Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
చివ‌రికి మ‌హేష్‌.. రామ్‌చ‌ర‌ణ్ అయినా అంతే క‌దా! - నిఖిల్‌

చిత్ర‌సీమ‌లో ఎవ‌రి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో  అంచ‌నా వేయలేం.
ప‌నైపోయింది అనుకొన్న ద‌శ‌లో నిఖిల్ యూ ట‌ర్న్ తీసుకొని హ్యాట్రిక్ హీరో అవుతాడ‌ని ఊహించామా?
వ‌రుస విజ‌యాల‌తో స్టార్ రేంజుకి చేర‌తాడ‌ని క‌ల‌గ‌న్నామా?
నిఖిల్ కూడా ఊహించ‌లేదు. కానీ... ఓ సూత్రం మాత్రం బ‌లంగా న‌మ్మాడు. 'ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్లో కూర్చోబెట్టేది క‌థ మాత్ర‌మే' అని తెలుసుకొన్నాడు. అలాంటి క‌థ‌ల‌కు ప‌ట్టం క‌ట్టాడు. దాంతో హిట్టొచ్చాయ‌. స్వామి రారా, కార్తికేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య‌తో వ‌రుస హిట్లందుకొన్నాడు. శంక‌రాభ‌ర‌ణంతో సెకండ్ హ్యాట్రిక్‌కి సిద్ధ‌మ‌య్యాడు. ఈ సంద‌ర్భంగా గో తెలుగుతో నిఖిల్ స‌ర‌దాగా ముచ్చ‌టించాడు. ఆ క‌బుర్లు మీ కోసం...

* హాయ్ నిఖిల్‌
- హాయండీ...

* కాన్సెప్ట్ సినిమాలు భ‌లే ప‌ట్టేస్తున్నారే..
- పట్ట‌డం కాదండీ.. న‌న్ను వెతుక్కొంటూ వ‌స్తున్నాయి. అది నా అదృష్టం. స్వామి రారా, కార్తికేయ‌, సూర్య వెర్స‌స్‌సూర్య ఈ క‌థ‌ల‌న్నీ నేను త‌యారు చేయించ‌లేదు. శంక‌రాభ‌ర‌ణం కూడా అంతే. కోన‌గారు పిలిచి.. మంచి క‌థ చెప్పారు.. నేను చేసేశా. 

* శంక‌రాభ‌ర‌ణం అని టైటిల్ చెప్ప‌గానే మీ ఫ‌స్ట్ రియాక్ష‌న్‌..
- క‌థంతా చెప్పి, టైటిల్ ఏంట‌నుకొంటున్నావ్ అని అడిగారు. ఏదో నాకు తోచిన రెండు పేర్లు చెప్పా!  చివ‌రికి శంక‌రాభ‌ర‌ణం అన్నారు. నేను షాకైపోయా. అదేంటి సార్‌, ఆ పేరేంటి? అంత రిస్క్ ఎందుకూ..?  అని అడిగా. కానీ న‌న్ను క‌న్వెన్స్ చేశారు కోన‌గారు.

* మ‌రి ప్రేక్ష‌కులు క‌న్వెన్స్ అవుతారా?
- శంక‌రాభ‌ర‌ణం అని పేరు చెప్పి ఓ బూతు సినిమా తీస్తే త‌ప్పు.. మేం మంచి సినిమానే తీశాం. ఈ సినిమాకి శంక‌రాభ‌ర‌ణం అని పేరెందుకు పెట్టామో తొలి 5 నిమిషాల్లోనే తెలిసిపోతుంది. ప్రేక్ష‌కులూ క‌న్వెన్స్ అవుతారు. నిజం చెప్పాలంటే ఈ టైటిల్ పెట్ట‌డం వెనుక ఓ మార్కెట్ స్ట్రాట‌జీ ఉంది. టైటిల్ ఇద‌ని తెలియ‌గానే అంద‌రూ షాకైపోయారు. అది మా విజ‌యం. మ‌రో విష‌యం ఏంటంటే శంకరాభ‌ర‌ణం ఓ క్లాసిక్‌. ఆ పేరు తెలియ‌నివాళ్లుండ‌రు. మా టైటిల్ సుల‌భంగా చేరిపోతుంది. ఏమై ఉంటుందా? అని ఆస‌క్తితో జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారు.

* ఈ సినిమా ప్ర‌త్యేక‌త ఏంట‌ని అడిగితే ఒక్క మాట‌లో ఏం చెబుతారు?
-  ఇది వ‌ర‌కు నా సినిమాల‌కూ, ఈ శంక‌రాభ‌ర‌ణానికీ క‌చ్చితంగా తేడా చూస్తారండీ. అదే ప్ర‌త్యేక‌త‌. స్వామి రారా, కార్తికేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య‌.. ఈ మూడు సినిమాలూ హిట్సే. కాక‌పోతే.. ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయా. ఆ లోటు.. ఈ సినిమా తీరుస్తుంది. మ‌రో విష‌య‌మేంటంటే దాదాపు 600 థియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుద‌ల అవుతోంది. నాక‌ది చాలా పెద్ద రిలీజ్‌. నా గ‌త సినిమాలు బాగున్నా.. కొన్ని సెంట‌ర్ల‌కు చేరువ కాలేదు. కానీ.. శంక‌రాభ‌ర‌ణం.. ప్ర‌తీచోటా అందుబాటులో ఉంటుంది.

* నిఖిల్ మంచి క‌థ‌ల్ని ఎంచుకొంటున్నాడు అని న‌మ్ముతున్నారు సినీ జ‌నాలు. ప్ర‌తీసారీ ఈ ఫీట్ సాధ్య‌మేనా?
- ఏమోనండీ చెప్ప‌లేం. నా వ‌ర‌కూ నేను కొత్త క‌థ‌లు ఎంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటా. నేనే అని కాదండీ.. చాలామంది హీరోలు కొత్త కథ‌ల్ని ఎంచుకొనేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే హిట్టు కొట్టాలి. అలా న‌మ్మిన సినిమా బాగా ఆడితే, ధైర్యం వ‌స్తుంది. మ‌రో సినిమా చేస్తారు. మ‌గ‌ధీర త‌ర‌వాత రామ్‌చ‌ర‌ణ్ ఆరెంజ్ అనే కొత్త క‌థ ఎంచుకొన్నాడు. అయితే ఆ సినిమా ఆడ‌లేదు. మ‌హేష్ బాబు నేనొక్క‌డినే, ఖ‌లేజా సినిమాలు నాకు బాగా ఇష్టం. కానీ.. ఆడ‌లేదు. ఎందుకంటే వాళ్ల‌కంటూ ఓ ఇమేజ్ ఉంది. ప్రేక్ష‌కులు ఏవేవో ఊహించుకొని థియేట‌ర్ల‌కు వ‌స్తారు. అలాంటప్పుడు చ‌ర‌ణ్‌, మ‌హేష్‌ల‌కు సైతం ప‌రాజ‌యాలు త‌ప్ప‌వు. నాకంటారా, ఎలాంటి ఇమేజ్ లేదు. కాబ‌ట్టి నాకు కొన్ని క‌థ‌లు సూట‌వుతాయి. ఒక‌వేళ నాక్కూడా ఫ్లాపులు ఎదురైతే.. నేనూ ప్లేటు మార్చేస్తానేమో. అప్పుడు సేఫ్ జోన‌ర్ క‌థ‌ల్ని ఎంచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డొచ్చు. అంతిమంగా ఎలాంటి క‌థ‌లు చేయాలో నిర్ణ‌యించేది జ‌యాప‌జ‌యాలే.

* వ‌రుస‌గా మూడు హిట్టు కొట్టారు... ఈ విజ‌యాలు మీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి?
- ప్ర‌తీ సినిమా కీల‌క‌మే. మూడు హిట్లొచ్చాయి క‌దా అని రిలాక్స‌యిపోకూడ‌దు. త‌ర‌వాత సినిమా కూడా మంచి సినిమా ప‌డాలి. లేదంటే.. మ‌న ఆట మ‌ళ్లీ ముందు నుంచీ మొద‌ల‌వుతుంది. అందుకే క‌థల విష‌యంలో రాజీ ప‌డ‌డం లేదు. కొంత‌మంది నిర్మాత‌లు భారీ పారితోషికం ఇస్తాం.. ముందు సంత‌కాలు చేసేయ్ అన్నారు. కానీ ఒప్పుకోలేదు. డ‌బ్బులు త‌క్కువైనా, సినిమా ఆల‌స్య‌మైనా.. మంచి క‌థ‌ల్నే ఎంచుకొంటా.

* స్వామి రారా, కార్తికేయ త‌ర‌వాత మ‌ళ్లీ అలాంటి క‌థ‌లే చెబుతారేమో?
- అవునండీ.. ఆ అనుభ‌వాలైతే చాలా ఎదుర‌య్యాయి. నిఖిల్ ఇలాంటి క‌థ‌లే చేస్తాడేమో అని... క్రైమ్ కామెడీలూ, సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ లు చెప్పిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ చేసిన‌వే చేస్తే నాకూ, చూసేవాళ్ల‌కూ బోర్ క‌దా..?

* విన్న క‌థే విన్న‌ప్పుడు ఏం అనిపిస్తుంది?
- వినాలండీ త‌ప్ప‌దు. ఎందుకంటే అలా వింటేనే అందులో మంచివి ఎంచుకొనే వీలుంటుంది. అది నా ప‌ని. విసిగెత్తిపోతే ఎలా?

* యేడాదికి ఒక‌ట్రెండు సినిమాలే చేస్తున్నారు..  స్పీడు పెంచొచ్చు క‌దా?
- స‌రిగ్గా చేస్తే యేడాదికి రెండు సినిమాలు చాలండీ. హ‌ర్రీ బ‌ర్రీగా సినిమాలు చేయ‌డం ఎందుకు?  ఓ సినిమా మొద‌లుపెట్ట‌కముందు స్ర్కిప్టు వ‌ర్క్ నుంచీ నేనూ పాలుపంచుకొంటా. పూర్త‌య్యాక ప్ర‌మోష‌న్ల హ‌డావుడి త‌ప్ప‌దు. అందుకే ఓ సినిమా పూర్త‌యిన త‌ర‌వాత మ‌రో సినిమా మొద‌లెట్టాలంటే టైమ్ ప‌డుతుంది.

* కార్తికేయ‌కి సీక్వెల్ తీస్తార‌ట‌..
- అవునండీ.. క‌థ రెడీ అయిపోయింది. కొంత‌మంది పార్ట్ 2 అని చెప్పి పార్ట్ 1తో ఎలాంటి సంబంధం లేని సినిమాలు తీస్తుంటారు. కానీ కార్తికేయ 2 అలా కాదు.. ఇది ప‌ర్‌ఫెక్ట్ సీక్వెల్‌.

* పెళ్లెప్పుడు?
- ఇంట్లోవాళ్లు కూడా ఇదే అడుగుతున్నారు. కెరీర్‌లో స్థిర‌ప‌డ్డాక పెళ్లి చేసుకోవాల‌న్న ఉద్దేశం నాది. అందుకే రెండు హిట్లు ప‌డ‌నివ్వండి అని చెప్పా. ఇప్ప‌టికే మూడొచ్చాయి అంటున్నారు ఇంట్లోవాళ్లు. మ‌రో హిట్ ప‌డితే.. అప్పుడు పెళ్లికి రెడీ అయిపోతా.

* తదుప‌రి సినిమా ఎవ‌రితో?
- టైగ‌ర్ ద‌ర్శ‌కుడు ఆనంద్‌తో. చాలామంచి క‌థ చెప్పాడు. అదో ఫాంట‌సీ క‌థ‌. ముగ్గురు క‌థానాయిక‌లు ఉంటారు. ఓ క‌థానాయిక‌గా అవికాగోర్‌ని ఎంపిక చేశాం. మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ల ఎంపిక జ‌రుగుతోంది.

* ఓకే.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ..i  సాయి  

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
movie review