దీపావళి జాగ్రత్తలు -
పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంతో జరుపుకునే పండుగ దీపావళి. ప్రతి ఏటా దీపావళి పండుగను ఆశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాము. ఈ పండుగను కొత్త బట్టలు, నోరూరించే పిండి వంటలు, లక్ష్మీ దేవి పూజలు, టపాకాయల మోత తో ఎంతో వైభవముగా జరుపుకుంటారు.
టపాకాయలు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ పండగను మరింతగా ఆస్వాదించవచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాలు జరిగే అవకాశం వుంది. కరోనా మహమ్మారి కూడా పూర్తిగా తగ్గక పోవడం వలన మరిన్ని జాగ్రత్తలు అవసరం.
టపాకాయలు కాల్చేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం.
1) టపాసులు పేల్చేటప్పుడు కాటన్ దుస్తులను ధరించడం ఉత్తమం.
2) టపాకాయలు కాల్చేటప్పుడు చేతులను, ముఖాన్ని టపాసుకు దూరంగా ఉంచి జాగ్రత్తగా అంటించాలి.
3) చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు, పెద్దవాళ్ళు తప్పకుండా వారి దగ్గర ఉండి, వారిచేత జాగ్రత్తగా టపాకాయలను కాల్పించాలి.
4) టపాసులను బహిరంగ ప్రదేశాలలోనే కాల్చాలి. కరెంటు తీగలు, ఎండు గడ్డి, పూరి గుడిసెలు వంటి మంటలు అంటుకునే అవకాశం గల ప్రాంతాలు లేని ప్రదేశాలలో మాత్రమే కాల్చాలి.
5) పేలకుండా ఉండిపోయిన టపాసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెంటనే వాటి దగ్గరకు వెళ్లడం, వాటిని తాకడం లాంటివి చేయకూడదు. మొదట వాటిపై నీటిని పోయడం ఉత్తమం
6) టపాకాయలు గాజు పాత్రలు లేదా ప్లాస్టిక్ పాత్రలో ఉంచి కాల్చరాదు.
7) ఈ పండగ రోజు శానిటైజర్ లను వాడకపోవడం ఉత్తమం. శానిటైజర్ లకు త్వరగా మండే స్వభావం ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. కావున టపాకాయలు పేల్చేటప్పుడు శానిటైజర్ లను వాడకూడదు.
8) వాడిన టపాసులను ఇసుకతో నింపిన బకెట్ లో వేయండి.
9)టపాసులు కాల్చేసమయంలో ముందు జాగ్రత్తగా బక్కెట్‌తో నీటిని సిద్ధంగా ఉంచుకోండి.
ఈ జాగ్రత్తలను పాటిస్తూ ఈ దీపావళి పండగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆశిస్తూ, శుభాకాంక్షలతో
మీ
గోతెలుగు.కామ్

