Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bhagavaan shree ramana maharshi biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

'సుశాస్త్రీయం' - ఆంద్ర రత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు - టీ.వీ.యస్. శాస్త్రి

Duggirala Gopalakrishnaiah

స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వారిలో ఆంధ్రులు గణనీయంగానే ఉన్నారు. వారిలో రత్నంలాంటి వాడు మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు.అనర్గళమైన తన వాక్పటిమతో,పద్యాలతో  ఆ రోజుల్లో ఆంధ్రులను ఉత్తేజపరచిన ఈ మహనీయుడు చిరస్మరణీయుడు.

ఈయన 02-06-1889 న,కృష్ణా జిల్లాలోని పెనుగ్రంచిపోలు అనే ఒక కుగ్రామంలో శ్రీ కోదండరామయ్య, శ్రీమతి సీతమ్మ అనే పుణ్య దంపతలుకు జన్మించారు.

బాపట్ల ,గుంటూర్లలో హై స్కూల్ విద్యనభ్యసించారు.బాల్యం నుండి ఆయనకు కళలంటే ఎక్కువ మక్కువ. ఆ మక్కువతోనే,యవ్వనపు తొలి దశలోనే స్కూల్ లో 'జాతీయ నాట్యమండలి' ని స్థాపించారు. నాటక,సంగీత,సాహిత్యాలను ప్రోత్సహించాలనే సదుద్దేశ్యం ఆ సంస్థ స్థాపించటం వెనక ఉన్నాయి.అలా కళలలో కూడా ఆయన  ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు.ఆ తర్వాత ఉన్నత విద్యలకై ఇంగ్లండ్ కు వెళ్ళారు. అక్కడి ఎడింబరో యూనివర్సిటీ నుండి M.A పట్టాను సంపాదించారు.కొంతకాలం శ్రీ ఆనంద కుమారస్వామి గారనే ప్రముఖిడికి సహాయకుడిగా పనిచేసారు.ఆ రోజుల్లోనే నందికేశ్వరుని సంస్కృత కావ్యమైన 'అభినయ దర్పణం' ను ఆంగ్ల భాషలోకి “The Mirror of Gesture”  అనే పేరుమీద అనువదించారు.

“The Mirror of Gesture” ను కేంబ్రిడ్జి –హార్వర్డ్ యూనివర్సిటీ వారి ప్రెస్ 1917 లో ప్రచురించింది.స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత కొద్ది రోజులు రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలోను ,బందరు జాతీయ కళాశాలలోను ఉపన్యాసకులుగా పనిచేసారు. గాంధీ గారి స్ఫూర్తితో,1919 లో స్వాతంత్ర్య సమరరంగంలోకి దూకారు. 1919 లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం చీరాల , పేరాల నగరపాలక సంస్థలను కలిపి ఒకే మున్సిపాలిటీగా చేసింది. అలా చేయటం వలన ఆయా పట్టణాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశ్యంతో నాటి ప్రభుత్వం మీద సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.

ఆ ఉద్యమం చివికి చివికి పెనుప్రభంజనంగా మారింది. ఆంధ్రదేశపు ఉద్యమాలలో అదొక మైలు రాయిలా నిలిచింది.1920లో నాగపూరులో జరిగిన కాంగ్రెస్స్ మహాసభ తీర్మానాలను ప్రజలకు చేరువ చెయ్యటం కోసం, ఆంద్రదేశమంతా తిరిగి నాటి బ్రిటిష్ కుటిల నీతిని ఎండగట్టి ప్రజలను చైతన్యవంతులను చేసారు.ఆయన ఉపన్యాసాలకు తండోప తండాలుగా ప్రజలు రావటం చూసిన బ్రిటిష్ ప్రభుత్వం వారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. ఆయన ఉపన్యాసాల మీద ఆంక్షను విధించింది ప్రభుత్వం.ఆ ఆంక్షను ధిక్కరించి బరంపురంలో ఉపన్యాసం ఇస్తుండగా ఈయనను అరెస్ట్ చేసారు.బ్రిటిష్ ప్రభుత్వం వీరికి ఒక సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్షను వేసింది.

ఆయనకి తెలుగు జానపద కళలంటే అమితమైన ప్రీతి. తోలుబొమ్మలాట,జముకుల కథ,వీధి నాటకాలు, బుర్రకథ, సాముగరిడీలు, గొల్లకలాపం, బుట్టబొమ్మలు, కీలుగుర్రాలు, కొమ్ముబూర, జోడు మద్దెల, పల్లె సుద్దులు,  తూర్పు భాగోతం, పల్నాటి వీర విద్యావంతులు ... ఇంకా అనేకమైన కళారూపాలను అభిమానించి ప్రోత్సహించారు.

కళకు ఒక సామాజిక పరమార్ధముందని గ్రహించి,తద్వారా ప్రజలను దేశస్వాతంత్ర్యం కోసం కార్యోన్ముఖులను చేసారు.'సాధన' అనే పత్రికను స్థాపించారు. గ్రంధాలయ ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించారు.ఆయన పరమ భక్తాగ్రేసరుడు. వేషధారణ కూడా  విభిన్నంగా ఉండేది. ఆధ్యాత్మిక వేత్త,రామభక్తుడైన ఈయన 'రామదండు' పేరుతొ ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.'రామదండు'ను  జాతీయభావాలతో కూడా చక్కగా,సమర్ధవంతంగా నడిపారు.

ఆ రోజుల్లో యువకులు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నందుకు గర్వపడేవారట! 1921 లో గుంటూరులో ఆయన ఒక ఉపన్యాసాన్ని ఇస్తున్న సందర్భంలో ప్రజలు మైమరచిపోయారు. ఆ సభలోనే ప్రజలు ఆయనకు 'ఆంద్ర రత్న' అనే బిరుదును ప్రసాదించారు.సహాయనిరాకరణ ఉద్యమం నాటి రోజుల్లో దేశమంతటినీ మూడు సంఘటనలు ప్రభావితం చేసాయి.వాటిలో మొదటిది, గోపాలకృష్ణయ్య గారి నాయకత్వంలో నడచిన చీరాల-పేరాల ఉద్యమం.'రామదండు' లో సుశిక్షుతులైన అనేకమంది యువకులు ఆయన బాటలో నడిచారు.

విజయవాడలో జరిగిన కాంగ్రెస్స్ జాతీయ సమావేశాలలో 'రామదండు' కార్యకర్తలు చేసిన పనితీరు గాంధీ గారితో సహా పలువురి దృష్టిని ఆకర్షించింది. అది ఆయన నాయకత్వ పటిమ, యువకులు ఆయన నుండి పొందిన స్ఫూర్తి. 'రామదండు' నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతరంగా పనిచేయనారంభించింది. ప్రతి కులం నుండి ఒక సభ్యుని తీసుకొని సమాంతరంగా ఒక అసెంబ్లీని ప్రారంభించారు ఆయన.'రామదండు' సభ్యులు పాడే సంకీర్తనలు, భజనలు ప్రజలను మరింత ఉత్సాహ పరిచేవి. ప్రభుత్వ భూములలో షెడ్లను, పాకలను 'రామదండు' నిర్మించింది.చీరాల-పేరాల ఉద్యమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తన దమన నీతితో అణచివేసినా, ఆ ఉద్యమ స్ఫూర్తి ప్రజలలో అలానే నాటుకుపోయింది.

గోపాలకృష్ణయ్య గారు మంచి హాస్యప్రియులు. అవి స్వాతంత్రోద్యమం నాటి రోజులు. ఒక రోజు చిత్తరంజన్ దాస్ గారు గుంటూరు మీటింగ్ కి వెళుతూ కలకత్తానుండి వచ్చే మెయిల్ లో తెనాలిలో ఆగారు. తెనాలి ప్లాట్ ఫారం మీద ఆగివున్న గుంటూరు రైలెక్కి పడుకున్నారు. ఆ రైలు తెల్లవారుఝామున కానీ బయలుదేరదు. అదే రైలుకు గుంటూరు వెళ్ళటానికి వచ్చిన గోపాలకృష్ణయ్య గారు మొదటి బోగీ మీద 'సి. ఆర్. దాస్ ' అన్న పేరును చూసి ,"ఆహా !ఏమి నా భాగ్యం! నాకోసం టిక్కెట్టును రిజర్వు కూడా చేసారే!" అన్నారు తన సహచరులతో. "ఈ రిజర్వేషన్ మీకు కాదండి, సి. ఆర్.దాస్ గారికి "అని చెబితే ,అందుకు ఆయన "అవునయ్యా!నా పేరు కూడా సి. ఆర్.దాసే కదా! అదే చీరాల రామదాసు!" అని చమత్కరించారట .

ఈ 'ఆంద్ర రత్నం' 40 సంవత్సరాల చిన్న వయసులోనే అనగా 1928లో అకస్మాత్తుగా దివికేగారు.

ఆంధ్రులను తేజోవంతులను చేసిన ఈ మహనీయునికి ఘనమైన నివాళిని సమర్పించుదాం!

మరిన్ని శీర్షికలు
weekly horoscope(June 1-June 7)