Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

కర్నాటక తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

karnataka  viharayatralu

( బంగారు తిరుపతి )

కేజిఎఫ్ నుంచి ‘ ముళబాగల ‘ రోడ్డుమీద సుమారు 30 కిలోమీటర్లదూరంలో రోడ్డు పైన వున్న ‘ గుట్టహళ్లి ‘ లో వున్న వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని బంగారు తిరుపతి అని అంటారు . గుట్టహళ్లి అంటేనే తెలుస్తోంది కదా గుట్టపల్లి అని ( హళ్లి అంటే పల్లి అని అర్దం ) , ఓ చిన్న కొండ సుమారు 40 మీటర్ల యెత్తున కొండమీద కట్టిన మందిరం . రోడ్డు దిగగానే మెట్లదారి , మెట్లు యెక్కుతూ వెళ్లగానే ఎదురుగా పెద్ద గరుత్మంతుని విగ్రహం స్వాగతం పలుకుతూ వుంటుంది . ఎదురుగా పుష్కరిణి , అయితే ఇవన్నీ ఈ మధ్య చోటుచేసుకున్న మార్పులు , 1994 ప్రాంతాలలో సన్నని రాతి మెట్లు కొన్ని చోట్ల మెట్లుకూడా లేకుండా వుండేవి , పాడుబడ్డ చిన్న పుష్కరిణి వుండేది అందులో నీరు స్నానానికి పనికివచ్చేటట్లుగా వుండేది కాదు . చిన్న రాతి కోవెల . శ్రావణ  , మాఘమాసాలలో భక్తులు యెక్కుగా వచ్చేవారు . మనుషుల కన్నా కోతులు యెక్కువగా వుండేవి . ఇప్పుడు ఈ కోవెలలో భక్తుల రద్దీ పెరిగింది , దాతల సహాయంతో మరమ్మత్తులు , గోపుర నిర్మాణం జరిగేయి , ముఖ్యంగా పుష్కరిణిని బాగుచేయించడం , పరిశుభ్రతని పాఠించడంతో భక్తులు అందులో స్నానాలు చెయ్యగలుగుతున్నారు .

గర్భగుడిలో వున్న వేంకటేశ్వర స్వామిని ముఖ ద్వారంలోంచి దర్శించుకోడం వుండదు , పక్కనవున్న ఆరు భాగాలుగా వున్న రాతి కిటికీలోంచి మాత్రమే దర్శించుకోవాలి , అలా దర్శించుకొన్న భక్తులకు హరిషడ్వర్గాలను జయించే శక్తిని ప్రసాదిస్తాడట స్వామి .

ఇక్కడ చాలా కోతులున్నాయని చెప్పేనుకదా , అయితే ఈ కోతులు భక్తులచేతులలోంచి ప్రసాదం లాక్కోడం లాంటి కోతిపనులు చెయ్యవు , దర్శనం అయి బయటకి వచ్చే భక్తులను ప్రసాదం చెయ్యచాచి అడుగుతాయి , అలా ఒకసారి కాదు యెన్నిమార్లు వెళ్లామో ఈ కోవెలకి అన్నిసార్లూ అదే అనుభవం .

బృగుమహర్షి అహంకారం నశించి విష్ణుతత్వాన్ని గ్రహించిన ప్రదేశమట యిది . ఆ కథేంటో తెలుసుకుందాం .బృగు మహర్షి యెవరు అంటే మత్స పురాణం ప్రకారం మత్స్య భగవానుడు వైవస్వత మనువుకు బ్రహ్మదేవుని ఆసీస్సులతో అగ్నినుండి ఆవిర్భవించిన మహర్షుల గురించి తెలియ జేశేడు. అగ్ని వెలుగు నుండి బృగు మహర్షి, అగ్ని కణాలనుండి ఆత్రి, అగ్ని శిఖల నుండి అంగీరసుడు, కాంతి ప్రసరణనుండి మైరీచి, అగ్ని కేశాల నుండి పులస్త్యుడు ఆవిర్భవించారు. అగ్ని ప్రవాహం నుండి పులహుడు, అగ్ని తేజస్సు నుండి వశిష్ఠుడు వచ్చారు.         బృగు మహర్షికి ముగ్గురు పత్నులు నలుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మించారు -వారు దాత, విధాత, శుక్రాచార్య, చ్యవన, శ్రీమహాలక్ష్మి . బృగు మహర్షి బృగు సంహిత అనే గ్రంథాన్ని రచించేడు . బృగు సంహిత జ్యోతిష్శాస్త్రానికి సంబంఓదించిన మొదటి గ్రంథం . శ్రీ మహాలక్ష్మి ని  శ్రీమహావిష్ణువునకిచ్చి వివాహం చేసిన తరువాత శ్రీమహావిష్ణువునకు మామగారు కాబట్టి అతని కన్నా తనే గొప్ప అనే భావన కలుగుతుంది , దాంతో అహంకారం పెరుగుతుంది బృగు మహర్షి లో . విష్ణుమూర్తి అతనికి బుద్ది చెప్పడానికి తగిన సమయం కోసం యెదురు చూస్తూ వుంటాడు .

ఒకనాడు ఋషులందరూ మహాయాగాన్ని చేస్తూ వుంటారు , ఆఖరిరోజు యాగ ఫల గ్రహీతగా త్రిమూర్తులలో యెవరిని పిలవాలనే విషయమై వాదోపవాదాలు జరుగగా మహావిష్ణువు మామగారైన బృగువుని అడుగుతారు . బృగువు త్రిమూర్తులలో యెవరు గొప్పో నిర్ణయించడానికి ముందుగా విష్ణుమూర్తిని పరీక్షించడానికి వైకుంఠానికి వెళతాడు , వైకుంఠంలో విష్ణుమూర్తి బృగుమహర్షికి దర్శనం యివ్వక లక్ష్మీదేవితో పాచికలాడుతూవుంటాడు . ద్వారపాలకులు యెంతసేపటికీ లోనికి అనుమతించకపోయేసరికి కోపంతో ద్వారపాలకులను ధిక్కరించి బృగువు లోనికి ప్రవేశిస్తాడు , పాచికలాటలో మునిగి వున్న విష్ణుమూర్తిని చూచి కోపంతో విష్ణుమూర్తి వక్షస్థలం వామభాగాన కాలితో తంతాడు . విష్ణుమూర్తి బృగువు చేసిన పనికి కోపగించక అథిధి మర్యాదలు చెయ్యనారంభిస్తాడు , విష్ణుమూర్తి వక్షస్థల వామభాగం లక్ష్మీదేవిది , బృగుమహర్షి తనస్థానాన్ని కాలితో తన్నితే కోపగించక అతనికి సపర్యలు చేస్తున్న విష్ణుమూర్తిని చూసిన లక్ష్మీదేవి కోపంతో అక్కడనుంచి వెడలిపోతుంది .

విష్ణుమూర్తి సపర్యలు చేస్తున్నట్లుగా నటించి కాలిలోనున్న బృగుమహర్షి మూడో కంటిని చేత్తో గట్టిగా వొత్తుతాడు . బృగుమహర్షిమూడోకన్ని చూపును పోగొట్టుకొంటుంది . మూడోకన్ను పోవడంతో బృగుమహర్షికి తాను చేసిన తప్పు తెలిసి విష్ణుమూర్తికొరకై తపస్సు చేసుకుంటూ గుట్టహళ్లి కొండలలో గడపసాగేడు . అలిగిన శ్రీమహాలక్ష్మి తపస్సమాధిలో వుండిపోతుంది , ఆమె యొక్క అంశ కలియగంలో ఆకాశరాజు ఇంట పద్మావతిగా అవతరిస్తుంది , జగన్నాధుడు వేంకటేశ్వరస్వామిగా అవతరించి పద్మావతిని వివాహమాడి అవతారం చాలించి వైకుంఠానికి మరలిపోతూ వేంకటేశ్వరునిగా అవతరించడానికి కారణభూతుడైన బృగుమహర్షి తనకై యింకా భూలోకంలో తపస్సు చేస్తూ వుండడం తెలుసుకొని బృగుమహర్షికి వేంకటేశ్వరునిగానే ప్రత్యక్షమౌతాడు . తనలోని హరిషడ్వర్గాలను నశింపజేసిన స్వామిని అక్కడే అదే రూపులో వెలసి మానవులను కూడా హరిషడ్వర్గాలనుండి విముక్తులను చెయ్యమని కోరుతాడు . బృగుమహర్షి కోరిక మేరకు స్వామి వేంకటేశ్వరుని రూపంలో అవతరించేడు .

పక్కనే వున్న చిన్నమందిరంలో పద్మావతిని ప్రతిష్ఠించేరు . పద్మావతీ దేవి మందిరం 19వ శతాబ్దంలో నిర్మింపబడింది  .

ముత్యాలమడుగు ———

కర్నాటకలోని అనెకల్ జిల్లాలో కొండలలో వున్న జలపాతం యిది , బెంగళూరు నగరానికి సుమారు 50 కిలోమీటర్లదూరంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పలమనేరు పట్టణానికి దగ్గరగా వుంటుందీ జలపాతం . కర్నాటక , ఆంధ్ర నుంచి పర్యాటకులు వస్తూ వుంటారు . ఈ జలపాతం నీరు కొండలమీంచి పడుతూ ఎండలో ముత్యాలుపడుతున్నాయా అనే భ్రమను కలిగిస్తూవుంటుంది , అందుకే దీనిని ముత్యాలమడుగు అంటారు . చుట్టూ దట్టమైన అడవులు , కొండలు వుండడం వల్ల మంచి పిక్నిక్ స్పాట్ గా పేరుపొందింది . 

అయితే ఈ జలపాతం వర్షాధారం అవడం వల్ల వర్షాలు పడ్డాక మాత్రమే చూడగలం . ఆగస్టు నుంచి నవంబరు వరకు ఈ జలపాతాన్ని చూడగలం , వర్షపాతం తక్కువగా వుండే సంవత్సరం ఇక్కడకి వెళ్లకపోవడమే మంచిది . అడవి ప్రాంతం కాబట్టి కోతులు అడవి పక్షులను చూడొచ్చు . ఇదండీ ఈ వారం విశేషాలు వచ్చేవారం మరికొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu