Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

Aditya Hrudayam

సూపర్ మార్కెట్ లో ఒక ర్యాక్ లో వరుసగా సబ్బులున్నాయి. లక్స్, సంతూర్, డౌవ్, సింథాల్, లిరిల్ వగైరా... వగైరా...

క్రాస్ రోడ్స్ లో గోడకి వరుసగా వాల్ పోస్టర్లున్నాయి. రొమాన్స్, ఆకాశంలో సగం, నషా, ఎవడు, అత్తారింటికి దారేది వంటివి...

ఆ సబ్బు ఎలా అయితే ఒక ప్రొడక్టై మార్కెట్ లోకి మన ముందుకు వచ్చిందో, ఈ సినిమా కూడా అలా ఒక మస్తిష్కంలో పుట్టి, కొన్ని మస్తిష్కాల సమిష్టి కలయికయ్యి, ఒక ప్రొడక్ట్ గా తయారై మార్కెట్ లో ప్రేక్షకుడి ముందుకి ముస్తాబై వస్తుంది.

దానికీ ప్రచారం అవసరం. దీనికీ ప్రచారం అవసరం.

అంతటితో ఆగితే పర్లేదు... కానీ సినిమా పరిశ్రమలో దుష్ప్రచారం కూడా ఎక్కువ. దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకుండా పనిచెయ్యాల్సిన అవసరం ఎక్కువుంటుంది. ఆ దుష్ప్రచారాన్ని మించిన రేంజ్ లో మంచిగా ఉండాల్సి వస్తుంది. నచ్చిన చోట్లా, నచ్చని చోట్లా కూడా. బయటి సమస్యలతో, సంఘర్షణలతో పాటు మనలో మనకి అంతర్గత సంఘర్షణల రాపిడి కూడా ఎక్కువుంటుంది.

అసలే అస్థిర జీతభత్యాల ఉద్యోగంలో ఇన్ని రకాల భావోద్వేగాల చెలగాటం మధ్య మంచి కలల్ని కనటం, లేదా మంచి రచయితలతో కనిపెట్టించడం, వాటిని ప్రేమించడం, అనుకున్నంత బాగా తీయడం గగనమైన రోజుల్లో ప్రెస్ మీట్స్ లో చెప్పినట్టు అనుకున్నదానికంటే బాగా తియ్యడం, దాన్ని అందంగా ప్రచారం చేసి మార్కెట్ లో పెట్టడం, ప్రజల్ని ఆకర్షితులను చేసి వారితో 'హిట్టు' అనిపించుకోవడం, ఈలోగా మన దైనందిక చర్యలు, మన కుటుంబ జీవితం, ఆర్ధిక జీవితం 'ఫట్' అవ్వకుండా బ్యాలెన్స్ చేయడం.

(చదివేవాళ్ళు ఇక్కడ చిన్న గ్యాప్ తీసుకోండి... ఆయాసం వచ్చినట్టుంది)

మళ్ళీ మొదలెడదాం...

ఇన్ని పనులు చేయాలంటే రిస్క్ కాదు... అప్పుడప్పుడు వినోదం కోసం ఎక్కాల్సిన రోలర్ కోస్టర్ రైడ్ ని మన నిత్యప్రయాణంగా మార్చుకోవడమే.

ఇన్ని దాటి దీంట్లో స్థిరంగా నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తికీ, నిర్మాతైనా, దర్శకుడైనా, హీరో అయినా, హీరోయిన్ అయినా, మరే ఇతర టెక్నీషియనైనా, సహా నటీనటులైనా అందరికీ శిరస్సు వంచి నమస్కరించడంలో ఏ మాత్రం తప్పులేదు.

కానీ విచిత్రంగా పబ్లిక్ కి, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ బూమ్ తర్వాత, ఇంటర్నెట్ రివల్యూషన్ పెరిగిన తర్వాత, ఇలా ఎదిగిన వారి గురించి చెడుగా రాస్తే మాత్రమే నచ్చి క్లిక్ లు, లైక్ లు, కామెంట్లు ఎక్కువ సంఖ్యలో వచ్చే ట్రెండ్ ఇప్పుడు.

దీన్ని కూడా తట్టుకుని గట్టెక్కాలి పరిశ్రమలో ఉన్నవారు. పబ్లిక్ ఇంటరెస్ట్ కి, పర్సనల్ ఇంటరెస్ట్ కి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం యోగా చెయ్యడమంత కష్టం. అది సాధించిన ప్రతి సక్సెస్ ఫుల్ దర్శకుడు, నిర్మాత, రచయిత, హీరో, హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటులందరూ మహా యోగులు - నా దృష్టిలో యోగ్యులు. అది చేతకాక వాళ్ళని విమర్శించేవాళ్ళని మానసిక విశ్లేషకుల దగ్గరికి పంపి కౌన్సిలింగ్ ఇప్పించడమే మనం చేయగలిగిన పని. ఎన్నారైలకి నచ్చే సినిమాలు, పరాయి రాష్ట్రాల్లో స్థిరపడిన వారికి నచ్చే సినిమాలు, స్వరాష్ట్రంలో ఒక్కో ప్రాంతం వారిని ఆకట్టుకునే నేటివిటీ ఉన్న సినిమాలు, అందులో మల్టీప్లెక్స్ ప్రేక్షకుల అభిరుచికి అద్దం పట్టే సినిమాలు, క్లాస్ ఆడియెన్స్, మాస్ ఆడియెన్స్, యూత్ ఆడియెన్స్, లేడీస్, ముఖ్యంగా రివ్యూయర్లకి నచ్చే సినిమాలు, డిస్ట్రిబ్యూటర్లకి నచ్చే సినిమాలు, ఇండస్ట్రీలో మిగిలిన వారికి నచ్చే సినిమాలు - ఇన్ని భిన్నాభిరుచుల మధ్య ఒక మంచి కథని తయారు చేసి ఒక నిర్మాతకి, ఒక హీరోకి మాత్రమే బాగా నచ్చేలా తయారు చేసినట్టు అనిపించి, ఇంతమందిని శాటిస్ ఫై చేయడం ఈరోజుల్లో దర్శక, రచయితలకి కత్తి మీద సాము, నెత్తిమీద సమ్మెటపోటు.

థియేటర్ దాకా వచ్చేదాకా సినిమాల కంటే అండర్ ప్రొడక్షన్ లో ఆగిపోయే సినిమాలు మూడొంతులు ఎక్కువగా వున్న రోజుల్లో ఎన్ని మంచి ఆలోచనలు, ఎన్ని మంచి కలలు, ఎన్ని మంచి ఆశయాలు మరుగున పడి మూలుగుతున్నాయో ఊహిస్తే ఆ ప్రతిభావంతుల పనితనం ప్రేక్షకులు రుచి చూడకుండానే చీకటి పాలవ్వడం చూస్తే నరకం పైన కాదు, ఇక్కడే అనుభవించినట్టు ఉంటుంది.

ఇన్ని చెప్పాక కూడా ఎవరైనా పరిశ్రమలోకి రావాలని కొత్తగా కలలు కంటారా..? కంటే...ఆ కలలు చెత్తబుట్టలోకి కాకుండా ప్రేక్షక ప్రపంచం కన్నుల ముందుకు రావాలని కష్టపడగలమా..లేదా అని ఆలోచించుకోవాలి. షూటింగ్ అనుభవం ఒక్క సినిమాకి కూడా లేకుండా కూడా దర్శకుడు అవ్వొచ్చు. కానీ, దర్శకుడైన ప్రతి వ్యక్తికీ షూటింగ్ అనుభవం(అసిస్టెంట్ డైరెక్టర్గా)అక్కర్లేదంటే మాత్రం నేనొప్పుకోను.

మంచి సాహిత్యం చదవని వాళ్ళు కూడా మంచి సినిమాలు తీశారంటే ఓ.కే. గానీ, మంచి సినిమా తీయడానికి ఏమీ చదువుకోనక్కర్లేదంటే మాత్రం నేనొప్పుకోను.

జీవితాన్ని పరిశీలిస్తూ, దానిలోని సహజత్వాన్ని, మన ఊహల్లోని సృజనకి జోడించి, జోడెద్దుల స్వారీని గమ్యం (థియేటర్)దాకా చేసేవాడే నా దృష్టిలో దర్శకుడు.

అలా చేయడం నేను ఈ కాలం రాసినంత ఈజీ కాదు...

ఈ కాలం రాసే స్థాయికి నేను చేరినంత కష్టం.....





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
Benefit Show Tickets for Attharintiki Daaredi