దర్శకుడు గుణశేఖర్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ ఈ వేసవికి విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాలతో అనుకున్న సమయానికి విడుదల కాలేదు. సినిమా నిర్మాణంలోని భారీతనం, టెక్నికల్ అంశాలతోనే కాస్త ఆలస్యమయ్యిందని చిత్ర యూనిట్ చెబుతోంది. రీ రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘రుద్రమదేవి’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాత గుణశేఖర్.
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రాణా మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గోన గన్నారెడ్డి పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమాకి ఇంకో అదనపు ఆకర్షణ. కొత్త టెక్నాలజీతో సింఫనీ ఆర్కెస్ట్రాని వినియోగించి 25 రోజులపాటు సినిమా రీ రికార్డింగ్ కార్యక్రమాలు నిర్వహించారట. లండన్‌లో రీ రికార్డింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కిన ‘రుద్రమదేవి’ ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. వెండితెర అద్భుతంగా ‘రుద్రమదేవి’ రానుందనీ, చరిత్రలో రుద్రమదేవి అనే ధీర వనితకు ఈ సినిమా గొప్ప నివాళి అని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
|