Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఇగో సమస్యలు - భమిడిపాటి ఫణిబాబు

ego problems

ప్రతీవాడూ తాను చెప్పిందే రైటూ, అవతలివాడికేమీ తెలియదూ అనే అభిప్రాయంలోనే ఉంటాడు… దీన్నే "ego"  అంటారనుకుంటాను .ఇదివరకటి రోజుల్లో తల్లితండ్రులతో మన ప్రవర్తన ఒక హద్దు లో ఉండేది.వాళ్ళు చెప్పినది, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా,నచ్చినా నచ్చకపోయినా,భయం వలన అనండి, భక్తి,గౌరవం అనండి,ఏమీ కాకపోతే అభిమానం అనండి, దేనికీ వ్యతిరేకించకుండా ఉండేవాళ్ళం.దానిని ఇప్పటి తరం వాళ్ళు ' మీకు ఇండివిడ్యుయాలిటీ అనేది లేకపోవడం' వల్ల అంటారు.కానీ, ఒక్క విషయం ఒప్పుకోవాలి--నూటికి 90 పాళ్ళు అలా ఉండడం వలన ఏమీ నష్టపోలేదు.మన పెద్దవాళ్ళూ సంతృప్తి చెందేవారు. వాళ్ళ 'ఇగో' సంతృప్తి అయేది.

ఇప్పటి తరం వాళ్ళు అన్నిటిలోనూ ఫాస్ట్.అన్నీ తమకే తెలుసునన్నట్లుగా ప్రవర్తిస్తారు. అప్పుడే పుట్టిన పసి బిడ్డ దగ్గరనుండీ,30-35 సంవత్సరాల వయస్సు వారి దాకా!ఎవరూ ఎవరి మాటా వినే స్థితిలో లేరు.పాతరోజుల్లో ఇంటిపెద్ద మాట వినేవారు, కానీ ఈరోజుల్లో, ఆ పెద్దాయన, తనకే అంతా తెలుసుననుకుని, ఇంట్లో ఉండే అతి చిన్నవాడైన ఏ మనవడికో, తనకు తెలిసినదేదో చెప్దామని ప్రయత్నిస్తాడు, పూర్తిగా ఆయన చెప్పనిచ్చేది చెప్పనిచ్చి, చటుక్కున " వై .." అంటాడు. దేన్నీ ఛస్తే నమ్మడు. వాడి నమ్మకం వాడిదీ, గూగులమ్మకంటే ఈయనకి బాగా తెలుసునా అనుకుంటాడే కానీ, పోనీ పెద్దాయనా ఏదో తన సంతోషంకొద్దీ చెప్పారూ, వింటే పోలేదూ అని మాత్రం అనుకోడు. ఎవరి "ఇగో" వారిదీ మరి ! బహుశా ఇదివరకటి రోజుల్లోలేని 'ఎక్స్ పోజర్' ఇప్పుడు ఉండడం వల్లేమో. ఇంకోటి కూడా చెప్పుకోవాలి,అప్పటికంటె టెక్నలాజి లో జరిగిన అభివృధ్ధి కూడా వాటికి కారణం. అయినా కొన్ని కొన్ని బేసిక్స్ ఏమీ మారలేదు.అది గుర్తించడానికి ఈ తరం వాళ్ళు ఒప్పుకోరు. ప్రతీ దానికీ, 'ఎథిక్స్' అంటూ ఉంటే పనులు అవవు కదా.అలాగని 'అన్ ఎథికల్' గా ఉండమని ఎవరూ అనడం లేదు.'కొంచెం 'ఫ్లెక్సిబుల్' గా ఉండమనే పెద్దవాళ్ళు చెప్తూంటారు. వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ప్రస్తుతపు జనరేషన్ లో ఎవరూ, ఇంకోళ్ళు చెప్పింది వినరు.అక్కడే 'ఇగో' సమస్యలు వస్తున్నాయి.

ఇంకో కారణం ఏమిటంటే, ఈ రోజుల్లో భార్యాభర్తలు క్వాలిఫికేషన్ అనండి,సంపాదన అనండి, తెలివితేటలు అనండి,ఏ విషయం తీసికున్నా ఒకరికొకళ్ళు ఏమీ తీసిపోరు. దానికి సాయం వాళ్ళ వయస్సులు కూడా రమారమి ఒకలాగే ఉంటాయి.ఇదివరకటి రోజుల్లో భార్యాభర్తల మధ్య కనీసం ఏడెనిమిది సంవత్సరాల ఎడం ఉండేది, ఏదో పెద్దాయనమీద గౌరవంచేతైనా, భార్యలు భర్తల మాటకి విలువిచ్చేవారు.కానీ, ఈరోజుల్లో"ఎడం" మాట దేవుడెరుగు,వయసుతో పనిలేదు.దీనితో ఒకరిమాట ఒకరు వినే పరిస్థితి లేదు. ఇంకోళ్ళ మాట మనం ఎందుకు వినడం అనేది ' బాటం లైన్'.ఎవరి ఇగో వారిదీ మరి ! వీటి ప్రభావం వాళ్ళ పిల్లలమీద ఎక్కువగా పడుతోంది.చెప్పానుగా, ఈ రోజుల్లో పిల్లలు బహుభాషా ప్రవీణులు. ఒక్కోచోట, తల్లితండ్రులకంటె ఒకటో రెండో భాషలు ఎక్కువగా వస్తాయి కూడానూ ( ఇప్పటి స్కూళ్ళ ధర్మమా అని). తల్లితండ్రులు వాళ్ళ వాళ్ళ సమస్యలు ఈ పిల్లల ఎదురుగానే చర్చించుకోవాల్సిన దుస్థితి లో ఉన్నారు.ఎందుకంటే, ఆ పిల్లల్ని ఒక్కళ్ళనీ వదిలి, ఏ మార్నింగ్ వాక్కో, ఈవెనింగ్ వాక్కో చేయడానికి సమయమూ లేదు.

ఇదివరకటి రోజుల్లో  భార్యా భర్తలు ఏదో 'మోస్ట్ ఐడీల్' గా ఉండేవారని కాదు. వాళ్ళకీ అభిప్రాయ బేధాలుండేవి.ఇప్పటికంటె ఎక్కువేమో కూడానూ. కానీ ఇప్పటి తరం లో వాళ్ళెవరైనా వారి తల్లితండ్రులు వాళ్ళ ఎదురుగా ఒకళ్ళమీద ఒకళ్ళు అరుచుకోగా విన్నారా? ఎక్కడో నూటికీ కోటికీ కొన్ని సందర్భాలుండొచ్చేమో.కానీ చాలా తక్కువ.ఆ రోజుల్లో, ఏదైనా సీరియస్సు విషయం మాట్లాడుకోవాలంటే, బయటకు ఎక్కడికో వెళ్ళడం.మా చుట్టాలు ఒకళ్ళున్నారు--ఆవిడ కేమైనా ఆయన చేసినది నచ్చలేదనుకోండి, టెర్రేస్ మీద ఉన్న వాటర్ ట్యాంక్ లో నీళ్ళు చూసొద్దామని, డాబా మీదకు తీసికెళ్ళి, ఓ పాఠం తీసికునేవారుట. అందుకనే ఎప్పుడైనా అమ్మ డాబా మీదకు ముందుగా వెళ్ళి, పిల్లలతో చెప్పేది,'మీ నాన్నగారిని డాబా మీదకు రమ్మనమని చెప్పండి' అని. ఇంక ఈ పిల్లలు ' నాన్నా, అమ్మ నిన్ను వాటర్ ట్యాంకు దగ్గరకి పిలుస్తోందీ'అనగానే ఈయనకు అర్ధం అయిపోయేది, ఓహో ఈవేళ క్లాసు పీకుతుందన్నమాటా అని! ఇవన్నీ పిల్లలు పెద్ద అయి, పెళ్ళిళ్ళు అయేక తెలిశాయి! ఇప్పుడు వాటర్ ట్యాంకు దగ్గరకు వెళ్ళే అవసరమే లేదనుకోండి ఎందుకంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేసికొని వెళ్ళిపోయారు!

ఇగో సమస్యలకి ఇంకో కారణం-వర్క్ ప్లేస్ లో ఉండే ఒత్తిడి కూడా ఓ కారణం.సాధారణంగా పనిచేసే భార్యా భర్తల్లో, ఆఫీసునుండి భార్యే ముందర వస్తుంది. భర్త గారు ఆఫీసులో ఏదో మీటింగో ఏదో ఉందని ఆలస్యంగా వస్తాడు. ఇప్పుడు ప్రతీ ఇంట్లోనూ ఓ వంట మనిషి ఉంటోంది, అలాగే గిన్నెలు అవీ తోమడానికీ, ఇల్లూ అదీ క్లీనింగు కీ విడివిడిగా మెయిడ్ లు ఉంటున్నారు.ఇందులో ఏ ఒక్కరు టైముకి రాకపోయినా మొత్తం షెడ్యూల్ అంతా గోవిందా! ఇంటికి వచ్చేటప్పుడే, క్రెచ్ లో ఉంచిన పిల్లల్ని తెచ్చుకోవాలీ, వాళ్ళ స్కూలు డెయిరీలు చూడాలీ, మర్నాటికి షూసూ, యూనిఫారం రెడీ చేయాలీ, బ్రేక్ ఫాస్ట్ లోకి ఏం తింటారో అది రెడీ చేయాలీ. ఇవన్నీ చేసి కూర్చునే సరికి మెల్లిగా భర్త గారు వస్తాడు.ఇంట్లో దేనికీ సాయం చేయడని, భార్య గయ్య్ మందంటే అనదూ! అప్పటికి ఏ అర్ధరాత్రో అవుతుంది, ఇంక బయట వాక్కుకి వెళ్ళే టైమేదీ?

ఎంత ఒత్తిడులు ఉన్నా, కొద్దిగా అవతలివాళ్ళ మాట వింటే బాగుంటుందేమో అనుకునేంతవరకూ, ఈ సమస్యలకి సొల్యూషన్ లేదు. ఎందుకంటే, పెద్దవాళ్ళు వచ్చి ఏదైనా సహాయం చేద్దామా అనుకున్నా, వీళ్ళ మాట వినేవాళ్ళెవరూ లేరు.ఏదో ఇంటికి వస్తూన్న మెయిడ్లు ముగ్గురు, ఈ పెద్దవాళ్ళతో కలిపి అయిదుగురు! తేడా ఏమిటంటే, వీళ్ళకి వోటింగ్ పవర్ లేదు. మిగిలిన ముగ్గురు మెయిడ్ల మీదా అరవమనండి, మర్నాటి నుండీ నోటీసైనా లేకుండా మాయం అయిపోతారు.అందుకే వీళ్ళు, వారిమీద తమ ఇగో చూపించరు.అంటే, ఇలాటి ఇగో ఉంటే నష్టం ఎవరికో తెలుసన్నమాట. వినేవాళ్ళుంటేనే ఈ ఇగో లు చూపించడం. దీన్నే జరుగుబాటు రోగం అనికూడా అంటూంటారు. ఇదంతా వ్రాసేనుకదా అని నాకు నా ఇగో లేదనడంలేదు.ఇంకా మా ఇంటావిడ వింటోంది కాబట్టి ఆవిడమీదే అరుస్తూంటాను. చెప్పేవాడికి వినేవాడెప్పుడూ లోకువే. ఎప్పుడో ' ఇనఫ్ ఈజ్ ఇనఫ్' అంటుందీ, నోరుమూసుక్కూర్చుంటాను

మరిన్ని శీర్షికలు
mother is god