Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

'ఆముక్తమాల్యద'

గోదాదేవి అందచందాల వర్ణననుండి ఆమె విరహావస్థవర్ణన వైపుకు మరలుతున్నాడు శ్రీకృష్ణదేవరాయలు.

ఆ నవలా యలంతి పసుపాడి దుకూలము దాల్చి గుబ్బచన్
గోనల దావు లుప్పతిల గుంకుము తేటల నిగ్గు దేర గ
ప్రానన  నాభి దీర్చి పిత్రుబద్ద లతాంతము లర్థి గొప్పునం
బూని యొకింత సే పునిచిపుచ్చి చెలిం గని వెచ్చనూర్చుచున్  

ఆ నవల, ఆ తరుణి కొద్దిగా పసుపు రాసుకుని స్నానం చేసి, వస్త్రధారణ చేసి, వక్షోజముల కొనలకు పరిమళముల వేకువలు అయ్యేట్లు, కుంకుమ కాంతులు శోభించేట్లు కర్పూరంతో తిలకము దిద్దుకుని(కస్తూరీ తిలకము), తన తండ్రి (దేవ దేవునికోసం) అల్లిన పూమాలను, కోరికతో కొప్పులో ధరించి, కొంతసేపు ఉంచుకుని తీసేసి, తన చెలికత్తెను చూస్తూ, వేడి నిట్టూర్పులు విడుస్తూ యిలా అంటుంది.

మీపాడిన హరిచందము
లేపాడిగ దలపవచ్చు నిత డేసతులం
గాపాడినవా డనుగై
త్రోపాడిన దన్ను వలచి తొయ్యలులారా

ఓ మగువలారా! మీరు ఇంతగా పాడుతున్నారు, ఆ 'హరి'గురించి, ఆతని తీరు ఏమనుకోవాలి? అతడు తననే వలచి, వెంటబడిన స్త్రీలను ఎవరిని కాపాడాడు చెప్పండి? 

తాను సురమౌని నృపతనుల్ దాల్చి యకట
కామినీతతి నుడికించుకంటె నట్టె
గండెయును నల్లదాసరిగాడు కిరియు
హరియు నై పోవుటయ మంచి దనుయుగంబు

తాను (ఆ శ్రీహరి) వామనుడు, పరశురాముడు, శ్రీరాముడు, బుద్ధుడు(నృపతనుల్) మొదలైన శరీరాలు అవతారాలుగా ధరించి కామినులను ఉడికించడం కంటె ప్రతియుగము అలాగే మత్స్యము(గండె) కూర్మము (నల్లదాసరిగాడు)వరాహము(కిరి) సింహము(హరి) మొదలైన శరీరాలు (అవతారాలు) ధరించడమే మంచిది! వామనావతారంలో బలిని బంధించి ఆయన భార్య ఐన వింధ్యావళిని బాధ పెట్టాడు. పరశురాముడై రాజులను అందరినీ సంహరించి వారి భార్యలను విరహవేదనకు గురి చేశాడు. శ్రీ రాముడై తనను వలచి వచ్చిన శూర్పణఖ ముక్కూ చెవులు కోయించాడు. బుద్ధుడై చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి ఇల్లూ వాకిలీ వదిలిపెట్టి తన భార్యను  వేదనకు గురిచేశాడు. కనుక ఈ అవతారాలు అన్నీ  ఆడాళ్ళను వేధించిన అవతారాలే.  మత్స్య, కూర్మ, వరాహ, నరసింహావతారాలే నయం! మత్స్య కూర్మావతారాలలో ఆడాళ్ళ జోలికే పోలేదు. వరాహావతారంలో తనను  వలచిన భూదేవి కోరికను తీర్చి కరుణించాడు. నరసింహావతారంలో స్త్రీ, ప్రేమ, వలపు ప్రసక్తే లేదు, అంతా రౌద్రమే!

ఆ తనువుల లేరుగదా
నాతులు మరి కాక కలిగిన న్వగ తిర్య
గ్జాతికి నీజాతికి గల
యీతీవ్రత గలదే యెరుగ కిట్లే లంటిన్ 

ఆ శరీరాలు, ఆ అవతారాలు ధరించినపుడు ఆతనికోసం వెంపర్లాడిన ఆడవాళ్ళు లేరుగదా. ఒకవేళ ఉన్నా ఉండొచ్చు, ఎందుకంటే పాపం ఆ మహా ఇల్లాలు, శ్రీమహాలక్ష్మి నిత్యానపాయిని, ఎప్పుడూ ఆయనను వదలకుండా అంటిపెట్టుకుని, ఆయనకు అనుకూలంగా తానూ అవతారాలు ధరిస్తూనే ఉన్నది కదా, ఒక వేళ అలా మత్స్యము, కూర్మము, వరాహము, సింహము మొదలైన శరీరాలు ధరించినప్పుడు ఆయనకోసం ఎవరైనా స్త్రీలు ఆశించినా, ఆ జలచరాలకు, జంతువులకు ఈ మానవజాతి స్త్రీలకు ఉన్నట్లు యీ అనురాగము, ఈ విరహము, ఈ తీవ్రత ఉండదు గదా, ఏంటో తెలిసీ తెలియకుండా యిలా మాట్లాడుతున్నాను ఏమిటి? అని, విరహ బాధతో ఏదో ధోరణిలో పలవరిస్తున్నట్టు మాట్లాడుతున్న గోదాదేవి మానసికావస్థను వర్ణించే నెపంతో  శ్రీహరి అవతారాలను చమత్కారపూర్వకంగా ప్రస్తుతిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు.

ఆత్మవ త్సర్వభూతాని యనుట బొంకె
ముద్దియల కైన వలవంత ముచ్చటలను
నాటపాటల గతల గొంతడగు గాని
నోరులేని జంతువులకు నొప్పి ఘనము

అన్ని జంతువులను తనను చూసుకున్నట్లే చూసుకోవాలి అంటారు గానీ, అది అసత్యమే! మనుషులూ  జంతువులూ ఎన్నటికీ ఒకటి కారు. స్త్రీలకు చెలికత్తెలతో ముచ్చట్లతో, ఆటపాటలతో, కథలతో విరహవేదన కొంతైనా తగ్గుతుంది, మరపుకు వస్తుంది కానీ, పాపం నోరులేని జంతువులకు బాధ మరీ ఎక్కువ, గోడు చెప్పుకుని ఏడవడానిక్కూడా ఉండదు పాపం అని తన విరహ వేదనతో పరిపరి విధాలుగా పలుకుతూ, పలవరిస్తూ, అలమటిస్తున్నది గోదాదేవి.

(కొనసాగింపు తరువాయి సంచికలో)

***వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని శీర్షికలు
Mango Chicken Curry