Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Lakshmi Narasimha Swamy Temple - Mangalagiri

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆనందమయ జీవితానికి పన్నెండు సూత్రాలు - లాస్య రామకృష్ణ

Twelve Statements to Live Happily

ఈ గజిబిజి జీవితం లో కొన్ని చిన్న చిన్న విషయాలను మనం తెలియకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం. అలాంటి వాటిని అర్ధం చేసుకున్నప్పుడు ఆనందమయ జీవితం మన సొంతం. అటువంటి ఆనందమయ జీవితానికి పన్నెండు సూత్రాలు ఇక్కడ వివరించబడ్డాయి.

1. కృతఙ్ఞతలు తెలుపండి - ఇప్పుడు మీరు గడుపుతున్న జీవితం ఏంతో విలువైనది. దానికి కృతఙ్ఞతలు తెలుపండి. గతం లో చేసిన పొరపాట్లు నుండి మీరు నేర్చుకున్న పాఠాలు సరైన దిశలో ముందుకు నడిపించేందుకు మీకు ఉపయోగపడతాయి. మీ జీవితం లో ని మంచిని ప్రశంసించండి. ప్రస్తుతం మీ వద్ద ఉన్న దానికి మీరు కృతజ్ఞతా భావం తెలుపండి. ఎంత కృతజ్ఞతతో ఉంటే అంత మీ దగ్గర ఉంటుంది.

2. ఆశావహ దృక్పధాన్ని అలవరచుకోండి -  జీవితం నుండి ఉత్తమమైనవి ఆశిస్తే మీకు ఉత్తమమైనవే లభిస్తాయి. మీరు ఆశావాదా లేక నిరాశావాదా, మంచికి ప్రాధాన్యం ఇచ్చేవారా లేక చెడుకా ఇటువంటివేమి జీవితం పట్టించుకోదు. మీరు ఏ విధం గా జీవితాన్ని ఆశిస్తారో అదే విధం గా జీవితం మిమ్మల్ని శాశిస్తుంది. అందుచేత ఆశావాహ దృక్పధం అన్నది ఆనందమయ జీవితానికి ప్రధానమైన అంశం. ఆశావాది రోజా పువ్వు ని మాత్రమే చూస్తాడు, నిరాశావాది రోజా పువ్వు కున్న ముళ్ళనే చూస్తాడు.

3. అతిగా ఆలోచించడం మానుకోండి - మన ప్రస్తుత జీవితాన్ని ప్రభావితం చేసేవి పుట్టినప్పటి నుండి మనకున్న ఆలోచనలే అన్న విషయాన్నీ మరచిపోకూడదు. మీకు ఏదైనా నచ్చక పోతే, దానిని మార్చేందుకు ప్రయత్నించండి. ఒక వేళ మార్చలేకపోతే అతిగా ఆలోచించకుండా ఆ విషయం వదిలేయండి. జీవితం పై మీ కున్న దృక్పధాన్ని మార్చుకుంటే జీవితం మీ పట్ల తన దృక్పధాన్ని మార్చుకుంటుంది. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ఇదివరకటి మీ కంటే మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించండి. ఇతరులతో పోల్చుకోవడం మానండి. మీ సమయం, శక్తి వంటివి ఉపయోగించి మెరుగైన జీవితానికి కావలసినవి ఏర్పరచుకోండి. అంతే కానీ, ఇతరులతో పోలిక ఆనందాన్ని నిర్మూలిస్తుంది అన్న విషయం గుర్తుంచుకోండి.

4. దయాగుణం పెంపొందించుకోండి - ఎల్లప్పుడూ ఇతరులతో దయ గా ఉండండి. సాయం చెయ్యడానికి ముందు ఉండండి. అది డబ్బు సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు.

5. సామాజిక బాంధవ్యాలు ఏర్పరచుకోండి - బయటికి వెళ్లి కొత్త వ్యక్తులని కలవండి. ఇతరులు చేసే వాటిపై మీరు ఆసక్తి చూపిస్తే, మీరు చేసే వాటిపై కూడా ఇతరులు ఆసక్తి కనబరుస్తారు. సామాజిక బాంధవ్యాలను మెరుగుపరచుకునేందుకు మీ వంతు ప్రయత్నం చెయ్యండి. ఇతరులలో మీకు నచ్చనివి ఉంటే అవి మీకు ఇబ్బంది పెట్టనంత వరకు వాటిని పట్టించుకోకండి. వారిలోని మంచికే ప్రాధాన్యతనివ్వండి.

6. మీ మనస్సుని అర్ధం చేసుకోండి - మీ ఆలోచనలను గమనిస్తూ మీ మనస్సుని అర్ధం చేసుకోండి. తగిన వ్యూహాలు రచించండి. మనస్సుని మీరు నియంత్రించాలి గాని మనస్సు మిమ్మల్ని నియంత్రించకూడదు. ప్రయోగశాల లో ఎలుకలా కాకుండా శాస్త్రవేత్తలాగ ఉండండి.

7. క్షమాగుణం అలవరచుకోండి - గతం లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులని క్షమించడం నేర్చుకోండి. మీరు వారిని క్షమించిన మరుక్షణం మీలో ఒత్తిడి మటుమాయం అవుతుంది. ఆనందం ప్రవేశిస్తుంది.

8. మీ ప్రతిభని గుర్తించండి - మీలో ఉన్న అసమాన ప్రతిభలను వెలికితీయండి. మీకున్న ప్రతిభ మీకు తెలిసే ఉంటుంది. ఒక వేళ తెలియకపొతే, ఏ సందర్భాలలో మిమ్మల్ని మీ బంధువులు, స్నేహితులు లేదా గురువులు ప్రశంసించారో గుర్తుతెచ్చుకోండి. ప్రతిభ అనేది దేవుడిచ్చిన వరం. ఆ ప్రతిభని ఉపయోగించుకోవడంలోనే ఆనందం ఉంది.

9. ప్రకృతిని ప్రేమించండి - అందంగా ఉదయించే సూర్యుడు, పచ్చటి చెట్లు, ప్రకృతి సౌందర్యం, జీవితం యొక్క అందం వీటన్నిటిని ఆస్వాదించండి. చిన్న చిన్న విషయాలే ఎంతో ఆనందం కలిగిస్తాయి. ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అవే గొప్ప విషయాలుగా అనిపిస్తాయి.

10. మీ లక్ష్యాలకు కట్టుబడి ఉండండి - ఆనందంగా ఉండాలంటే మీకంటూ కొన్ని లక్ష్యాలు ఉండాలి. లక్ష్యాలు అనేవి వివిధ రకాలు. వ్యక్తిగత లక్ష్యాలు, ఉద్యోగ లక్ష్యాలు, సామాజిక లక్ష్యాలు వంటి వివిధ లక్ష్యాలు ఉన్నాయి. జీవితం నుండి మీరు ఆశించేదేంటి అనే ప్రశ్న వేసుకుని సమాధానం తెలుసుకోండి. ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యండి. తప్పక విజయం సాధిస్తారు.

11. ఆధ్యాత్మికతను సాధన చెయ్యండి - అశక్తులుగా ఉన్నవాళ్ళకి శక్తి ని, సందేహంలో ఉన్నవాళ్ళకి నమ్మకాన్ని కలిగించేది ఆధ్యాత్మికత. మనందరినీ సృష్టించిన అదృశ్య శక్తి మనల్ని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటుంది. ఆ నమ్మకమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతను సాధన చెయ్యడం ద్వారా ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.

12. మీ శరీరాన్ని అర్ధం చేసుకోండి -  'మీ శరీరాన్ని సంరక్షించుకోండి, మీరు నివసించేది అందులోనే' అని ఒక ప్రముఖ వ్యక్తి సూక్తి. ఆ సూక్తి అక్షరాలా నిజం. మీరు మీ శరీరం గురించి ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. ఒకసారి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెడితే మళ్లీ మాములు స్థితికి చేరుకోవడం కష్టం. అందుచేత, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యండి. సమృద్దిగా నీళ్ళు త్రాగండి. నీళ్ళే జీవనాధారం. ఆరోగ్యకరమైన ఆహారాన్నే పుచ్చుకోండి.

ఇవన్నీ పాటిస్తే ఆనందమయ జీవితం మీ సొంతం.

మరిన్ని శీర్షికలు
navvula jallu by chekka chenna keshava rao