Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sage , Professor ' Abdul Kalam ' tribute !

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

ఇదివరకటి రోజుల్లో ఇళ్ళలోకి సరుకులు  కొనుక్కోడానికి, కిరాణా కొట్లకి వెళ్తే కావాల్సినవన్నీ దొరికేవి.  నెలసరి సరుకులు నెల మొదట్లొ తెచ్చేసికుని పద్దు రాసేసేవారు. మధ్యలో ఏదైనా చిన్నా, చితకా కావాల్సొచ్చినా, పిల్లాడికి పద్దుపుస్తకం ఇచ్చి, తెప్పించుకునేవారు. ఆ కొట్టువాడు  ఇచ్చే కొసరు బెల్లం ముక్క కోసం, ఇంట్లో ఎన్నిసార్లు చెప్పినా హాయిగా వెళ్ళేవారు.  పాలకీ, నూనె కీ  ఇంటికే వచ్చి ఇచ్చేవారు. కూరగాయలకైతే సంత ఉండేది.
దేశంలొ ఆర్ధిక సంస్కరణలు వచ్చిన తరువాత, ఎక్కడచూసినా, పెద్దపెద్ద Malls  వచ్చేశాయి. పాతరోజుల్లోలాగ, ప్రతీ వస్తువుకీ, ప్రత్యెకమైన స్థలాలకి వెళ్ళనక్కరలేకుండా, ఒకే చోట దొరుకుతున్నాయనే తప్ప, పాత కిరాణా కొట్లే హాయనిపిస్తోంది. వాడకంగా వెళ్ళే కొట్లో,, కనీసం బేరమైనా చేయొచ్చు, కానీ ఇక్కడ, వాడు అంటించిన లేబుల్ మీద వ్రాసిన రేటే  ... మహా అయితే  ఒకటో రెండో శాతం తగ్గించానంటాడు. మొదట్లో ఈ malls  లో ఏదో wholesale లో తెస్తారూ, ధరలు తక్కువేమో అనే " అపోహ " ఉండేది. ఉదాహరణకి, నిమ్మకాయలు కొనాలనుకోండి, బయటి కొట్లలో పదిరూపాయలకి, మూడు అన్నా కానీ, బేరంచేస్తే , తప్పకుండా నాలుగూ, ఒక్కోప్పుడైతే అయిదూ కూడా దొరుకుతాయి. అదే ఏ Reliance  కో D'mart  కో వెళ్తే, బయటివాడిచ్చే మూడు నిమ్మకాయలకీ 12-14 రూపాయలు తిసికుంటాడు. ఇది అనుభవం మీద చెప్తున్నది. పైగా  చాలా వస్తువులు ( కూరగాయలు తప్ప), మిగిలిన వస్తువులమీద  పై రెండు maals  కీ కనీసం  4% తేడా ఉంది.Reliance  కి 6000 కోట్లు లాభం /Quarter  వచ్చిందంటే రాదు మరీ ? ఇదంతా మన చలవే.

 పైగా మాల్స్ కి వెళ్ళడంలేదూ అంటే, కొందరికి నామోషీ గా ఉంటోంది.గత పది సంవత్సరాలలోనూ, ఎన్నెన్ని మాల్స్ మూతబడిపోయాయో అందరూ చూస్తూనే ఉన్నారు.మొదట్లొ ఎంత ఉత్సాహంగా, వెళ్ళినా, క్రమక్రమంగా, అందరికీ తెలుస్తూనే ఉంది. కిరాణా కొట్లకీ, ఈ ఆధునిక మాల్స్ కీ ఉన్న తేడా. ఒక్కసారి వెళ్తే చాలు, అవసరం ఉన్నా, లేకపోయినా, కనిపించినవన్నీ కొనేయడం. దానికి సాయం, పిల్లలతో వెళ్తే ఇంక అడగక్కరలేదు.వాళ్ళకి ప్రతీదీ వింతగానే కనిపిస్తుంది. దానికి సాయం, ఆ మాల్స్ వాళ్ళు కూడా, నిత్యావసరవస్తువులని, ఎక్కడో మూల గా పెడతారు.నిజంగా కావాల్సినవి చూసుకునేలోపలే, మనం తోసుకెళ్తున్న trolley  నిండిపోతుంది. చివరకి బిల్లింగు కౌంటరుకి వచ్చేసరికి తెలుస్తుంది, ఎంతవరకూ మునిగామో. పోనీ ఆ కొన్నవన్నీ, ఉపయోగిస్తామా అంటే అదీ లేదూ.అయినా చేతినిండా డబ్బులూ, ఎలా ఖర్చుపెట్టాలీ అనే తపన. వీటికి సాయం కొత్తగా, online shopping ఒకటొచ్చింది.

 

ఎవరింటికి వెళ్ళినా, వారు ఆ నెలలో ఏవేమి సరుకులు online  లో తెప్పించారో, చూపించి, అవతలివారిని ఊరించడం. పైగా, వీటిల్లో ఎంత “ ఆదా” చేశారో, ఈ తరహా షాపింగులో ఉండే, సదుపాయాలేమిటో,వచ్చినవారిని ఊదరగొట్టేయడం. ప్రతీరొజూ చూస్తూంటాము, టీవీల్లోనూ, పేపర్లలోనూ ప్రకటనలు—ఫలానా కంపెనీ, 30%అంటే ఇంకోడు 40% డిస్కౌంటంటాడు. అసలు  సగానికి సగం ధరలకి అమ్ముతూ, ఎంతకాలం సాగిస్తారో వాళ్ళకే తెలియాలి.

ఎవరేమిచెప్పినా ప్రస్తుత ఫాషన్—online shopping.

సరుకులకి malls  ఎంతలా దోచుకుంటున్నాయో, వాటికి మించింది, చాలా బ్రాండెడ్ వస్తువులవాళ్ళు. బ్రాండు లేబుల్ పెట్టాడూ అంటే చాలు, 00 రూపాయలకొచ్చే బనీను, బ్రాండుది కొనాలంటే  190 రూపాయలు. పైగా ఏమైనా అంటే  “క్వాలిటీ అండీ క్వాలిటీ” అంటారే కానీ, మహా అయితే ఇంకో రెండు నెలలు మన్నుతుంది. చివరకి ఈ రెండురకాలూ కూడా, ఇల్లుతుడిచే గుడ్డల్లాగే కదా మిగిలేదీ? పోనీ ఈ కంపెనీలవాళ్ళు, స్వంతంగా ఏమైనా తయారుచేస్తున్నారా అంటే అదీ లేదూ.  ఏ కోయంబత్తూరులొనో, ఈరోడ్ లోనో. టోకులో కొనేయడం, వాటికి లేబుల్స్ పెట్టేయడమూనూ. ఈమాత్రందానికి, మనం మాత్రం చెల్లించే మూల్యం, ఎవరైనా ఆలోచిస్తున్నారా, అంటే అదీలేదూ. అయినా లొపల వేసికునేదానిక్కూడా లేబులేవిటీ? ఎవరికైనా చూపించుకోడానిక్కూడా వీలుండదు. మహా అయితే, ఏ దండెం మీదో, ఆరేసినప్పుడు, “ ఓహో ఈయన ఫలానా బ్రాండు వాడతాడన్నమాట..” అని అందరూ అనుకోవాలి.

అయినా ఎవరిష్టం వారిదీ, ఏదో ఒకటి ఒంటిమీద బట్టుంటే చాలు, ఏ బ్రాండైదేనేమిటీ?

సర్వేజనా సుఖినోభవంతూ...

మరిన్ని శీర్షికలు
sahiteevanam