Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
betaludu movie review

ఈ సంచికలో >> సినిమా >>

పూర్ణతో ఇంటర్వ్యూ

interview with purna
అవును... ఆ సినిమాలో ఓవ‌ర్ యాక్టింగ్ చేశాను! - - పూర్ణ‌
 
గ్లామ‌ర్ క్వీన్ అనే మాట త‌ర‌చూ వింటుంటాం. ఇలా పిలిపించుకోవాల‌ని చాలామంది క‌థానాయిక‌లు ఆరాట‌ప‌డుతుంటారు. వెండి తెర‌పై త‌మ అంద‌చందాల్ని వెద‌జ‌ల్లేది అందుకే. అయితే... 'హార‌ర్ క్వీన్' అనే బిరుదు గురించి విన్నారా??  కేర‌ళ‌లో పూర్ణ‌ని అలానే పిలుస్తుంటారు. ఎందుకంటే మ‌ల‌యాళంలో హార‌ర్ త‌ర‌హా సినిమాల్ని చాలా చేసింది పూర్ణ‌. తెలుగులోనూ అవును, అవును 2, రాజుగారి గ‌ది చిత్రాల్లో న‌టించింది. ఇవ‌న్నీ హార‌ర్ సినిమాలే. వీట‌న్నింటికి భిన్నంగా జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురాలో ఓ ప‌ద్ద‌తైన అమ్మాయి రాణి పాత్ర‌లో ఒదిగిపోయింది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. పూర్ణ అవ‌కాశాల‌కు మ‌ళ్లీ త‌లుపులు తెర‌చు కొన్నాయి. ఈ సంద‌ర్భంగా పూర్ణ‌తో జ‌రిపిన చిట్ చాట్ ఇది. 
 
* హాయ్ పూర్ణ‌..
- హాయ్‌...

* తెలుగులో గెస్ట్ హీరోయిన్‌లా అప్పుడ‌ప్పుడూ ద‌ర్శ‌న మిస్తున్నారు..
- (న‌వ్వుతూ)  గ‌త నాలుగేళ్ల‌లో దాదాపు 20 సినిమాలు చేశా. తెలుగులో తక్కువ‌గా క‌నిపించి ఉండొచ్చు. కానీ త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో బిజీగా ఉంటున్నా. అందుకే తెలుగు సినిమాల్లో న‌టించే తీరిక ఉండ‌డం లేదు.

* చేసిన సినిమాల్లో హార‌ర్ క‌థ‌లే ఎక్కువ‌. ఆ సినిమాలంటే ఎందుకంత ప్రేమ‌..?
- భ‌లేవారే. నాకు హార‌ర్ సినిమాలంటే చాలా భ‌యం. అలాంటి సినిమాలే చూసేదాన్ని కాదు. ఇప్ప‌టికీ అంతే. చీక‌టి, దెయ్యం, కుక్క‌లు వీటికి హ‌డలిపోతుంటా. ఒంట‌రిగా ప‌డుకోవ‌డం నావ‌ల్ల‌కాదు. అలాంటి నాకే ఎందుకు అలాంటి అవ‌కాశాలొస్తున్నాయో మ‌రి.

* హార‌ర్ సినిమాలే చూడ‌రా.. మ‌రి అవును 2, రాజుగారి గ‌ది?
- అవి కూడా అంతే. అవును అయితే టీవీలో వ‌చ్చే వ‌ర‌కూ చూళ్లేదు.

* కేర‌ళ‌లో మిమ్మ‌ల్ని హార‌ర్ క్వీన్ అంటార‌ట క‌దా?
- అవును. ఎందుకంటే ఆ త‌ర‌హా సినిమాల్లో ఎక్కువ న‌టించా. పోస్ట‌ర్ల‌లో నా గెట‌ప్‌, నా మాట‌లు ఇవ‌న్నీ హార‌ర్ క్విన్‌ని చేసేశాయి. నా సినిమాల్ని చూసిన మా ఇంట్లోవాళ్లు కూడా నువ్వు నిజంగానే దెయ్యంలా ఉన్నావ్ అంటుంటారు.

* గ్లామ‌ర్ పాత్ర‌లు దూరం అవుతున్నాయ‌ని ఫీల‌వుతున్నారా?
- అదేం లేదు. అయితే రెగ్యుల‌ర్ గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు నేను సూట్ అవ్వ‌ను. జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా సినిమాలో నేను చాలా హోమ్లీగా ఉంటా. ఆ త‌రహీఆ పాత్ర‌లే నాకు న‌ప్పుతాయి. ఒక‌వేళ ఓవ‌ర్ గ్లామ‌ర్‌గా క‌నిపించమంటే ఎలాంటి సినిమా అయినా నో చెబుతా.

* మ‌రి ఐటెమ్ పాట‌లు చేశారెందుకు?
- చేసింది ఒక్క సినిమానే క‌దా. పైగా అది మహేష్ బాబు సినిమా. హైద‌రాబాద్ లో నేను తొలిసారి అడుగుపెడుతున్న‌ప్పుడు చూసిన తొలి క‌టౌట్ మ‌హేష్ దే. ఆ క‌టౌట్ల‌లో మహేష్ ని చూడ‌గానే అత‌నితో ప్రేమ‌లో ప‌డిపోయా. అలాంటి క‌థానాయ‌కుడి ప‌క్క‌న న‌టించే అవ‌కాశం వ‌స్తే ఇక ఆలోచించేది ఏముంది?  పైగా ఆ పాట కూడా చాలా ప‌ద్ద‌తిగా ఉంటుంది.

* ఇక ముందూ ప్ర‌త్యేక గీతాల్లో ఆఫ‌ర్లు వ‌స్తే..?
- నాకు డాన్స్ అంటే ఇష్టం. అయితే నా డాన్స్‌.. కేవ‌లం ఐటెమ్ సాంగ్ కోసం కాదు. ఐటెమ్ పాట‌ల్ని నేనేం త‌ప్పు ప‌ట్ట‌డం లేదు. కానీ ఇప్పుడు ఐటెమ్ గీతం అంటే.. ఎలా ఉంటుందో మ‌న‌కు తెలిసిందే. చిట్టి పొట్టి దుస్తుల్లో హాట్ హాట్‌గా క‌నిపించాల్సివ‌స్తోంది. అలాంటి పాట‌ల‌కు నేను దూరం.

* శ్రీ‌నివాస‌రెడ్డి ప‌క్క‌న హీరోయిన్ అంటే.. మీ కెరీర్‌కి ఇబ్బంది అనుకోలేదా?
-  ఎందుకు భ‌యం?  ఇది క‌థ‌ని నమ్మి తీసిన సినిమా. ఆయ‌న‌దే కాదు, ప్ర‌తి ఒక్క‌రి పాత్ర ఈ క‌థ‌కు కీల‌కమే. క‌మెడియ‌న్లు ఆ త‌ర‌వాతి కాలంలో హీరోలుగా రాణించారు. విజ‌యాలు సాధించారు. ఆ జాబితాలో శ్రీ‌నివాస‌రెడ్డి పేరు కచ్చితంగా ఉంటుంది.

* మీరేమో పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్ట‌ర్ల కోసం ఎదురు చూస్తున్నారు, మ‌రి అలాంటి పాత్ర‌లు త‌ర‌చూ దొర‌క‌డం క‌ష్టం క‌దా?
- కావొచ్చు. కానీ అలాంటి పాత్ర‌ల కోసం ఎదురుచూడ‌డంలోనూ ఓ సంతృప్తి ఉంటుంది. ఓ రెగ్యుల‌ర్ పాత్ర అయినా స‌రే, న‌టీన‌టుల నుంచి కావ‌ల్సిన అవుట్ పుట్ రాబ‌ట్టుకోవొచ్చు. అదంతా ద‌ర్శ‌కుడి చేతుల్లో ఉంటుంది. ఓ సినిమాలో క‌థానాయిక స‌రిగా న‌టించ‌లేదంటే.. క‌చ్చితంగా అది దర్శ‌కుడి వైఫ‌ల్య‌మే. నువ్వ‌లా.. నేనిలా అనే ఓ సినిమా చేశా. ఆ సినిమా చూసి చాలామంది 'పూర్ణ ఓవ‌ర్ యాక్టింగ్ చేసింది' అన్నారు. అవును.. నిజంగానే ఆ సినిమాలో నేను ఓవ‌ర్ యాక్టింగ్ చేశా. కానీ.. అందులో నా త‌ప్పేం లేదు. ద‌ర్శ‌కుడు చెప్పాడు కాబట్టే అలా న‌టించా.

* తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం ఇలా సౌతిండియా అంతా తిరిగేస్తున్నారు. మీకు ఎక్క‌డ కంఫ‌ర్ట్‌గా ఉంది?
- అలా అడిగితే సమాధానం చెప్ప‌డం క‌ష్టం. నాకు అన్ని చోట్లా ఒకేలా ఉంది. నాకు కంఫ‌ర్ట్‌గా ఉంది కాబ‌ట్టే ఇన్ని భాష‌ల్లో న‌టిస్తున్నానేమో. లేదంటే సెట్లో ఒక్క రోజు కూడా ఉండ‌లేను.

* పెళ్లెప్పుడు చేసుకొంటారు?  ఆ ఆలోచ‌న‌లు ఏమైనా ఉన్నాయా?
- పెళ్లి జీవితంలో ఓ ముఖ్య‌మైన ఘ‌ట్టం. చేసుకోవాల్సిందే. జీవితాన్ని ప‌రిపూర్ణంగా అనుభ‌వించాలంటే పెళ్లి చేసుకోవ‌డం త‌ప్ప‌ని స‌రి. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. వాళ్లు చూసిన అబ్బాయినే చేసుకొంటా.

* డాన్స్ అంటే మీకు చాలా ఇష్టం క‌దా. ఆ నేప‌థ్యంలో ఓ సినిమా చేసే ఆలోచ‌న ఉందా?
- త‌ప్ప‌కుండా చేస్తా. కానీ.. త‌గ‌న క‌థ దొర‌కాలి. నా డాన్సింగ్ టాలెంట్ అంతా ఆ సినిమాలో చూపించాల‌నివుంది.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌.

-కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka