Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
hrithik roshan balam  paublisity in tollywood

ఈ సంచికలో >> సినిమా >>

వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఏదీ?

sonu sood says ..No protection in shooting spot

ఓ ప్రమాదం ప్రాణాల్ని తీసేయొచ్చు. ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాల్ని పణంగా పెట్టి డేంజరస్‌ గేమ్‌ ఆడుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఆ గేమ్‌లో పొరపాట్లు జరిగితే, అది పొరపాటు కాదు, నేరమని చెప్పక తప్పదు. 'మాస్తిగుడి' అనే కన్నడ సినిమా షూటింగ్‌ ఇద్దరు నటుల్ని బలిగొంది. సినిమా క్లయిమాక్స్‌ చిత్రీకరిస్తుండగా హెలికాప్టర్‌ నుంచి నీటిలోకి దూకిన ఇద్దరు ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. విలన్లుగా పేరు తెచ్చుకుంటున్న ఉదయ్‌, అనిల్‌ తమకు ఈత రాదని చెప్పినా ఫైట్‌ మాస్టర్‌, దర్శకుడు పట్టించుకోలేదు. వారి రక్షణకు తగిన ఏర్పాట్లు చేయలేదు.

ఒక బోటును సిద్ధంగా ఉంచినా అదీ నామమాత్రమే. అది కూడా సమయానికి పనిచేయకపోవడంతో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. హీరో విజయ్‌ మాత్రం తప్పించుకున్నాడు అదృష్టవశాత్తూ. ఈ ఘటనపై బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ తీవ్రంగా స్పందించాడు. విదేశాల్లో సినిమా షూటింగులకు పూర్తి రక్షణ ఉంటుంది. ఆ స్థాయిలో మన సినిమాల షూటింగుల్లో రక్షణ ఏర్పాట్లు ఉండవు. ఈ విషయాన్నే ప్రశ్నించాడు సోనూసూద్‌. జాకీచాన్‌తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్‌లో అంబులెన్స్‌, డాక్టర్‌ ఉండటమే కాకుండా యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించేటప్పుడు పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నారని చెప్పాడాయన. అయితే షూటింగుల్లో నిర్లక్ష్యమే ఎక్కువగా ప్రాణాల్ని బలిగొంటుంది. తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్నా, 'ఏమీ కాదులే' అని నటీనటులు అత్యుత్సాహం చూపడమూ ప్రమాదాలకు కారణం. ఏదేమైనా ఓ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాల్ని బలిగొంది. ఇకనైనా అలాంటి ఘటనలు జరగకుండా పరిశ్రమ పెద్దలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. 

మరిన్ని సినిమా కబుర్లు
movie industry in fear