Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

రాశీఖన్నా తో ఇంటర్వ్యూ

interview with rashikhanna

ప‌ది కోట్లు ఇస్తాన‌న్నా ఒప్పుకోను - రాశీఖ‌న్నా

వేగంగా సినిమాలు చేశామా, సెటిల్ అయ్యామా... క‌థానాయిక‌ల లెక్క ఇదే. అందుకోసం గ్లామ‌ర్ అనే వ‌ల విసురుతారు. దానికి ప‌డ‌ని సినిమాలా??  రాశీఖ‌న్నా ప్ర‌యాణం కూడా అలానే సాగుతోంది. గ్లామ‌ర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొంది. అయితే.. ఈమ‌ధ్య త‌న‌లోకి కామెడీ యాంగిల్‌ని కూడా బ‌య‌ట‌కు తీసింది. సుప్రీమ్ లో బెల్లం శ్రీ‌దేవిగా న‌వ్వించింది. త‌న‌లో పంచ్‌లు విసిరే స‌త్తా ఉంద‌ని నిరూపించుకొంది. కాస్త సాన‌బెడితే... రాశీఖ‌న్నాలో ఓ మంచి న‌టిని కూడా బ‌య‌ట‌కు తీయొచ్చ‌న్న సంగ‌తి నిరూపించింది. అందుకే.. రాశీ అంత బిజీ హీరోయిన్‌గా మారింది. ఇటీవ‌ల సుప్రీమ్ విడుద‌లైంది.. రాశీకి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా గో.తెలుగుతో రాశీ జ‌రిపిన చిట్ చాట్ ఇది.

* సుప్రీమ్ సినిమా రిజ‌ల్ట్‌తో హ్యాపీయేనా?
- సూప‌ర్ హ్యాపీ. సినిమా బాగుంది.. మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. దాంతో పాటు నా పాత్ర‌కీ మంచి పేరొచ్చింది. అంత‌కంటే కావ‌ల్సింది ఏముంది?

* బెల్లం శ్రీ‌దేవిగా కామెడీ పంచారు.. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా?
- ఆ విష‌యం నాకే తెలీదు. దాన్ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి బ‌య‌ట‌కు తీశారు.. (న‌వ్వుతూ). బెల్లం శ్రీ‌దేవి అని నా పాత్ర పేరు చెప్ప‌గానే ఎంత న‌వ్వుకొన్నానో. పోలీస్ పాత్ర అంటే సీరియ‌స్‌గా ఉంటుందేమో అనుకొన్నా. కానీ.. నా పాత్ర చుట్టూ మంచి కామెడీ పండించారు. అస‌లు నేను కామెడీ చేయ‌గ‌ల‌నా, లేదా అనే అనుమానాలు ఉండేవి. ఈ పాత్ర‌కు అంత మంచి పేరొచ్చిందంటే అదంతా ద‌ర్శ‌కుడి వ‌ల్లే..

* ద‌ర్శ‌కుడు బెల్లం శ్రీ‌దేవి పాత్ర గురించి చెప్పిన‌ప్పుడు మొద‌ట మీ రియాక్ష‌న్ ఏంటి?
- అస‌లు ఏ ధైర్యంతో న‌న్ను ఈ సినిమాలోకి తీసుకొంటున్నారు? అని ద‌ర్శ‌కుడినే నేరుగా అడిగేశా. ఎందుకంటే ఇది వ‌ర‌కు నేను కామెడీ చేసింది లేదు.. ఇలా క‌నిపించిందీ లేదు. కానీ అనిల్ మాత్రం 'నాపై న‌మ్మ‌కం ఉంటే చేయండి' అన్నారు. నేను ఓకే అనేశా. 

* ఈ హిట్‌లో మీ భాగ‌మెంత‌?
- అది మీరే చెప్పాలి. అయినా ఒక్క‌రి వ‌ల్ల సినిమాలు ఆడ‌వు. అంద‌రూ బాగా చేశారు. అంద‌రూ క‌లిసి క‌ష్ట‌ప‌డితేనే ఇలాంటి సినిమాలొస్తాయి.

* ఓ సినిమా ఎంచుకొనేట‌ప్పుడు మీరు గ‌మ‌నించే అంశాలేంటి?
- క‌థ న‌చ్చాలి.. ఆ త‌ర‌వాతే నా పాత్ర‌. కొన్నిసార్లు క‌థ బాగుండి నా పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్యం లేక‌పోయినా చేయాల‌నిపిస్తుంటుంది. కొన్నిసార్లు క‌థ‌లు బాగున్న‌ట్టు అనిపిస్తాయి. కానీ తెర‌పై మాత్రం అనుకొన్న ఫ‌లితం క‌నిపించ‌దు. అలాంట‌ప్పుడు ఏం చేయ‌లేం.

* ప‌రాజ‌యాలొచ్చిన‌ప్పుడు బాధ ప‌డ‌తారా?
- అస‌లు దాని గురించి ఆలోచించ‌ను. రాశీ వ‌ల్ల సినిమా పోయింది అని ఎవ్వ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కూ అన‌లేదు. అలా అనిపించుకొంటే నాకు మ‌రో అవ‌కాశం వ‌చ్చేది కాదు. 

* పారితోషికం కోసం సినిమా ఒప్పుకొన్న సంద‌ర్భాలున్నాయా?
- ఒక్క‌టంటే ఒక్క‌టీ లేదు. నాకు న‌చ్చ‌ని చోట ఒక్క నిమిషం కూడా ఇమ‌డ‌లేను. అలాంట‌ప్పుడు న‌చ్చ‌ని క‌థ‌తో రెండు మూడు నెల‌ల పాటు ట్రావెల్ చేయ‌మంటే న‌ర‌కంలో ఉండ‌డ‌మే. అందుకే నాకు న‌చ్చ‌క‌పోతే ప‌ది కోట్లు ఇస్తాన‌న్నా సినిమా ఒప్పుకొనేది లేదు. 

* ఈమ‌ధ్య క‌థానాయిక‌లు త‌ర‌చూ పార్టీల్లో క‌నిపిస్తున్నారు. మీకూ ఆ అల‌వాటుందా?
- ఇల్లు - సెట్ త‌ప్ప నాకు మ‌రో ప్ర‌పంచం తెలీదు. మ‌రీ ముఖ్య‌మైతే త‌ప్ప పార్టీల‌కు వెళ్ల‌ను. వెళ్లినా అక్క‌డ ఇమ‌డ‌లేను. నా ప్ర‌పంచం అంటూ నాకొక‌టి ఉంది. సినిమాల‌తోనే స‌మయం గ‌డిచిపోతుంది. ఇంకా పార్టీలంటూ వృథా చేసుకోను.

* ఈమ‌ధ్య క‌థానాయిక పాత్ర‌ల‌కున్న ప్రాధాన్యం పెరుగుతోందా, త‌గ్గుతోందా?
- నా వ‌ర‌కూ ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల‌నే చేశా. అయితే న‌టిగా నిరూపించుకొనే అవ‌కాశం అంత‌గా రాలేద‌నే చెప్పాలి. సినిమా అనేది గ్లామ‌ర్ ప్ర‌పంచం. క‌థానాయిని అందంగా చూపించ‌డంలో త‌ప్పులేదు. కానీ న‌టించ‌డానికి అవ‌కాశం ఉన్న పాత్ర‌ల్నీ సృష్టించాలి. అయితే అది ద‌ర్శ‌కుల చేతుల్లో ఉన్న ప‌ని. మేం ద‌గ్గ‌రుండి మా పాత్ర‌ల్ని రాయించుకోలేం క‌దా?

* ఇది వ‌ర‌కు కాస్త బొద్దుగా ఉండేవారు.. ఇప్పుడు స్లిమ్ అయ్యారు కార‌ణం ఏమిటి?
- ఎప్పుడూ ఒకేలా క‌నిపించ‌డం బోర్ క‌దా? అందుకే.. మార్పు అవ‌స‌రం.

* అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా?
- బొద్దుగా ఉన్న‌ప్పుడు నువ్వు బొద్దుగా ఉంటే బాగున్నావ్ అనేవారు. ఇప్పుడు స్లిమ్ గా మారినా, నీ అందం త‌గ్గ‌లేదు అని కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ద‌క్షిణాది వాళ్ల‌కు బొద్దుగా ఉండే అమ్మాయిలే న‌చ్చుతారు అనుకొనేదాన్ని. అయితే.. ఆ అభిప్రాయం త‌ప్ప‌ని తెలిసింది. 

* మీ అందాన్ని ఎలా కాపాడుకొంటున్నారు?
- అందాన్ని కాపాడుకోవ‌డం ఎలా? అనే విష‌యంపై పెద్ద‌గా దృష్టి పెట్ట‌ను. మేక‌ప్ ల‌తో అందం పెర‌గ‌దు. అది స్వ‌త‌హాగా రావాలి. బ్యూటీ పార్ల‌ర్‌ల చుట్టూ తిరిగే అల‌వాటు నాకు లేదు.

* బాలీవుడ్ వెళ్లే ఆలోచ‌న‌లు ఏమైనా ఉన్నాయా?
- నేను అక్క‌డి నుంచి వ‌చ్చిన‌దాన్నే క‌దా?  ప్ర‌స్తుతం ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ న‌న్ను బాగా ఆద‌రిస్తోంది. ఈ స‌మ‌యంలో అక్క‌డకు వెళ్లి నిరూపించుకొనే ప్ర‌య‌త్నాలు చేయ‌డం ఎందుకు?  బాలీవుడ్ ఆలోచ‌న లేక‌పోవ‌డం వ‌ల్లే కుటుంబంతో స‌హా హైద‌రాబాద్ షిఫ్ట్ అయిపోయా. మంచి అవ‌కాశాలొస్తే త‌మిళంలో న‌టిస్తా. అంతే త‌ప్ప బాలీవుడ్ వెళ్లేది లేదు.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
brahmotsavam shining