Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఓ పాట పుట్టి, పెరిగిందిలా.. పాటల రచయిత సిరాశ్రీ తో చిట్ చాట్

interview with sirasri

అద్భుతాలు అస్తమాటూ జరగవు..అవకాశాలు అన్నివేళలా రావు..కొన్ని కొన్ని అలా జరిగిపోతాయంతే...అలా జరిగిన తరువాత వింటే..దాని వైనం కంటే..ఓహో..అలా జరిగిందా..అని కాస్సేపు అనుకోవడమే మన వంతు అవుతుంది. ఎందుకంటే ఏదయినా దానంతట అది పుడితేనే రంజుగా..రమణీయంగా..వుంటుంది. ఇంగ్లీషులో అవుటాఫ్ ది బాక్స్ థింకింగ్ అని ఓ లైన్ వుందిగా..అలాంటివి మన సినిమాల్లో కాస్త అరుదుగా కనిపిస్తుంటాయి. కొలవరి పాట వస్తే ఏమిటీ వెర్రి అనుకుంటూనే జనం ఊగిపోయారు.మళ్లీ అలా ట్రయ్ చేసినా అలాంటి రేంజ్ కు మరో పాట రాలేదు. ఇప్పుడు తెలుగునాట అనుకోకుండానే ఓ పాట పుట్టింది. యూట్యూబ్ లో, ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో తీగలో కరెంట్ జరజరాపాకేసినంత వేగంగా పాకేసింది. అదే 'ఇంటర్నెట్ బుర్రకథ'. అసలు ఈ పేరే చిత్రంగా వుంది..ఇంటర్నెట్..నేటి తరానికి కాలక్షేపం కలిగించే సాంకేతిక విప్లవం. బుర్రకథ నిన్నటి తరాన్ని చైతన్యవంతం చేసిన కాలక్షేపం.

ఇంకో చిత్రమేమిటంటే, రెండు మాధ్యమాలూ ఇటు కాలక్షేపానికి అటు చైతన్యానికి ఉపయోగపడేవే. అలాంటి రెండు పేర్లు కలయికతో పాట పుట్టడమే యాధృచ్చికం. ఆ అయిడియా ఏమిటి? దాని వైనమేమిటి తెలుసుకుందామనిపించి, రచయిత సిరాశ్రీని కాస్సేపు ప్రశ్నలతో వేధించాను..ఓపిగ్గా నా తెలియని తనాన్ని భరించి మరీ సమాధానాలిచ్చారు..నేను క్వశ్చినింగు..ఆయన జవాబులతో జంపింగు..ఇలా ఖర్చయింది ఫోన్ లో టాక్ టైమ్..కానీ అంతా అయ్యాక.. ఆయన చెప్పింది..నాకు అర్థమయింది..నేను బుర్రకెక్కించుకున్నది..గో తెలుగు పాఠకులతో పంచుకోవాలనుకున్న పర్యవసానమే ఈ ఆర్టికల్. మీ టైమ్ 'కిల్' కాదని నాదీ హామీ.

అవును సిరాశ్రీ గారూ..మీరు బోలెడు పాటలు రాసారు..ఎంతో కొంత పేరు సంపాదించారు..కానీ ఈ పాటేంటండీ..మొత్తం మీ క్రెడిట్ బ్యాలెన్స్ ను ఒక్కసారి డబుల్ చేసేసింది అని అడిగా తొలి  ప్రశ్నగా..
ఆయనంటారు...'నిజమే..నేనూ ఒప్పుకుంటాను..ఎంతవరకు వెళ్లిందంటే, ఓ జాతీయ న్యూస్ చానెల్, ఆ పాట హిందీవెర్షన్ రాయండి..పాపులర్ అవుతుంది..మాదీ అండా దండా..అనేంత వరకు'

అలా అనేసి ఊరుకుంటే నేనూరుకుంటానా...అందుకే అడిగా...'మీరు ముందే ఊహించారా..అయినా ఇది ఇంతకీ మీ అయిడియానా..లేక..' అని
'నిజం చెప్పనా..లేడీస్ అండ్ జంటిల్ మెన్ అనే సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ రాయాలి. సినిమా ప్రమోషన్ అన్నాక, పాటలోకి సినిమా విషయం రావాలి కదా..సినిమా అంంతా సోషల్ నెట వర్క్ లు,,వాటి ప్లస్సులూ..మైనస్సులూ..వగైరాలపై నడుస్తుంది..వున్నట్లుండి మేము సై అంటే ఆయన సైసై అంటాడు..ఆయన సై అంటే మేము సై సై అంటాం..అలాంటి వాడుు రఘు కుంచె..ఈ అయిడియా ఇచ్చాడు.. సోషల్ నెట్ వర్క్ మీదే పాట రాయకూడదా..అని.. అంతే. అదిగో అక్కడ పడింది విత్తనం.

బాగానే వివరించారు..'అయినా అదేంటండీ..వాళ్లేమో సోషల్ నెట్ వర్క్ మీద సినిమా తీస్తారా..మీరేమో దాని మీదే పాట రాస్తారా..అదేం న్యాయం అండీ..తప్పుకాదా..'అని సరదాగా నిలదీసా..
కానీ ఆయనేం తక్కువ తిన్నాడా..'అయ్యా..మీరు 'లైక్' కొట్టబోయి..'అన్ లైక్' కొడుతున్నట్లుంది..మేమేమీ సోషల్ నెట్ వర్క్ ను తిట్టడంలా..దాని మంచి చెడ్డలు చెబుతూ సినిమా తీస్తున్నారు. అదే నేనూరాసా..అయినా మనలో మాట..మీకొ సంగతి చెబుతా..సినిమాలపై స్ఫూఫ్ లతో సుడిగాడు సినిమా తీస్తే చూసారా లేదా..రామ్ గోపాల్ వర్మ సినిమాలపై సెటైర్ వేస్తే సినిమా తీస్తేనే (అప్పల్రాజు) గదా జనం చూసింది..ఎక్కడ వేయాల్సింది అక్కడేవేయాలండీ..పొలిటికల్ కార్టూన్ తీసుకెళ్లి పిల్లల పత్రికలో వేస్తే ఫలితం వుంటుందా..'

హమ్మ..మళ్లీ పంచ్చేస్సాడు ఈయన..'అయితే సోషల్ నెట్ వర్కింగ్ లేకపోతే..మీకు..మీ ఈ పాటకు ఇంత ప్రాచుర్యం వచ్చేదా...దాని ప్రభావం కాదనగలరా' భలే అడిగేసానే...ఏం చెబుతాడొ..
'గొప్పోళ్లండీ మీరు..అది నిజమే..ఒప్పీసుకుంటాను...' అన్నాడే కానీ నాకో డవుటు..నా గోల పడలేక..ఓకె అనేసాడా..

'అయితే ఇప్పుడు చెప్పండి...మళ్లీ ఇలాంటివి చేసేయడం మొదలెడతారా...'ఇప్పుడేటంటారో?
'నాకు మొదట్నిట్నించీ మీరన్న అవుటాఫ్ బాక్స్ అయిడియాలంటే ఇష్టమే. అందుకే ఆర్జీవీ పై ఓడ్కా విత్ వర్మ పుస్తకం రాసా..అది అటు ఆటో బ్రయాగ్రఫీ కాదు..ఇంకొటీ కాదు. అప్పటికి ఆ తరహా అదే తొలిసారి. ఇప్పటికి ఇది ఇంతే. అయితే ఒకటి మాత్రం చెబుతా..ఇంత ప్రాచుర్యాన్ని ఇంత తక్కువ సమయంలో అందించే ఈ సోషల్ నెట్ వర్క్ ను వాడుకుని ఏదైనా కొత్తగా చేయాలని మాత్రం ఆలోచిస్తా' ...గట్టివాడే..దేనికీ దొరకడం లేదు.

ఇలా లాభం లేదు. ఈయన్ని ఓ సీరియస్ సిద్ధాంత పరమైన ప్రశ్న అడగాల్సిందే..'అవును..ఇంతకీ మీరు ఈ సోషల్ నెట్ వర్క్ కు మద్దతుదారా..వ్యతిరేకులా..' భలే అడిగేసాను.. ఎటూ చెప్పలేక గిలగిలలాడాలి..
'అవసరమేనండి..కానీ అవసరమైన మేరకు. మనం ఇప్పుడు చాలా ప్రయోజనం పొందుతున్నాం..జుట్టు రాలితే గూగుల్ లో కొడుతున్నాం..హెయిర్ ఫాల్ కాజెస్..అంటూ..డాక్టర్ టాబ్లెట్ రాస్తే గూగుల్ లో వెదుకుతున్నాం..దేనికిరాసారు..సరిగ్గా రాసారా లేదా అని. అదే విధంగా మన అభిప్రాయాలు, అవసరాలు అన్నీ సోషల్ నెట్ వర్క్ లో షేర్ చేసుకుంటున్నాం...కానీ...' ఆగాడాయిన.

మళ్లీ ఈ కానీ..దమ్మిడీ ఏమిటబ్బా..
'మరీ ఈ పూట ఉప్మా వండా...నిన్ననే కొత్త చొక్కా కొన్నా..ఇలాంటి అక్కర్లేని పోస్టింగ్ లు అనేకం వస్తున్నాయి. అక్కర్లేని చెత్త కూడా భరించాలి. ఇక్కడ ఓ చిత్రం వుంది. టైమ్ కిల్ చేయాలనుకునే, రిటైర్ అయిన వాళ్లకు మంచి కాలక్షేపం. టైమ్ కిల్ చేయకూడదు..కష్టపడాలి, టైమ్ తో పరుగులెత్తాలి.. అనుకునే కుర్రకారుకు హానికరం.

భలే చెప్పారే..బొమ్మా..బొరుసు..'కానీ..మీ పాట అంతా కుర్రకారుకు చెర్నాకోల లా వుందేమో..' అవును మరి ఇంటర్వూ అన్నాక ఏదో కిరికిరి వుండాలిగా..
'ఏమండీ అంటే అన్నానంటారు..మీరేదో అడగాలని అడుగుతున్నారు కానీ..పాట విన్నారు కదా..మంచి చెడ్డా రెండూ చెప్పాను కదా..పనికొచ్చేదీ..పనికిరానిదీ అన్నీ వివరించాగా..అందరికీ తెలిసిన పదాలే వాడాను కదా..ఇంటర్నెట్ , సోషల్ నెట్ వర్కింగ్ కు సంబంధించి ఏదీ వదల్లేదు కదా.. అయినా..మరింకేందుకండీ ఈ కిరికిరి పెట్టి కుర్రాళ్లను నాపైకి ఎగసం దోయాలి చూస్తారు'..

అబ్బో..ఈయనకు సీరియస్ ఏంగిల్ కూడా వుందా..' అవును ఇంతకీ ఒక్కముక్కలో సోషల్ నెట్ వర్కింగ్ సంగతి మీరే చెప్పేయండి..'
'పాటలోనే చెప్పాగా..దూరమవుతున్నవాళ్లు..దగ్గరవుతున్నారు..దగ్గరగా వున్నావాళ్లు దూరమవుతున్నారు..ఎక్కడికి వెళ్లాలో తెలియక, మనుషులు ఎక్కడికో వెళ్లిపోతున్నారు..'

'తస్సాదియ్యా...మాస్టారూ..భలే సెప్పారు కానీ, మీ..నా ఈ ఇంటర్వూ సదవాలంటే, ఎవరైనా మళ్లీ ఇంటర్ నెట్ కే రావాలండీ బాబు..మరీ ఎక్కువ తిట్టమాకండి..'
లాస్ట్ పంచ్ మనదైతే..ఆ కిక్కే వేరప్పా..

వి. రాజా

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Maine Pyar Kiya