Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with sai dharm tej

ఈ సంచికలో >> సినిమా >>

సుప్రీం చిత్ర సమీక్ష

supreme movie review

చిత్రం: సుప్రీం 
తారాగణం: సాయిధరమ్‌ తేజ, రాశి ఖన్నా, రవికిషన్‌, రాజేంద్రస్రాద్‌, సాయికుమార్‌, కబీర్‌ సింగ్‌, మాస్టర్‌ మిఖాయిల్‌ గాంధీ, వెన్నెల కిషోర్‌, రాజేష్‌, పృధ్వీ, ప్రభాస్‌ శ్రీను, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్‌రెడ్డి, అలీ తదితరులు. 
సంగీతం: సాయి కార్తీక్‌ 
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌ 
దర్శకత్వం: అనిల్‌ రావిపూడి 
సమర్పణ: దిల్‌ రాజు 
నిర్మాత: శిరీష్‌ 
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 06 మే 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
ట్యాక్సీ నడుపుతుంటాడు మన డైనమిక్‌ హీరో బాలు (సాయి ధరమ్‌). అతనికి ఓ కుర్రాడు రాజన్‌ (మాస్టర్‌ గాంధీ) పరిచయమవుతాడు. హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న బాలు, రాజన్‌ కారణంగా ఓ కరడగుట్టిన విలన్‌తో తలపడాల్సి వస్తుంది. రాజన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళితే, అతనో రాజ కుటుంబానికి చెందిన కుర్రాడు. ఆ రాజకుటుంబానికి చెందిన ఆస్తుల్ని ఆక్రమించాలనుకుంటాడు విక్రమ్‌ సర్కార్‌ (కబీర్‌ సింగ్‌). అతనితో తలపడ్డమే మన హీరో పని. చివరకు ఏం జరుగుందన్నది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే 
సాయిధరమ్‌ తేజ సినిమా సినిమాకీ ఈజ్‌ పెంచుకుంటూ పోతున్నాడు. నటనలో పరిణతి సాధిస్తున్నాడు. డైలాగ్‌ డెలివరీలో చాలా మార్పు వచ్చింది. డాన్సుల్లో మావయ్యను మించిపోయాడు. యాక్షన్‌లో అదరగొట్టేస్తున్నాడు. వన్‌ మ్యాన్‌ షో అన్నట్లుగా సాయిధరమ్‌ తేజ తెరపై సందడి చేసి ఆకట్టుకుంటాడు. హీరోయిన్‌ రాశి ఖన్నా పోలీస్‌ గెటప్‌లో కనిపించింది. నటన కన్నా ఆమె గ్లామర్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. కాస్త కొత్తగా కనిపించింది కూడా.

కబీర్‌ సింగ్‌ విలనిజం బాగా పండించాడు. బాల నటుడు గాంధీ బాగా చేశాడు. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కన్పించినంతసేపూ షోని స్టీల్‌ చేసేశాడు. బోల్డంతమంది కమెడియన్లు తెర మీద నవ్వులు పూయించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 
కథ కొత్తదేమీ కాదు. కథనమూ అంతే. తర్వాత ఏం జరిగిపోతుందనేది ముందే తెలిసిపోతుంది ప్రేక్షకుడికి. కానీ, సినిమాని వేగంగా నడిపించగలిగాడు. బోర్‌ కొట్టించలేదు. ఆద్యంతం కామెడీనే నమ్ముకున్నాడు దర్శకుడు. తొలి సినిమా 'పటాస్‌'లోలానే ఇక్కడా కామెడీకి లోటు లేకుండా చూసుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. హీరో బలబలాల్ని తెలసుకుని, దానికి తగ్గట్టుగా సీన్లు రాసుకుని, సినిమాని నడిపించాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌ సెకెండాఫ్‌లో అవసరం అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకి హెల్పయ్యింది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి రిచ్‌నెస్‌ని అద్దాయి. 
ఫస్టాఫ్‌ అంతా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌ దాకా ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవ లేదు. అక్కడక్కడా యాక్షన్‌, అవసరమైన చోట కామెడీ, దాంతోపాటుగానే హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ అన్నీ సరిగ్గా కుదిరాయి. సెకెండాఫ్‌లో సెంటిమెంట్‌ కొంచెం ఎక్కువవుతుంది. దాంతోపాటే సినిమా స్లో అవుతుందన్న భావనా కలుగుతుంది. ఓవరాల్‌గా సినిమా కమర్షియల్‌ విలువలతో తెరకెక్కింది. మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌కి కావాల్సినవన్నీ దర్శకుడు సమకూర్చేశాడు. సెకెండాఫ్‌లో హీరో పాత్రకు ప్రాధాన్యత తగ్గడం కొంచెం డిజప్పాయింటింగ్‌గా అనిపస్తుంటుంది. మాస్‌ కమర్షియల్‌ సినిమాల్లో హీరో డల్‌ అయితే సినిమా డల్‌ అయిపోతుంది కదా. అది తప్పించి, సినిమా ఓవరాల్‌గా చూసుకుంటే మాస్‌ని మెప్పించే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అనే చెప్పాలి.

ఒక్క మాటలో చెప్పాలంటే 
'సుప్రీం' హీరో స్పీడు ఓకే

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
who will get lucky chance with balayya