సత్యభామ -
"సత్యా..నువ్వు తలుచుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఎంతకాలం ఇలా మనం వీడి టార్చరు భరిస్తాం. రేపే ఏదో ఒకటి తేల్చెయ్యాలి"
"అవునే ప్రియ చెప్పింది కరెక్టే. మన ఉద్యోగాలు ఎక్కడ ఊడగొడతాడోనని భయంతో ఊరుకుండడమే తప్ప.. ఆ మహానుభావుడి నస భరించడం కష్టంగా ఉందే"
"అప్పటికీ మొన్న మన లీడరు విక్రమసింహకు చెప్పి చూశాను. ఇలాగే బాస్ కనుక విసిగిస్తే అందరం కలిసి హెడ్డాఫీసుకు కంప్లెయింటు చేస్తామన్నాను. దానికి ఆయన 'మేడమ్..ఈయన సంగతి మీకు తెలియదు. మీరు ఫిర్యాదు చేశారని తెలిస్తే, మీ మీద లేనిపోని పితూరిలన్నీ చెప్పి మీ ఉద్యోగాలకు మీరే రాజీనామా చేసేలా చేస్తాడు. ఇక మేము వెళ్ళి మీకు సపోర్టుగా మాట్లాడితే మన మధ్య ఏదో ఉందనే దరిద్రపు అనుమానాన్ని అందరికీ కలిగేలా చేస్తాడు' అని చెప్పాడు" అన్నది రోషిణి
"అయితే ఏంచేద్దామంటారే మీరు" అడిగింది సత్యభామ.
"ఎల్లుండి దీపావళి. మన ఆఫీసుకు సెలవు ఇచ్చారు. కానీ వీడు మనలను మధ్యాహ్నం నుంచి ఆఫీసుకు రమ్మని సతాయిస్తాడు. చస్తే రామని చెప్పు. ఏంచేస్తాడో చూద్దాం" అన్నది ప్రియ.
"ఆ మాటేదో అందరం కలిసే చెబుదాం" అన్నది సత్యభామ.
"ఆయనే ఉంటే వైట్ శారీ ఎందుకన్నట్లు. ఆ ధైర్యమే ఉంటే నిన్నెందుకు అడుగుతామే. సత్యా..ప్లీజే..మా తల్లి కదూ.. మాలో కాస్త ధైర్యస్థురాలివి నువ్వేనే. పైగా పని విషయంలో నువ్వు చాకు. అందుకే ఆ బాసుకు నువ్వంటే కాస్త దడ. నరకాసురుడిని చంపిన సత్యభామవై, మన నరకుడి పొగరణచి మన మనుగడ సాగేలా చూడవే" అందరూ కోరస్ లో చేరి బ్రతిమలాడేసరికి సత్యభామలో ఒకరకమైన ఆవేశం తన్నుకొచ్చి "ఓకె.. రేపే నా విశ్వరూపం చూపిస్తా" అని పమిట తీసి బొడ్లో దోపి కాఫీ తాగడం ప్రారంభించింది.
*****
"ఏమిటి..నేను వస్తానని తెలిసే అటు తిరిగి కూర్చున్నారా. ముఖం చూపించడం లేదని ముడుచుకు పోతాననుకున్నారేమో.. నెవర్..నేను పెట్టే నాలుగు.. పెట్టే పోతాను. నువ్వసలు బాస్ వేనా. కాదు..శాడిస్టువి. నీకసలు మనసే లేదు. ఆడవాళ్ళను ఎలా ట్రీట్ చెయ్యాలో అసలు తెలీదు. నిన్ను పెట్టుకుని ఆ మహాతల్లి ఎలా భరిస్తున్నదో అర్థం కాదు. అరె..అయిదు గంటల వరకు చెప్పకుండా, తీరా బయలుదేరేటప్పుడు ఫైలు తెచ్చి ముందుపెట్టి, ఇది చాలా అర్జంటు..పూర్తిచేసి పొమ్మంటావు. మా మొగుళ్ళు సరే.. మమ్మల్ని కట్టుకున్న నేరానికి మాకోసం వీధిలో పడిగాపులు కాస్తుంటారు. పాపం ప్రియ..పెళ్ళిగాని పిల్ల..ఆ అమ్మాయి కోసం ఏడు పదుల వయసున్న వాళ్ళ నాన్నగారు ఊసురో మంటూ ఆఫీసు బయట ఎదురుచూడాలా. మమ్మల్ని అది చెయ్, ఇది చెయ్ అంటావు తప్ప, ఏనాడైనా పేపరు మీద పెన్ను పెట్టావా. అసలు పని వచ్చా నీకు, హెడ్డాఫీసులో ఇన్స్పెక్షను డిపార్టుమెంటులో మీ మామగారు ఉన్నారని పొగరు నీకు. అసలు వాళ్ళకు, వీళ్ళకు కాదు..ఆయనకే నీ మీద ఫిర్యాదు చేస్తా. ఎదురుతిరిగితే ఉద్యోగం ఊడపీకేస్తానంటావా.. ఛోడ్ దో.. నీ తొక్కలో ఉద్యోగం ఉంటే ఎంత ఊడితే ఎంత. నీలాంటి నరకుడి దగ్గర పనిచేసే కంటే నాలుగిళ్ళలో వంటలు చేసుకుని బ్రతకడం మేలు.ఇదిగో రేపు దీపావళి. ఇంటిల్లిపాది సంతోషంగా చేసుకునే పండుగ. 'మధ్యాహ్నం భోంచేసి రండి..ఎంత ఒక గంట పని చేసిపోండి' అంటారేమో. రాము..ఎవ్వరమూ రాము. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇది ఆఫీసులో అందరి మాట. ఇది చెప్పి పోవడానికే వచ్చాను" అని గిర్రున వెనుదిరిగిన సత్యభామ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నిర్ఘాంత పోయింది. ఎదురుగా బాసు వైకుంఠం. మరి కుర్చీలో కూర్చుంది. బిక్కమొహంతో వెనక్కు తిరిగి చూసింది. తనవైపు చూసి నవ్వుతూ జనరల్ మేనేజర్ గిరీశం గారు. గొంతు తడారిపోయింది సత్యభామకు. ఏడుపు తన్నుకు వచ్చింది. ఉద్యోగం ఊడిపోవడం ఖాయమనుకుంది.
"సార్...అది..అది" ఏడుపు తన్నుకు వస్తుంది ఆమెకు.
"ఏమ్మా సత్య..మిమ్మల్ని ఇంత టార్చర్ పెడుతున్నాడా వైకుంఠం. ఏమయ్యా..నువ్వసలు మనిషివేనా. బాసంటే పెద్ద పోటుగాడనుకుంటున్నావా. వాళ్ళు చిన్న కూలీలయితే, మనం పెద్ద కూలీలం. బెదిరించి కాదయ్యా, ప్రేమ చూపించి పనిచేయించు కోవాలి. నీ గురించి విన్నానుగానీ, మరీ ఇంత దుర్మార్గుడివని అనుకోలేదు. చూడు సత్యా..ఇక నుంచి ఈ బ్రాంచికి బ్రాంచిమేనేజరు నువ్వు. దీన్ని లేడీస్ బ్రాంచిగా మారుస్తున్నాను. మగవారిని వేరే బ్రాంచిలకు మారుస్తాను. ఇదిగో వైకుంఠం ఇకనుంచి నువ్వు హెడ్డాఫీసులో డిస్పాచ్ సెక్షనుకు హెడ్ గా ఉండు. అదే నీకు శిక్ష. థాంక్సమ్మా సత్య.. నిజంగా సత్యభామలానే రెచ్చిపోయి వైకుంఠం పొగరు దించావు. ఆల్ ది బెస్ట్. ఇదే నీకు దీపావళి బొనాంజ. రేపే అందరికీ ఆర్డర్స్ వస్తాయి" అన్నాడు జనరల్ మేనేజర్.
"సార్..సార్..ఇది అన్యాయం సర్.. నా పోర్టుఫోలియో ఊడబీకి ఆ అమ్మాయికి ఇస్తారా" బోరుమన్నాడు వైకుంఠం.
"అంతేకావాలి నీకు..అంతేకావాలి నీకు..మా ఆడపిల్లల ఉసురు పోసుకున్నావు కదా. నీకు తగినశాస్తి జరిగింది" అంటూ డోరు తీసుకుని బయటకు వచ్చేసింది సత్యభామ.
******
"అంత సీను జరిగిందా ఆఫీసురూములో. అయినా మనకు తెలియకుండా జనరల్ మేనేజర్ ఎప్పుడు వచ్చాడే" ఆశ్చర్యంగా అడిగింది రోషిణి.
"ఎప్పుడొస్తే మనకెందుకు రోషిణి. మన పథకం పారింది. మన సత్య దెబ్బకు వైకుంఠానికి వైకుంఠం కనిపించి ఉంటుంది. ఏమయినా మన జనరల్ మేనేజర్ కాస్త ఆడవాళ్ళ పక్షపాతిలా ఉన్నాడు. మనగోడు విని చలించి మన సత్యను మేనేజరును చేశాడు. పోనీలేవే మన బ్రాంచి లేడీస్ బ్రాంచి అయితే ఎంచక్కా మనం...."
"ఆఫీసు పనులు ఎగ్గొట్టి నగల గురించి, బట్టల గురించి చర్చించుకోవచ్చు" అంటూ వచ్చి, ఏదో చెప్పబోతున్న ప్రియ మాటలకు అడ్డు తగిలాడు వైకుంఠం.
"హలో సర్..ఈరోజుతో మీ సినిమా బంద్. రేపటినుంచి సత్యభామ రాజ్యం. అన్నీ మీ ముందే జరిగాయిగా. ఇంకా ఎందుకా బిల్డప్పు. రేపటి నుంచి ఇక్కడ ప్రమీలారాజ్యమే..అంటే అంతా ఆడవాళ్ళ పెత్తనం అన్నమాట" కళ్ళు ఎగరేస్తూ అన్నది ప్రియ.
"ప్లీజ్..ఇక ఆపవే" అని ప్రియను కంట్రోలు చెయ్యబోయింది సత్యభామ.
"ఎందుకే ఇంకా భయపడతావు.. ఇప్పుడు వైకుంఠం గారు తీ.తా. అంటే తీసేసిన తహసిల్దారు. పవరు పోయిన ప్రెసిడెంటు" వెటకారంగా నవ్వింది రోషిణి.
"ఏంటి మేడమ్..మీరంతా చాలా హుషారుగా ఉన్నారు. మన వైకుంఠం సారుకు బదిలీ వచ్చిందా. ఏం సార్..మీకు ట్రాన్స్ఫర్ అయిందా" అడిగాడు అప్పుడే వచ్చిన విక్రమసింహ.
"విక్రమ్..వీళ్ళంతా ఒక కలల లోకంలో ఉన్నారు. సత్యభామ గారేదో మన జనరల్ మేనేజరుతో మాట్లాడి నా గురించి చెప్పి, నన్ను ఈ పోస్టు నుంచి పీకించి ఆమెను ఈ పోస్టులో పెట్టారట. ఊహాలోకంలో తేలిపోతున్నారు" అని పకపకా నవ్వాడు వైకుంఠం.
"సార్..తప్పయిపోయింది. ఏదో చిన్న బిల్డప్ ఇచ్చాను. అంతే. మీరు సీరియస్ గా తీసుకోకండి. మీరు చెప్పినట్టు రేపు మధ్యాహ్నం నుంచి ఆఫీసుకు వస్తాను" వణికిపోతూ చెప్పింది సత్యభామ.
"అదేమిటే..ఇప్పటిదాక బ్రాంచి మేనేజరు అన్నావు. లేడీస్ బ్రాంచి అన్నావు..మరి ఇప్పుడేందే" సత్యభామను కుదుపుతూ అడిగింది రోషిణి.
"అదంతా నాటకం..నేను చీవాట్లు పెట్టేసరికి బయటకు వచ్చి ఆ అవమానాన్ని మీతో చెప్పలేక ఇలాంటి బిల్డప్ ఇచ్చింది. అయినా మన జనరల్ మేనేజర్ పేరు లావణ్య త్రిపాఠి..సుబ్రహ్మణ్యం కాదు. సత్యభామ బుట్టలో పడి అది కూడ మర్చిపోయారు మీరు. వెరీగుడ్ సత్యభామగారు, మీకు ఉద్యోగం ఊడినా కథలు వ్రాసుకునో, హరికథలు చెప్పుకునో బ్రతికేయగలరు" అని వెటకారంగా నవ్వాడు వైకుంఠం.
"ఆవేశపడకు వైకుంఠం..సత్యభామ చెప్పినదాన్ని నిజం చేయబోతున్నాను. ఈ బ్రాంచిని లేడీస్ బ్రాంచి చేయబోతున్నాను. దానికి బ్రాంచి మేనేజర్ సత్యభామే" అన్న మాటలు విని ఉలిక్కిపడి వెనుదిరిగాడు వైకుంఠం.
ఎదురుగా జనరల్ మేనేజర్ లావణ్య త్రిపాఠి గారు.
"మేడమ్..మీరు ఇక్కడ.."
"అవును నేనే..బ్రాంచి ఇన్స్పెక్షనుకని బయలుదేరాను. ఇంతకుముందు నీ గురించి నాకు విక్రమసింహ ఉత్తరం వ్రాశాడు. అప్పుడే నేను మెసెంజరు ప్రతిమను ఇక్కడికి పోస్టు చేశాను. ఆ రోజు నుంచి బ్రాంచిలో జరిగే ప్రతి విషయాన్ని నాకు అప్డేట్ చేసేది. నీ తిక్కచేష్టలు, శాడిజమ్ మొత్తం తెలిసింది. ఈ రోజు ఉదయం సత్యభామ నీ ఛాంబరుకు వచ్చినపుడు నువ్వు వాగిన ప్రతి అడ్డమైన వాగుడు నాకు తెలుసు. నీ గదిలోకి వచ్చి తన సెల్ ఫోనులో వీడియో ఆన్ చేసి దూరంగా పెట్టి వెళ్ళిపోయింది ప్రతిమ. నీకు ఆ విషయం తెలియక నీ ధోరణిలో నువ్వు వాగావు. ఆ వీడియో మొత్తం నేను చూశాను. ఇప్పుడు సత్య చెప్పిన కథను కూడ నాకు వినిపించింది ప్రతిమ. దారిలో వస్తూ ఆలోచించాను. అదేదో బాగుందనిపించింది. నీ ఉద్యోగం పీకేద్దామనుకున్నాను. కానీ మీ మామయ్య మంచితనం గుర్తుకు వచ్చింది. అందుకే నిన్ను నా ఆఫీసులో గుమాస్తాగ వేస్తున్నాను. సత్యా..కంగ్రాట్స్.. ఈ బ్రాంచిని నీ చేతుల్లో పెడుతున్నాను. మన ఆడవాళ్ళ పవరేమిటో చూపించు. సత్యభామ యుద్ధమే కాదు, రాజ్యాన్ని కూడ ఏలగలదని నిరూపించు. ఇదే మీ అందరికీ దీపావళి కానుక. ఆల్ ది బెస్ట్" అని సత్యభామకు కరచాలనం చేసింది లావణ్య త్రిపాఠి.
ముఖంలో ఆనందం సత్యభామకు..మాడిన ముఖం వైకుంఠానికి. ఇదే భగవంతుడి స్కెచ్ అంటే...

