Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఒక్క క్షణం చిత్రసమీక్ష

okka kshanam movie review

చిత్రం: ఒక్క క్షణం 
తారాగణం: అల్లు శిరీష్‌, సురభి, సీరత్‌ కపూర్‌, శ్రీనివాస్‌ అవసరాల, ప్రవీణ్‌, సత్య, దాసరి అరుణ్‌కుమార్‌ తదితరులు. 
సంగీతం: మణిశర్మ 
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె నాయుడు 
దర్శకత్వం: విఐ ఆనంద్‌ 
నిర్మాత: చక్రి చిగురుపాటి 
నిర్మాణం: లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 28 డిసెంబర్‌ 2017

క్లుప్తంగా చెప్పాలంటే 
జీవా (అల్లు శిరీష్‌), జ్యోత్స్న (సురభి) ఒకరంటే ఒకరికి ఇష్టం. వీరిద్దరి ప్రేమ ఇలా ఉంటే, జ్యోత్స్న నివాసముండే గేటెడ్‌ కమ్యూనిటీలో శ్రీనివాస్‌ (అవసరాల శ్రీనివాస్‌), స్వాతి (సీరత్‌కపూర్‌) ఉంటారు. ఆ ఇద్దరి మధ్యా ఎప్పుడూ గొడవలే. వారి గొడవలకు కారణమేంటని తెలుసుకునే క్రమంలో జీవ, జ్యోత్స్నలకు షాకింగ్‌ విషయాలు తెలుస్తాయి. శ్రీనివాస్‌ జీవితంలో ఏం జరిగితే, అదే జీవా జీవితంలోనూ జరుగుతుంటుంది. స్వాతి జీవితంలో ఏం జరుగుతుందో అది జ్యోత్స్నకీ జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్వాతి - శ్రీనివాస్‌ల గతంమే జీవా - జోత్స్నల వర్తమానం. మరి, ఈ నలుగురి జీవితాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి, ఈ రెండు జంటలు ఎదుర్కొనే చిత్ర విచిత్రమైన పరిస్థితులేంటి? స్వాతి - శ్రీనివాస్‌లానే, జ్యోత్స్న - జీవాల మధ్య కూడా విభేదాలొస్తాయా.? అన్నవి తెరపైనే చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే 
నటుడిగా అల్లు శిరీష్‌కి ఈ సినిమా పెద్ద పరీక్షే పెట్టింది. ఆ పరీక్షలో పాస్‌ అయ్యేందుకు అల్లు శిరీష్‌ పడ్డ కష్టం మనకు స్పష్టంగా తెలుస్తుంది. చాలా బాగా చేశాడు. సరదాగా కన్పించాడు, సీరియస్‌గానూ కనిపించాడు. రెండు భిన్నమైన కోణాల్లో తనను ఆవిష్కరించుకోవడానికి అల్లు శిరీష్‌ చేసిన ప్రయతానికి మంచి మార్కులు పడతాయి.

హీరోయిన్‌ సురభికి నటిగా కాసిని మార్కులు పడ్డ చిత్రం ఇప్పటిదాకా ఏదీ లేకపోయినా, ఈ సినిమాతో ఆమెకి చెప్పుకోదగ్గ మార్కులైతే పడతాయి. గ్లామరస్‌గానూ కనిపించినా, కాస్త బొద్దుతనం ఎక్కువైందనే భావన కలిగిస్తుంది. శ్రీనివాస్‌ అవసరాల మరోమారు డిఫరెంట్‌ రోల్‌లో కనిపించి మెప్పించాడు. సీరత్‌కపూర్‌ తన నటనతో ఆకట్టుకుంటుంది. చాలాకాలం తర్వాత దాసరి అరుణ్‌కుమార్‌ తెరపై కనిపించాడు. అతనూ బాగా చేశాడు. ప్రవీణ్‌, సత్య తదితరులు తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.

ప్యారలల్‌ లైఫ్‌ అనే కొత్త కాన్సెప్ట్‌ని ఎంచుకుని దర్శకుడు చేసిన ఈ ప్రయత్నానికి అభినందనలు ఖచ్చితంగా అందుతాయి. సెకెండాఫ్‌లో కథనం కాస్త సాగదీసినట్లనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. మ్యూజిక్‌ బావుంది. పాటలు వినడానికి బాగున్నాయి, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. నిర్మాణపు విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు.

కాన్సెప్ట్‌ ఎంచుకోవడంలోనే దర్శకుడు సగం విజయాన్ని ముందే అందేసుకున్నాడు. సినిమాని అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించడంలోనూ దర్శకుడు కొంతమేర సఫలమయ్యాడు. అయితే అక్కడక్కడా కథ డైవర్ట్‌ అయినట్లు అనిపించడం కొంచెం మైనస్‌ పాయింట్‌గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా చూస్తే, సినిమా కొత్తదనం కోసం ఎదురుచూసే ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఫస్టాఫ్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో కొంత డ్రాగింగ్‌ అనిపించినా, చివరికొచ్చేసరికి ఇంట్రెస్టింగ్‌గా మలిచాడు. మొత్తంగా చూసినప్పుడు ఇదొక మంచి ప్రయత్నం అనే అభినందనలు సినిమా పూర్తయ్యాక థియేటర్‌ నుంచి వచ్చే ప్రేక్షకుడి నుంచి దర్శకుడికి అందుతాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే
ఒక్క క్షణం థ్రిల్లింగ్‌గానే ఉంది

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka