Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

నా స్వార్థంకోసం సినిమాలు చేయను! - లక్ష్మీ ప్రసన్న

interview with lakshmi prasanna
మోహ‌న్‌బాబు కూతురు అనే ట్యాగ్‌ని ఎప్పుడో తొల‌గించుకొంది ల‌క్ష్మీప్రస‌న్న‌. న‌టి, నిర్మాత‌, బుల్లితెర హోస్ట్‌... ఇలా ర‌క‌ర‌కాల అవ‌తారాల‌తో   త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపును తెచ్చుకొంది. ఒక్కమాట‌లో చెప్పాలంటే... గ్లామ‌ర్ ప్రపంచంలో దూసుకెళ్తోంది. చిన్నప్పట్నుంచీ  స్వతంత్రభావాల్ని అల‌వ‌ర్చుకొన్న లక్ష్మీప్రస‌న్న స్వేచ్ఛగా అడుగులేస్తోంది. త‌న‌కి ఇష్టమొచ్చిన రీతిలో డ్రెస్సులేసుకొంటుంది. ఇష్టమైన ప‌నుల‌న్నిటినీ  చేసేస్తుంది. ``నేను నాలాగే ఉండాల‌నుకొంటాను. ఎవ‌రేమ‌నుకొన్నా ఫ‌ర్వాలేదు`` అని చెబుతుంటుంది. తొలి అడుగుల్లోనే విశిష్ట న‌టిగా గుర్తింపు తెచ్చుకొంది ల‌క్ష్మీ ప్రస‌న్న. తొలి చిత్రం `అన‌గ‌న‌గా ఓ ధీరుడు` చిత్రంలో న‌ట‌న‌కు గానూ ఉత్తమ ప్రతినాయిక‌గా  నంది పుర‌స్కారాన్ని ద‌క్కించుకొంది.  ఆ పుర‌స్కారం ద‌క్కించుకొని తొలి వ‌నిత‌... లక్ష్మీప్రస‌న్నే. తాజాగా `చంద‌మామ క‌థ‌లు` సినిమాలో లీసాస్మిత్ అనే మోడ‌ల్‌గా న‌టించింది. ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మీతో ముఖాముఖి.

* ఒక‌చేత్తో సిగ‌రెట్టు, మ‌రో చేత్తో మందు గ్లాసు. ఇంత సాహసం ఎలా చేయ‌గ‌లిగారు?
- అదంతా నాన్నగారు ఇచ్చిన ధైర్యమేనండీ. న‌టుడు అనేవాడు అన్ని ర‌కాల పాత్రలు చేయ‌గ‌ల‌గాలి అనేది ఆయ‌న నమ్మిన సిద్ధాంతం. ఆయ‌న వార‌సురాలిగా నేను కూడా అదే బాట‌లోనే వెళుతున్నా. ఒక మంచి పాత్రకోసం ఎంత క‌ష్టప‌డినా ఫ‌ర్వాలేద‌ని చెబుతుంటారు నాన్నగారు. నాకు ద‌ర్శకుడు ప్రవీణ్ స‌త్తారు అప్పజెప్పిన పాత్రను పండించ‌డం కోసమే ఇదంతా చేశా.  సిగ‌రెట్ కాల్చడం, మందు కొట్టడ‌మే కాదు...  సినిమాలో బూతులు కూడా  ఎక్కువ‌గా మాట్లాడుతుంటాను. `ఇన్ని బూతులు నాతో మాట్లాడించేస్తున్నారు, సెన్సార్‌వాళ్లు బీప్ సౌండ్స్ ఇచ్చి వ‌దిలేస్తారు, ఆ త‌ర్వాత మీ ఇష్టం` అని ద‌ర్శకుడిని హెచ్చరించా. `ఏం ఫ‌ర్లేదు... ఆ బీప్ సౌండ్స్‌తోనే జ‌నాల‌కు విష‌యం అర్థమైపోతుందిలెండి` అని చెప్పి నాతో డైలాగులు చెప్పించారు.

* సిగరెట్ తాగే విషయంలో ఇబ్బందులేమీ ఎదురుకాలేదా?
- మామూలు ఇబ్బందులు పడలేదండి బాబూ... స్టైల్ గా కాల్చాలని చాలా సినిమాలు చూశా. ముఖ్యంగా ఫ్యాషన్ సినిమాలో కంగన నటనని ఒకటికి పదిసార్లు పరిశీలించా. ఆ తర్వాతే సెట్ కి వెళ్ళా. మొదట కాస్ట్లీ సిగరెట్స్ నాతొ కాల్పించారు. పరవాలేదులే అనుకున్నా. ఆ తర్వాత చీప్ సిగరెట్స్ తెచ్చారు. అదేంటి ఇవిచ్చారు అని అడిగితే... ఇపుడు మీ దగ్గర డబ్బులు లేవు, అందుకే ఇవి కాలుస్తున్నారు అని చెప్పాడు దర్శకుడు. నాకైతే ఏడుపొచ్చిందనుకోండి.

* సిగరెట్ సన్నివేశాల్లో నటించినందుకు మరి మీ నాన్నగారు ఏమీ అనలేదా?
- ఆయ‌న‌కి ఈ సినిమా ప్రోమోస్ కూడా చూపించ‌లేదు. త‌మ్ముళ్లు చూశారు, వాళ్లేమీ అన‌లేదు. నాన్నగారు మాత్రం ఎలా స్పందిస్తారో అనే భ‌యం ఉంది. ఆయ‌న‌కి నేరుగా సినిమా చూపించాల‌నుకొంటున్నా. సినిమా చూశాక త‌ప్పకుండా నా నిర్ణయాన్ని అభినందిస్తార‌న్న న‌మ్మకం ఉంది.

* `చంద‌మామ క‌థ‌లు`లో ఎనిమిది క‌థ‌లు ఉన్నాయంటున్నారు. అందులో మీది  ఓ క‌థ. ఇలాంటి చిత్రాల‌తో మీలాంటి ఓ న‌టికి  వ‌చ్చే గుర్తింపు  ఎంత‌?
- నా స్వార్థం కోసం ఎప్పుడూ సినిమా చేయ‌ను. క‌థని కూడా ఓ క‌థ‌లాగే వింటాను త‌ప్ప... అందులో నా పాత్ర ఏమిటి అని ఎప్పుడూ అడ‌గ‌ను.   నా ఆలోచ‌న‌లు కూడా అటువైపు  వెళ్లవు. ఒక మంచి క‌థ‌లో నేను ఓ భాగం కావాల‌నుకొంటానంతే. ఈ సినిమా ఒప్పుకోవ‌డం వెన‌క కార‌ణం  అదే. ప్రవీణ్ స‌త్తారు క‌థ గురించి చెబుతున్నప్పుడే నాలో ఏదో తెలియ‌ని ఓ  ఉత్సాహం. ఇలాంటి సినిమాలో నేను భాగ‌మ‌వుతున్నా అని సంబ‌ర‌ప‌డుతూ వెంట‌నే ఓకే చెప్పేశాను.

* `చంద‌మామ క‌థ‌లు` అంటే చిన్నప్పుడు చ‌దువుకొన్న నీతి క‌థ‌ల్లా ఉంటాయా?
 - అలా అస్సలుండ‌వు. ఇవి అడ‌ల్ట్ చంద‌మామ క‌థ‌లు అని చెప్పొచ్చు. మ‌న‌కు స్కూల్స్‌లలో, కాలేజీల‌లో ఉద్యోగాలు సంపాదించ‌డం కోసం పాఠాలు బోధిస్తుంటారు కానీ... జీవితానికి సంబంధించిన విష‌యాలు మాత్రం చెప్పరు. ఆ బాధ్యతని ఈ సినిమా చేప‌ట్టింద‌ని న‌మ్ముతాను. ఇందులో కొద్దిమంది జీవితాలు క‌నిపిస్తాయి. వాటిద్వారా క‌లిగే అనుభ‌వాలు అన్నీ ఇన్నీ కావు.

* ఆచితూచి సినిమాలు ఎంచుకొంటుంటారు. మంచి క‌థ‌లు దొర‌క‌క‌పోవ‌టంవ‌ల్లేనా?
- అలాంటిదేమీ లేదు. ఇటీవ‌ల నా ద‌గ్గరికి మంచి మంచి క‌థ‌లు వ‌స్తున్నాయి. ఇక నుంచి వెంట‌వెంట‌నే సినిమాలు చేయాల‌నుకొంటున్నా. ఇన్నాళ్లూ డ‌బ్బులు తీసుకోవ‌డం లేదు క‌దా అని కేవ‌లం న‌చ్చిన పాత్రల్ని మాత్రమే చేస్తూ వెళ్లేదాన్ని. ఇప్పుడు మా ఆయ‌న అమెరికా నుంచి ఇండియాకి వ‌చ్చాడు. నాకూ ఓ కుటుంబం ఉంది. అందుకే డ‌బ్బు తీసుకొని విరివిగా సినిమాలు చేయాల‌ని నిర్ణయించుకొన్నా.

* ఒక‌ప‌క్క న‌ట‌న‌, మ‌రోప‌క్క నిర్మాణం, ఇంకోప‌క్క బుల్లితెర‌పై కూడా దూసుకెళ్తున్నారు...
- మీకు ఇంకో విష‌యం తెలుసా?  ద‌ర్శక‌త్వం కూడా చేయాల‌నుంది. కానీ... ఆ కుర్చీలో కూర్చుంటే బోలెడ‌న్ని బాధ్యతలు మోయాల్సి ఉంటుంద‌ని తాత్కాలికంగా ఆ ప్రయ‌త్నాన్ని విర‌మించుకొన్నా. చిన్నప్పట్నుంచీ సినిమా రంగాన్ని చూస్తున్నా. నాన్న నుంచి న‌ట‌న‌నే కాకుండా... నిర్మాణ బాధ్యత‌ల్ని చేప‌ట్టడం కూడా నేర్చుకొన్నా. నా అభిరుచి కొద్దీ బుల్లితెరకి సంబంధించిన షోలు కూడా చేస్తున్నాను. ఈ ప్రయాణం చాలా బాగుందండీ.

* ఇంత‌కుముందు టాక్‌షో ఇప్పుడు మాత్రం గేమ్‌షో చేస్తున్నారు...
- నిజంగా ఈ రెండింటిమ‌ధ్య చాలా తేడాలు క‌నిపిస్తున్నాయి. ఇదివ‌ర‌కు టాక్‌షోలో ఎదురుగా పెద్ద పెద్ద స్టార్స్ ఉండేవారు. వాళ్లతో మాట్లాడాలంటే నాకే కాస్త బెరుగ్గా, భ‌యంగా ఉండేది. ఏం మాట్లాడితే ఏమ‌వుతుందో అనుక్షణం అప్రమ‌త్తంగా ఉండాల్సొచ్చేది. అయితే... ఇప్పుడు చేస్తున్న `గేమ్‌షో` విష‌యంలో మాత్రం అలాంటి భ‌యాలేవీ ఉండ‌వు. స‌ర‌దాగా నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఆ షోని నిర్వహిస్తున్నా. ఈ రెండు షోల మ‌ధ్య వైవిధ్యమైన అనుభ‌వం. త్వర‌లో మ‌రో గేమ్‌షోతో రాబోతున్నా.

* అంతా బాగానే ఉంది కానీ... నిర్మాత‌గా మాత్రం డ‌బ్బులొచ్చే సినిమాలు తీయ‌లేక‌పోతున్నారు...
- ఎవ‌ర‌న్నారు ఆ మాట‌?  `గుండెల్లో గోదారి`కి చాలా డ‌బ్బులొచ్చాయి తెలుసా?  మా నాన్నగారు, ఓ ఎన్నారై క‌లిసి ఆ సినిమాని కొన్నారు. నాన్న తొంద‌ర‌గా డ‌బ్బు ఇవ్వలేదు కానీ... కొన్నాళ్ల త‌ర్వాత మాత్రం మొత్తం ఇచ్చేశారు. ఆ సినిమాకి తెలుగులో బాగానే లాభాలొచ్చాయి. త‌మిళంలో మాత్రం నిరాశ‌ప‌రిచిందంతే.

* నిర్మాత‌గా ఎలాంటి సినిమాలు తీయడానికి మీరు ఇష్టప‌డ‌తారు?
- న‌వ‌త‌రం అభిరుచుల‌కు త‌గ్గట్టుగానే నేనూ ఆలోచిస్తున్నా. `గుండెల్లో గోదారి`తో నా టేస్ట్ ఏంటో తెలిసిందిగా? అలా స‌హ‌జ‌త్వమున్న సినిమాల్ని తీయ‌డానికే నేను ఇష్టప‌డ‌తా. నాన్నగారు డ‌బ్బు ఇవ్వడం లేదు కానీ... బోలెడ‌న్ని సినిమాలు తీయాల‌నుంది. ప్రస్తుతం ఒక సినిమాకి సంబంధించిన ప‌నుల్ని మొద‌లుపెట్టా. ఓ కొత్త ద‌ర్శకుడితో ఆ సినిమా తీయ‌బోతున్నా. అందులో నేనూ ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతున్నా.

* ఒకే.. ఆల్ ది బెస్ట్‌..
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌.

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
movie review prathinidhi