Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Puzzling Fever? అంతుపట్టని జ్వరం? Ayurvedic Treatment | Dr. Murali Manohar Chirumamilla, M.D.

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

సాధారణంగా మనలో చాలామంది, కొన్ని కొన్ని చిన్న విషయాలలొ, జాగ్రత్త వహించడంలో అశ్రధ్ధ చేస్తూంటాము. అదృష్టం బాగుంటే, అంతగా ప్రమాదం ఉండకపోవచ్చు, కాని రోజు బాగుండకపోతే, ఒక్కొక్కప్పుడు ప్రాణం మీదకి రావొచ్చు. అలాగని వాటిగురించి తెలియదా అంటే అదీ కాదు, సమయానికి గుర్తుకిరావు.

ఉదాహరణకి, రోడ్లమీద ద్విచక్రవాహనాల మీద వెళ్ళేవారికి ఓ " దురలవాటు" ఉంది-- బండిని start చేయడంలో ఉన్న శ్రధ్ధ, దాని stand  సరీగ్గా పైకి లాగేడో లేదో అన్న విషయం చూసుకోరు. దారిలో ఏ speed  బ్రేకరుకో, అలా వేళ్ళాడుతూన్న  stand  తగిలితే, ఇంక అంతే సంగతులు ! పైగా హెల్మెట్లు పెట్టుకోవడం ఈరోజుల్లో అందరికీ నామోషీ ఆయె. ఏ కాలొ చేయో విరగడమైతే ఖాయం, కానీ శిరస్త్రాణం లేకపోవడం మూలాన కపాలమోక్షం కూడా జరగొచ్చు. చూశారా, ఓ చిన్న మతిమరుపు ధర్మాన, ఎన్నిఅనర్ధాలో..

అలాగే, కొంతమందిని చూస్తూంటాము-- మొత్తం కుటుంబం, కనీసం ఓ నాలుగు శాల్తీలు, ఒకే బండి మీద వెళ్ళడం. సరే, ఏదో కలిసొస్తుందని వెళ్ళాడే అనుకుందాం, సరైన జాగ్రత్త తీసికుంటారా, అంటే అదీ ఉండదు. వెనక్కాల కూర్చున్న ఈ డ్రైవరు గారి భార్య, తను కట్టుకున్న, చీర కొంగు ఒబ్బిడిగా పెట్టుకుంటుందా అంటే అదీ లేదు. పడవ తెరచాపలాగ, గాలికి అటూ ఇటూ ఎగురుతూ, చివరకి ఏ చక్రంలోనో పడుతుంది. ఆ తరువాత జరిగేది ఇంకా చెప్పాలంటారా? కొత్తచీరే కట్టుకుందీ, మరీ ఊరందరికీ చూపించాలంటారా, చీర కొంగు డిజైను ఎలా ఉందో, లేదా అందులో బ్లౌజు పీసు ఉందో లేదో .. వగైరా వివరాలు?

కొంతమంది వెనక్కాల కూర్చున్నవాళ్ళు, ఏదేదో మాట్టాడేస్తూంటారు, చేతులు అటూ ఇటూ తిప్పుతూ, దీనితో ఏమౌతుందంటే, వెనక్కాల ఇంకో బండి మీదొచ్చేవాడికి wrong signals  వెళ్ళడం.  ముందరవాడు ఏవైపుకి తిప్పుతాడొ తెలియక, చివరకి ఒకడిమిద ఒకడు పడడం, అల్లరి జరగడం. ఊరికే అప్పనంగా దొరికింది కదా అని, వెనక్కాల సీటుమీద కూర్చోడమే కాదు, ఓ పధ్ధతిలొ, నొరుముసుకుని కూర్చోడం కూడా ఓ కళ. రోడ్డుమీద వీళ్ళొక్కరే కాదుగా, ఇంకా చాలా వాహనాలు వెళ్తూంటాయి. అందరూ బాగుంటేనే మనమూ బాగుంటాము.

అన్నిటిలోనూ మహా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటుంది. దీనివలన మరీ ప్రాణహానిలాటిది ఉండదనుకోండి, కానీ, అకారణంగా వీధిన పడుతూంటాము. గుర్తుందా, ఇదివరకటిరోజుల్లో, ప్రతీ ఇంటికీ,  సింహద్వారంతో పాటు, ఇంట్లోకి వెళ్ళడానికి ఇంకో రెండు మూడు మార్గాలుకూడా ఉండేవి. సింహద్వారానికి కూడా, ఓ రెండు తలుపులూ, ఓ గడియా ఉండేవి. ఈరోజుల్లో వస్తూన్న ఆటోమెటిక్ తాళాలు, ఆరోజుల్లో ఉండేవి కావు. అవసరం అయితె, తలుపుకి బయట ఓ గొళ్ళెంపెట్టేవారు. మరీ అత్యవసరం అయితేనే కానీ, తాళాలు పెట్టేవారు కాదు. అరుగుమీద ఏ ఒడియాలో ఎండపెట్టాల్సివచ్చినా, వాకిట్లో  ఏ ముగ్గో వేయాల్సొచ్చినా, తలుపుకి ఓ గొళ్ళెం పెడితే సరిపొయేది, ఏ కుక్కా, పిల్లీ ఇంట్లోకి వెళ్ళకుండా ఉండడానికి. కానీ ఈరోజుల్లో ఎపార్టుమెంట్లకి, ఉండడమంటే, మూడు రూమ్ములూ, నాలుగు బాల్కనీలూ, హాలూ , కిచెనూ, మూడు బాత్ రూమ్ములూ అయితె ఉంటాయి కానీ, రాకపోకలకి మాత్రం ఒక్కటంటే ఒక్క తలుపు మాత్రమే. మనిషికి ప్రాణం, ఉన్న నవరంధ్రాలలోంచీ ఏదో ఒకదానిద్వారా పోవచ్చేమో కానీ, ఎపార్టుమెంట్లకి మాత్రం ఒకటే ద్వారం. దానికో ఆటోమాటిక్ తాళం, ఉన్నదేమో ఒకే తలుపూ, ఎందుకంటే, మరీ రెండేసి తలుపులుంటే, బయటికెళ్ళేటప్పుడు, రెండుతలుపులూ మూసి, వాటికి తాళాలు వేసేటంత, ఓపికా, టైమూ ఉండడంలేదు ఈరోజుల్లో, ఎవరికీ.  బిల్డరుకి కూడా కలిసిరావడంతో అలాగే కానిచ్చేస్తున్నారు. కానీ ఈ arrangement  లో, ప్రతీ  ఫ్లాట్ కీ కనీసం రెండు మూడైనా తాళంచెవుల గుత్తులుండడం కనీసావసరం గా మారింది.

ఆఫీసుకెళ్ళే వారిదగ్గర చెరోటీ, ఉండాలే కదా, చివరకి ఇంట్లో ఉండే ఏ పెద్దావిడ దగ్గరో, ఓ గుత్తి మిగులుతుంది. అదేమో గుర్తుగా ఏ స్టాండుకో పెట్టుంచుతారు. ఈవిడేమో, ఏదో అవసరానికి వరండా లోకి వెళ్తారనుకుందాము. తలుపుసంగతి మర్చిపోయి, చీరకొంగుకి చేయి తుడుచుకుంటూ, బయటకి వెళ్తారు. ఈలోపులొ ఏదో కొంప మునిగిపోయినట్టు, ఆ ఏకాండీ తలుపుకాస్తా  గాలికి భళ్ళున పడిపొతుంది.. లోపలేమో ఏ స్టవ్వుమీదో, ఏ చారో, పాలో పెట్టుండొచ్చు. మనవడో, మనవరాలో నిద్రపోతూండొచ్చు, పాపం , ఆ తలుపుకి ఈ విషయాలన్నీ తెలియవుగా, దానిపనేదో గాలిరావడంతో మూసుకుపోవడమొకటే , అది కాస్తా చెసేసింది. ఇక్కడ పెద్దావిడకేమో కంగారూ, అయ్యో..అయ్యో అంటూ నానా హడావిడీ చేసెయడం,బయటి రాష్ట్రాల్లో  అయితె, భాష రాదూ, ఈవిడ మాట్టాడే భాష ఎవరికీ అర్ధం అవదూ, పొనీ,ఆఫీసుకెళ్ళిన కొడుక్కో, కోడలికో ఫోను చేద్దామా, అంటే ఫోను కూడా లోపలే ఉండిపోయిందీ, ఎవరిచేతనైనా ఫోను చేయిద్దామా అంటే, నెంబరు గుర్తులేదాయె, కారణం, ఎప్పుడైనా మాట్టాడాల్సొచ్చినా, ఆ ఫొనులొ పేరుమీద ఓ నొక్కు నొక్కితే పనైపోయేది. నెంబరు విడిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే రాలేదు. చూశారా ఓ చిన్న మతిమరుపు, ఎన్ని గొడవలు తెప్పించిందో?  ఆ తలుపు పడిపోకుండా, ఏ స్టాపరో పెట్టడమో, లేదా తాళాలు ఏ కొంగుకో ముడివేసికున్నా, కాదూకూడదనుకుంటే, చివరకి ఆ ఫొను చెతిలో ఉన్నా, ఈ గొడవంతా ఉండెదే కాదుగా. ఊరికే మొగుణ్ణే కొంగుకి ముడేసికోవడం కాదు, ఈరోజుల్లో ఎపార్టుమెంట్ల తాళాలుకూడా ముడేసికుంటూండాలి.....

సర్వేజనా సుఖినోభవంతూ....

మరిన్ని శీర్షికలు
navvunaluguyugalu