Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కథాసమీక్షలు - సుంకర వి హనుమంతరావు.

 

కథ :  మళ్లీ ఆ మంచి రోజులు వస్తాయా నాన్నా
రచయిత    :  నూజిళ్ల శ్రీనివాస్
     సమీక్ష : సుంకర వి హనుమంతరావు
        గోతెలుగు 162వ సంచిక!


సామాన్యమైనకథ చదివిస్తుంది.

అందమైన కథ అలరిస్తుంది.

స్పందించి రాసిన కథ ఆలోచింప జేస్తుంది. అనుభవంతో రాసిన కథ అన్వయించుకునేలా చేస్తుంది.

పైన పేర్కొన్న అన్ని లక్షణాలను అంది పుచ్చుకున్న కథ.. నూజిళ్ల శ్రీనివాస్ కథ.. 

మళ్లీ ఆ మంచిరోజులొస్తాయా నాన్నా?..అవుతుంది.

కథా శీర్షికతోనే ప్రాణం పోసుకున్న ఈ కథ గడిచిపోయిన గతానికి ..తండ్రీ కొడుకుల..అనుబంధాలకు అద్దం పడుతుంది.బెడ్ టైం స్టోరీలా ప్రారంభించిన ఈ కథ గత స్మృతుల..గులాబీల గుభాళింపును గుండెలకు అద్దేస్తుంది.

ఓహ్.!.”తరవాణి.”.ఎప్పటి  మాట? ఆనాడు తెలుగు లోగిళ్లను చలివేంద్రంలా సేదతీర్చిన అన్నపూర్ణ..ప్రతిరూపం.ఈనాడు ఇన్నాళ్లకు..శ్రీనివాస్ కలం నుండి జాలువారిన ..అచ్చ తెలుగు మాట..ఆణిముత్యాల మూట. పెంకులాట..బిళ్లంగోడు..కాళ్లాగజ్జ కంకాళమ్మ..వైకుంఠపాళీ..నాటి ఆటల తోటలోపుష్పించిన పూల బాలల ప్రతిరూపాలైతే..జంతికలూ..చేగొడీలు..అరిసెలూ అప్పాలు..జీళ్లు..మరమరాలఉండలు..బెల్లం అచ్చులు.. నేటి తరానికి..చిటారు కొమ్మన మిఠాయి పొట్లాలే.కొన్ని వంటకాలు ఈ మధ్యే స్వగృహ ఫుడ్స్ వారి సౌజన్యంతో..ఆస్వాదించ గలుగుతున్నం. కానీ పీజా బర్గర్ల..తుఫాను పల్లె సీమల్ని కూడా కబళించేస్తోంది. 

గడిచి పోయిన బంగారు కాల దివ్య స్మృతుల్ని ..తన వంశాంకురానికి కథా రూపంలో అందించాలన్న తపనను తండ్రి..పాత్ర ద్వారా..రచయిత తీర్చి దిద్దిన పధ్దతి..కథ చదివిన ప్రతి తండ్రి హృదయాన్ని.. తట్టి లేపుతుంది.ప్లేగ్రౌండ్స లేని..కాంక్రీట్..గదుల్లో ..కమిలి పోతున్న తమ చిన్నారుల బాల్యం..తప్పకుండా ..అమ్మానాన్నల ఆలోచన్లని..తమ బాల్యంతో బేరీజు వేయిస్తుంది. నేటి భావి భారత పౌరులు కోల్పోతున్న .. బంగారు బాల్యం..వేలెత్తి చూపిస్తుంది.

నాటి హరికథలఅందాల్ని వీధి నాటకాల వింతల్ని..గాలిపటాల రెపరెపల్ని ..హృద్యమంగా చూపించి..జామతోటల్ని ..మామిడి రుచుల్ని ..నూతి చప్టాల స్నానాల్ని ..బొప్పాయి గొట్టాల..ఆటల్ని ..ఉమ్మడి కుటుంబాల సరదాల్ని..ఓ అందమైన చిత్రపటంలా చిత్రించిన శ్రీనివాస్ గారూ..ముందు మీకు ధన్యవాదాలు సమర్పించు..కుంటున్నాను.అర్ధవంతమైన కథల్నిఅందిస్తున్న గోతెలుగు వారిని అభినందిస్తున్నాను.   అర్ధవంతమైన కథలకు..ఆకర్షణీయమైన   చిత్రాలను అందిస్తున్న మాధవ్ గారిని ఎంత పొగిడినా..తక్కువేనని నా అభిప్రాయం.. ఓ అధ్యాపకుడు బోధించే పారాలు..ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో  ..పాఠాలు చెప్పిన నాడు తెలియదు .పాఠాలు నేర్చుకున్న డెంటు..భవిష్యత్తు చెపుతుంది.

రచనలకు కూడా అంతటి శక్తి వుంటుందన్న నమ్మకం మీ కథ చదివాక..నాకు కలిగింది.

ఒక్కసారిగా మరిచిపోయిన నా బాల్యం నా కనులముందు కదలాడింది.

హేట్సాఫ్ శ్రీనివాస్.మీ సాహిత్య యాత్ర కలకాలం యిలాగే కొనసాగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.

మళ్లీ ఆ మంచి రోజులు బాలలందరి బాల్య జీవితాలలొ తొంగి చూడాలని కోరుకుంటున్నాను.

ఆ రోజులు మళ్లీ తిరిగొస్తే..ఇంటింటికీ.. సింధు..దీపాలే.

 

ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు.....  http://www.gotelugu.com/issue162/4147/telugu-stories/mallee-aa-manchirojulostaayaa-naanna/
  

 
    

 

.

 

మరిన్ని శీర్షికలు
samanyudi asahanam