Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ :  కొంతసేపు తగాదా తర్వాత ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమ కబుర్లు చెప్పుకుంటుంటారు. వెంటాడుతున్న దుష్టశక్తుల బారి నుండి సహస్రనెలా కాపాడుకోవడమేలాగాని తీవ్రంగా ఆలోచిస్తాడు విరాట్... సహస్ర తన పడక గదిలో విరాట్ ఫోటో చూపిస్తుంది..

ఆ తర్వాత

‘‘అయినా సరే నేన్నమ్మను’’ అన్నాడు బింకంగా

‘‘ఎందుకు నమ్మవు? నీ గదిలో నా ఫోటోలు చూసి నీ ప్రేమను నేను నమ్మాను. నా గదిలో నీ ఫోటో చూస్తే నమ్మవా? నాలో ప్రేమ లేదనా? ప్రేమంటే నాకు తెలీదా?’’ నిలదీసింది సహస్ర.

‘‘రెండూ కాదు’’ అన్నాడు విరాట్

‘‘మరేమిటి?.’’

‘‘నీ ప్రేమని ఎలా నమ్మమంటావ్? నా ముద్దు బాకీ అలాగే ఉండి పోయిందిగా’’ అంటూ భుజాల మీద చేతులేసాడు. అంతే ఒక్కసారిగా నవ్వేసింది సహస్ర.

‘‘నీ బాకీయే కదా చెల్లు వేస్తున్నాను. తీసుకో’’ అంటూ కౌగిట ఒదిగి పోయింది. తొలి కౌగిలి తొలి ముద్దుల పరవశంలో చాలాసేపు అలాగే ఉండి పోయారిద్దరూ.

I              I                     I

సహస్రను వెనక్కు తీసుకెళ్ళే నిమిత్తం

మహ దేవ నాయకర్‌ ఆదేశం మేరకు

మధురై నుంచి బయలు దేరిన కదిరేశన్‌ బృందం వాళ్ళంతా ప్రయాణిస్తున్న జీపు శరవేగంతో చెన్నై రోడ్‌ మార్గంలో పరుగులు తీస్తోంది.కదిరేషన్‌ ముఖంలో ఎప్పుడూ కందులు వేగుతున్నట్టు సీరియస్‌గా ఉంటాడు. బహుశ అతడు నవ్వగా చూసిన వాళ్ళు ఇంత వరకూ ఎవరూ లేరు.

ఒక విశ్వాసం గల కుక్కలా యజమాని చెప్పింది చేసుకు పోవటం అతని అలవాటు. అనవసరమైన గొడవలకి పోడు. గొడవంటూ వస్తే వదలడు. అతడితో పని ముక్కు సూటి వ్యవహారంలా ఉంటుంది. లౌక్యం బొత్తిగా తెలీదు. కాస్త మూర్ఖత్వం కూడ ఉంది. ఇంత వరకు అప్పగించిన పనిలో అపజయమంటూ లేదు.  అందుకే మహ దేవ నాయకర్‌ కదిరేషన్‌ నాయకత్వంలో తన మనుషుల్ని చెన్నై పంపించాడు.ఇక రెండో వాడు వడివేలు

వీడు కాస్త పొట్టిగా లావుగా వుంటాడు. అయిదడుగుల అయిదంగుళాల ఎత్తుమించడు. కోరమీసం, జులపాల జుత్తు, మెళ్ళో గుప్పెడు లావుండే తాయెత్తు బిళ్ళతో నుదుట సింధూరం బొట్టు ధరించి విచిత్రంగా కన్పిస్తాడు.

మనస్తత్వాల్లో వీళ్ళిద్దరూ తూర్పు పడమర లాంటి వాళ్ళు. కదిరేషన్‌ ఎంత సీరియస్‌గా ఉంటాడో అంత కంత బోళా శంకరుడిలా ఉంటాడు వడివేలు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుంటాడు. ఆ పైన బాగా లౌక్యం తెలిసిన వాడు. నక్క జిత్తులన్నీ వీడి దగ్గరున్నాయి. కదిరేషన్‌ ఏదైనా పొరబాటు చేసినా వీడు సరి చేస్తుంటాడన్న నమ్మకంతో మహ దేవ నాయర్‌ కదిరేషన్‌ ఏ పని మీద పంపించినా వెంట వడివేలును పంపిస్తుంటాడు.

ఇక ఈ కదిరేషన్‌ బృందానికి సంబంధించినంత వరకూ చెన్నై వెళ్ళేది శత్రువుల జాడ తెలుసుకోడానికి. దాడి చేయటానికి కాదు. తమ యజమాని వ్యాపార సామ్రాజ్యానికి యువరాణి లాంటి లక్ష్మీ సహస్రను చెన్నైలో గాలించి పట్టుకొని మధురై తీసుకెళ్ళటం కోసం వెళ్తున్నారు.మధురై నుండి సహస్ర కోసం చెన్నైకు బయలు దేరిన బ్యాచ్‌ మరొకటుంది. అది త్యాగరాజన్‌ ఆర్డర్‌తో అతడి కుడి భుజం ఎట్టయప్ప నియమించిన క్రిమినల్‌ బ్యాచ్‌.

వీళ్ళు డ్రయివరుతో కలిపి

మొత్తం పది మంది.

వీళ్ళందరిదీ నేర చరిత్రే...

ప్రతి ఒక్కడు క్రిమినల్‌ కేసుల్లో అనేక సార్లు జైలు కెళ్ళొచ్చిన వాడే. ఒకరిద్దరు ప్రస్తుతం బెయిలు మీద బయట వున్న వాళ్ళు వున్నారు.వీళ్ళకి మాటలు తక్కువ చేతలెక్కువ.

చూడ్డానికి చాలా నెమ్మదస్తుల్లా అమాయంగా కన్పిస్తారు. కాని పథకం ప్రకారం ప్రత్యర్ధిని స్పాట్‌లో ఫినిష్‌ చేసి కామ్‌గా వెళ్ళి పోతారు.ఈ హంతక ముఠా నాయకుడి పేరు అళగిరి. మనిషి మహా ఉంటే అయిదడుగుల ఎత్తు మించడు.  పొట్టిగా కాస్త లావుగా కన్పిస్తాడు. చింపిరి జుత్తు మాసిన గడ్డం సాదా లుంగీ షర్టు భుజాన ఓ గుడ్డ సంచితో చూడ్డానికి బికారిలా కన్పిస్తుంటాడు. చాలా ప్రశాంతంగా అమాయకంగా నవ్వుతుంటాడు. తెలీని వాళ్ళు ఇంత అమాయకుడు లోకంలో ఉంటాడా అనుకుంటారు.

బాగా చదువుకొని ఉద్యోగం రాక దారి తప్పి క్రిమినల్‌గా మారిన వాడు అళగిరి. అలాగని అతనేమీ క్రైమ్‌ చేయడు. అంతా అతడి మనుషుల చూసుకుంటారు. ఎట్టయప్పన్‌ ఇచ్చినపథకాన్ని తు.చ. తప్పకుండా తన మనుషులతో అమలు చేయించటమే అళగిరి పని.అళగిరి బృందం ప్రయాణం చేస్తోన్న వేన్‌లోని రహస్య అరల్లో పొడవాటి కత్తులు ఇనుపరాడ్‌లు, రెండు రివాల్వర్లు, ఒక షాట్‌ గన్‌ కూడ ఉన్నాయి. అళిగిరి బృందంలోఇపుడు విక్కీ డైమండ్‌ అనే యిద్దరు బెస్ట్‌ షూటర్స్‌కూడ వున్నారు. వీళ్ళు రివాల్వర్‌ గాని షాట్‌ గన్‌ గాని గురి చూస్తే తప్పే ప్రసక్తే లేదు.

ఎట్టి పరిస్థితి లోనూ సహస్రతో డైరక్ట్‌  ఫైటింగ్‌కు పోవద్దనేది త్యాగరాజన్‌  స్ట్రిక్ట్‌ ఆర్డరు. వీళ్ళు బయలు దేరే ముందు ఒకటికి పది సార్లు హెచ్చరించి పంపించాడు. ఎంతో అవసరమైతే తప్ప కత్తులు ఇనుపరాడ్‌లు తీయొద్దు సహస్ర (లహరి) కనబడగానే తొందరపడి ముందుకు పోవద్దు. ఫాలో చేసే ముందు ఆమె వుంటున్న ఇల్లెక్కడ తెలుసుకోండి. వీలు చూసి ఆమె ఇంట్లోంచి బయటికొస్తుండగా కాల్పులు జరపండి. స్పాట్‌లో ప్రాణం పోవాలి. పని ముగిసిన గంటలోపే మీరంతా చెన్నై పొలిమేరలు దాటి ఇవతలికి వచ్చేయాలి. అంటూ చిలక్కి చెప్పినట్టు చెప్పి మరీ సాగనంపాడు కాబట్టి.

ఈ హంతక ముఠా

లహరిని అంతం చేయటం కోసమే

చెన్నైకు బయలుదేరింది

I              I                     I

తెల్లవారే సరికి నీకు మర్యాద నేర్పిస్తానంటూ సవాల్‌ విసిరిన విరాట్‌ వెంటనే మధురై లోని తన మిత్రుడు ధర్మకు ఫోన్‌ చేసివిషయం చెప్పాడు. ఇటు ఎ యస్‌ పి ప్రకాశ్‌ తన పర్సనల్‌ అసిస్టెంట్‌ వన్ నాట్‌ ఫోర్‌ ని పిలిచి విచారించినా అవతలి వ్యక్తి ఎవరనేది అంతు చిక్క లేదు.విరాట్‌కున్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌లో ఈ ధర్మ ఒకడు. ఇతనితో బాటు అక్కడ మిత్ర వర్గం చాలానే ఉంది. అంతా ముఫ్పై లోపు వయసు యువకులు. గతంలో రెండేళ్ళ పాటు విరాట్‌ మధురైలోఉండి కరాటే నేర్చుకున్నప్పుడు ఏర్పడిన మిత్ర బృందం అది. ఇరవై మందికి పైగా ఉంటారు. ప్రస్తుతం అంతా వివిధ వృత్తుల్లో స్థిర పడినా స్నేహం అలానే కొనసాగుతోంది. ఎవరికే సమస్య వచ్చినా అంతా షేర్‌ చేసుకుంటారు.అటువంటి ధర్మ`

విరాట్‌ ఫోన్‌లో చెప్పిన విషయం వినగానే`

వెంటనే ఫోన్లు కొట్టి పిలిచి`

మిత్ర వర్గంతో సమావేశమయ్యాడు.

తగిన కారణం లేందే విరాట్‌ చర్య తీసుకోడని తెలుసు. ఎ యస్‌ పి ప్రకాశ్‌ దుశ్చర్యలు లంచగొండితనం గురించి చాలా వింటూనే వస్తున్నారు. అ పైన జగన్మోహన్‌ తొత్తు అనీ తెలుసు. కాబట్టి ప్రకాశ్‌ను దెబ్బ కొట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారంతా. పిమ్మట రెండు గంటల్లోనే ఇద్దరు యువకులు వెళ్ళి ఎ యస్‌ పి దినచర్యలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారంతో తిరిగొచ్చారు.ఎ యస్‌ పి ప్రకాష్‌ ఉంటున్నది మధురై వన్‌ టౌన్‌ ఏరియాలో. అతనింకా అవివాహితుడు గాబట్టి ఒంటరిగానే ఉంటున్నాడు. వంట ఇల్లు వాకిలి శుభ్రం చేసే వాళ్ళు , ఇద్దరు నమ్మకమైన నౌకర్లు ఇంటిని కనిపెట్టుకొని ఉంటారు.

ఎ ఎస్‌ పి ప్రకాష్‌కి ఒక గర్ల్‌ ఫ్రెండుంది. ఆమె పేరు అముదవల్లి. రాత్రి సుమారు ఎనిమిది తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో అముదవల్లి ఇంటికొస్తాడు. అంతటితో తమ డ్యూటీ ముగించుకొని ఎస్కార్ట్‌గా జీప్‌ లో వచ్చిన పోలీసులు వెనక్కి వెళ్ళి పోతారు. రాత్రికి ప్రకాష్‌ అముదవల్లి చెంతనే.

అయితే రాత్రంతా అక్కడ ఉండే అలవాటు లేదు. సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి బయలుదేరి దారిలో బీట్‌ కానిస్టేబుల్స్‌ని పలకరిస్తు ఇంటికెళ్ళిపోతాడు. తిరిగి మరునాడు రాత్రే అముదవల్లి యింటికొచ్చేది.

ఈ పక్కా ఇన్ఫర్మేషన్‌ ఆధారంగా రాత్రికి ఫథకం సిద్ధం చేసాడు ధర్మ. దాని ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకి ముందుగా ఇద్దరు యువకులు వెళ్ళి అముదవల్లి ఇంటి సమీపంలో మాటు వేసారు. రాత్రి సరిగ్గా తొమ్మిది పది నిముషాలకు వాళ్ళ నుంచి ధర్మాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. అంత క్రితమే ప్రకాష్‌ వచ్చాడని. ఎస్కార్ట్‌గా వచ్చిన పోలీసులు వెనక్కి వెళ్ళి పోయిన విషయం కూడా చెప్పారు.

‘ఒకే ఇక మీరక్కడ్నుంచి వచ్చేయండి. మనం పదిన్నరకి ఇక్కడి నుండి స్పాట్‌కి బయలుదేరుతున్నాం’’ అంటూ ఆ యిద్దర్ని వెనక్కి పిలిచాడు ధర్మ.

ఇటాంటి పనులకి స్పాట్‌ నిర్ణయం చాలా కీలకం. ప్రత్యర్థి తమకి ఒంటరిగా చిక్కేలా` అన్ని విధాల అనుకూలమైన జన సమర్థం లేని ప్రాంతాన్ని చూసి` తగిన స్పాట్‌గా ఎంచుకుంటారు. స్పాట్‌ ఎంపిక జరిగాక ఒరిజినల్‌ నేరస్తులయితే రెక్కీ నిర్వహించి ఏర్పాట్లు సరి చూసుకుంటారు. అయితే ఇక్కడ రెక్కీ నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆలోచించాకే ధర్మ పార్క్‌ ఏరియాని ఎంపిక చేసాడు.

అముదల్లి ఇంటి నుంచి ఎ యస్‌ పి ప్రకాష్‌ తన ఇంటికెళ్ళే దారిలో అర కిలో మీటరు దూరంలోనే ఉందా పార్కు. విశాలమైన రోడ్‌ కి ఎడం పక్కగా పార్కు గోడ, కుడి పక్కగా ఏదో పెద్ద గోడౌన్‌ కి చెందిన ఎత్తయిన ప్రహరీ గోడ ఉండగా రోడ్‌ కి అటు యిటు శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్ల మూలంగా పగలే అటు వెళ్తుంటే ఏదో గుహలోకి పోతున్నట్టుంటుంది.

వీధి లైట్ల కాంతి కూడా సరిగా ప్రసరించక అక్కడికొచ్చే సరికి రోడ్డంతా చీకటి గాను నిర్మానుష్యం గాను ఉంటుంది. అరిచినా కూడా అటు చివర ఇటు చివర ఇళ్ళ వరకూ వినబడదు. అటువంటి పార్కు ప్రాంతానికి రాత్రి పదిన్నర గంటలకు చేరుకుంది ధర్మా స్నేహ బృందం.తమ బైక్‌లు కనబడకుండా పార్క్‌ గోడ వెంట చెట్ల వెనక ఉంచి వచ్చారు. ఎ యస్‌ పి ప్రకాష్‌  బైక్‌ ఎగువన మలుపు తిరగ్గానే తమను హెచ్చరించటం కోసం ఇద్దర్ని అక్కడ వదిలి వచ్చాడు ధర్మ. అంతా మంకీ కేప్‌ లతో ముఖాలు తెలీకుండా జాగ్రత్త పడ్డారు. చేతుల్లో దృఢమైన క్రికెట్‌  బేట్‌లున్నాయి. క్రమంగా సమయం అర్ధరాత్రికి దగ్గర పడిరది ఈ లోపల`

ఎ యస్‌ పి ప్రకాష్‌కి పగలంతా ఫోన్‌లో విరాట్‌ మాటలే చెవిలోమరు మోగుతూ వచ్చాయి.

ఫోన్‌లో తనకు సవాల్‌ విసిరిన వాడెవడో అసలు వాడెలా ఉంటాడో కూడా తెలీదు. ప్రత్యర్థి ఎవడో తెలిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇక్కడా పరిస్థితి లేదు. ఆ పైన మధురైలోవాడి తాలూకు మనుషులెవరన్నా ఉన్నారా అంటే అదీ తెలీదు. ఇక తనపైన దాడి చేయగల దమ్ము ఎవడికుంది? మర్యాద నేర్పిస్తాట్ట మర్యాద. ఏ విధమైన మర్యాద అది? నలుగురు పెద్ద మనుషుల్ని పంపించి బుద్ధి మతి చెప్పిస్తాడా లేక కిరాయి మనుషులతో కొట్టిస్తాడా? సాయంకాలమవుతున్నాఅటువంటి సూచనలేమీ లేక పోవటంతో ఆ రెండూ వట్టి మాటలే అన్పించింది. వాడి మాటలు వట్టి బెదిరింపులు తప్ప వేరేమీ కాదనే నిర్ణయానికొచ్చేసాడు ప్రకాష్‌.

దాంతో రాత్రికి అముదవల్లి ఇంటికెళ్ళే సమయానికి ఆ విషయమే మర్చి పోయాడు. మందు కొట్టి చక్కగా భోజనం చేసి అముదవల్లితో అర్ధరాత్రి వరకు గడిపాడు. బయలుదేరుతుంటే ఆముదవల్లి హెచ్చరించింది. ‘‘ఇవాళ కాస్త మందు ఎక్కువైనట్టుంది. ఇక్కడే ఉండిపోయి ఉదయం వెళ్ళొచ్చుగా’’ అంది.

‘‘నోనో... ఎక్కువేం కాలేదు. స్టడీగానే ఉన్నాను. జాగ్రత్తగా తలుపేసుకో’’ అంటూ అముదవల్లి చెక్కిలి మీద చిటికే వేసి బైక్‌ స్టార్ట్‌ చేసాడు. అలా అతడు బయలు దేరేసరికి అర్థరాత్రి పన్నెండు గంటలు.

పది నిమిషాల్లోనే బుల్లెట్‌ బైక్‌ పార్క్‌ రోడ్‌ లోకి ఎంటరయింది. పార్క్‌ను సమీపిస్తుండగా హెడ్‌లైట్‌ కాంతిలోఒక ఘోర దృశ్యం ఎ యస్‌ పి ప్రకాష్‌ కంటబడిరది. చూడగానే ఉలికి పాటు చెందాడు. అటే గమనిస్తు బైక్‌ను స్లో చేసాడు.

సరిగ్గా పార్కు గేటు ఎదురుగా`

రోడ్‌ కి అడ్డంగా పడున్నాడో యువకుడు.

అతడి పక్కన నెత్తురు మడుగు కట్టింది. ముఖానికి మంకీ కేప్‌ ఉన్నందున అతడెవరో తెలీటం లేదు. ఎవరన్నా వాడ్ని కొట్టి చంపి పడేసారా లేక ఏ లారీనో తొక్కి చంపిందా అర్థం కాలేదు. అంత నెత్తురు పోయిందంటే బ్రతికుండే ఛాన్సేలేదు. సహజంగానే పోలీస్‌ అధికారి గాబట్టి ఎం జరింగిందో తెలుసుకోవాలనే కుతూహలం కొద్ది డెడ్‌ బాడీకి అయిదు గజాల ఇవతలగా బైక్‌ ఆపాడు. హెడ్‌ లైటు ఆన్‌లోనే ఉంచి స్టాండ్‌ వేసాడు. ఏదన్నా క్లూ దొరుకుతుందని శవం చుట్టూ ఒక రౌండ్‌ కొట్టాడు. ఎలాంటి ఆధారం పక్కన కన్పించ లేదు. నెత్తురింకా గడ్డ కట్టని కారణంగా సంఘటన జరిగి కూడా ఎక్కువ సేపు కాలేదనిపించింది. ఎవరో వాడ్ని కొట్టి లేదా కత్తులతో దాడి చేసి హత మార్చి వుండాలి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్