Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

నగరం చిత్రసమీక్ష

nagaram movie review

చిత్రం: నగరం 
తారాగణం: సందీప్‌ కిషన్‌, రెజినా, శ్రీ, చార్లీ, రాందాస్‌, మధుసూదన్‌ తదితరులు 
నిర్మాణం: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రొటన్షియల్‌ స్టూడియోస్‌ 
సినిమాటోగ్రఫీ: సెల్వకుమార్‌ 
సంగీతం: జావెద్‌ రియాజ్‌ 
దర్శకత్వం: లోకేష్‌ కనగరాజ్‌ 
నిర్మాత: అశ్వనికుమార్‌ సహదేవ్‌ 
విడుదల తేదీ: 10 మార్చి 2017

క్లుప్తంగా చెప్పాలంటే

ఉద్యోగం కోసం నగరానికి వస్తాడో కుర్రాడు. ప్రేమ కోసం పాట్లు పడుతుంటాడు నగరంలో ఇంకో కుర్రాడు. మరో వ్యక్తి తన కుటుంబ పోషణ కోసం నగరంలో జీవనం సాగిస్తుంటాడో సామాన్యుడైన ఓ వ్యక్తి. నగరంలో పెద్ద డాన్‌ అవుదామనుకునే వ్యక్తి మరొకరు. ఈ నలుగురికీ మధ్య నడిచే కథే ఈ 'నగరం'. నాలుగు కథలు, ఆ కథలన్నీ కలిస్తే ఇంకో కథ. కొన్ని ట్విస్ట్‌లతో ఆ నలుగురి జీవితాలూ తారుమారైపోతాయి. అవేంటి? వారెదుర్కొన్న కష్టాలేంటి? వాటినుంచి వాళ్ళెలా బయటపడ్డారు? అనేవి తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే

సందీప్‌ కిషన్‌, శ్రీ చాలా బాగా చేశారు. నటించారనడం కన్నా, తమ పాత్రల్లో జీవించేశారనడం సబబు. రాందాస్‌, చార్లీ కూడా అంతే. ఎవరూ ఓవర్‌ ది బోర్డ్‌ యాక్టింగ్‌ చేయలేదు. అందరూ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు. తెరపై సినిమా నడుస్తున్నంతసేపూ నటీనటులు కాకుండా, వారి పాత్రలే మనకు కనిపిస్తుంటాయి. అంత చక్కగా వారి వారి పాత్రల్లో అందరూ ఒదిగిపోయారు. రెజినా కూడా సహజమైన నటనతో ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులంతా సినిమా గమనంలో తమ వంతు పాత్ర పోషించారు.

ఇలాంటి సినిమాలు గతంలో కూడా వచ్చాయి. అయితే పకడ్బందీగా అన్ని కథల్నీ మిక్స్‌ చేయడం ఓ కళ. దర్శకుడు అందులో సక్సెస్‌ అయ్యాడు. స్క్రీన్‌ప్లే ఇలాంటి సినిమాలకు ప్రాణం. ఎక్కడా గ్రిప్‌ వదలకుండా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. మాటలు బాగున్నాయి. ఎడిటింగ్‌ చాలా బాగుంది. అక్కడక్కడా సినిమా నెమ్మదించినట్లు అనిపిస్తుందిగానీ, అన్ని కథల్ని మిక్స్‌ చేసే సందర్భంలో ఆ మాత్రం నెమ్మదించడం మామూలే. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ విభాగాలు బాగా సహకరించాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మూడ్‌కి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు.

ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, యాక్షన్‌ - ఇలాంటి మాటలు చెప్పుకునే సినిమా కాదిది. ఇదో ప్రత్యేకమైన సినిమా. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ దర్శకుడు కథ మీదనే దృష్టిపెట్టాడు. అందులో కథల్ని ఒకదానితో ఒకటి లింకప్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. సినిమాని మొదట్నుంచీ వేగంగా నడిపించడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో చాలా వరకు దర్శకుడు సఫలమయ్యాడు. నటీనటుల నుంచి మంచి సహకారం లభించడంతో దర్శకుడి పని ఇంకొంచెం తేలికైంది. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ బాగున్నాయి. క్లయిమాక్స్‌లో మాత్రం దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. అప్పటికే ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది గనుక ఆ చిన్న మైనస్‌నీ పట్టించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఓవరాల్‌గా సినిమా ఓ మంచి ప్రయత్నంగా ప్రశంసలు పొందేందుకు అర్హత కలిగి ఉన్నట్టే.

ఒక్క మాటలో చెప్పాలంటే

కొత్త కొత్తగా ఉందీ 'నగరం'

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka