Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మేఘన

జరిగిన కథ :  మరణానంతరం కలిగే నరకలోక ప్రాప్తి, అక్కడ విధించబడే శిక్షలు,  వాటినుంచి విముక్తికి చెయ్యాల్సిన ఉత్తర క్రియల గురించి డాక్టర్ హిమాన్షు చుపుతుంటే వింటుంటాడు డాక్టర్ హరి...

ఆ తర్వాత

 ‘‘శంఖం, విష్ణు చక్రం కూడా బంగారంతో చేయించాలా? పట్టు వస్త్రాలు ఖరీదైనవి కొని తేవాలా?’’

‘‘హరి గారూ... కన్ ఫ్యూజ్ కావద్దు... పురాణాల గురించి చెబుతుంటే కన్ ఫ్యూజ్ ఔతున్నారు. మీ సబ్జక్ట్ కాదు కాబట్టి... అదే వైద్య శాస్త్రం గురించి మీకు తెలియనిది వివరిస్తుంటే ఎంతో శ్రద్దగా, చురుకుగా వింటూ చిటికెలో గ్రహించేస్తారు దీన్నే ‘‘సెలక్టివ్ లెర్నింగ్ ’’ అంటారు.’’ అన్నాడు హమాన్షు.

‘‘ఓకే... ఓకే... బంగారు రేకుపై  శ్రీమన్నారాయణుని నిండు విగ్రహాన్ని ప్రతిబించించాలి... అంతే కదా?’’

‘‘బాగా చెప్పారు...’’

‘‘సరే... ఆ తర్వాత....?’’

‘‘వృషోత్ సర్జన క్రియ నిర్వర్తించి...’’

‘‘అదేమిటి?’’

మంత్ర జలంతో ఒక కోడె దూడ కు స్నానం చేయించి, వస్త్రం, చందనం, పుష్పాలు, ఆభరణాలు మొదలైనవి అలకరించాలి. శంఖు, చక్ర, త్రిశూల వంటి దేవతా చిహ్నాలు కుంకుమతో తీర్చిదిద్దాలి.

ఆ తర్వాత శాస్త్రం ప్రకారం తగిన క్రియలు చేసి ఆ దూడని స్వేచ్ఛగా విడచి పెట్టాలి. దీనిని ఎవరూ వ్యవసాయ కర్మల నిమిత్తం ఉపయోగించని విధంగా సంరక్షించాలి. ఇందులో ఇంకా రకాలున్నాయి.

‘‘వృషోత్ సర్జనం అర్థమయిందండీ... తర్వాత?’’

‘‘పదమూడు మంది బ్రహ్మణోత్తములను రప్పించి....’’

‘‘పదమూడు మంది బ్రాహ్మణులను రప్పించ వచ్చులెండి... పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు.’’

‘‘బ్రాహ్మణులు కాదండీ.. బ్రాహ్మణోత్తములు  బ్రాహ్మణ ఉత్తములు. బ్రాహ్మలందరూ ఉత్తములు కారు అని దాని అర్థం. అనగా బాగా జ్ఞాన సముపార్జన చేసిన బ్రాహ్మణులను పిలవాలి. వాళ్లే ఉత్తమ బ్రాహ్మణులు.’’

‘‘ఓకే... పిలిచి...?’’

‘‘వారికి గొడుగు, పాదరక్షలు, ఉంగరాలు, పీటలు, వస్త్రాలు, బియ్యం, భూదానం, గోదానం మొదలైనవి (వీటినే షోడశ మహా దానాలంటారు) అతిశయంగా యథావిధిగా జరిపించాలి.’’

‘‘ఈ రోజుల్లో గొడుగు, పీటలు ఎవరు తీసుకుంటారండీ... బ్రాహ్మలు బుల్లెట్ల మీద, కార్లలో తిరుగుతున్న రోజులివి.’’

‘‘యుగ ధర్మాన్ని బట్టి ఎలా సాగితే అలాగే కానివ్వచ్చు... ఆ తర్వాత వారికి మృష్టాన్న భోజనానంతరం జల పూరిత ఘట దానం, శయ్యా దానం వంటివి చేయాలి. ఈ విధి సాంగోపాంగంగా నెరవేర్చగలిగితే ఏ రీతిగా ప్రేత జన్మ పొందినప్పటికీ వారు ముక్తులవుతారు.’’

‘‘ఏ రీతిగానైనా..?’’

‘‘మీరు విన్నది కరెక్టే. ఏ రీతిగానైనా సరే... హత్య కావచ్చు, ఆత్మహత్య కావచ్చు... ఈ రకమైన మరణం సంభవించినప్పుడు ఏడాది వరకు కర్మకాండ జరగ కుండా ఉండాల్సిందే.’’

‘‘బాగా చెప్పారు... పాపం... ఆ కర్మకాండలు లేకనే సంవత్సరాల తరబడి మగ్గిపోయాయి ఆ ఆత్మలు. కనీసం ఇప్పటికైనా దైవానుగ్రహం వల్ల వాటికి మోక్షం కలిగితే చాలు.’’ అంటున్నంతలోనే హరి సెల్ ఫోన్ మోగింది.

‘‘అమ్మా... ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాం నేను, హమాన్షు...’’ అన్నాడు హరి.

X                 X                X

‘‘నాయనా... హరీ... ఇవిగో అస్థికలు తీసుకో. లోక కళ్యాణం కోసం, ప్రజల మేలు కోసం నేను స్వయంగా తవ్వి తీసుకున్నాను వీటిని. ఇవేమీ కొన్ని శతాబ్దాల, దశాబ్దాల పురాతనమైనవి కాదు. వీటి పరిశోధన ద్వారా తెలుసుకునే అంశాలు అదే గ్రామంలోని భూమిని, గాలిని, నీటిని పరిశోధించి కూడా తెలుసుకో గలను. బాధాతప్తములు, అలమటిస్తున్న ఆత్మల సంతృప్తికి నా వంతు కృషి నేను చేయగలను. అదే విధంగా నిన్నే నమ్ముకుని, నీ మీద ఎంతో నమ్మకంగా నీవేదో మేలు చేస్తావని, నీ కోసం ఆతృతగా ఆర్తిగా ఎదురుచూస్తున్న ఆ జీవులను సంతృప్తిపరుచు. వెళ్లు నాయనా.... వెళ్లు ఆలస్యం చేయకు. హిమాన్షు నీకు తోడుగా ఉంటాడు. ఇద్దరూ సాయంత్రం ప్లైటుకు వారణాసి వెళ్లండి. హిమాన్షుకు వారణాసిలోని బ్రాహ్మ ణోత్తములు తెలుసు. వారి సహాయంతో మీ ఇద్దరూ కార్యాన్ని నిర్వర్తించి విజయంతో తిరిగి రండి. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతో ఉంటాయి.’’ అంటూ మనస్ఫూర్తిగా అట్టపెట్టను హరి చేతిలో పెట్టింది సుధారాణి.‘‘తల్లి మనసేమిటో, ప్రేమ ఏమిటో పూర్తిగా తెలుసుకున్నానమ్మా... నీ ఉన్నతమైన, అంతులేని పుత్ర వాత్సల్యాన్ని తెలుసుకోలేకపోయాను.’’ అందామనుకున్నాడు హరి. కానీ గొంతు పెగలలేదు, మాటలు రాలేదు. హృదయం బరువెక్కి గొంతుకలో ఏదో అడ్డుబడినట్లయి, ఆ భారమంతా దింపుకోవడానికన్నట్లుగా కళ్లలోంచి ధారగా కన్నీళ్లు కారుతుండగా ఒక్కసారిగా శిరసు వంచి తల్లికి పాధాభివందనం చేసాడు హరి. ఒక్కసారిగా హరిని గుండెలకు హత్తుకుంది సుధారాణి.

ఆ రోజు సాయంత్రమే హరి, హిమాన్షులు వారణానికి బయలుదేరిపోయారు అస్థికలతో సహా.

X                 X                X

కరీంనగర్ శివార్లలోని కుగ్రామం....

అప్పటికే అక్కడికి సుధారాణి ఆమె ఐదుగురు అనుంగ శిష్యులు కారులో చేరిపోయారు. ఎక్కడయితే అస్థికలను తవ్వి తీసారో అదే ప్రదేశంలో నిలబడి ఉన్నారు అందరూ. అంతకు ముందు అదే ప్రదేశంలో ఎలా తిరుగాడారో, ఏమేం చేసారో నెమరువేసుకుంటూ ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటున్నారు ఐదుగురు శిష్యులు.

హిమాన్షు ఏదో పని చూసుకుని, తన మిత్రుడితో పాటు గ్రామానికి చేరుకుంటానన్నాడు. ఇంకా రాలేదు. బ్రాహ్మణులు ఎప్పుడెప్పుడు క్రతువులు మొదలుపెడదామా అని ఎదురు చూస్తున్నారు...

అరగంట గడిచింది...

ఒక్కరొక్కరుగా గ్రామస్థులు ఆ స్థలానికి చేరుకుంటున్నారు. చూస్తుండగానే ఆ సంఖ్య రెండువందలకు పైగా పెరిగిపోయింది కానీ ఒక్కరు కూడా క్రతువు జరిగే స్థలానికి దగ్గరగా రావడం లేదు. దూరంగానే ఉండి చూస్తున్నారు.

‘‘వీళ్లకెవరు చెప్పారు? ఏం చెప్పారు?’’ ఆశ్చర్యంతోపాటు అనుమానం కూడా కలిగింది సుధారాణికి.‘‘వీళ్లెవరూ అడ్డుబడరు కదా? ఇంత కష్టమూ బూడిదలో పోసిన పన్నీరు కాదుకదా?’’ ట్రింగ్... ట్రింగ్... సుధారాణి సెల్ ఫోన్ మోగింది.

అవతల హరి... ‘‘అమ్మా వచ్చేస్తున్నా... ఇంకో పదిహేను నిమిషాల్లో నీ ముందుటాను. నా అపార్ట్ మెంట్ నుండి బయలుదేరేటప్పటికి లేటయ్యింది’’ అంటున్నాడు.

హరి గొంతులో ఏదో ఉత్సాహం...

సుధారాణిలో కూడా ఉత్సాహం కలిగింది.

ఇంతలోనే రెండు పెద్ద పెద్ద వ్యాన్లు వచ్చి ఆగాయి. అవి టీవీ యూనిట్ వాళ్లవి. వాళ్లు కెమేరాలు, సరంజామా అంతా తీసుకుని హడావుడి పడిపోతూ పరుగులు తీస్తున్నారు. అంతా అయోమయంగా ఉంది సుధారాణికి.

ఏమిటిది? వీళ్లందరూ ఉంటే ఈ క్రతవు సాగుతుందా? నెరవేరాల్సిన ఆశయం నెరవేరుతుందా? ఆందోళన చోటు చేసుకుందామె మదిలో...ఇంతలో నింపాదిగా ఆమెను సమీపించాడు హిమాన్షు.

‘‘ఏమిటిది? ఏమి జరుగుతుందిక్కడ? మనమనుకున్నదేమిటి? జరుగుతున్నదేమిటి? వాతావరణం కూడా మబ్బులతో మసక బారినట్లున్నదేమిటి? ఈ గ్రామస్థులు, ఈ టీవీల వాళ్లు ఈ హడావుడి నాకంతా అయోమయంగా ఉంది. అంటూ హిమాన్షు వైపు తిరిగింది సుధారాణి.

‘‘అమ్మా ఆందోళన చెందవద్దు... మనం ఇక్కడున్నది ఒక మంచి పని చేయడానికి, సత్సంకల్పంతో, సంకల్పబలంతో ఉన్న మనల్ని ఏ దుష్టశక్తీ ఆపలేదు. నిబ్బరంగా ఉండండమ్మా.’’ అన్నాడు హిమాన్షు.
ముగింపు వచ్చే సంచికలో......  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yatra