Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అంతా గందరగోళం - భమిడిపాటిఫణిబాబు

antaa gandaragolam

చిన్నప్పుడే హాయిగా ఉండేది. ఏదో ఇంట్లో నాన్నగారో,అమ్మో, అమ్మమ్మ గారో చెప్పేది వినడం, ఆహా..ఓహో.. అనుకోడం. ఏ సమస్యలూ లేకుండా వెళ్ళిపోయేది.ఆ తరువాత స్కూల్లో చేర్పించిన తరువాత, ఆ మాస్టారు చెప్పిందేదో వినడం, పద్యాలూ, పాఠాలూ బట్టీ పట్టేయడం, ఓ గొడవొదిలిపోయేది. జీవితం అంతా అలాగే వెళ్ళిపోతే జివితం అని ఎందుకంటారూ. మా అమ్మమ్మగారనే వారులెండి.. ఎవరైనా స్నేహితులద్వారా ఏదైనా విని, అది మంచి వార్తైతే పరవాలేదనేవారు.కర్మం చాలక అదేదో దుర్వార్తలాటిదైనా, ఇంకోటేదైనా అయితే " ఎందుకురా దరిద్రపు వార్తలన్నీ మోసుకొస్తావూ.. పై దేవతలు తథాస్తూ అంటారనేవారు.అలా ఏదో మంచి వార్తైతేనే వినే అలవాటైపోయింది. బహుశా positive vibes ఉండాలని అలాగనేవారేమో. ఏదైతేనే "రాముడు మంచి బాలుడు" లాగ గడిచిపోయింది, బాల్యమంతా..

ఎప్పుడైనా, ఎవరికైనా ఒక particular వయస్సులో చుట్టూ ఉండే స్నేహితుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అలాగని వాళ్ళేమైనా ఊరుకుంటారా ఏదో విషయం మొదలెడతారు. వీడికేమో అంతగా అవగాహన ఉండదూ, అలాటప్పుడు  Ignorance is bliss అనుకుని వదిలేయడమే.. అయినా ఎన్నాళ్ళిలా సాగుతుందీ? పెళ్ళీ, పిల్లలూ సంసారం వచ్చిన తరువాత కూడా అలాగే ఉంటానంటే కుదరదుగా. పైగా భార్యకీ, పిల్లలకీ మనమేమో అదేదో role model లాగ ఉండాలిట, అదో గొడవా...అందువలన ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు ప్రపంచం లో జరిగే ప్రతీ విషయం, పూర్తిగా తెలిసికోలేకపోయినా, కనీసం తెలుసున్నట్టు pose పెట్టవలసొస్తుంది..ఏదో వీధిన పడకుండా లాగించేశాననుకోండి, బహుశా మా ఇంటావిడా, పిల్లలూ నన్ను సరీగ్గానే estimate చేసుంటారు. ఈయన్ని అల్లరి పెట్టడం ఎందుకులే అనైనా అనుకునుండొచ్చు. ఏది ఏమైతేనే నన్నెప్పుడూ ఇరుకులో పెట్టలేదు.వాళ్ళ పాట్లేవో వాళ్ళే పడ్డారు. ఈ చదువులూ చట్టుబండలూ నన్నడక్కుండా ఉంటే, వాళ్ళకి కావలిసినవన్నీ చేస్తానూ అని ఒప్పేసికున్నాను. పిల్లల దగ్గర సిగ్గెందుకూ? ఇంటావిడకైతే మొదటి ఆరు నెలల కాపరంలోనే తెలిసిపోయింది.నా ప్రాణానికీ హాయిగా ఉండేది.

తరువాత పిల్లల పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ.. వాటికేమీ మనం ఓ పెద్ద intellectual అవఖ్ఖర్లేదు. ఏదో సాదా సీదా తెలివితేటలు చాలు, ఆ మాత్రం ఉన్నాయిలెండి.ఇన్నాళ్ళూ గడిచిన జీవితంలో మనకున్న పుస్తకాలనండి, ప్రసార సాధనాలనండి, ఎంత చెప్పినా limited గానే ఉండేవి.వాటికి సాయం, మనం చిన్నప్పుడు నేర్చుకున్నవీ, అక్కడా ఇక్కడా విన్నవైతేనేమిటి, ప్రతీ విషయం మీదా, ప్రతీ వ్యక్తిమీదా ఓ అభిప్రాయం నాటుకుపోయుండేది.మధ్యలో ఇంకోరెవరైనా( మనకంటే ఎక్కువ చదువుకున్నవాడవొచ్చు, అనుభవం ఎక్కువున్నవాడవొచ్చు) చెప్పినా సరే ఒప్పుకోకపోవడం. ఇదొకటి మాత్రం అబ్బింది, " సిరి అబ్బదు కానీ, చీడ అబ్బుతుందిట" ..అలా ఉంది. పోనీ అవతలివాడేదో చెప్తున్నాడూ, ఓసారి వినేస్తే పోలా అనిమాత్రం అనుకోకపోవడం!

మొత్తానికి అన్ని ఆశ్రమాలూ దాటి వానప్రస్థాశ్రమంలోకి వచ్చేసరికి లేనిపోని గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ internet ఒకటొచ్చింది. దాని దారిన దాన్ని వదిలేస్తే పోయేదిగా, అబ్బే నేర్చేసుకోవాలీ, మనంకూడా moving with times లా ఉండాలీ అనుకోడం. ప్రతీదీ తెలిసికోవాలనే కోరికా, ఎందుకు చెప్పండి ఈ వయస్సులో ఈ వేషాలన్నీ. హాయిగా ఓ పేపరోటి కొనుక్కుని,  లైబ్రరీకి వెళ్ళి, ఏ పుస్తకమో (అదీ లైట్ గా ఉండేది) చదువుకుని, ఇంటావిడ చేసిన కందా బచ్చలి కూరా, గోంగూర పచ్చడీ, మావిడి ఒరుగులతో పప్పూ, తోటకూర పులుసూ తిని హాయిగా పడుక్కోకా?

"ప్రవచనాలు" వినడంతో  ప్రారంభం అవుతుంది అసలు గొడవంతా.. ఆయనెవరో చెప్పడంతో నెట్ లో కూడా ఓ నొక్కు నొక్కితే ప్రత్యక్షం అవుతున్నాయి. వీటికి సాయం ఈ టీవీ లోటీ.ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తారు. ఎవరిది వినాలో తెలియదు. ఎవరు చెప్పింది రైటో తెలియదు. ఇవన్నీ కాకుండా, మా ఇంటావిడేమో ఫలానా స్కాంద పురాణం లో ఇలా ఉందీ, శివ పురాణం లో ఇలా ఉందీ ఇంకో పురాణం లో ఇలా ఉందీ అంటూ ఒకే రోజులో నన్ను confuse చేసేయడం!ఏమిటో ఇదివరకే హాయిగా ఉండేది.. వీటికి సాయం టీవీల్లో వచ్చే జ్యోతిషాలు/ వారఫలాలూ—ఒకేరాశికి  సవాలక్ష ఫలితాలు. ఎవరిని నమ్మాలో తెలియదు.

అలాగే ఇన్నాళ్ళూ మనకి ఏదో వ్యక్తి మీద ఉన్న అభిప్రాయ విషయంలోనూ అలాగే. ఒక్కో పేపరు వాడు ఒక్కోలా.. ఒక్కో చానెల్ వాడు ఒక్కోలా.. ఏమిటో అంతా గందరగోళం..అందుకే అన్నాను ignorance is bliss... అని !!

మరిన్ని శీర్షికలు
navvunalugu yugaalu