Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
natyabharateeyam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam
విల్లిపుత్తూరు వర్ణనలో ఆ నగరసౌందర్యాన్ని, స్త్రీల సౌందర్యాన్ని, అక్కడి వారకాంతల సౌందర్యాన్ని, అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని, పంటచేల, బావుల, ఉద్యానవనముల స్త్రీ, పురుషుల వర్ణన చేస్తూ  24 అత్యద్భుతములైనపద్యాలను చెప్పాడు రాయలు. నిజానికి ఏ ఒక్క పద్యమూ కూడా వదిలిపెట్టాల్సినది కాదు, కానీ, ఇది కేవలం విమర్శా వ్యాసమే, విమర్శా గ్రంథం కాదు గనుక ఒక మూడు నాలుగు పద్యాలను పరిశీలిస్తున్నాము మనము.

ఉ. వేవిన మేడపై వలభి వేణిక జంట వహించి విప్పగా 
     బూవులు గోటమీటుతరి బోయెడు తేటుల  మ్రోత గామిశం
    కావహమౌ గ్రుతాభ్యసన లౌటను దంతపు మెట్ల వెంబడిం 
    జేవడి వీణ మీటుటలు చిక్కెడలించుటలు న్సరింబడన్ 

వేకువ కాగానే అనడానికి 'వేవినన్' అని విచిత్ర ప్రయోగము చేశాడు. వేకువ కాగానే, తెల్లవారగానే, మేడలమీద  చూరుల వెంట కూర్చుని తమ జడలను విప్పుకుంటూ క్రితం రాత్రి తాము తురుముకున్న వడలిపోయిన పూవులను తమ గోళ్ళతో మీటుతూవాటిని తీసివేస్తుంటే, విదిలించివేస్తుంటే, ఆ పూవుల పరిమలమునకు తుమ్మెదలు చేస్తున్న ధ్వనులను విన్న ఆ దారిన వెళ్ళేకాముకులకు, వారు ( ఆ స్త్రీలు ) కృతాభ్యసనలు ( అభ్యాసము చేసినవాళ్ళు ) కావడం చేత, చేవడిన్చేతుల 'వడి' తో అంటే..హస్త లాఘవంతో దంతపు మెట్లు వేసి వున్న వీణలను మీటినట్లుగా  అనుమానము కలుగుతుంది. అంటే ఇది ఆ నగర వారకాంతల వర్ణన అని అన్వయం.   ఇక్కడ ప్రత్యేకంగా చెప్పక పోయినా ఈ పద్యనికిముండు పద్యాలలో, ఆ తర్వాతి పద్యాలలో కూడా ఆ నగర వారకాంతల సౌందర్యాన్ని, అతిశయాన్ని, వైభవాన్ని వర్ణించన పద్యాలే వున్నాయి కనుక ఇక్కడ వర్ణింప బడ్డ స్త్రీలు  కూడా ఆ నగర వారకాంతలే అని భావం. వారకాంతలు కనుకనే దారిన వెళ్ళే  వాళ్ళను కవ్విస్తూ, ఊరిస్తూ భ్రమలు పెడుతూ ఇలా చేస్తారు అని కూడా ఒక విసురు!

ఆ సుందరీమణులు సంగీత శాస్త్రములో నేర్పు, అభ్యాసము కలిగినవారు కనుక, ఆ సంగతి ఆ వాడలోని ఇళ్ళ జాడలు తెలిసినవాళ్లకు  పరిచయమే కనుక,  దారిన వెళ్ళే వాళ్లకు ఆ సుందరీమణులు'వేణికన్' అంటే జడను'చంట' వహించి అంటే తమవక్షోజములమీద పడేట్లుగా, ముందుకు వేసుకుని, విప్పుతూ విలాసంగా గోళ్ళతో మీటుతూ విదిలించి వేస్తుంటే, ఆ నల్లని జడ,ఆ జడకింద వున్న విశాలమైన వక్షోజ భాగము వీణ మెట్ల దారి, వీణ దిమ్మలా (బుర్రలా) ఏమిటి అనే అనుమానాలను కలిగిస్తున్నాయి. యింతలో ఆ విసిరేస్తున్న, విదిలిస్తున్న పూల పరిమళాలకు ఆకర్షింప బడి ఝుమ్మని మ్రోతలు చేస్తూవచ్చి వాలుతున్న తుమ్మెదల ధ్వనులు వీణా నాదములా ఏమిటి? అనే అనుమానాలను కలిగిస్తున్నాయి.ఈ జడ, జడకింది వక్షోజ భాగం వీణలా కనిపించడం అనేది ఒక విచిత్రమైన, ప్రత్యేకమైన వర్ణన. జడను ఇలా వర్ణించడం ఇదివరకు ఎవరూ చేయలేదు, తెలుగులోనైతే, ఈ వ్యాసకర్త చవి చూసిన కొద్ది ఆంధ్ర సాహిత్యంలో, కానీ ఈ కావ్య నాయిక ఐనగోదాదేవి మాత్రం అద్భుతమైన సాహిత్య సౌరభాలను కూడా కలిగిన తమిళ సారస్వతంలోని  ప్రసిద్ధమైన తన తిరుప్పావై పాశురముల ప్రబంధంలో  ఒక గొప్ప వర్ణన చేసింది.'' పుత్తర వల్గుల్ పునమయిలే..'' అని, 'పుత్తర వల్గుల్' అంటే, పుట్టలోని పాము వంటి పిరుదుల భాగము కలిగిన అని, పిరుదులపైన పడుతున్న నల్ల తాచు వంటి జడను ఒకసారి ఊహించుకుంటే, విశాలమైన ఆ జఘన భాగం పుట్టలాగా, అక్కడిదాకా వున్న నల్లనిజడ కొస త్రాచుపాముతోకలాగా, తలవెనుకవైపునుండి చూస్తేశిరస్సు మీది భాగం వెడల్పుగా ఉండి, పడగ విప్పుకున్న  నల్ల త్రాచులాగా కనిపిస్తుంది, కేవలం తలనుండి జడ చివర దాకా చూస్తే, పునమయిలే అంటే పురివిప్పిన నెమలి అని, మగనెమలి పురివిప్పి ఆడుతుంటే ఎలా వుంటుందో, స్వేచ్ఛగా విరిసిన తలకట్టు అంత అందంగా ఉంటుందని. ఇలాంటి వర్ణనకు సమానమైన వర్ణన వేరెక్కడా, ఏ సాహిత్యములో కూడా లేదు అని మహానుభావులైన పెద్దలు సాధికారికంగా తెలుగు, తమిళ, సంస్కృత ఆధ్యాత్మిక, సాహిత్య సారస్వతముల పై విమర్శచేయగలిగిన వారు చెప్పారు, నాకు మాత్రం ఈ శ్రీకృష్ణ దేవరాయల వర్ణన , గోదామాత చేసిన ఆ వర్ణన రెండూ ప్రత్యేకమైన,విశిష్టమైన  వర్ణనలు అనిపించాయి, స్త్రీల తలకట్టు గురించి. ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరీ  స్తోత్రం ఈ వ్యాఖ్యలోపరిగణలోకి తీసుకోకుంటే, ఎందుకంటే ఆయన వర్ణించిన కేశపాశములు జగజ్జనని ఐన అమ్మవారి గురించి కనుక.('' ధునోతు ధ్వాంతం నః తులిత దళితేందీవరవనం ఘనం, స్నిగ్ధం, శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజము పలబ్దుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ విటపినాం '' నల్లకలువల వనాన్ని ధిక్కరించే, ఆ సహజమైన సౌరభాన్ని తాము కూడా పొందాలని వచ్చే, దేవేంద్రుని నందనోద్యానవనంలోని దేవజాతికిచెందిన పుష్పాలకు కూడా నివాస స్థలమైన నీ నల్లని ప్రకాశవంతమైన 
తలకట్టు మా యొక్క  పాపములను ఎగురగొట్టుగాక! '' తనోతు క్షేమం నః తవ వదన సౌందర్య లహరీ పరీవాహ శ్రోత స్సరణివ సీమంత సరణి:వహంతీ సిందూరం ప్రబల కబరీభార తిమిర ద్విషాం బృందై: బందీక్రుతమివ నవీనార్క కిరణం''  నల్లని ఆ జుట్టును రెండు పాయలుగా చీల్చిన సౌందర్య ప్రవాహంలాగా పాపిట మార్గం వుంటే, చీకట్లు అనే శత్రువులబృందం బందీగా చేసిన బాలభానుడేమో అన్నట్లు ఆ  పాపిటమార్గంలో ధరించిన అమ్మవారి సిందూరం వున్నది. అటువంటి ఆ పాపిటమార్గం మాకు క్షేమమును కూర్చుగాక'', ఇవీ ఆది శంకరుడి వర్ణనలంటే!) ఇంత బేరీజు వేయడానికి, తద్వారా కలిగే మాటలకందని ఆత్మానందాన్ని ఒంటరిగా అనుభవించడం ఇష్టం లేక 
అందరితో పంచుకోవాలనుకోవడం ఒక కారణమైతే, కవిగా రాయలు ఎదిగిన ఎత్తులు ఊహించడానికి చేసే ప్రయత్నంలో, ఒక గోదాదేవి, ఒక ఆదిశంకరుడు మాత్రమే రాయలంతటి విశిష్ట వర్ణనలు చేశారు అని చెప్పాలనుకోవడం రెండవ కారణం.

మ. తల బక్షచ్ఛట గ్రుక్కి బాతువులు కేదారంపు గుల్యాంతర
      స్థలి నిద్రింపగ జూచి యారెకులుష స్స్నాత ప్రయాత ద్విజా
      వలిపిండీకృత శాటులన్సవి దదావాసంబు జేర్పంగ రే       
      వుల డిగ్గ న్వెస బారు వాని గని నవ్వున్శాలి గోప్యోఘముల్       
 
ఆ వూరి వరిచేలలోని పంట కాలువలలో తలను రెక్కల చాటున(పక్ష చ్ఛటన్) 'కుక్కుకొని', దూర్చుకొని, ఆ వరిమళ్ల మధ్యలోనినీటి పాయలలో బాతువులు అంటే బాతులు నిదురిస్తుంటే పహరా కాస్తున్న వూరి కాపలా భటులు (ఆరెకులు) తలలు కనబడక,దగ్గిరికి ముడుచుకుని పడుకున్న ఆ తెల్లని నీటి బాతులను దూరం నుండి చూసి, వాటిని ఉషః కాలంలో కాలువలో స్నానాలు చేసిన బ్రాహ్మణులు, పిండుకుని, వెళ్ళేప్పుడు తీసుకుని వెళ్ళడం మరిచిపోయిన అంగవస్త్రములు, వస్త్రములు  గామోసు అనుకుని,( ఉష స్స్నాతప్రయాత  -ద్విజావళీ-పిండీకృత- శాటుల్-అన్-సవి) వాటిని, ఆ పిండుకున్న వస్త్రాలు అని తాము అనుకున్న వాటిని వారి వారి ఇళ్ళకు చేరుద్దాం (దదావాసంబు జేర్పంగ) అని నీటి కాలువలలోకి దిగగానే, ఆ బాతులు పారిపోతుంటే వాటిని చూసి, ఆ బాతులనూఈ బైతులనూ చూసి, ఆ పంటల  కాపలాకోసం వున్న స్త్రీలసమూహం ఘొల్లున నవ్వుతుంటుంది!  పాపం తెల్లమొహాలేసి వెనక్కు తిరిగి వెళ్తారు ఆ నగర కావలి వాళ్ళు. 

సీ. ఎదురేగి సాష్టాంగ మెరగి పాద్యం బిచ్చి 
        నారికేళ కటాసనముల నునిచి
     నును బోక పొత్తి గుట్టిన దొప్ప గమితోడ   
        రంభ విశాల పర్ణములు వరిచి
     శాల్యన్న  సూపాజ్య కుల్యా బహువ్యంజ 
        నక్షీర  దధులర్పణంబు జేసి
      వార్చిన  పిదప సంవాహన మంఘ్రుల 
          కొనరిచి తాంబూల మొసగి కుశల 
 
తే. మడిగి పోయెద మన్న దవ్వనిచి సిరికి 
     దగిన సత్కృతి జేసి ఖేదమున మగిడి
     యర్చన గావింతు రెపుడు నిట్లతిథులైన
     భాగవతులకు నప్పురి భాగవతులు

ఆ పట్టణము లోని భాగవతులు తమ అతిథులు ఐన భాగవతులకు ఎదురేగి, సాష్టాంగ వందనము జేసి  కాళ్ళుకడుక్కోడానికి నీళ్ళనిచ్చి,  కొబ్బరి ఆకులతో, ఈనెలతో అల్లిన చాపల మీద కూర్చుండబెట్టి, పోక చెట్ల ఆకులతో కుట్టినదొప్పలను వుంచి , పెద్ద పెద్ద అరటి ఆకులను పరచి, వరియన్నము, పప్పు, నేతి కాలువలతో, అనేకములైన పచ్చళ్ళు, కూరలతో, పాలు పెరుగులతో భోజనం పెట్టి, భోజనానంతరం వారు కొద్దిగా నడుము వాల్చితే, వారికి తాంబూలంఇచ్చి వారి కాళ్ళు పిసికి ( ప్రయాణ శ్రమతో కాళ్ళు లాగుతుంటాయి గదా పాపం!) ఇక వాళ్ళు వెళ్లి వస్తాము అంటే, తమ శక్తి కొద్దీ వాళ్లకు సత్కారము జేసి, అల్లంత దూరం వాళ్లతో వెళ్లి, సాగనంపి, అయ్యో! అప్పుడే వెళ్లి పోయారే! అనే బాధతో వెనక్కు వెళ్ళేవారు.  ఎంత నమ్మ శక్యము గాని సుందర స్వప్నం కదూ? ఈ పద్యానికి కండ్లు చెమరిస్తే అదిమానవత్త్వానికీ, భారతీయ తత్త్వానికీ, తెలుగు ప్రేమల వెలుగు లోగిళ్ళ అమృతత్త్వానికీ చిన్ని రుజువు!   కన్న వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు వచ్చినా ఇంత ఆదరంతో కాదు కదా, అసలు ఆహ్వానం ఇవ్వడానికే వెనక్కి తీసే రోజులివి. కాళ్ళకు కాదు కదా, తాగడానికి కూడా సరిపడా నీళ్ళివ్వలేని నికృష్టమైన నగర నివాసాలివి. వాళ్ళో, వాళ్ళతో వచ్చినపిల్లలో కొత్తగా కొనుక్కున్న సోఫాలనూ, వాటి కవర్లనూ ఎక్కడ పాడుజేస్తారో అనే పాడు టెన్షన్ల పాట్లివి. సింథేటిక్, ప్లాస్టిక్ప్లేట్లూ, గ్లాసులూ, ప్లాస్టిక్ ఫిల్టర్ నీళ్ళూ, మన సీరియల్స్ సమయంలోనో, చాటింగు సమయంలోనో వస్తే , చూసీ చూడనట్టుమనం చూస్తే, చూసీ చూసీ ' ఇక వెళ్ళొస్తాము ' అంటే, ఇంకా ఇక్కడే వున్నారా..వెళ్ళడం సరే..మళ్ళీ రావడం ఏంటి? అన్నట్లు  తలలు దిప్పి చూసే చూపులు! అతిథులకు కాళ్ళు పిసకడం అటుంచి..అమ్మా నాన్నల కట్టుకున్నవాళ్ళ ..పీకలు పిసక్క పోతే ఆ మానవుడు  మహానుభావుడే! కానీ ఒకప్పుడు ఇలాంటి లోగిళ్లుండేవి, అలాంటి మనుషులువుండేవాళ్ళు,అంతటి  సభ్యతా సంస్కారాలు, ప్రేమాభిమానాలు ఉండేవి. ఆ దృశ్యముల అక్షర చిత్రాలు కనుకనే,ఈ పద్యాలూ, కావ్యాలూ 'నిలిచి ఉండేవి'!'వైష్ణవం వైష్ణవో దృష్ట్వా దండ వత్ప్రణవేద్భువి' వైష్ణవుడు మరొక వైష్ణవునికి కర్రలాగా నేలమీద పడిపోయి రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు భుజాలు, వక్షస్థలం, తల నేలకుతాకించి, ఈ అష్టాంగములతో నమస్కరించి,'అమర్యాదః క్షుద్రః చలమతి: అసూయా ప్రసవభూ: కృతఘ్నో దుర్మానీ స్మర పరవ శః  వంచన పరఃపాపిష్టో'( మర్యాదా మన్ననా తెలియని వాడిని, క్షుద్రుడిని, చంచలమైన మనసు కలవాడిని, అసూయా పరుడిని,క్రుతఘ్నుడిని, దురభిమానం గల దుర్మార్గుడిని, కాముడికి లొంగిన బలహీనుడిని, వంచకుడిని, పాపినిఐన నన్ను మన్నించి కరుణించండి) అని ప్రాధేయ పడి, ప్రార్ధించి, ఆదరించి, సత్కరించడం చేస్తాడు, చేయాలి.

వైష్ణవుడు అని ఇక్కడ చెప్పడం ఇది వైష్ణవ మార్గ సంబంధ ప్రబంధం కనుక. శైవుడైనా, ఇంకెవరైనా, ఇంత వినయంగా వుండాలి. మానవుడెవరైనా ఇలా చెయ్యొచ్చు, చెయ్యాలి అని చెప్పడం కోసం ఇంత సాత్త్వికులైనవిల్లిపుత్తూరు భాగవతులను పరిచయం చేసి, వెంటనే తరువాతి పద్యంలో భాగవతోత్తముడైన విష్ణుచిత్తులను పరిచయం చేశాడు రాయలు!

శా. అందుండుం ద్వయసద్మపద్మవదనుండ ద్వంద్వు డశ్రాంతయో
      గాందూబద్ధమధు ద్విషద్ద్విరదు డన్వర్థాభిధానుం డురు         
      చ్చందో బృంద తదంత వాగపఠనా సంజాత తజ్జన్య  ని 
      ష్పంద  ద్వైత సుసంవిదాలయుడు నిష్ఠన్ విష్ణుచిత్తుండనన్   

శ్రీ మహావిష్ణువు యొక్క ద్వయ మంత్రమునకు నిలయమైనవాడు, పద్మమువంటి సుందరమైన, మృదువైన నిర్మలమైనవదనము కలవాడు, సుఖ దుఖ్ఖాలు, ఆనందము విషాదము..ఇలాంటి ద్వంద్వములు లేని వాడు అంటే స్థిత ప్రజ్ఞుడు,నిరంతర యోగమనే సంకెలల చేత మధుసూదనుడు అనే గజమును  బంధించికున్నవాడు, వేదములను,వేదాంతములైన ఉపనిషత్తులను చదువనివాడైనా, ఆ వేదవేదాంతరహస్యసారమైన చలింపని ద్వైత జ్ఞానము ( జీవుడు-దేవుడు అనే దేహము-దేహి..అనే ద్వైత జ్ఞానము) అనే పవిత్ర జ్ఞానమునకు ఆలయమైనవాడు, విష్ణు చిత్తుడు అనగామహా విష్ణువు యందే లగ్నము చేసిన చిత్తము గలవాడు  అనే సార్ధక నామధేయుడు (అన్వర్థాభిధానుండు ) ఉండేవాడు.వేద వేదాంతముల పఠనం చేయకుండానే, ఆ వేద వేదాంత మర్మమైన పరమేశ్వర సంబంధ మైన అమలిన జ్ఞానమును పొందినవాడు,యోగమంటే చిత్తమును నిరోధించడం, అంటే చిత్తమును అనవసరమైనవాటివైపు పోకుండా నిరోధించడం కనుక, అలా అనవసరమైనవిషయములకు పోకుండా, చిత్తమును, విష్ణుమూర్తి యందే లగ్నంచేసిన విష్ణుచిత్తుడు అనే సార్ధక నామధేయుడు ఉండేవాడు ఆ విల్లిపుత్తూరులో. అసలైన కథా ప్రారంభము ఇది కనుక ఇక్కడ శార్దూల విక్రీడితాన్ని వాడాడు శ్రీకృష్ణదేవరాయలు!

ఈ ఒక్క పద్యంలోనే విష్ణుచిత్తుని సంపూర్ణ పరిచయం చేయడం రాయల ప్రతిభ. పాండిత్యము, శాస్త్ర జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానముల సర్వోత్క్రుష్ట లక్ష్యము పరమాత్మ తత్త్వదర్శనమే కనుక ఆ తత్త్వదర్శనమును ఆ పాండిత్య, శాస్త్ర జ్ఞాన, ఆధ్యాత్మిక జ్ఞాన రహితుడైనప్పటికీ పరమాత్మ తత్త్వాన్ని దర్శించ గలిగినవాడు విష్ణుచిత్తుడు. కేవలం నిష్కల్మషమైన, నిశ్చలమైన, నిష్కామమైన భక్తి భావం కలిగినవాడు.   ఇక్కడ ఒక అద్భుతమైన వచనంలో విష్ణుచిత్తుని పాత్ర చిత్రణ అనే నెపంతో..కుహనా...' జ్ఞానులనూ, ఆధ్యాత్మికతత్త్వవేత్తలనూ పండితులనూ' వ్యంగ్యంగా నిరశించి, అసలు జ్ఞానము అంటే ఏమిటో చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇలాంటివి రచయితను పట్టించే, పరిచయం చేసే పరమ సత్యాలు కనుక వచనమే ఐనా పరిశీలిద్దాం. రాయలు ఎంత జ్ఞానియో, ఎంత ఔచిత్యం కలిగినవాడో, ఎంత స్వతంత్ర భావాలను కలిగినవాడో తెలుస్తుంది.

'' అమ్మహీసుర వరుండు ప్రక్రుతికంటే పరుండగు తన్నును, దనకంటె బరుండగు పరమేశ్వరుం, బరమేశ్వర ప్రసాద బహుజనన 
కృత సుకృత ఫలరూపయగు నాచార్య కృప గుప్త దానంబు నిదానంబు న్దేలిపిన గతిం దెలుపగా..( ఆ బ్రాహ్మణుడు మనముప్రారంభములో చెప్పుకున్నచతుర్వింశతి(24)తత్త్వములకు తనను భిన్నుడైనవానిగా, జీవుడిగానూ, తనకంటే భిన్నుడైన  వానిగా పరమాత్ముడినీ, పూర్వ జన్మలో చేసిన గుప్తదానము వలన మరుసటి జన్మములో సత్ఫలితాన్ని ఇచ్చినట్లు, అనేక పూర్వజన్మల లో చేసిన పుణ్య ఫలితముగా ఒక సద్గురువుయొక్క దయ చేత తెలుసుకున్నట్లు తెలుసుకోగలిగాడు. యిరవై నాలుగు తత్త్వముల ప్రకృతిని అచిత్తు అని, తనను జీవుడు అని, ఈ రెంటిక్కే భిన్నుడైన వాడు దేవుడనీ లేదా చిత్తు అనీ విశిష్టాద్వైత సిద్ధాంతం. లోతులకు వెళ్ళకుండా కనీసం ఇంతవరకూ తెలిసికోవడం ఈ ప్రబంధాన్ని, రాయల ఆలోచనా విధానాన్నీ, ప్రజ్ఞనూ తెలిసికొనడానికి అవసరం, సహాయకారి. కీర్తి, ప్రతిష్ఠలకు ఆశించకుండా చేసిన గుప్త జ్ఞానం మరుజన్మలో పెన్నిధిని అందించినట్లు, అనేక పూర్వ జన్మలలో చేసిన పుణ్య ఫలితముగా సద్గురువును పరమేశ్వరుడు 
ప్రసాదించడం వలన, ఆ సద్గురుకృపచేత తెలుసుకున్నట్లు, ప్రక్రుతి-జీవుడు-దేవుడు అనే  మూడు తత్త్వాలను ఆయన తెలుసుకున్నాడు)..
''...నాత్మీయ తదీయ శేష శేషిత్వ సంబంధం బనాద్యంబుగా దెలిసి...''( తన యొక్క పరమేశ్వరునియొక్క  భ్రుత్యుని-యజమాని యొక్క సంబంధమును అనాదిగా, అతి పూర్వమైనదని తెలిసికొని, అంటే తను పరమేశ్వరుని దాసుడు సహజంగా, ఎన్నెన్ని జన్మల నుండో అనే జ్ఞానము కలిగి)

''..ఈ తెలివి గలిగి యఖర్వ నిర్వృతిం గాంచి సుఖించు పరమ యోగికి  బహు క్లేశదంబులగు  చదువులం బని ఏమి..''( పైన చెప్పుకున్న ఈ  జీవునికీ దేవునికీ వున్న భ్రుత్యుడు-యజమానుల సంబంధమును తెలిసికొని, తనను పరమేశ్వరునికి దాసునిగా భావించి అఖండమైన అసలైన సుఖమును పొందే పరమయోగికి బహు కష్టములను ఇచ్చే చదువులతో పని ఏమి?)

''...ఈ వివేకంబు లేని వాని.. హేతువాదంబు ధాతువాదంబు...'' ( ఈ జ్ఞానము లేని హేతువాది వల్ల ధాతువులకు హాని. వాటిని శోధనతో చంపుతాడు   కనుక!)

''...కాణాదంబు  ప్రాణాదంబు..''(ఈ జ్ఞానము లేని వాని తర్క శాస్త్రము ప్రాణాలను తీస్తుంది, వూరికే తర్కించి చంపుతాడు కనుక! కణాదుడు ఒక తార్కికుడు )

''...కాపిలంబు చాపలంబు...''( కపిలుని సాంఖ్య మతము చపలత్త్వము కలిగినది..కపిలుని సంఖ్య వాదము ఈశ్వర-నిరీశ్వర అనే వాదంమధ్య  వూగిసలాడుతుంది)

''...మీమాంస హింస...''(యజ్ఞ, యాగ, అగ్నిష్టోమ సంబంధమైన కర్మకాండ యితర జీవుల ప్రాణాలను తీస్తుంది, యజ్ఞ పశువులుగా చేసి!)

''...వ్యాకరణంబు  అశరణంబు...'' (వ్యాకరణం రక్షింపలేదు) 

''..అటుగాక చదువ దొరకొనిన నరునకు గాలంబు నలంబు, విఘ్నంబు లఖిలోద్యమఘ్నంబులు."( అదీ గాక బాగా చదువుదాము  అనుకునేవాడికి సమయము సరిపోదు, ఎంత చదువుకుంటే చదువుకున్నట్లు, దానికి అంతం ఎక్కడ వుంటుంది? ఎన్నో విఘ్నాలుసమస్త ప్రయత్నాలనూ నాశనం చేస్తాయి..ఎందుకొచ్చిన వెధవ చదువులు?!)

''..అందులకు సామగ్రి గిటగిటన, గొంతెరుంగ నగు  మదంబు పుటపుటన...''( ఐనా సరే, బాగా జ్ఞానము సంపాదిద్దాము, చదువుకుందాము అని  మొదలు బెట్టాడా, కావలసిన సామాగ్రి ఎక్కువ దొరుకక పోవచ్చు, దొరకదు, కొంత తెలిసిందా ఇక మదం పుట్టుకొస్తుంది! ఇవ్వాళ లోకంలో జరిగేది ఇదే, ఎంత వ్యంగ్యంగా చెప్పాడో చూడండి!)

''..దుద ముట్టం జదివె నేనియు సముత్పన్న విజ్ఞానుండై త్రైగుణ్య విషయంబులగు వాని నానీత ధాన్యుండు నిష్ఫలంబైన పలాలంబును,నాలబ్దమధుండు సిక్థకంబును విడుచు వడువున విడువ వలయు, గావున శాంతిదాంతిపరతం బరమైకాంతినైన నాకు మొదల నివి యదిగామిపం    దుద విసర్జింప నేమి ప్రయోజనంబు..''( ఒకవేళ తుదిముట్ట చదివి, జ్ఞాన సముపార్జన చేసినా దాని ఫలం ఏమిటి? చివరికి  ఈ చదువు, ఈ పాండిత్యము, ఈ జ్ఞానము ఇవన్నీ నిష్ప్రయోజనములు అని ధాన్యాన్ని కొనుక్కున్నవాడు గింజలు లేని పొట్టును విసర్జిన్చినట్లు, తేనెను కొన్నవాడు ఆ తేనెపట్టులోని  మైనాన్ని, అంటే పిప్పిని వదిలేసినట్టు..ఈ చదువును, పాండిత్యమును, జ్ఞానమును నిరర్ధకాలు అని భావించి వదిలెయ్యడమేగా? కనుక బాహ్య ఇంద్రియాలను అంటే కర్మేంద్రియాలను నిగ్రహించుకున్న నాకు..శాంతునకు, అంతర ఇంద్రియాలను అంటే జ్ఞానేంద్రియాలను నిగ్రహించుకున్న నాకు..దాంతునకు, ఏకాంతముగా కేవలము భక్తితో ధ్యానము చేసుకునే వాడికి,  మౌనికి, యోగికి, ఇవన్నీ ఈ చదువు, పాండిత్యము, జ్ఞానము వీటిని పొందడం ఎందుకు, మళ్ళీ వదిలించుకోవడం ఎందుకు?)

''..వాది భంజనంబు, రాజ రంజనంబును జేయుచు బునర్జననంబులకు విసువని జనంబులకు గానిమ్ము, మాదృశులకు  దదీయఖ్యాతి ఈతి, లాభంబు క్షోభంబు, పూజనంబు ఉద్వేజనంబు..''  (శాస్త్ర వాదములు చేసి ప్రతివాదులను వోడించి రాజుల మనోరంజనంబు జేస్తూ..పునర్జన్మంబులకు విసుగు చెందకుండా జనులకు గానీ, నాలాంటి వారికి ఆ ఖ్యాతి ఈతిబాధలే, ఆ రాజ పూజలు భయానక అనుభవాలే!

ఇక్కడ శాస్త్ర చర్చలు, వాద ప్రతివాదాలు చేసి..గెలిచామనే ప్రతివాద భయంకరులను, రాజులను ఆశ్రయించి వారిని ఆనంద పరిచే పండితులను, జ్ఞానులను వ్యంగ్యం చేస్తున్నాడు, కవిగా ఉద్దేశ పూర్వకంగా ఇక్కడొక ధ్వని..విష్ణుచిత్తుడు వాదంచేయవలసివచ్చింది, పాండ్య రాజును రంజింపజేయవలసివచ్చింది, పరమాత్ముడి ఆజ్ఞ మేరకు, ఎందుకంటే తను పరమాత్ముడి దాసుడు కనుక, తనకంటూ ఏమీ స్వేచ్చను కోరుకోని బంటు కనుక,..)

''..అని వితర్కించి యుర్వర బూర్వంబున సౌవీరభూరమణునకు గౌరవంబంగీకరించి బోధించి ముక్తికనిచిన భారతభూమి సురవతంసంబును బోలె దుర్విభావ్యబోధుండై పరమ పదంబునను భాగవతులకప్రాక్రుతంబులగు బహు భద్ర మూర్తులు భరియించి భగవత్పరిచర్య సేయుటయు
బరమ పురుషార్ధంబగుట ఎరిగి యచటి రథచరణపాణి మాలికా కరణ కైంకర్యంబున కన్కురిత కౌతూహలుండై చేయుచుందే, మరియును,...( ఈ రకంగా తనలో తను వితర్కించుకొని పూర్వము సౌవీర రాజుకు జ్ఞాన బోధ చేసిన జడ భారతునివలె, సమస్త జ్ఞాన సారాన్ని తెలిసికొనిమౌనంగా, నిరాడంబరంగా, ఊహకు అందని జ్ఞానము కలవాడై, భాగవతులకు ప్రక్రుతి మాయలకు లొంగని మంగళ రూపములలో, జన్మలలో, భగవంతునికి పరిచర్యలు, సేవకునిగా సేవలు చేయుటయే పరమ పురుషార్ధమని, అంటే మోక్షమని తెలిసికొని, ఆ విల్లిపుత్తూరునందలి చక్రయుధుని, మన్నారు కృష్ణుని సేవలో మాలలు అల్లి శ్రద్ధ, భక్తులతో సమర్పిస్తూ, వున్నాడు విష్ణుచిత్తుడు.)

క.        న్యాయార్జిత విత్తంబున 
           నాయోగీశ్వరుడు పెట్టు నన్నంబా ప్రా
           లేయ పటీరాచలప
           ద్యాయాతా  యాత వైష్ణవావళి కెల్లన్

ఆ విష్ణుచిత్తుడు న్యాయార్జిత విత్తముతోనే అటు హిమాచలము నుండి ఇటు మలయాచలము వరకు మధ్యన వున్న మార్గంలోని బాటసారులైన వైష్ణవులకు అందరికీ భోజనం పెట్టేవాడు. యజమాని కృతం పాపం అన్నమాశ్రిత్య తిష్ఠతి..అని సూక్తి. అంటే యింటి యజమాని చేసిన పాపం అతను పెట్టే భోజనాన్ని ఆశ్రయించుకుని వుంటుంది. అందుకే ఎవడుబడితే వాడు పెట్టే విందులకూ,భోజనాలకు యోగులూ, జ్ఞానులూ, సాధకులు, అసలు ఎవరైనా సరే, వెళ్ళకూడదు. ఎవరింటికైనా భోజనానికి వెళ్ళేప్పుడు పండ్లూ,పూలూ  తీసుకెళ్లడం అందుకు విరుగుడు, వూరికే పిలిచాడు కదా అని పడి తినకుండానూ, సామాజిక పరస్పర మర్యాదగానూ వుంటుంది. అందుకని  ప్రత్యేకముగా న్యాయర్జిత విత్తంబున..అని చెప్పాడు ఇక్కడ.

చ.       గగనము నీరు బుగ్గకెనగా జడివట్టిన నాళ్ళు  భార్య క 
            న్బొగ సొరకుండ నారికెడపుం బొరియల్దవులించి వండ న   
            య్యగపల ముంచిపెట్టు గలమాన్నము నొల్చినప్రప్పు నాలుగే
            న్బొగిపిన కూరలున్వడియముల్వరుగు ల్పెరుగు న్ఘ్రుతప్లుతిన్ 

ఆకాశము ముసురుపట్టి, నీటిబుగ్గవలె ఉబికి, ఉబికి వర్షం కురిపిస్తూవున్న రోజులలో పొగరాకుండా ఎండిన  కొబ్బరి బొండముల పీచుతో పొయ్యి అంటించి ఆ కొబ్బరికాయల ఇంధనం తోనే వరియన్నము, పొట్టు వలిచిన పప్పు, నాలుగైదు పొరిలించిన, వేయించిన కూరలు, వడియాలు, వరుగులు, పెరుగుతో, నేతి ధారలతో వండిపెట్టేది ఆ  విష్ణుచిత్తుని  ఇల్లాలు. అంటే పొమ్మనకుండా పొగబెట్టే రకం వంట కాదన్నమాట! తన లౌకిక ప్రపంచ జ్ఞానం ఇక్కడ పరిచయం చేస్తున్నాడు రాయలు. సామాన్య, నిరాడంబర బ్రాహ్మణ గృహస్థు వంటల, వడ్డనల తీరు, ఇలా వుంటుంది!  శ్రీకృష్ణ దేవరాయలు సింహాసనాన్ని ఎక్కకముందు ఆయనకు ఒక గొప్ప మిత్ర బృందం ఉండేది. కవులు, గాయకులూ,కళాకారులు, రసికులు, విదూషకులు ఆ బృందంలో వుండేవారు. రాయల సర్వతోముఖ వైదుష్యానికి ఈ బృందం,ఆ బృందంతో గడిపిన రోజులే కారణం. ఆరోజునుండి ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రుడు అల్లసాని పెద్దన.కనుక బ్రాహ్మణుల యింటి భోజనం, వాతావరణం ఆయనకు కొట్టిన పిండి, కనుక ఇంతటి సహజమైన వర్ణనలు! ఇది వర్షాకాలంలో ఆ యింటి భోజన పదార్ధాల వివరాలైతే ఆ తర్వాత వేసవి కాలంలోని భోజన వివరాలు..

చ. తెలి నులివెచ్చ యోగిరము దియ్యని చారులు దిమ్మనంబులున్ 
     బలుచని యంబళు ల్చేరకు పా లెడనీళ్ళు రసావళు ల్ఫలం 
     బులును   సుగంధి శీత జలముల్వడ  పిందెలు నీరు జల్లయు
     న్వెలయగ బెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్

తెల్లని నులివెచ్చని, మరీ వేడి, మరీ చల్లదనం లేకుండా ఉన్న అన్నము, తియ్యని చారులు, మజ్జిగ పులుసులు(తిమ్మనంబులు)పల్చని  అంబళి ద్రవాలు, చెరుకు రసాలు, లేత కొబ్బరినీలు (ఎడ నీళ్ళు) రసాలు, (అంటే రసమూరే భక్ష్యాలు) అరటి పండ్లు, రసాల మామిడిపండ్లు మొదలైన వాటితో, వట్టివేళ్ళు వేసిన చల్లని సుగంధ జలములు, వూరేసిన మామిడి పిందెలు, ఆవకాయ ముక్కలు(వడపిందెలు..వేసవిలో వురేసిన మామిడిముక్కల వలన వడ కొట్టకుండా వుంటుంది అని..) పలుచని నీరు చల్లతో..చక్కనిభోజనం పెట్టేవాడు విష్ణుచిత్తులు అతిథులకు. అంతకు ముందు వేసవి తాపానికి గురై, అలిసిపోయి వచ్చిన అతిథులకు చందనచర్చ చేసేవారు, చల్లబడడం కోసం. వేసవి కాలములో పలుచని, చల్లని, ద్రవ పదార్ధాల మిశ్రమంతో భోజనము వుండాలి అని ఆరోగ్యసూత్రాన్నియిక్కడ చెప్తున్నాడు. రసం, తియ్యని చారులు అంటే పులుసులు మొదలైనవి  అన్నమాట. చారు, పులుసు లేకుండా చేసిన భోజనం ఎటువంటి భోజనమో కొన్ని పోలికలతో అంతకుముందే చెప్పారు మహానుభావులైన పూర్వీకులు.'' మాతృ హీన శిశు జీవనం వృథా, కాంత హీన నావ యవ్వనం వృథా, శాంతా హీన తపసః ఫలం వృథా, తింత్రిణీ రసవిహీన భోజనం..'' అని, తల్లి లేని శిశువు జీవితం, చెలియా లేని యవ్వనం, శాంతం లేని తపస్సు, పోపుగింజల రసం, చారు లేనిభోజనం..ఇవన్నీ వృథా అని తేల్చి పారేశారు. పాక శాస్త్ర, ఆహార శాస్త్ర సంబంధ చర్చలో ఇది వుంటుంది, ఇవన్నీ తెలిసినరసిక రాయలు శ్రీకృష్ణదేవరాయలు! ఇక శీతాకాలంలోని భోజనాల వివరాలు..

మ. పునుగుం దావి నవోదనంబు మిరియంపుం బొళ్ళతో జట్టి చు
      య్యను నాదారని కూర గుంపు ముకు మందై యేర్చునావం జిగు
      ర్కొను పచ్చళ్ళును బాయసాన్నములు నూరుంగాయలున్ జే సురు
      క్కనునేయుం జిరుపాలు వెల్లువుగ నాహారం బిడున్సీతునన్

'పునుగులు' అనే పేరుగల వరిధాన్యంతోవండిన  వేడి వేడి అన్నము, మిరియాల పొడి(కారప్పొడి)తో ఆ వంట పాత్ర 'చుయ్య'నే మోత ఆగకుండా, నిరంతరమూ కలయబోస్తూ, తాలింపు వేస్తూ చేసే కూరలగుంపుతో,ముక్కుమందు ఐన, పడిశాన్ని, 'రొంప'ను వదలగొట్టే ఆవపిండితో కలిపి, చురచురమనే పచ్చళ్ళతో,పాయసాన్నంతో, వూరగాయలతో, చేతిమీద పడగానే 'చురుక్కనే' వేడి వేడి నేతి ధారలతో, యిగరగాచిన పాలప్రవాహాలతో, అంటే ఇక లేవు అనే మాటరాకుండా సమృద్ధిగా పాలతో, శీతాకాలంలో భోజనం పెట్టేవాడు,విష్ణుచిత్తుడు, తనఇంటికి వచ్చిన అతిథులకు! శీతాకాలంలో యిలాంటిభోజనం ఆరోగ్యప్రదాయకం అన్నమాట.ఒక విశేషం ఏమంటే, ఇక్కడ ఇంత సహజ సుందరమైన శైలిలో బ్రాహ్మణ దంపతుల యింటి భోజన ఏర్పాట్లనూ, ఆహార పదార్ధాల వివరాలను వర్ణించిన రాయలు ఇంత అద్భుతంగానూ  క్షత్రియోచితమైన భోజన వివరాలను వర్ణించాడు, రాబోయే ఆశ్వాసాలలో చూడవచ్చు!

చ. కదళిగభీరపుష్పపుటికాచ్ఛట జేతుల నిప్పపిండిపై
     గుదురుగ నిల్పి యోపుగతి గూనల నూనియ నించి తరాత ము
     న్నుదికినశాటి వ్రేల నది నొక్కట గ్రుంకిడి వత్తు రెందరే
     వదలక యాతనింట శనివారమున న్బరదేశ వైష్ణవుల్

ఆ మహాశయుడి ఇంట్లో ఒక మూల పెద్ద పెద్ద బానలుండేవి, వాటి నిండా నువ్వుల నూనె వుండేది,పెరట్లో పెద్ద అరటి తోట వుండేది, ఆ అరటియాకుల, పూవుల పెద్ద పెద్ద దోనెలలో ఈ బానల్లోని నూనెను కావలసినంత నింపుకొని, అరచేతుల్లో ఇప్పపూల పిండి పోసుకొని, ఆ పిండి మీద ఈ నువ్వుల నూనెను నింపిన దోనెలు పెట్టుకొని, అంతకు ముందే సిద్ధంగా, శుద్ధంగా విష్ణుచిత్తుడు ఉతికి పెట్టిన వస్త్రాలను, ధోవతులను,( ఇవి ఆయన ఇంటిలోని వస్త్రాలు, ఆయన యాత్రికులకు సిద్ధంచేసిన మడి బట్టలు, పట్టువి)సుబ్బరంగా స్నానం చేసి కట్టుకునేవి కనుక, చేత్తో ముట్టుకోకుండా, నిబ్బరంగా వాటికిముడేసిన తాళ్ళనుపట్టుకుని ఊపుకుంటూ, పరస్పరం మీరెక్కడినుంచి వచ్చారు అంటే మీరెక్కడి నుంచి..??అని వివరాలు తెలుసుకుంటూ, పాత పరిచయస్తులను  కుశల ప్రశ్నలు వేస్తూ, నదికి వెళ్లి స్నానం చేసి,ఉతికినబట్టలు కట్టుకుని, ఉతుక్కున్న తమ బట్టలమూటలు పట్టుకుని, విష్ణుచిత్తుని ఇంటికి వచ్చి,వాటిని అరేసుకుని, హాయిగా భోంచేసి, కొంతసేపు విశ్రమించి, వెళ్ళేప్పుడు అంతవరకూ తాము ధరించిన మడి పట్టుబట్టలనో, ధావళులనో విడిచేసి, తమ బట్టలు కట్టుకుని వెళ్ళిపోయేవారు..(ఇలా ఆస్తికులైన అతిథులకు బట్టలను సిద్ధంగా పెట్టేవాళ్ళు ఇప్పటికీ వున్నారు అక్కడక్కడా, కనుక ఇదేమీ విచిత్రం కాదు)ఈ సనాతనధార్మికజీవనాన్ని, ఆ పాత్ర స్వభావాన్ని, పరిసరాలను, సమాజాన్ని పరిచయం చేయడం రాయల ప్రత్యేకత!ఇలా గుంపులకు గుంపులుగా ప్రత్యేకించి శనివారమునాడు దూర ప్రాంతాలనుండి వైష్ణవులు వదిలిపెట్టకుండా వచ్చేవాళ్ళు. ఇలా నిత్యాన్నదాన నిరతునిగా  సంతర్పణలు చేస్తున్నాడు విష్ణుచిత్తుడు. ప్రత్యేకముగా శనివారమునాడు అని ఎందుకు చెప్పాడు అంటే వారాల సంతలు జరుగుతుంటాయి కదా..ఆ ప్రాంతంలో శనివారమునాడు ఏదో సంత జరుగుతూ వుండి వుంటుంది బహుశా, భోజనం చేసి యాత్రలనుండి తిరిగి తమ తమ ఇళ్ళకో, ఇంకా యాత్రలకు ముందు ముందుకో వెళ్తూ, ఈ ప్రాంతంలో అరుదుగా, చవగ్గా దొరికే వాటిని కొనుక్కుని వెళ్ళే వాళ్ళన్నమాట!నువ్వుల నూనెలో ఇప్పపిండిని కలిపి, ఆ మిశ్రమాన్ని తలకూ, శరీరనికికూడా కామోసు, శుభ్రంగా పట్టించి స్నానం చేసేవాళ్ళన్నమాట, ఆరోగ్యం కోసం, అది ఒక అదనపు వివరం, రాయలు ఈ పద్యంలో చెప్పింది.

శా. ఆ నిష్ఠానిధి గేహ సీమ నడురేయాలించినన్ మ్రోయునెం
     తే నాగేంద్ర శయాను పుణ్య కధలుం దివ్య ప్రబందాను సం
     ధాన ధ్వానము నాస్తి శాక బహుతా నాస్త్యుష్ణతా  నాస్త్యపూ
     పో  నాస్త్యోదన సౌష్టవంచ కృపయా భోక్తవ్యమన్ పల్కులున్

ఆ విష్ణుచిత్తుని ఇల్లు అర్ధరాత్రంలో కూడా శేషశాయి ఐన శ్రీ మహావిష్ణు సంబంధమైన కథలతో,  ద్రావిడ దివ్య ప్రబంధ  పారాయణతో, అతిథి, అభ్యాగతులకు స్వాగతవచనాలతో, '' ఎక్కువగా కూరలు లేవు..వేడిగా కూడా లేదు..పప్పులేదు..అప్పచ్చులు లేవు..వున్న అన్నం కూడా నాణ్యముగా లేదు..దయచేసి..ఓర్చుకుని భోజనం చేయండి..'' అనే పలుకులతోమారు మ్రోగుతూ వుంటుంది..అర్ధరాత్రంలో కూడా..!!! అంటే..ఆయనకు..అంతర్యామి దేవుడు..అతిథి దేవుడు..ఈ ఇద్దరుదేవుళ్ళ సేవ తప్ప వేరే ఏదీలేదు ప్రవృత్తి ఐనా, వృత్తి ఐనా అదే. ఆళ్వారుల లోనే కాదు, ప్రబంధపాత్రలన్నింటిలో కూడా కచ్చితంగా ఈయనే  పెద్దమనిషి, ప్రవరుడికి ఐనా ఊళ్ళు తిరగాలి, వింతలూ విశేషాలూ చూడాలి అనే కుతూహలం వున్నది, ఈయనకుఅదీ లేదు, తను వెళ్తే గుడిలో దేవుడు, తన ఇంటికొస్తే అతిథి దేవుడు. ఈ ఇద్దరి సేవ, అంతే, కనుక ఈయన 'పెరియాళ్వారు'అనే సార్ధక నామధేయుడు కూడా!

తే. ఇత్తెరుంగున నవ్వైష్ణవో త్తముండు 
    జాగరూకత   దైర్తిక భాగవతుల
    కితర మెరుగక ఎవ్వరేమేమి వేడి 
    రలయ కవి పెట్టి సంతుష్టి సలుపుచుండె

ఈ విధంగా పరమ జాగరూకుడై తీర్థాటన, దేశాటన, పుణ్య క్షేత్రాటన చేసే భాగవతులకు, ఎవరేది అడిగితే, వారికది పెట్టి,సంతృప్తులను చేస్తున్నాడు. ఈ చిన్ని పద్యంతో ప్రథమాశ్వాస కథా ఘట్టాన్ని ముగించి ఆశ్వాసాంత పద్యాలూ అని చెప్పుకునే పద్యాలతో ప్రథమాశ్వాసం పూర్తిచేశాడు రాయలు. ఇంత చిన్ని పద్యంలో కూడా ఒక కొండంత సందేశాన్ని పెట్టాడు. 'జాగరూకుడై'సేవ చేయడం అంటే చాలా భయ భక్తులతో చేయడం, ఎక్కడ ఏ లోటు, పొరపాటు వస్తుందో, అతిథిసేవలో లోపం వస్తుందో అనిసేవజేయడం, చేసే ఏ పనికైనా అది అవసరం, అందునా, దానం చేసేప్పుడు అది మరీ అవసరం. అందుకే '' అవజ్ఞయా న దాతవ్యంకస్య చిల్లీలయాపివా, అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయః '' అని సుమంత్రుడితో పలికించాడు వాల్మీకి వారు రామాయణంలో.అవజ్ఞ అంటే నిర్లక్ష్యం, చిల్లీలగా అంటే సరదాగా, నిర్లక్ష్యంగా, సరదాగా, పరిహాసంతో ఎన్నడూ దానంకానీ, ధార్మిక కార్యాలు కానీ చేయకూడదు, దాతా చేయ కూడదు, కార్యకర్తలూ చేయ కూడదు, ఎవరు చేసినా ఆ దోషం ఆ దాతను నాశనం చేస్తుంది! ఇది తెలిసిన వాడు కనుక విష్ణుచిత్తుడు ఇలా జాగరూకుడై అతిథి సేవ చేస్తున్నాడు అని ఇది తెలిసిన రాయలు తెలియజేశాడు, ఈ దానంలో, యజ్ఞ, యాగాది, క్రతువుల, పూజలలో లోపాలు చేస్తే బ్రహ్మరాక్షసులై పుడతారు అని ధర్మ శాస్త్ర నిర్దేశం. అలా బ్రహ్మరాక్షసుడైన  వాడి వృత్తాంతం కూడా ముందు ముందు ఆముక్తమాల్యదలో రుచి చూద్దాం.

కం. జలచర కిటి హరి వటు భ్రుగు 
     కుల రఘుకుల సీరి బుద్ధ ఘోటి ప్రముఖో 
     జ్జ్వల జనికృత జనరక్షా
     అలమేల్మంగాభిధేందిరాలయ  వక్షా        

జలచర -మత్స్య, కూర్మ అవతారాలు; కిటి-సూకరము, వరాహావతారము;హరి-సింహము, నరసింహావతారము; వటు- వామనుడుభ్ర్గుకుల-పరశురామావతారము, రఘుకుల-శ్రీరామావతారము;సీరి-బలరాముడు, కృష్ణావతారము;బుద్ధ-బుద్ధుడు;ఘోటి-గుర్రాన్నెక్కినవాడుకల్కి అవతారము; ప్రముఖ-ఉజ్జ్వల-జని కృత జన  రక్షా..మొదలైన ప్రకాశవంతమైన జన్మలనేట్టి జనులను రక్షించినవాడా,అలమేమంగ - అభిధ - ఇందిర ఆలయ వక్షా..అలమేలుమంగా అనే మరొక పేరు కలిగిన లక్ష్మీ దేవికి ఆలయమైన, నివాసమైన వక్షస్తలమును కలిగినవాడా! మత్స్య, కూర్మ మొదలైన అవతారములలో జనుల్ని రక్షించినవాడా(ఇక్కడ ఒక చిన్న చమత్కారం వున్నది, బలరాముడు-శ్రీకృష్ణుడు-ప్రద్యుమ్నుడు-అనిరుద్ధుడు- ఈ నాలుగు అవతారాలూ శ్రీ కృష్ణావతారంలో చతుర్వ్యూహాలు- హైందవ ధర్మానికి అతి సుపరిచితములైన ఇరవైనాలుగు కేశవనామాలలో యివి కూడా ఉంటాయి. విశేషించి వైష్ణవ సంప్రదాయంలో, విశిష్టాద్వైత సంప్రదాయంలో, కనుక బలరాముడు అంటే శ్రీకృష్ణావతారం అనే సూచన!) అలమేలుమంగా అనే మరొక పేరు గలిగిన లక్ష్మీదేవికి నిలయమైనవక్షస్థలం కలిగినవాడా!( ఈ పద్యానికి కొనసాగింపుగా తరువాతి పద్యం చెప్పి స్వామికి వినిపిస్తున్నాడు)

భుజంగ ప్రయాతం:
బలద్విడ్వినిర్దిష్ట పాథోధరోరూ
పలాసార ధారాతపత్రీకృతాద్రీ  
ఫలన్మూర్ధ చాణూర భంగోగ్ర బాహా
కళాకృత్తకంసా శిఖండావతంసా

ఈ ఛందస్సు నడక ఒక పాము మెలికలు తిరుగుతూ సాగినట్టు సాగుతుంది కనుక భుజంగ ప్రయాతం అన్నారు. ఆదిశంకరుడుఎన్నో గొప్ప స్తోత్రాలు ఇచ్చాడు ఈ వృత్తంలో. ఇక్కడ రాయలు శ్రీకృష్ణ వర్ణన చేశాడు సంస్కృతపద సమాస భూయిష్టంగా,క్లిష్టంగా వున్నా ఇష్టంగా ఇలాంటి వర్ణనలు తెలుసుకుంటే  భావుకత్వం, సున్నితత్త్వం పెరుగుతాయి! భాషలో పట్టు పెరుగుతుంది!బలద్విట్-వినిర్దిష్ట' బలుడు అనే రాక్షసుడిని చంపిన దేవేంద్రునిచేత నియోగింపబడిన, పాథో ధరములు  అంటే నీటిని ధరించేవి, మేఘముల, ఉరు- ఉపల-ఆసార ధార..గొప్ప రాళ్ళ వర్ష ధారకు, ఆతపత్రీ కృత అద్రి- గొడుగులాగా చేసిన కొండను కలిగినవాడా, శ్రీకృష్ణా!ఫలత్ - మూర్ధ - చాణూర - భంగ - ఉగ్ర బాహా..పగులుతున్న శిరస్సుగల చాణూరమల్లుని నాశనముచేయుటలో ఉగ్రమైనబాహువులుకలవాడా! ఉగ్రమైన బాహువులతో, మల్లయుద్దంలో ఉత్తి చేతుల తోనే చాణూర మల్లుని తల పగులగొట్టి చంపిన వాడా శ్రీకృష్ణా!( ఈ చాణూరమల్లుడు ఆ రోజులలో అఖిల  భారతంలో ప్రసిద్ధుడైన తెలుగు మల్లవీరుడు! ఆంధ్ర రాష్ట్రము నుండి వీడిని ప్రత్యేకంగా పిలిపించుకుని శ్రీకృష్ణుని చంపడం కోసం నియోగించాడు కంసుడు!) కళా-కృత్త-కంసా-కళ అనేది పురాతన భారతీయ కాలమానంలో అత్యల్పమైన కొలత..అంత స్వల్ప వ్యవధిలో కంసుడిని చంపినవాడా!  శిఖండా వతంసా ..శిగయందు నెమలి పింఛమును ధరించిన వాడా, శ్రీకృష్ణా!దేవేంద్రుని ఆజ్ఞపై మేఘుడు రాళ్ళవాన కురిపించినప్పుడు గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా పట్టిన వాడా, భీకరములైన కరములతో చాణూరుని తలను బ్రద్దలుకొట్టి చంపినవాడా, క్షణకాలంలో కంసుని చంపినవాడా, శిఖిపింఛధారీ, శ్రీ కృష్ణా!ఇది నీకు విన్నవించుకొనుచున్న ఆముక్తమాల్యదా గ్రంథములోని హృద్యంబైన పద్యముల ప్రథమాశ్వాసము, అని ప్రథమాశ్వాసమును  ముగించాడు రాయలు. 
మరిన్ని శీర్షికలు
ego problems