Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue185/531/telugu-serials/atulitabandham/atulitabhandham/

( గతసంచిక తరువాయి) 

లోపలి నుంచి వినిపిస్తున్న నవ్వులు వింటూ ఆశ్చర్యంగా లోపలికి అడుగు పెట్టిన మధుబాల, చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తగారినీ, ఐశ్వర్యనూ చూస్తూనే మరింత ఆశ్చర్యానికి లోనైంది.

“మధూ!” ఆనందంగా లేచి వచ్చి ఆమెను గాఢంగా కౌగలించుకుంది ఐశ్వర్య.

“ఐశూ! ఎన్నాళ్ళకి చూసానే నిన్ను!” మధు కళ్ళు చెమరించాయి. ఐశ్వర్య చెయ్యి పట్టి సోఫాలో కూర్చోబెట్టింది.

“ఎంత సేపైంది ఐశూ వచ్చి?”

“అరగంట దాటిందే... ఆంటీ టీ కూడా ఇచ్చారు...” నవ్వుతూ చెప్పింది ఐశ్వర్య.

“మధూ, నీ ఫ్రెండ్ నాకూ ఫ్రెండ్ అయిపోయింది...” నవ్వింది సుగుణమ్మ. అత్తగారిని మనసులో ప్రశంసించకుండా ఉండలేకపోయింది మధుబాల. ఐశ్వర్య గురించి అందరికీ తెలుసు. ఒకప్పుడు తమ  స్నేహాన్ని వ్యతిరేకించిన వారే అందరూ... అసలు వేణూ కూడా ఐశ్వర్యను యాక్సెప్ట్ చేసి ఉంటే ఎంత బాగుండేది?

“ఏమిటే ఆలోచిస్తున్నావు?” అడిగింది ఐశ్వర్య.

“ఉహు,” తల విదిలించింది మధుబాల.

“ఎలా ఉన్నారమ్మా ఆవిడ?” సుగుణమ్మ ప్రశ్నకు, “ఫర్వాలేదు అత్తయ్యా... బాగా నీరసంగా కనిపిస్తున్నారు. కోలుకోవడానికి ఇంకా సమయం పట్టేట్టుంది...” అంది మధుబాల.

ఇంతలో లోపలినుంచి బాబీ ఏడుపు వినిపించింది. గబగబా లోపలికి పరుగు పెట్టి, వాణ్ణి ఎత్తుకుని తీసుకువచ్చింది మధుబాల. తల్లి ఎత్తుకోగానే ఠక్కున ఏడుపు మానేసాడు వాడు... వాడిని తీసుకు వచ్చి, “ఇదిగో నీ ఆంటీ వచ్చేసింది... ఏడవకు రా బాబీ...” అంటూ ఐశ్వర్య ఒడిలో కూర్చోబెట్టింది.

ఐశ్వర్య కొత్తగా అనిపించడంతో మళ్ళీ ఏడుపు మొహం పెట్టాడు వాడు... ఇంతలో పాలు కలిపి తెచ్చిన సుగుణమ్మ వాడిని ఎత్తుకుని పాలు పడుతూ ఉంటే, స్నేహితురాళ్ళు ఇద్దరూ కబుర్లలో పడిపోయారు.

రెండు గంటల తర్వాత, టిఫినూ, కాఫీ అయ్యాక  ఐశ్వర్య వెళుతూ ఉంటే, “వస్తూ ఉండమ్మా, నేను చెప్పింది మర్చిపోకు...” అన్నది సుగుణమ్మ.

“అలాగే ఆంటీ...” అని సుగుణమ్మ పాదాలకు నమస్కరించి, బయలుదేరింది ఐశ్వర్య.

***

“అయిపోయింది... మూడురోజులూ మూడు క్షణాల్లా గడిచాయి కదా... ట్రైనింగ్ కి అసలు ఇష్టం లేకుండా వచ్చాను... ఇప్పుడు మీతో చక్కని అనుబంధం ఏర్పడి, మనం విడిపోవాలంటే కాస్త దిగులు వేస్తోంది...” సూట్ కేసు సర్దుకుంటూ అన్నాడు వేణు, కార్తీక్ తో.

“అసలు నేను మనుషులతో అనుబంధం పెట్టుకోనండి, అవసరానికి మాట్లాడతాను అంతే...  ఐశ్వర్యతో కలిసి ఉన్నప్పుడు కూడా, మీ మధుబాల గారు మా అనుబంధాన్ని అంత హర్షించలేదని నాకు ఆమె అంటే కొంచెం కోపం ఉండేది. అయినా ఐశ్వర్య కోసమని మీ పెళ్ళికి వచ్చాను. ఐశూకి ఉన్నంత ప్రేమాభిమానాలు నాకు ఎవరి మీదా ఉండవు... చివరికి మా అమ్మానాన్నలు, అన్నా వదినలు, వాళ్ళ పాప రూప... ఉహు, ఎవరి మీదా... చివరికి ఐశ్వర్య మీద కూడా... మానసిక అనుబంధం ఎరగని ఒక రోగ్ ని నేను... అలాంటిది, నేనూ నాలాంటి వాళ్ళ  చేతుల్లో దెబ్బ తిన్నాక, ఇప్పుడిప్పుడే మనుషుల విలువ తెలుస్తోంది వేణూ... ఈ మూడురోజులూ నేను డ్రింక్ చేయలేదు, కనీసం సిగరెట్ వెలిగించ లేదు... ఎలా ఉండగలిగాను? మీతో కలిసి ఉండటం కోసం... మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం కోసం... ఇంత బావుంటుందా మనం ఎదుటి వారికోసం సర్దుకుంటే? ఓహ్... నాలోనూ మనసనేది ఉందన్న మాట!” ఉద్వేగంగా అన్నాడు కార్తీక్.
“కార్తీక్... మీరు కొద్దిగా ఆవేశపడుతున్నారు... కంట్రోల్ యువర్ సెల్ఫ్ మై ఫ్రెండ్...” కార్తీక్ భుజమ్మీద చేయి వేసాడు వేణు.
ఆ చేతిని అలాగే అదిమి పట్టుకుని కొన్ని క్షణాలు ఉండిపోయాడు కార్తీక్.

“వేణూ... నాకూ మనిషిగా మారాలని ఉంది... ఐశ్వర్యతో కలిసి జీవించాలని ఉంది... సాధ్యమేనంటారా?” ఆర్తిగా అడిగాడు కార్తీక్.
“నిజంగానా?” వేణు కళ్ళలో ఆనందం...

“అవునండీ, తను మా వదినకు బాగా దగరైంది. ప్రతీ వారం వాళ్ళింటికి వచ్చి, మా అమ్మానాన్నలతో, రూపతో కలిసి గడిపి వెళుతోంది... మా పేరెంట్స్ కి కూడా ఐశూ అంటే చాలా ఇష్టం... నాతో నా మనిషిగా, ప్రియురాలిగా జీవించిన ఐశూ ఈరోజు నాకేమీ కానట్టు, ఓ పరాయి పిల్లలా  నా ముందు తిరుగుతూ ఉంటే ఎంతో బాధ కలుగుతోంది... ఆమె నన్ను ఇగ్నోర్ చేస్తున్న ఫీలింగ్ నన్ను రంపంలా కోసేస్తోంది... సెంటిమెంట్స్ అంటూ లేని నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను? అనిపిస్తోంది... కానీ నాకు అర్థమైంది ఏమిటంటే, ఐశూని నేను ప్రేమిస్తూనే ఉన్నాను... ఆమె ప్రెజెన్స్ లో ఎంతో హాయిగా ఉంటుంది... నాకేం కావాలో ఆమెకు తెలుసు... ఇన్నాళ్ళూ గాలికి తిరిగాను... ఇప్పుడు... ఇప్పుడు ఆమె ఒప్పుకుంటే... ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను...”

“కార్తీక్, మీరేం మాట్లాడుతున్నారు?” సంభ్రమంగా అడిగాడు వేణు. “మీరు వివాహం...”

“యస్ వేణూ... మా అన్నావదినల పెళ్ళి అయి పదిహేను సంవత్సరాలు దాటింది... పాపకు సమస్య... నడవలేదు... ఇద్దరికీ ఆ విషయంలో బెంగే... ఆనందం లేదు... కానీ ఇద్దరి మధ్యా అవగాహన ఉంది... సయోధ్య ఉంది... విజయవంతమైన వైవాహిక జీవితానికి అద్భుతమైన ఉదాహరణ వాళ్ళే... మరి నేనెందుకు  పెళ్ళిని మానుకొని, ఇలా ఎండమావుల వంక పరుగు తీశాను? కేవలం నా మూర్ఖత్వం వల్ల మాత్రమే... తప్పు చేసాను నిజమే... కానీ దిద్దుకోవాలని అనుకుంటున్నాను. ఎంతో తీవ్రంగా గాయపరిచాను నా ఐశూని... ఇప్పుడు నేను అడగగానే ఆమె ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకు లేదు... అసలు ఎందుకు ఒప్పుకోవాలి? అయినా అడుగుతాను... ఏ మూలనైనా నన్ను క్షమించాలని తనకు అనిపిస్తే, నాకన్నా అదృష్టవంతుడు వేరే ఎవరూ ఉండరు...” ఉద్వేగంగా చెప్పాడు కార్తీక్.

“తప్పకుండా మీ ఆశ నెరవేరుతుంది కార్తీక్... ఆల్ ది వెరీ బెస్ట్... మీరు ఐశూ గురించి చెబుతూ ఉంటే, మధూని నేను నా కోపంతో, అసహనంతో, స్వార్థంతో ఎంత బాధించానో బాగా అర్థం అవుతోంది... నాకూ మంచిరోజులు రావాలని దేవుడిని ప్రార్థిస్తాను...ఆ... ఫ్లైట్ టైం అవుతోంది... టాక్సీ అరేంజ్ చేయమని రిసెప్షన్ వాళ్ళకి చెబుదామా?” అన్నాడు వేణు.

సంజ చీకట్లు ముసురుకుని, వినీలాకాశంలో వాళ్ళు ఎక్కిన విమానం మబ్బుల మధ్యనుంచి పయనిస్తూ ఉంటే,  నిశీథిలో వెలుగుతున్న నక్షత్రాల్లా ఆ యువకులిద్దరి మనసుల్లోనూ మధురోహలు మెరుస్తున్నాయి...

***

రాత్రి పదిన్నరకి కాలింగ్ బెల్ మ్రోగితే తలుపు తెరిచింది మధుబాల. ఎదురుగా ట్రాలీ బాగ్ తో నిలుచుని ఉన్నాడు వేణు... పక్కకు తప్పుకుని దారిచ్చింది మధుబాల.

“హాయ్ మధూ... బాగున్నావా?” చిరునవ్వుతో పలకరించాడు... చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా తానీ ఇంటికి వచ్చిన తరువాత మాట్లాడాడు వేణు - అనుకుంటూ, “ఊ...” అంది ముక్తసరిగా.

“అమ్మ పడుకుందా?” అన్నాడు షూ విప్పుకుంటూ...

“ఊ... ఆవిడకి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి... ఇందాకే పడుకున్నారు...”

“బాబిగాడు...”

“వాడు కూడా పడుకున్నాడు... మీరు భోజనం చేస్తారా? రెడీగా ఉంది టేబుల్ మీద...”

“సరే, కాస్త ఫ్రెష్ అయి వచ్చి, నేను వడ్డించుకుని తింటాను, నువ్వెళ్ళి పడుకో...” చెప్పాడు వేణు. తలూపి, మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది మధుబాల. ‘ఈ సౌమ్యత, ప్రసన్నత అప్పుడు ఉండి ఉంటే ఎంత బావుండేది?” ఆమె మనసు మూల్గింది...

***

సుగుణమ్మ మేనత్తకి సీరియస్ గా ఉందని పల్లె నుంచి ఫోన్ రావటంతో, ఆవిడ వెళ్లాలని హడావుడి పడసాగింది. నిజానికి బాగా పెద్ద వయసావిడ... చివరి రోజుల్లో మేనకోడలిని చూడాలని కలవరిస్తోంది అని ఆమె పిల్లలు చెప్పటంతో మనసాగక బయలుదేరింది... తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోయిన చిన్నారి సుగుణను మేనత్తే పెంచి పెద్దజేసింది... అందువలన ఆవిడతో అనుబంధం ఎక్కువ.
వేణుకు సెలవు దొరకలేదు. అందువలన దూరపు బంధువుల అబ్బాయిని తోడిచ్చి టాక్సీ బుక్ చేసి తల్లిని ఊరికి పంపక తప్పలేదు.

***

అత్తగారు ఊరికి వెళ్ళిన మొదటి రోజు బాబును చూసుకోవటం కోసం ఆఫీసుకు సెలవు పెట్టింది మధుబాల. పనిమనిషి సహాయంతో ఆమె ఇంటిపనీ, వంటపనీ చూసుకుంటూ ఉంటే తాను ఆఫీస్ కి వెళ్ళేవరకూ బాబిని చూసుకున్నాడు వేణు. ఇద్దరి మధ్యా పెద్దగా మాటలు లేకుండానే సౌమ్యంగా పనులు జరిగిపోతున్నాయి.

రెండవ రోజున సుందరమ్మను చూడటానికి, సరాసరి ఆఫీసు నుంచే  వినత ఇంటికి వెళ్ళాడు వేణు. ఆవిడ మెల్లగా కోలుకుంటోంది... వేణుతో చాలా ఆదరంగా మాట్లాడింది. అలాగే అవంతి, పిల్లలూ కూడా వేణుతో చాలా అభిమానంగా మాట్లాడారు. వినత సరేసరి... ఆమెలో వచ్చిన మార్పు వేణును కూడా ఆనందం లో ముంచింది... ‘ఇప్పటికి బాధ్యత తెలిసింది...’ అనుకున్నాడు. పవన్ మాత్రం మొహం ముడుచుకునే ఉన్నాడు. వేణుతో చాలా ముక్తసరిగా మాట్లాడాడు...

వేణు ఇంటికి బయలుదేరబోతుంటే, “బావా నీతో మాట్లాడాలి...” అన్నాడు పవన్ ముఖాన గంటు పెట్టుకునే... వేణుకు ఏమీ అర్థం కాలేదు... సరేనన్నట్టు తలూపాడు... పవన్ తన స్టడీ రూమ్ వైపు నడిచాడు.

ఇద్దరూ టేబుల్ కి అటూ ఇటూ కుర్చీల్లో కూర్చున్నాడు... టేబుల్ మీద ఉన్న గాజు పేపర్ వెయిట్ ను చేత్తో అటూ ఇటూ తిప్పుతూ, దాని వైపే దృష్టి సారించిన పవన్ హఠాత్తుగా, “బావా, అయామ్ సారీ... వినతతో నేను జీవించలేను... నాకు స్వేచ్ఛ కావాలి... మీ చెల్లెల్ని నీవు మీ ఇంటికి తీసుకువెళ్ళు...” అన్నాడు కటువుగా...

“పవన్ బావా... ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తాగి ఉన్నావా??” క్షణాల్లో రౌద్రాకారం దాల్చాడు వేణు.

 

( పరివర్తన కలిగినట్లే కనిపిస్తోన్న పాత్రల స్వభావాలు కథను సుఖాంతం చేయబోతున్నాయా? ఏమో...మిగతా వచ్చేవారం..)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam