Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

atadu .. aame..oka rahasyam

 

గత సంచిక లోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue213/601/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

( గతసంచిక తరువాయి )..... “అబ్బే- ఏం లేదండీ. ఏదో అనబోయి ఏదో అన్నాను”  తడబడుతున్నట్టుగా  భయంగా అన్నాడు. పాణి నవ్వుతూ అతడి భుజమ్మీద చెయ్యి వేసి అన్నాడు “నాకు తెలుసులే గౌడా...  దొరసానమ్మ గారంటే రత్న మాలా దేవే కదా? ఆయన ఫ్రెండుని, ఆవిడ సంగతి నాకు తెలియనదనుకున్నావా? ” చీకట్లో బాణం వేసాడు.

జంపన్న గౌడ్ ముఖంలో భయం తగ్గింది   “ఏమో సారూ. ఆవిడ పేరేమిటో నాకు తెలియదు.  తెల్లగా పొడుగ్గా హుందాగా, దేవ లోకం నుంచి దిగి వచ్చిన దేవ కన్యలా ఉన్నారు చూడ్డానికి.  దొర గారికి బాగా దగ్గర వారిలా అనిపించారు. అందుకే నేనూ అలా అన్నాను”

“ఎప్పుడు వచ్చారు వాళ్ళిక్కడికి?”

“రెండు మూడు నెలల క్రితం అనుకుంటా. ఒక రోజు కోట నుంచి ఒక మనిషి  నా దగ్గరకి వచ్చి చిన్న దొర గారు రాత్రి చెరువు గట్టుకు వస్తానన్నారు.  జాగ్రత్తగా చూసుకో అన్నాడు.  రాజా వారు స్నేహితులతో చెరువు గట్టుకు  వచ్చే వేళల్లో  ఊళ్ళో  జనం ఎక్కువగా అటు వైపు వెళ్ళకుండా చూస్తూ  ఉంటాము మేము.  అలాగే ఆ రోజు కూడా నాతో చెప్పాడు ఆ మనిషి.  ఎవరైనా కవులతో వచ్చి మందు పార్టీ చేసుకుంటున్నారేమో అనుకున్నాను నేను. కానీ అర్ధ రాత్రి సమయంలో కారులో  ఒక అందమైన స్త్రీతో వచ్చి దిగారు దొర గారు.
ఇద్దరూ చాలా సేపు చెరువు గట్టున గడిపి వెళ్ళారు ఆ రోజు.  అద్భుతమైన అందగత్తె ఆమె. అలాంటి అందాన్ని ఇప్పటి  వరకూ  చూడ లేదు నేను.  చెరువు గట్టు మెట్ల మీద  ఒకరి చేతుల్లో ఒకరూ చేతులేసుకుని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ వెన్నెల్లో చాలా సేపు కుర్చున్నారు ఆ రాత్రి.  వాళ్ళిద్దరినీ చూస్తుంటే పెళ్ళి చేసుకుంటారనిపించింది. ఇద్దరిదీ మంచి జోడీ అనుకున్నాను. కానీ ఇంత లోనే ఏం జరిగిందో ఇలా అయి పోయింది”  బాధ పడుతున్నట్టుగా అన్నాడు జంపన్న గౌడ్.

“తరువాత మళ్ళీ ఎప్పుడైనా వచ్చారా రత్నమాలా దేవి గారు ఇక్కడికి?”

“తరువాత ఎప్పుడూ రాలేదు”

“అలాగా? ఈ మెన్నే ఆవిడ ఇక్కడికి వచ్చి వెళ్ళారని విన్నానే?” తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు పాణి.

“మీరు అంటుంటే గుర్తొచ్చింది.  ఆ మధ్యనొకసారి మాత్రం పని మీద నిజామాబాద్ వెళ్ళినప్పుడు టాక్సీలో  ఆవిడ సిర్నాపల్లి రావడం చూసాను. చూడగానే గుర్తు పట్టాను. ఆ రోజు రాత్రి  మళ్ళీ దొర గారు ఆవిడని తీసుకుని చెరువు గట్టుకి వస్తారేమో అనుకున్నాను. కానీ రాలేదు”

పాణి గుండెలు ఉద్వేగంగా కొట్టుకున్నాయి.  చీకట్లో మరో బాణం వేస్తూ అడిగాడు ఆ వ్యక్తిని  “ఎప్పుడు?  దొర గారు చనిపోయే ముందరేనా?” 


“కాదండీ. ఈ మధ్య కాలంలో ఆవిడ ఇక్కడికి రాగా ఎప్పుడూ చూడ లేదు. నేను టాక్సీలో చూసినది కూడా నెల రోజుల క్రితం.  విచిత్రం ఏమిటంటే అసలు అప్పుడు ఆవిడ వచ్చినట్టు  సిర్నా పల్లిలో ఎవరికీ తెలియదు.  నేను ఎవరినో చూసి ఆవిడనుకున్నానని అన్నారు మా వాళ్ళంతా. కానీ నేను మాత్రం ఆవిడ్నే చూసానని కచ్చితంగా చెప్ప గలను. ఎందుకంటే, వేరెవ్వరూ ఆమె అంత అందంగా ఉండరు.  ఎవరినో చూసి ఆమె అనుకుని పొరపాటు పడే ఆస్కారం లేదు”

పాణికి కొంత మేరకి అర్ధమైనట్టుగా అనిపించింది.  బహుశా అప్పుడు రత్నమాల రహస్యంగా సిర్నాపల్లి వచ్చి వెళ్ళి ఉండాలి.  పొరపాట్న  నిజామాబాద్ లో జంపన్న గౌడ్ కంట పడి ఉంటుంది.  అంత రహస్యంగా ఆమె సిర్నాపల్లి ఎందుకు వచ్చింది? ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చెయ్య గలిగింది?

“అవునూ, మీ ఊళ్ళో యాదగిరి అని ఒక కుర్రాడి పేరు చెబుతూ ఉండే వాడు పాణి. అతడెక్కడ ఉంటాడు?”  అడిగాడు పాణి.

“ఏ యాదగిరి? చాకలి యాదగిరా?”

పాణికేమని సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. “రాజేంద్ర ఎప్పుడు చెరువు గట్టుకి వచ్చినా  ఆ యాదగిరి బాగా కబుర్లు చెబుతాడని  చెప్పేవాడు”

“ఈ ఊళ్ళో చాలా మంది యాదగిరిలు ఉన్నారండీ. దొర గారు ఎప్పుడు చెరువు గట్టుకి వచ్చినా అందరం ఆయనతో మాట్లాడాలని తహతహ లాడుతూ ఇక్కడికి వచ్చేవాళ్ళే.  దొర గారు మీకు ఎవరి గురించి చెప్పేరో?”  అన్నాడు జంపన్న గౌడ్.

“అస్తమాటూ తనని అండమాన్ తీసుకెళ్ళమని అడిగేవాడట”  యాదగిరి చెప్పిన మాటలనే గుర్తు తెచ్చుకుని తిరిగి  సంధించాడు పాణి.
“ఓహ్... వాడా? వాడు కల్లు గీసే యాదగిరి అండీ.  బంగళాలో తోట పనికి ఎక్కువగా వెడుతూ ఉంటాడు” మొత్తానికి తనకి కావల్సిన యాదగిరిని  ఐడెంటిఫై చెయ్య గలిగినందుకు పాణికి రిలీఫ్ గా అనిపించింది.  “అవును. ఇప్పుడు  గుర్తొచ్చింది. కల్లు గీసే యాదగిరనే చెప్పేవాడు. ఎక్కడుంటాడు అతడు? ఒకసారి పిలిపించ గలవా, నాకు చూడాలని ఉంది”  గొంతులో ఆత్రుత తెలియనివ్వకుండా సాధ్యమైనంత మామూలుగా అడగడానికి ప్రయత్నించాడు.

“ఆ యాదగిరి ఇప్పుడు ఇక్కడ లేడు”

“ఎక్కడికెళ్ళాడు?” ఆత్రుతగా అడిగాడు పాణి.

“నిజామా బాద్ వెళ్ళాడు. వాడు చిన్న రాజా వారికి నమ్మిన బంటు. బంగళాలో ఏం జరుగుతోందో అన్నీ వాడికి తెలుసు. కానీ ప్రాణం పోయినా నోరు విప్పి ఎవరికీ ఏమీ చెప్పడు. చిన్న రాజా గారు  చని పోయిన దుఃఖాన్ని వాడు తట్టుకో లేక పోతున్నాడు.  ప్రస్తుతం బాధ మర్చి పోవడానికి నిజామా బాద్ లో ఏ బార్ లోనో తాగుతూ పడి ఉంటాడు”

“రేపు పెద్ద కర్మకి వస్తాడు కదా? వస్తే నా దగ్గరకి ఒకసారి రమ్మన్నానని చెప్పు” అన్నాడు పాణి.

“పెద్ద కర్మకి వాడు రాడండీ” అన్నాడు జంపన్న గౌడ్.

“ఎందుకు రాడు?” ఆశ్చర్యంగా అడిగాడు

“ఊర్లో ఏడుస్తూ తిరుగుతుంటే చూడ లేక దొర గారే డబ్బిచ్చి నిజామాబాద్ పంపేసారు. నువ్వెలాగూ ఇక్కడుంటే తట్టుకో లేవు. పెద్ద కర్మ అయ్యే దాకా ఊర్లోకి రావద్దన్నారు”

“డబ్బిచ్చి పంపేరా? ఏ దొర గారూ?” 

“సురేష్ వర్మ దొర గారు”

అతడి మాటలు వింటుంటే, పాణికి తల తిరుగుతున్నట్టుగా అనిపించింది. 

ఒక పక్క ఇంద్రనీల, మరో పక్క రత్నమాల,  ఇంకొక పక్క  సురేష్ వర్మ...  ఒకరికొకరూ సంబంధంలేని ముగ్గురు వ్యక్తులు   ఈ కేసులో కీలకంగా కనిపిస్తున్నారు.  కేసులో సాక్ష్యాలని తారు మారు చెయ్యాలని ప్రయత్నిస్తూ ఇన్వెస్టిగేషన్ కి అడ్డు వస్తున్నారు. వాళ్ళలో ఎవరు నేరస్థులు?

అన్నింటినీ మించి అసలు కోటలో దొరికిన వజ్రాలు ఎక్కడ ఉన్నాయి?  ఒక వేళ రాజేంద్ర ఆత్మ హత్య చేసుకోవడమే నిజమైతే ఆ ఆత్మహత్యకి కారణమేమిటి?  ఇవి కాకుండా ఈ  కేసులో తను ఇంకా తెలుసుకోవలసినది ఏమైనా ఉందా? అంతు తెలియని ప్రశ్నలు అతడి మెదడుని కాలుస్తుంటే, కారులో బంగళాకి తిరుగు ప్రయాణమౌతుండగా డి.ఎస్.పీ ప్రసాద్ కి ఫోన్ చేసాడు . “సిర్నాపల్లి గ్రామానికి చెందిన యాదగిరి అనే ఒక వ్యక్తి ప్రస్తుతం నిజామాబాద్ లో  ఉన్నాడు. నిజామాబాద్ లో ఉన్న బార్ లోనో  చవకబారు హోటల్ రూమ్ లోనో  తాగుతూ ఉండి ఉంటాడు. నువ్వెలాగైనా ఊర్లో ఉన్న బార్లనీ, అలాంటి  హోటళ్ళనీ  వెదికించి తెల్లారే లోగా అతడ్ని పట్టుకుని మీ కస్టడీలోకి తీసుకోవాలి.  ఎంత రాత్రయినా ఫరవా లేదు. అతడు దొరక గానే వెంటనే నాకు ఫోన్ చెయ్యి” అని చెప్పాడు.

ప్రసాద్ ఫోన్ పెట్టేసిన రెండు క్షణాలకి పాణి ఫోన్ రింగయింది. ఎవరా అని చూసిన పాణికి  మొబైల్  స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ చూడగానే ఉత్సాహంగా అనిపించింది.

ఫోన్ ఎత్తి “చెప్పు యోగేష్... నువ్వు మర్చి పోయిన ఆ పేరు ఏమైనా గుర్తుకు వచ్చిందా?”  ఎక్సయిట్మెంట్ తో అడిగాడు. “గుర్తుకు వచ్చింది సార్.  ఆ పేరు...  బంగారు లక్ష్మి”  నార్త్ ఇండియన్ యాసతో పలుకుతూ అన్నాడు యోగేష్.

“బంగారు లక్ష్మి?!” 

“యెస్ సర్... అదే పేరు.  అనుమానం లేదు” అన్నాడు యోగేష్.

“థాంక్స్ యోగేష్. నాకు నీ జ్ఞాపక శక్తి మీద నమ్మకం ఉంది. నువ్వెలాగైనా  గుర్తు తెచ్చుకుని చెబుతావని నాకు తెలుసు. అందుకే నీ ఫోన్  కోసం  ఎదురు చూస్తున్నాను. థాంక్సెలాట్”  అన్నాడు పాణి.

ఫోన్ పెట్టేసిన పాణి ఆలోచనలో పడ్డాడు. బంగారు లక్ష్మి ఎవరు? ఆమెకీ  రాజేంద్రకీ, ఈ వజ్రాలకీ సంబంధం ఏమిటి? ఆమె ఎక్కడ ఉంటుంది?
ఏదేమైనా నిధి గురించి తెలిసిన వ్యక్తులు ఇప్పటికి ముగ్గురయ్యారు. రాజేంద్ర, అతడి ప్రియురాలు రత్నమాల, మరొక వ్యక్తి బంగారు లక్ష్మి.   రత్నమాల బంగారు లక్ష్మిలలో ఒకరి ఆచూకీ నైనా తెలుసుకో గలిగితే  కేసు చాలా వరకూ  విడి పోతుంది. 

తను చేస్తున్న ఎంక్వయిరీలో రత్న మాల గురించి కొంతైనా సమాచారం లభించింది. కానీ అసలు బంగారు లక్ష్మి అన్న పేరు  ఇప్పటి దాకా ఎక్కడా తగల్లే... అతడి ఆలోచనలు అక్కడ బ్రేక్ వేసినట్టు ఆగి పోయాయి.

బంగారు లక్ష్మి  పేరు డైరెక్టుగా తగల్లేదు గానీ, ఇండైరెక్టుగా ఎక్కడో  తగిలినట్టుగా అనిపించింది. ఎక్కడ?!  కళ్ళు మూసుకుని బాగా ఆలోచించాడు. రెండు నిమిషాలు ఏకాగ్రతతో ఆలోచిస్తే అతడికి గుర్తుకు వచ్చింది ఆ పేరు ఎక్కడ తగిలిందో.

ఇంద్ర నీల మొబైల్లో...  ఉదయం ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చూడకుండా ఆమె మొబైల్లో డేటాని చెక్ చేసాడు. దాంట్లో   ఉన్న లాస్ట్ డయల్డ్ నెంబర్  పేరు... బంగారం !

ముందు రోజు రాత్రి నుంచీ అవాల్టి ఉదయం వరకూ ఇంద్రనీల మొబైల్ నుంచి ‘బంగారం’ అన్న  పేరుకి దాదాపు ముప్పై ఐదు సార్లు డయల్ చేసింది !!

ఆమేనా బంగారు లక్ష్మి ?!

అంటే... వజ్రాల గురించి తెలిసిన నాలుగో వ్యక్తి  ఇన్స్పెక్టర్ సుప్రియా?! ఆమెకి కూడా ఈ వజ్రాలతో సంబంధం ఉందా? వజ్రాల కోసమే ఆమె కోటకి వచ్చిందా?  ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయో వెదికేందుకే  ఆమె ప్రత్యేకంగా అడిగి మరీ ఈ ప్రదేశానికి పోస్టింగ్ వేయించుకుని వచ్చిందా?
అతడు ఆలోచనల్లో ఉండగానే కారు రాజ మహల్ గేటు దాటి లోపలకి ప్రవేశించింది.

(అపరాధ పరిశోధనలో అన్నీ అనుమానిత పాత్రలే.....నిధి కోసం అన్వేసణలొ అన్నీ అనుకోని ట్విస్టులే.........ఈ ఉత్కంఠ వచ్చేవారం దాకా..........)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham