Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
annamayya pada seva

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆధ్యాత్మిక చిన్న కథలు : పుస్తక సమీక్ష - సిరాశ్రీ

adhyatmika chinna kathalu
ఆధ్యాత్మిక చిన్న కథలు
రచన: మల్లాది వెంకట కృష్ణమూర్తి
వెల: 70/-
ప్రతులకు: 040-27612244, 9849022344
 
ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఆమధ్య "వార్త" ఆదివారం అనుబంధంలో వారానికో ఆధ్యాత్మిక కథ రాసేవారు. ఆధ్యాత్మికత అనగానే ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, షట్చక్రాలు వంటి జటిలమైన పడికట్టు పదాలతో కాకుండా, జీవితంలో ఎదురుపడే సంఘటనలతో చిన్నపిల్లలకి సైతం అర్ధమయ్యే భాషలో సరళ సుందరంగా ఈ కథల్ని తీర్చిదిద్దారు.

నిజానికి ఆధ్యాత్మికత అనేది వ్యాసాలు, ఉపన్యాసాల రూపంలో కన్నా కథలుగా చెబితే మనసుపై ప్రభావం బలంగా ఉంటుంది. పైగా ఇవి చిన్న కథలు. ఏదీ పేజీకి మించి లేదు. చెప్పదల్చుకున్న విషయం నేరుగా ఒక సంఘటనగా, కేవలం రెండు మూడు పాత్రలతో తేటతెల్లమైపోతుంది.

ఇప్పుడు ఆ కథలన్నీ "ఆధ్యాత్మిక చిన్న కథలు" పేరుతో పుస్తకంగా వేసారు. ఇప్పటికే మూడు సార్లు అచ్చయ్యిందంటే పాఠకాదరణ విశేషంగా ఉందని అర్ధమౌతుంది.

ఈ కథల్లో రచయిత స్వీయ రచనలు కొన్ని, అనువాదాలు, అనుసరణలు ఇంకొన్ని. "విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేట పరుతు" అని పోతన భాగవతంలో అన్నట్టు ఈ రచయిత తాను విన్నవి, కన్నవి, అనుకున్నవి కథలుగా మనకందించారు. ప్రతి కథా ఒక జ్ఞాన గుళికే.

పాఠశాలల్లో ఇలాంటి చిన్న కథలను ప్రతి తరగతిలోను ఒక పాఠంగా చేరిస్తే విలువలతో కూడిన విద్యను పిల్లలకు  అందించినట్లౌతుంది.

ఇందులో ఉన్న కథలేవీ ఏ మతానికి చెందినవి కావు... మనిషి తనానికి, స్వార్ధ రాహిత్యనికి, సేవా తత్పరతకి, శరణాగతికి, పాప భీతికి, దైవ ప్రీతికి, సంఘ నీతికి, ధర్మ నిరతికి తార్కాణాలు మాత్రమే.
మరిన్ని శీర్షికలు
Lakshmi Narasimha Swamy Temple - Mangalagiri