Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటిఫణిబాబు

 

ది వరకటి రోజుల్లో అమ్మాయి కొత్త కాపురానికి వెళ్ళేటప్పుడు, సంసారానికి కావలిసిన వస్తువులన్నీ ఇచ్చి పంపేవారు. ఓ మంచం, పరుపూ, బీరువా,ఓపిక ఉన్నవాళ్ళు ఇంకా కొన్ని విలాస వస్తువులూ అమర్చేవారు.ఏంలేదూ, అమ్మాయి సుఖంగా కాపురం చేసికోవాలనే సదుద్దేశ్యంతో. ఆ ఆచారం కొద్దిరోజులు పోయిన తరువాత, అల్లుడిగారి దగ్గర ఏమేమి ఉన్నాయో చూసి, ఇంకా ఏమైనా కొనవలసినవి ఉంటే దానికి సరిపడే రొఖ్ఖం ఇచ్చేవారు.వీళ్ళకి కావలిసినవి కొనుక్కునేవారు.

కాపురానికి వచ్చేసరికే ఇక్కడ కొన్ని సరుకులు--గ్యాస్, కబ్బోర్డ్,డబల్ కాట్ లాటివి( ఎప్పటికైనా పెళ్ళి అవకపోతుందా, కాపురం పెట్టలేకపోతామా అనే ఉద్దేశ్యంతో) అమర్చుకొంటాడు. మామగారు ఇచ్చిన డబ్బుతో కొత్త దంపతులు కలిసి,ఇంకా కావలిసిన వస్తువులు కొనుక్కోవడం ఓసరదా.. రోజులు గడిచే కొద్దీ ఇలాటి సరదాలన్నీ కొండేక్కేశాయి.

ఇవేకాకుండా కొంతమంది అబ్బాయిలు వాళ్ళ ఇంట్లో ఉన్న పందిరిమంచమో, పడక్కుర్చీయో, అదీకాకపోతే మడత మంచమో ఏదో ఒకటి తన పాత జ్ఞాపకాలకి గుర్తుగా తెచ్చుకుంటాడు. అవన్నీ ముందరలో బాగానే ఉంటాయి, సంసారం పెరిగేకొద్దీ, ఇలాటివన్నీ పేరుకుపోయి ఇల్లంతా ఇరుకైపోయినట్లు కనిపిస్తుంది.అవన్నీ అమ్మడమో, ఎవరికో ఇచ్చేయడమో చేయవలసి వస్తుంది. ఇలా ఇచ్చేయవలసిన వస్తువుల్లో ముందరి విక్టిం కుర్చీయో,మడత మంచమో తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ భర్త వాళ్ళ ఇంటినుండి తెచ్చినవి.ఈ మడతమంచం కానీ, పడక్కుర్చీ కానీ ఇంట్లో ఎటువంటి స్పేస్సూ ఆక్రమించవు, ఏదో ఒక మూలని ముంగిలా కూర్చుంటాయి, అయినా పాపం,రెసెషన్ టైములో, వీటికే ముందరి " పింక్ స్లిప్" వస్తుంది. ఆ వస్తువులు కొన్ని సంవత్సరాలు చేసిన నిస్వార్ధ సేవ ఎవరికీ గుర్తు రాదు!!

ఇప్పుడొస్తున్న ప్లాస్టిక్ ఫర్నిచర్ కానీ, బీన్ బ్యాగ్ కానీ, సోఫాలు కానీ మడతమంచం, పడక్కుర్చీ ఇచ్చే సుఖం ఈయగలవా? ఇదివరకటి రోజుల్లో సంసారాలు పెద్దవి కాబట్టి, చిన్న పిల్లలికి వేసే ఉయ్యాలలు పదికాలాల పాటు ఇంట్లో శోభాయమానంగా ఉండేవి. మొత్తం మూడు, నాలుగు తరాల వాళ్ళకి ఉపయోగించేవి.ఆ ఉయ్యాలకి నవారో, లేక ప్లాస్టిక్ చక్కీయో ఉండేది. ఎవరైనా అదృష్టం బాగోక, ఆ ఉయ్యాలక్రింద పడుక్కున్నారా, తెల్లారేటప్పడికి వాళ్ళ బట్టలు కూడా తడిసిపోయేవి (ఉయ్యాలలో పడుక్కున్న చిన్నిపాపాయి ధర్మమా అని!). ఖాళీ ఉయ్యాలని ఊపనిచ్చేవారు కాదు పసిబిడ్డకి కడుపునొప్పి వస్తుందనేవారు!ఏ కారణం చేతైనా ఉయ్యాల ఖాళీ ఉన్నట్లైతే దాంట్లో ఓ ఎర్రచందనం బొమ్మ ఉంచేవారు! ఆ ఉయ్యాలకి గిలకలూ అవీ కట్టేవారు, అవి చూసి పసిబిడ్డ ఆడుకోవడానికి.

ఇప్పుడో ఓ ఫోల్డింగ్ ఉయ్యాల తెచ్చుకోవడం, అదికూడా ఓ రెండు మూడు సంవత్సరాల్లో రిటైర్మెంట్ ఇచ్చేయడం, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికీ, ఒకటి రెండు కంటే ఎక్కువ బిడ్డల్ని కనే ఓపికా లేదు, పెంచే సామర్ధ్యం లేదు.ఆ రోజుల్లో చిన్నపిల్లలు నడక నేర్చుకోవడానికి, చెక్కతో ఓ బండి తయారుచేసేవారు, దానికి చక్రాలుండేవి.ఇప్పుడైతే అవేవో వాకర్లొచ్చాయి.ఈ రోజుల్లో పిల్లో,పిల్లాడో తొక్కడానికి సైకిలొకటి కొంటారు, కొత్తమోజు తీరిపోగానే దానికి బేస్మెంట్ లో కారు పక్కనో, బైక్ పక్కనో చైన్ వేసి కట్టేయడమే. అది అక్కడే మట్టి పట్టేసి, కృంగి కృశించిపోవాల్సిందే.

మామూలుగా వయస్సు పై బడ్డ వాళ్ళను అంటే అమ్మా నాన్న, అత్తా,మామ లను పక్కకు పెట్టినట్లే, వారు సంవత్సరాలు తరబడి, అభిమానం పెంచుకున్న వస్తువులు కూడా కొద్ది రోజుల్లోనే అదృశ్యం అయిపోతున్నాయి. ఏమైనా అంటే ఇంట్లో స్పేస్ లేదుకదా అనే ఓ కుంటి సాకు చెప్తున్నారు.ఈ స్పేస్ అనేది మన దృష్టికోణాన్ని బట్టే కదా ఉండేదీ? సద్దుకుంటే సద్దుకోనూవచ్చు. కానీ, ఎందుకులెద్దూ అనే భావం. పోయేటప్పుడు ఏ వస్తువూ తమతో తీసికుపోలేరని అందరికీ తెలుసు, కనీసం వీళ్ళు బ్రతికి ఉన్నంతవరకైనా, వాళ్ళు అభిమానించే కొన్నైనా వస్తువులు ఉంచితే వీళ్ళకీ సంతోషంగా ఉంటుందని ఎందుకు గ్రహించరో తెలియదు.

ఏది ఏమైనా మనుష్యులకే విలువివ్వని ఈ రోజుల్లో, ప్ర్రాణం లేని వస్తువులకీ, సెంటిమెంట్లకీ విలువ ఇస్తారని ఆశించడం పొరబాటేమో!! అలాగని పరిస్థితులు మారవని కాదు.  జీవిత చక్రం ఎప్పుడూ గుండ్రంగా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటికో అప్పటికి తిరిగి పూర్వపు వాతావరణం వచ్చే తీరుతుందనే ఆశిద్దాం…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
chitrambhalare vichitram