఇవి చూసేవారు దేవుని ముందు దీపం పెడతారో లేదో కానీ టి.వీ స్విచ్ వేసి ఉంఛడంలో మాత్రం ఏమారరు. ఎప్పుడైనా కరెంట్ పోతే మహాబాధపడి పోతారు, ఆ సీరియల్స్ కోసం జెనరేటర్సో, యు.పి.ఎస్సో  ముందుగానే ఏర్పాటు చేసి ఉంచుకుంటారు, తిండీ నీళ్ళన్నా మానేస్తారుగానీ  సీరియల్స్ చూడటం మాత్రం మిస్సవ్వరు. భోజన సమయాలూ మారిపోతాయి.

8. షాపింగ్ భక్తి.. ఏకొత్త వస్తువైనా మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు మొదటి కొనుబడి బిల్ తమదే కావాలని పోటీపడివెళ్ళి, కొత్తగా రిలీజైనవన్నీ ముందుగా తామే కొని ప్రదర్శించడం. ఆరోజు ఇంట్లో వంటా వార్పూ కూడా ఉండవు, మాల్స్ లో దొరికే చెత్తాచెదారంతో కడుపునింపుకుని ఖాళీపర్స్ తో, ఏ.టీ. యం కార్డ్ ఊడుకుని యటపడతారు, శనిదేవుని దర్శనానికి వెళ్ళి వచ్చినట్లు.

9. ’మొబైల్ భక్తి- చేతులు దానమివ్వటం వలన  శోభిస్తాయి’, అంటారు పెద్దలు, ‘పుస్తకం హస్త భూషణం’ అప్పటి మాట, సెల్ఫోన్ చేతికి అందం 'నేటిమాట! చిన్ననుండీ పెద్దవరకూ, సాఫ్ట్ వేర్ ఉద్యోగినుండీ —సానపట్టే వాడివరకూ, పాలకులనుండీ పాప్ కార్న్ అమ్మకందారు వరకూ మొబైల్లేని వాడు మనిషే కాదు. పెళ్ళి మంత్రాలు చదివే పూజారి సైతం మధ్య లో ఫోన్ రింగవ్వగానే మంత్రాలు ఆపి దానికి అటెండై ఆతర్వాతే మంత్రాలు! ఇహ కొన్నాళ్ళకు ఇంటర్ నెట్ వ్రతాలు లాగా మొబైల్ పెళ్ళిమంత్రాలు రావచ్చేమో! .ఈ మొబౌల్ భక్తి ఇంతింతై వటు డింతై అన్నట్లు పెరిగిపోయి పాపులరైపోయింది.

ఈనవీన నవ విధ భక్తులలో దేనికో ఒకదానికి లోబడని వారే నేటి ప్రపంచంలో లేనే లేరని ఘంటా పధంగా చెప్పవచ్చు. మరి మనం ఏభక్తిలో  ఉన్నామో, ఎన్ని భక్తుల్లో ఉన్నామో మనకు మనమే తేల్చుకోవల్సి ఉంది. చివరగా చెప్పొచ్చేదేంటంటే ఈనవీన నవ విధ భక్తులపట్ల కడు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరిక! 

మరిన్ని శీర్షికలు
dakshinayana and uttarayana