Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

బాహుబలి2 చిత్రసమీక్ష

bahubali 2 movie review

చిత్రం: బాహుబలి ది కంక్లూజన్‌ 
తారాగణం: ప్రభాస్‌, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌, సుబ్బరాజు తదితరులు. 
సంగీతం: ఎం.ఎం.కీరవాణి 
సినిమాటోగ్రఫీ: సెంథిల్‌కుమార్‌ 
దర్శకత్వం: ఎస్‌.ఎస్‌. రాజమౌళి 
నిర్మాతలు: ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ 
నిర్మాణం: ఆర్కా మీడియా వర్క్స్‌ 
విడుదల తేదీ: 28 ఏప్రియల్‌ 2017 
క్లుప్తంగా చెప్పాలంటే 
'బాహుబలి ది బిగినింగ్‌' సినిమాలోనే కథేంటో చెప్పేశారు. దానికి కొనసాగింపు ఇది. ఇందులో తొలి భాగం మిగిల్చిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. కట్టప్ప, అమరేంద్ర బాహుబలిని ఎందుకు చంపాడు? శివగామి చేసిన నేరమేంటి? దేవసేనకు, భళ్ళాలదేవుడి నుంచి విముక్తి ఎలా? శివుడు - మహేంద్ర బాహుబలిగా ఎలా మారతాడు.? మాహిష్మతి రాజ్యాన్ని భళ్ళాలదేవుడి నుంచి మహేంద్ర బాహుబలి ఎలా దక్కించుకుంటాడు? అసలు రాజ్యాధికారాన్ని అమరేంద్ర బాహుబలి ఎలా దూరం చేసుకుంటాడు? ఇలాంటి ప్రశ్నలు రెండేళ్ళపాటు సగటు సినీ అభిమాని మెదళ్ళని తొలిచేశాయి. వాటన్నిటికీ సమాధానాలు ఏంటో తెరపై చూస్తేనే బాగుంటుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
ప్రభాస్‌ నటన గురించి ఏమని వర్ణించగలం? వర్ణించడానికి మాటలు చాలవు. అమరేద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి, శివుడు పాత్రల్లోకి ఒదిగిపోయాడు. నటించాడనటం కంటే జీవించాడనటం సబబు. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశమే ప్రత్యేకమన్నట్టు ప్రభాస్‌ నటన సాగింది. చేస్తున్నది ప్రపంచ స్థాయి సినిమా కావడంతో ఆ స్థాయి నటనను ఆశించేవారిని ప్రభాస్‌ ఏమాత్రం నిరాశపరచడు సరికదా, అహో అద్భుతం అనిపిస్తాడు. 

దేవసేన పాత్రలో అనుష్క చెలరేగిపోయింది. పోరాట సన్నివేశాల్లో సత్తా చాటింది. రాజసం ఉట్టిపడే పాత్రలో తనకు తానే సాటి అని ఇంకోసారి నిరూపించుకుంది. నటనలో అనుష్క ఆరితేరిందనిపిస్తుంది. శివగామి పాత్రలో మరోసారి రమ్యకృష్ణ తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె నటన ఈ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా చెప్పవచ్చు. కట్టప్పగా సత్యరాజ్‌ తన పాత్రకు ప్రాణం పోశాడు. భావోద్వేగాలు పండించే క్రమంలో సత్యరాజ్‌ నటన చూసేవారికి కంటతడి పెట్టించకమానదు. ఆయన సీనియారిటీ అంతా రంగరించేశారు ఈ సినిమా కోసం. నాజర్‌ బిజ్జలదేవ పాత్రలో జీవించాడనడం సబబు. 

ప్రత్యేకించి బళ్ళాలదేవ రాణా గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. రాజ్యాధికారం కోసం ఎత్తుగడలు వేసే క్రమంలో రాణా హావభావాలు ఆకట్టుకుంటాయి. పోరాట సన్నివేశాల్లో ఇంకా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటాడు రాణా. ఓ వైపు ప్రభాస్‌, ఇంకో వైపు రాణా చెలరేగిపోతోంటే అదొక కన్నుల పండువ అని చెప్పక తప్పదు. తమన్నా తొలి పార్ట్‌లో ఎక్కువ సేపు కన్పించిందిగానీ, ఈ సినిమాలో మాత్రం ఆమె చివర్లో వస్తుందంతే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 

కథ పరంగా రాజమౌళి తొలి పార్ట్‌లో కొన్ని సందేహాలు వదలడమే కాదు, అలా వదిలేందుకు కథని కొంతవరకే పరిమితం చేయాల్సి వచ్చింది. కంక్లూజన్‌కి వచ్చేసరికి కథ మొత్తం ఇందులోనే కనిపిస్తుంది. ఎక్కడా తొందరపడలేదు. కథనాన్ని పరుగులు పెట్టించేశాడు. తొలి అర్థభాగం అసలు సమయమే తెలియదు. తెరపై జరుగుతున్న సన్నివేశాల్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తాడు సగటు ప్రేక్షకుడు. సెకెండాఫ్‌లో మాత్రం కొంత వేగం తగ్గినట్లనిపిస్తుంది. అయితే గ్రాండియర్‌ లుక్‌తో సన్నివేశాల్ని ఎంజాయ్‌ చేసేవారికి ఆ 'స్లో' తెలియదు. డైలాగ్స్‌ అదరహో అనే రేంజ్‌లో ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ సినిమాకి అదనపు బలం. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికి చాలా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అద్భుతం. సంకేతిక విభాగంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ది ప్రత్యేక స్థానం.

కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పని తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిర్మాణపు విలువల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, అంతర్జాతీయ ప్రమాణాలతో అన్న మాట సరిగ్గా సరిపోతుంది. 

ఫస్టాఫ్‌ పూర్తయ్యేసరికి, ప్రేక్షకులు ఇంకా సంభ్రమాశ్చర్యాల్లోనే వుంటారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అయితే రాజమౌళి సినిమాల్లో సహజంగానే వుండే అద్భుతమైన ట్విస్ట్‌ ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. తల పక్కకి తిప్పడం కాదు కదా, కను రెప్పలు కూడా వేయలేనంతగా ఫస్ట్‌ హాఫ్‌లో ఆడియన్స్‌ లీనమైపోతారు. సెకెండాఫ్‌కి వచ్చేసరికి సినిమా నెమ్మదించినట్లు అనిపించడం చిన్న లోటు. కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడనేది ప్రిడిక్టబుల్‌గా ఉండటం కూడా చిన్న మైనస్‌గానే చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే తొలి భాగంలో కన్పించిన సుదీప్‌ పాత్రకి రెండో పార్ట్‌లో స్థానం లేదు. భళ్ళాలదేవకి కొడుకు ఉన్నట్లు తొలి పార్ట్‌లో చూపించిన రాజమౌళి, రెండో పార్ట్‌లో అతని భార్య ఎవరన్నదీ చూపకపోవడం లోటుగా అనిపిస్తుంది. ఇంత పెద్ద సినిమాలో అవి అదనపు అంశాలైపోతాయని రాజమౌళి భావించి ఉండొచ్చు. అవన్నీ మినహాయిస్తే, 'బాహుబలి ది కంక్లూజన్‌' ఓ వెండితెర అద్భుతం. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
'బాహుబలి ది కంక్లూజన్‌' - ప్రపంచ స్థాయి సినిమా 
అంకెల్లో చెప్పాలంటే: 4/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka