Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష: రుద్రమదేవి

movie review
చిత్రం: రుద్రమదేవి 
తారాగణం: అనుష్క, రాణా, అల్లు అర్జున్‌, కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్‌, నిత్యామీనన్‌, కేథరీన్‌, సుమన్‌, హంసానందిని, ఆదిత్య మీనన్‌, బాబా సెహగల్‌ తదితరులు. 
చాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌ 
సంగీతం: ఇళయరాజా 
దర్శకత్వం: గుణశేఖర్‌ 
ఆర్ట్‌: తోట తరణి 
నిర్మాణం: గుణ టీమ్‌ వర్క్స్‌ 
నిర్మాత: గుణశేఖర్‌ 
సమర్పణ: రాగిణి గుణ 
విడుదల తేదీ: 9 అక్టోబర్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే 
కాకతీయ సామ్రాజ్య అధిపతి గణపతి దేవుడు (కృష్ణంరాజు), అతని భార్య సోమాంబ (ప్రభ) తమకు పుట్టిన ఆడబిడ్డ రుద్రాంబ (అనుష్క)ను మగ బిడ్డలా లోకానికి పరిచయం చేస్తారు. ఆడబిడ్డ అని తెలిస్తే, దాయాదులు, సామంతరాజులకు తెలిస్తే కాకతీయ సామ్రాజ్యంలో అల్లకల్లోలం సృష్టిస్తారని రుద్రాంబను రుద్రుడిగా పెంచుతారు. యుద్ధ విద్యల్లో ఆరితేరిన రుద్రాంబ ఆడపిల్ల కాదన్న విషయం ఆమె చిన్ననాటి స్నేహితుడు చాళుక్య వీరభద్రుడికి ఆలస్యంగా తెలిసినా, రాజ్య క్షేమం కోసం ఆమెను ఆరాధిస్తాడు తప్ప, ఆమె ఆడపిల్ల అన్న విషయాన్ని బయటపెట్టడు. ప్రేమ కంటే ప్రజల శ్రేయస్సు తనకు ముఖ్యమని వీరభద్రుడితో చెప్తుంది రుద్రబాంబ. అయితే గోనగన్నారెడ్డి (అల్లు అర్జున్‌) అనే బందిపోటు వల్ల కాకతీయ సామ్రాజ్యానికి, రుద్రమదేవికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకోపక్క మహాదేవనాయకుడు (విక్రమ్‌జీత్‌) కాయతీయ సామ్రాజ్యంపై దాడి చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తాడు. రాజ్యంపైకి ముసురుకొస్తున్న సమస్యల్ని రుద్రాంబ ఎలా ఎదుర్కొంది? రుద్రాంబ, చాళుక్య వీరభద్రుడి ప్రేమను అంగీకరించిందా? రుద్రమ అమ్మాయేనన్న విషయం కాకతీయ సామ్రాజ్య ప్రజలకు తెలిసిందా? అన్నది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే 
'అరుంధతి' సినిమాలో జేజెమ్మగా ఎంతో పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించిన అనుష్క, 'రుద్రమదేవి' సినిమాకి వచ్చేసరికి ఇంకా మెచ్యూర్డ్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఆమె ఎత్తు, పర్సనాలిటీ ఇవన్నీ రుద్రమదేవి పాత్రకు సరిగ్గా సరిపోయాయి. అమ్మాయి అయినా అబ్బాయిలా కనిపించడం, యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం ప్రదర్శించడం ఇవన్నీ పెర్‌ఫెక్ట్‌గా చేసింది అనుష్క. అనుష్క తప్ప ఇంకెవరూ రుద్రమదేవి పాత్రలో ఊహించుకోలేని విధంగా ఆమె తన నటనతో ప్రేక్షకుల మన్నన పొందనుంది.

రుద్రమదేవికి అన్ని విధాలా సహాయపడే చాళుక్య వీరభద్రుడి పాత్రలో రాణా ఒదిగిపోయాడు. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్‌ రాణించాడు. థియేటర్‌లో అల్లు అర్జున్‌ అప్పీయరెన్స్‌కి ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. అల్లు అర్జున్‌ డైలాగ్స్‌కి థియేటర్స్‌లో విజిల్స్‌ పడ్డాయి. మంత్రి శివదేవయ్య పాత్రలో ప్రకాష్‌రాజ్‌ అద్భుతంగా నటించాడు. గణపతిదేవుడి పాత్రలో కృష్ణంరాజు హుందాతనం ప్రదర్శించారు. అసలు సిసలు రాజుగా కన్పించారు కృష్నంరాజు. మిగతా పాత్రలన్నీ తమ పాత్రల పరిధి మేర ఫర్వాలేదన్పించాయి. 
చారిత్రక కథాంశం ఎంచుకున్న గుణశేఖర్‌, అందులోని పాత్రల్ని తీర్చిదిద్దడంలో సక్సెస్‌ అయ్యాడు. కథను నడిపించడంలోనూ, పాత్రల తీరు తెన్నుల విషయంలోనూ గుణశేఖర్‌ పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పిస్తుంది. మ్యూజిక్‌ చాలా బాగుంది. పాటలు వినడానికీ, చూడ్డానికీ బాగున్నాయి. ఇలాంటి సినిమాలకు మెయిన్‌ ఎలిమెంట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, అది కూడా సినిమా మూడ్‌కి తగ్గట్టుగా ఉంది. సెట్స్‌తో ప్రేక్షకులకు కనువిందు చేశాడు ఆర్ట్‌ డైరెక్టర్‌ తోట తరణి. గుణశేఖర్‌ సినిమాల్లో సెట్స్‌కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆనాటి కాలంలోకి ప్రేక్షకుల్ని దర్శకుడు తీసుకెళ్ళగలిగాడంటే, అది ఆర్ట్‌ డైరెక్టర్‌ పనితనమే. కాస్ట్యూమ్స్‌ కూడా ఎంతో బాగున్నాయి. ఎడిటింగ్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతం. సినిమా అందంగా కనిపించడం వెనుక సినిమాటోగ్రాఫర్‌ కష్టం ప్రత్యేకంగా ప్రశంసించదగ్గది.

రుద్రమదేవి కథను ఎంచుకోవడంలోనే గుణశేఖర్‌ 'సాహసం' మొదలు పెట్టాడు. పాత్రల ఎంపిక దగ్గర్నుంచి, ప్రతి విషయంలోనూ గుణశేఖర్‌ తీసుకున్న శ్రద్ధ అణువణువునా తెరపై కన్పిస్తుంటుంది. అనుష్క నుంచి అల్లు అర్జున్‌ దాకా, చిన్న చిన్న పాత్రల్ని సైతం చాలా ఓపిగ్గా, చాలా జాగ్రత్తగా గుణశేఖర్‌ నటీనటుల్ని ఎంచుకన్నాడు. చారిత్రక కథ కావడంతో అవసరమైన మేర మాత్రమే డ్రామాని వినియోగించుకున్నాడు తప్ప, ఎక్కువగా ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్ళలేదు. ఆయా పాత్రలు తెరపై ఇంట్రడ్యూస్‌ అవుతున్నప్పుడు ప్రేక్షకుల్లో ఎగ్జయిట్‌మెంట్‌ చూస్తేనే, ఆ పాత్రల్ని ఎంత గొప్పగా గుణశేఖర్‌ తీర్చిదిద్దాడో అర్థం చేసుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో కామెడీని చొప్పించడానికి వీల్లేని కథ ఇది. ఆ కామెడీ కోరుకునేవారికి కొంత నిరాశ కలిగించవచ్చు. యుద్ధ సన్నివేశాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. చరిత్ర గురించి తెలుసుకుంటుంటే, మధురానుభూతికి గురవకుండా ఏ ప్రేక్షకుడూ ఉండడు. టెక్నికల్‌గా సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దడంలో గుణశేఖర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఓవరాల్‌గా సినిమా మంచి ఫీల్‌ని మిగుల్చుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే 
చరిత్ర అందంగా, అద్భుతంగా తెరకెక్కింది

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5
మరిన్ని సినిమా కబుర్లు
nani act in maniratnam direction