Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

గౌతమ్‌ నందా చిత్ర సమీక్ష

gautam nanda movie review

చిత్రం: గౌతమ్‌ నందా 
తారాగణం: గోపీచంద్‌, హన్సిక, కేథరీన్‌, తనికెళ్ల భరణి, ముఖేష్‌ రుషి తదితరులు 
సంగీతం: తమన్‌ 
సినిమాటోగ్రఫీ: సౌందర్‌రాజన్‌ 
దర్శకత్వం: సంపత్‌ నంది 
నిర్మాతలు: జె. భగవాన్‌, పుల్లారావు 
విడుదల తేదీ: 28 జులై 2017 


క్లుప్తంగా చెప్పాలంటే


అపర కుబేరుడైన గౌతమ్‌ (గోపీచంద్‌)కి డబ్బు తప్ప ఇంకేమీ తెలియదు. కావాల్సినంత డబ్బు, దాంతో లభించే హై క్లాస్‌ లైఫ్‌. హై క్లాస్‌ అంటే అలా ఇలా కాదు, ఓ రేంజ్‌లో అన్నమాట. కానీ గౌతమ్‌ అనూహ్యంగా తన గురించి తాను తెలుసుకోవాలనుకుంటాడు. దానికి ఓ సంఘటన కారణమవుతుంది. ఆస్తుల్ని సుఖ సంతోషాల్నీ వదిలేసి 'నేనేంటి?' అనుకుంటే కొత్త ప్రయాణం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తనలాగే ఉన్న ఇంకో వ్యక్తి తారసపడ్తాడు గౌతమ్‌కి. అతని స్థానంలోకి వెళ్ళదలచుకుంటాడు గౌతమ్‌. ఆ తర్వాత ఏమయ్యింది? అపర కుబేరుడు ఓ సామాన్యుడిలా మారి ఏం తెలుసుకున్నాడు? వంటి ప్రశ్నలకు తెరపైనే సమాధానం దొరుకుతుంది. 


మొత్తంగా చెప్పాలంటే 


పక్కా మాస్‌ క్యారెక్టర్స్‌కి ఎలాగైతే సూటయిపోతాడు, అస్ట్రా మోడ్రన్‌ గెటప్స్‌కి కూడా గోపీచంద్‌ అలాగే సూటవుతాడు. నటన పరంగా వంకలు పెట్టడానికేముంది? ఈ సినిమాలో కొత్తదనమేంటంటే ఇప్పటిదాకా ఎప్పుడూ కన్పించనంత స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకుంటాడు. అలాగే మాస్‌ యాక్షన్‌ సన్నివేశాల్లోనూ చెలరేగిపోయాడు. నటన పరంగా, లుక్‌ పరంగా, యాక్షన్‌ పరంగా గోపీచంద్‌కి నూటికి నూరు మార్కులూ ఇచ్చేయొచ్చు. 

హీరోయిన్లు ఇద్దరూ గ్లామర్‌కే పరిమితమయ్యారు. కేథరీన్‌, హన్సిక ఇద్దరూ అందంలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. కేథరీన్‌ మోడ్రన్‌గా కనిపిస్తే, హన్సిక సంప్రదాయ బద్ధంగా కన్పించింది. ఇద్దరూ పాటల్లో హాట్‌ అప్పీల్‌తో రెచ్చిపోయారనడం అతిశయోక్తి కాదు. నటన పరంగా ఇద్దరూ ఓకే. బిత్తిరి సత్తి బాగా నవ్వించాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 

ఈ తరహా పాత్రలు తెలుగు తెరకు కొత్త కాదు. పాత కథనే కొత్తగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. కథనం పరంగా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మరింత బాగుండేది. మాటలు బాగున్నాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అన్పిస్తుంది. సంగీతం విషయానికొస్తే పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటాయి. పాటలు వినడానికే కాదు, తెరపై చూడ్డానికీ అందంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మెయిన్‌ ఎస్సెట్‌. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీపడలేదు. ఆ విషయం ప్రతి సన్నివేశంలోనూ కన్పిస్తుంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి హెల్ప్‌ అయ్యాయి. 

సంపత్‌ నంది సినిమాలంటే స్టైలిష్‌ కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్స్‌. హీరోని హ్యాండ్సమ్‌గా చూపించడమే కాదు, హీరోయిన్లను అందంగా చూపించడంలోనూ సంపత్‌ నందిది ప్రత్యేకమైన శైలి. యాక్షన్‌ ఘట్టాల విషయంలో ఇంకా స్పెషల్‌గా దృష్టిపెడతాడు సంపత్‌ నంది. అది ఈ సినిమాలోనూ వర్కవుట్‌ అయ్యింది. గోపీచంద్‌ సినిమాల్లో ఇదొక భిన్నమైన సినిమా అనలేంగానీ కమర్షియల్‌గా అతనికి మంచి విజయాన్ని చిత్రం అవ్వొచ్చు. లాజిక్‌లు మిస్‌ అవడం ఒకింత మైనస్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా గోపీచంద్‌ మాస్‌ ఇమేజ్‌కి తగ్గ మాస్‌ మూవీ అని మాత్రం చెప్పొచ్చు. ఫస్టాఫ్‌, ప్రీ క్లయిమాక్స్‌, క్లయిమాక్స్‌ ఈ సినిమాకి బలాలు. సెకెండాఫ్‌లో అక్కడక్కడా హిక్కప్స్‌ కనిపిస్తాయి. ఓవరాల్‌గా గోపీచంద్‌ నుంచి ఓ మోస్తరు మాస్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చిందనే చెప్పుకోవాలి. సినిమాపై క్రియేట్‌ అయిన హైప్‌, మాస్‌ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేసే అంశాలు వెరసి సినిమాకి మంచి విజయాన్ని చేకూర్చవచ్చు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 

'గౌతమ్‌ నందా' జస్ట్‌ ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ 


అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
nag caliculations for akhil