మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతోన్న చిత్రానికి 'మహావీర' అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. అందుకే ఈ సినిమాకి యూనివర్సల్ అప్పీల్ ఉండేలా టైటిల్ ఉండాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఆ కోణంలోనే ఈ సినిమాకి 'మహావీర' అనే టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నారట. అభిమానుల నుండి కూడా ఈ టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదట్లో 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' టైటిల్‌తోనే ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారనీ సమాచారమ్. 'బాహుబలి' చిత్రానికి తెలుగు సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా లభించిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఇండియన్ సినిమా సత్తాని చాటింది ఆ సినిమా. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సినిమాకీ అదే స్థాయిలో కీర్తి దక్కాలని ఆశిస్తున్నారట. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐశ్వర్యారాయ్‌తో చిత్ర యూనిట్ ఇప్పటికే సంప్రదింపులు మెదలుపెట్టినట్లుగా సమాచారమ్. ఆగష్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
|