Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఇది వరకటి రోజుల్లో అంటే మరీ పాతరోజులని కాదూ, 70, 80  ల వరకూ కూడా మనం ఉన్న ఊరు నుండి, మరో ఊరికి వెళ్ళాలనుకుంటే, ముందుగా అక్కడ మనకి తెలిసిన స్నేహితులో, చుట్టాలో ఉన్నారా లేదా అని తెలుసుకోవడమో, కాకపోతే మనం ఫలానా ఊరు వెళ్తున్నామని ఎవరికో ఒకరికి చెప్పడం, ఆ వార్త , అలా… అలా,, పాకి, మనం వెళ్ళే ఊళ్ళోనే ఉండే, ఎవరికో ఒకరికి తెలిసినా పనైపోయేది. వాళ్ళ పిల్లలకి ఏదో తీసికెళ్ళాలనో, అదే ఊర్లో చదువుకుంటున్న పిల్లలకి డబ్బు  అందజేయాలనో,, ఏదో మొత్తానికి, మనం వెళ్ళే ఊరులో ఓ పరిచయస్తులని సంపాదించగలిగే వాళ్ళం. ఒకపనైపోయిందిగా, తరవాత ఏ బస్సుకో, రైలుకో టిక్కెట్లు బుక్ చేసుకోవడం… వసతి సౌకర్యం ఎలాగూ ఉంది..  మనమేమైనా నెలల తరబడి ఉంటామా ఏమిటీ, ఏదో మహా అయితే ఓ రెండు మూడు పూటలు.. అదికూడా  పగలంతా , ఏ పనిమీదైతే వెళ్ళామో, ఆ పని చూసుకోవడమూ, , Night  కి పడుక్కోడమూనూ..

ఆరోజుల్లో పట్టణాలూ అవీ  మరీ ఈరోజుల్లోలాగ ,  unmanageable  గా ఉండేవి కావు… రమారమి, మనం ఎవరింటికైతే వెళ్ళాలో, కనీసం ఆ Area  కి వచ్చి ఎవరినైనా, ఫలానా సొసైటీ ఎక్కడుందని అడిగితే, చెప్పేవారు… మరీ అంతగా తెలియకపోయినా,  అక్కడేఉన్న, ఏ కిరాణాకొట్టువాడినో అడిగినా చెప్పేవాడు—వాళ్ళకైతే అందరూ పరిచయస్థులేగా..  అదీ కాదంటే దగ్గరలో ఉన్న పోస్టాఫీసు వాళ్ళైతే 100% చెప్పగలిగేవారు.

ఇంక చిన్నచిన్న  పల్లెలకి వెళ్ళినప్పుడైతే అసలు గొడవే ఉండేది కాదూ, రోడ్డుపక్కనే బస్సు ఆగేది, ఆరోజుల్లో ఇప్పటిలాగ బస్సు స్టాండులూ అవీ ఎక్కడా,  మనం బస్సుదిగడమేమిటి, ఆ ఊరికి కొత్తవాళ్ళమని గుర్తుపట్టేసేవారు… “ ఎవరింటికండి బాబయ్యా.. “ అని ఎంతో ఆప్యాయతతో పలకరించేవారు. ఫలానా వారిల్లూ అనగానే, మన సామాన్లు, ఎత్తుకునో, లేకపోతే ఏ సైకిలుమీదో వెళ్తూన్న ఓ అబ్బాయిని ఆపి, ఆ సైకిలుకి మనసామాన్లు తగిలించి, ఫలానా మాస్టారింటికి జాగ్రత్తగా తీసికెళ్ళి దింపు బాబూ.. అని అప్పచెప్పేవారు. ఊరంతా తెలిసేది, మాస్టారింటికి చుట్టాలొచ్చారహో అని…

ఇప్పటికీ హైదరాబాదు లాటి మహానగరాల్లో, ఓ ఎడ్రస్ పట్టుకోవడం ఓ మహాయజ్ఞం లాటిదే.. అక్కడి ఇళ్ళనెంబర్లు అంతా గందరగోళంగా ఉంటాయి.. 132-1689 / 113 AX 442/ 79/ IV  అన్నట్టు.  ఆ బ్రహ్మక్కూడా తెలియదు ఇల్లు పట్టుకోవడం.  ఎవరిని అడిగినా ఒకటే సమాధానం—మాలూం నహీ..

అంతర్జాలం ప్రాచుర్యం చెందిన తరవాత కొత్తగా అదేదో   G P S  అని కొత్తదోటి వచ్చింది రంగంలోకి.. దాన్ని ON  చేసి ఎడ్రస్ టైపు చేసేస్తే  ఠక్కు మని తీసుకుపోతుంది. ఈ అంతర్జాలం ధర్మమా అని, ఇల్లు కదలకుండా అన్ని పనులూ చేసేసుకుంటున్నారు. బాంకులకి వెళ్ళక్కర్లేదూ, కిరాణా షాపు కి అక్కర్లేదూ, రైల్వే, విమాన టిక్కెట్లకి వెళ్ళాల్సిన అవసరం లేదూ,  అసలు బయటకే వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఒక విధంగా ఈ  Digitalisation  బాగానే ఉంది. ఎంతైనా ఇవన్నీ మానవుడు సృష్టించిన సాధనాలే.. అవి పనిచేస్తూన్నంతకాలమూ, అన్నీ సవ్యంగానే ఉంటాయి, జనాలుకూడా సుఖపడతారు. కానీ కర్మ కాలి ఇవి పనిచేసే  Server  లు  Down  అయిపోతే ఏమిటిట? ఉదాహరణకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర పెద్దపెద్ద క్యూలు చూస్తూంటాం, కిటికీ లోపలున్నవాడు మాత్రం టిక్కెట్టివ్వడు.. కారణం--  Server Down.  సందుకోటి చొప్పున ఎక్కడచూసినా ఏదో బ్యాంకుకి సంబంధించిన  A T M  కనిపిస్తుంది.. మన అదృష్టం బాగోక అవసరం వచ్చినప్పుడు, ఒక్క  A T M  పనిచేయదు.. కారణం మళ్ళీ  SERVER DOWN…

అసలు బయటకే అడుగు పెట్టాల్సిన అవసరం లేకపోయేసరికి  మనుషుల్లో బధ్ధకం పెరిగిపోయింది.  ఇదివరకటిరోజుల్లో ఏదో ఒక పనిమీద బయటకి వెళ్ళడమూ, రిటైరయినవారైతే  పోస్టాఫీసులోనో, బ్యాంకులోనో తమ పాతస్నేహితులని కలిసి, క్షేమసమాచారం అడగడమో.. లాటివి చేసేవారు. ఇదివరకు అంటే ఈ  Automation  రాకపూర్వం,  మనుషుల్లో ఓ ఉత్సాహం కనిపించేది..

ఇప్పుడో ఎవరిని చూసినా ఓ   Robot  లాగే కనిపిస్తున్నారు.. అసలు జీవకళనేది ఎక్కడా కనిపించదు. టెక్నాలజీ అభివృధ్ధి ఉండాలి కాదనడం లేదు.. కానీ వీటివలన మనుషుల్లో బధ్ధకం పెరిగితే దాని లాభం ?

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
thailand