చిత్రం: ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్
తారాగణం: సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మానస హిమవర్ష, మనాలీ రాథోడ్, కృష్ణ భగవాన్ తదితరులు.
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్లి
దర్శకత్వం: వంశీ
నిర్మాత: మధుర శ్రీధర్
నిర్మాణం: మధుర ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 02 జూన్ 2017
క్లుప్తంగా చెప్పాలంటే
ఓ పల్లెటూల్లో బాగా పాపులర్ ఫిగర్ లేడీస్ టైలర్ సుందరం తనయుడు గోపాలం, తన తండ్రి వృత్తినే కొనసాగిస్తుంటాడు. సొంతంగా బట్టల కొట్టు పెట్టి, ఫ్యాషన్ డిజైనర్ అవతారమెత్తాలన్నది గోపాలం కోరిక. కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే ఉండే మన్మథరేఖ తన అరచేతిలో ఉందని తెలుసుకునన గోపాలం, దాని సహాయంతో తన కలల్ని నెరవేర్చుకోవాలని తహతహలాడుతాడు. ఈ క్రమంలోనే ఆ ఊళ్ళోని ముగ్గురమ్మాయిల్ని వలలో వేసుకుంటాడు. ఆ తర్వాత అతని జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. అదేంటి? అన్నది తెరపైనే చూడాలి.
మొత్తంగా చెప్పాలంటే
ఫ్యాషన్ డిజైనర్ అవతారమెత్తాలనుకుని, పల్లెటూళ్ళోనే టైలర్‌గా పాట్లు పడే గోపాలం పాత్రలో సుమంత్ అశ్విన్ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రలు అతనికి కొట్టిన పిండి. నటుడిగా ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. వంశీ సినిమా కావడంతో సుమంత్ తన తన నటనకి ఇంకాస్త పదును పెట్టుకునే అవకాశం దొరికింది. హీరోయిన్లలో అనీషా ఆంబ్రోస్ అందంగా కన్పించింది. మిగతా ముగ్గురూ తక్కువేం కాదు. సినిమాకి అవసరమైనంత గ్లామర్ కన్పించారు. వంశీ హీరోయిన్లు ఎలా ఉంటారో, అలా ఒదిగిపోవడానికి హీరోయిన్లు ప్రయత్నించారు. నటన పరంగా అనీషా ఆంబ్రోస్‌కి మార్కులు బాగా పడతాయి. మిగతా హీరోయిన్లూ ఓకే. కృష్ణభగవాన్ కామెడీ పంచ్‌లతో కామెడీ అదిరిపోయింది. వంశీ ట్రేడ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ బాగా పండింది.
మన్మథరేఖ అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకుని కథని బాగానే రాసుకున్నారు. కథనం విషయంలో వంశీ తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించారు. సినిమా మొత్తమ్మీద హైలైట్ పాయింట్ సినిమాటోగ్రఫీ. గోదారి అందాలు వంశీ సినిమాల్లో ఇంకా అందంగా కన్పిస్తాయి. సినిమాటోగ్రాఫర్ వంశీ టేస్ట్‌కి తగ్గట్టు గోదావరి అందాల్ని రెట్టింపు చేసి చూపించాడు. ఆ లొకేషన్ల కోసం సినిమా మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళుంటారనడం అతిశయోక్తి కాదు. ఎడిటింగ్ అక్కడక్కడా అవసరం అన్పిస్తుంది. వంశీ సినిమాల్లో ఛమక్కులు మామూలే. అవి ఈ సినిమాలోనూ కన్పిస్తాయి. డైలాగుల్లోని ఆ ఛమక్కులు వంశీకే సొంతం. పాటలు బాగున్నాయి, వాటిని చిత్రీకరించిన విధానం ఇంకా బాగుంది. ఆర్ట్, కాస్ట్యూమ్స్ వంశీ ముద్రని స్పష్టంగా చూపించాయి. నిర్మాణపు విలువల విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
ఫస్టాఫ్ సరదా సరదాగా సాగిపోతుంటుంది. అక్కడక్కడా చిన్న చిన్న ట్విస్టులు, అందమైన లొకేషన్లు, హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో ఎక్కడా సినిమా బోరింగ్ అన్పించదు. సెకెండాఫ్‌లోనూ సినిమా అదే తీరున నడుస్తుంటుంది. ఓవరాల్‌గా వంశీ మార్క్ సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమానీ బాగా ఎంజాయ్ చేయగలరు. అయితే వంశీ సినిమాల్లో ఇదివరకు కన్పించిన స్పార్క్ కొంత మేర తగ్గిందనే భావన కలుగుతుంది. టైటిల్‌లో ఫ్యాషన్ డిజైనర్‌ని ఇంకాస్త ట్రెండీగా చూపించే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదన్పిస్తుంది. మొత్తంగా చూసినప్పుడు ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ రావడం ఖాయం.
ఒక్క మాటలో చెప్పాలంటే
తండ్రిని మించిన తనయుడు కాదు గానీ....
అంకెల్లో చెప్పాలంటే: 3.25/5
|