Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

ఆస్థానకవి: మహారాజా, మన కొలువుకి చిత్ర రచన కవి గారు విచ్చేశారు. ఈయన చెప్పే తెలుగు పద్యం, తిరిగేస్తే, సంస్కృత శ్లోకం ఔతుంది!
మహారాజు: వారి పేరు?
ఆస్థానకవి: నరసూళిగంపి!
మంత్రి: ( రాజు చెవివైపు వంగి రహస్యంగా)... పింగళిసూరన!!

 

 

సతీమణి: స్వామీ, తలకి ముసుగు పెట్టుకుని వస్తున్నారే?
ధూర్జటి కవి: నేను వస్తూ వస్తూ, వేశ్యాగృహాలుండే వీధిలో ప్రవేశించాల్సి వచ్చింది. రామలింగడు అక్కడి పొంచివుంటాడేమోనని భయపడి మొహం ముసుగుతో కప్పుకున్నాను!
సతీమణి: రామలింగడు చూస్తే ఏం?
ధూర్జటి  కవి: రాయలవారి కొలువులో, నా మీద పద్యాలు అల్లుతాడు... అదీ నా భయం!

 

ఒక పౌరుడు: నరసకవి మహాశయా... తమరే పద్యానికైనా అర్ధం విపులంగా చెప్పగలరటగా?
నరసకవి: చాలు చాల్లేవయ్యా.. నాకు తగిన గుణపాఠమే నేర్పాడు.. రామలింగకవి!
రెండవపౌరుడు: "మేకతోకకు మేక, తోకమేకకుతోక"  పద్యానికి అర్ధం చెప్పమన్నాడటగా?
నరసకవి: అర్ధం తెలీక, ఒక మేకలమంద వెతుక్కుంటూ పోయా.. పద్యం లో ఎన్ని మేకలో, ఎన్ని తోకలో లెక్కపెట్టడానికి!! ఇంకా లెక్క తేలలేదు.

 

ఒక పెద్దమనిషి: ఈ అడవిలో ఒక్క పాలపిట్ట కానరాదేమి?
రెండో పెద్దమనిషి: పాలపిట్టా?
ఒక పెద్దమనిషి: మంచి శకునం కోసం వెతుకుతున్నాను!
రెండో పెద్దమనిషి: "పాలపిట్ట శకున ఫలమిచ్చునందురు! పాలపిట్టకేమి ఫలము దెలియు? తనదుమేలు కీళ్ళు తనతోడ నుండగ!
విశ్వదాభిరామ వినురవేమ!!

ఒక పెద్దమనిషి: వేమన గారి అభిమానివా..?చచ్చాను!!

 

 

ఉపాధ్యాయశేఖరుడు: కవిత్రయమనగా ఎవరు?
విద్యార్థి తెలివిపరుడు: తిక్కన, వేమన, గురజాడ!
ఉపాధ్యాయశేఖరుడు: నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ కదా?
విద్యార్థి తెలివిపరుడు: ఏమో.. నేను శ్రీశ్ర్రీ గారిని నమ్ముతాను. వారి దృష్టిలో కవిత్రయము, తిక్కన, వేమన, గురజాడ!!

 

 

 

 

శిష్యుడు: గురువుగారూ, సుమతి గారికి కంద కూరంటే యిష్టమా?
గురువు: ఎందుకడిగావీప్రశ్న?
శిష్యుడు: సుమతి శతక కారువి పద్యాలన్నీ, కంద పద్యాలే!!

 

 

 

 

 

ఒక్క ఎద్దు: రేయ్, గురువుగారొచ్చేలోపుగా, నీకో ప్రశ్న! సంధులూ, సమాసాలు గురించి ఒక్క మాటలో చెప్పు!
చింతమొద్దు: మూడో సందులో, నాలుగు చక్రాల బండి మీద సమోసాలు అమ్ముతారు. ఎంత రుచిగా వుంటాయో?

 

 

ఒక అభిమాని: భానుని కిరణములు నా మీద పారాయి. వానలో నిలువెల్లా తడిసాను. మీ నీతి వినాలనివచ్చాను.
కవి: నా మీద అంత అభిమానమా?
ఒక అభిమాని: మీ నీతి వినని వాళ్ళు లేరు... నేనొక్కడినే మిగిలాను, కవి చౌడప్ప గారూ! మీ పద్యం పూర్తిచెయ్యడానికొచ్చాను! "కం" నా నీతి వినని వానిని భానుని కిరణములు మీద పారని వానిన్
వానను తడియని వానిని కానను రా కుంఠ వరపు కవి చౌడప్పా
(ఆధారంగా)

 

మంత్రి: మహారాజ, కొలువులోకి ఒక మహా కవి ప్రవేశించనున్నారు. మీ అనుమతి కోరుతున్నారు.
రాజు: వెంటనే ప్రవేశపెట్టు..
మంత్రి: వారితో పాటు, ఏనుగు కూడా రావాలట ప్రభో..
రాజు: ఏనుగు లక్ష్మణ కవి గారా?రండి రండి కవిశేఖరా...!

 

 

 

ఒక దారే పోయేవాడు: దాహం వేస్తున్నది... నీరు..చుక్క లేదు.
మరొకడు: పూర్వం శ్రీనాధ కవికి, దాహం వేసి , శివుడి మీద పద్యం చదివారు. భూమి నుండి గంగ చిమ్ముకొచ్చి ఆయన దాహం తీర్చింది!
ఒక దారే పోయేవాడు: నేను ఆయనంతటి కవిని కానే?
ఇంకొకడు: ఐతే నోర్మూసుకుని నడువ్!!

మరిన్ని శీర్షికలు
betala prashna