Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

Aditya Hrudayam

సినిమాల్లోకి కొత్తగా రావాలనుకునే వాళ్ల కోసం... (పార్ట్ - 3)
జాతీయస్థాయిలో పేరు పొందిన మన తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు 'నిశ్శబ్ద్' చిత్రం ద్వారా జియాఖాన్ అనే నటిని వెండితెరకి పరిచయం చేశారు. ఫిల్మ్ ఫేర్ ఉత్తమనటి అవార్డు తీసుకుని, ఇంకో రెండు మూడు చిత్రాలు చేసి, వాటిల్లో ఒకటి కమర్షియల్ గా హిట్ అయ్యాక అనూహ్య కారణాల వల్ల ఆమె పరమపదించారు. ఇంకో కొత్త నటిని రాబోయే చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు అదే రామ్ గోపాల్ వర్మ. ఇంకా అది విడుదల కాకుండానే ఆమెకు నాలుగు పెద్ద సంస్థల, అగ్రహీరోల చిత్రాల్లో హీరోయిన్ గా ఆల్రెడీ అవకాశాలొచ్చేశాయి. కొత్తవాళ్ళకి స్ట్రగుల్ ఎక్కువ, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్లకి స్ట్రగుల్ ఉండదు అని చాలామంది అనుకునే అభిప్రాయం తప్పనడానికి పై ఉదాహరణ.

కొత్తవాళ్ళకి, పాతవాళ్ళకి అన్న తేడా లేకుండా స్ట్రెస్, స్ట్రగుల్ అందరికీ 'డెస్టినీ'యే రుచిచూపించే ఏకైక వృత్తి చిత్రపరిశ్రమ.

కొంతమంది గ్రాఫ్ చూస్తే ఏమీ కష్టపడకుండా మంచి పొజీషన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. కొంతమందిని చూస్తే ఎంత కష్టపడినా ఇంకా అనుకున్నంత పైకి రాలేదేంటో అనిపిస్తుంది.

మూడు, నాలుగు మార్గాలున్న ప్రతిసారీ మనం ఏ దారి ఎంచుకుంటామో గమ్యం చేరడానికి, దాన్నే 'డెస్టినీ' అనవచ్చు.

నిర్ణయాధికారం మరోపేరు.

ఎవరి కర్మకు వారే కర్త. వారు చేసిందే క్రియ.

కష్టపడటం, తెలివితేటలుండటం, ప్రతిభ ఉండటం, అదృష్టం ఉండటం, పనిమీద మమకారం ఉండటం - వీటితో పాటు అనుకున్న పని అవ్వకపోతే డిప్రెస్ అవ్వకుండా డిటాచ్ అవ్వగలగడం కూడా సమానంగా ముఖ్యమైన విషయం.

కాలేజీ లెక్చరర్ గా కుదురైన జీవితం, కుటుంబ జీవితం త్యాగం చేసి సినిమా పరిశ్రమలోకి రిస్క్ తీసుకుని ప్రవేశించి స్టార్స్ గా సెటిలైన వాళ్ళలో దర్శకుడు సుకుమార్, నటుల్లో డా: బ్రహ్మానందం గారు, ఎమ్మెస్ నారాయణ గారు ఉన్నారు. కానీ, వీళ్లలా కాలేకపోయిన వాళ్లు, మనకి తెలియని వాళ్లు చాలామందే ఉండి ఉంటారు.

చదవడం వచ్చిన ప్రతివారూ మంచి కవో, కవయిత్రో కాలేనట్టే, సినిమాని చూసి విశ్లేషించగలిగిన ప్రతి ప్రేక్షకుడూ మంచి రచయితో,దర్శకుడో , నటుడో కాలేరు. అలాగే, డబ్బు పెట్టగలిగినవాళ్ళంతా మంచి నిర్మాతలూ కారు.

కొత్తగా పరిశ్రమలోకి రావాలనుకుంటే, మనకి బాగా బ్యాకింగ్ ఇచ్చే పరిశ్రమలో వ్యక్తులు లేనప్పుడు, ఖచ్చితంగా పాటించవలసిన సూత్రాలు కొన్ని ఉన్నాయి.

ఎ) ఎప్రోచ్ : మనం ఆర్టిస్ట్ గానో, టెక్నీషియన్ గానో, నిర్మాతగానో, నిర్మాణ కార్యకర్తగానో పరిశ్రమలో చేరాలంటే, ఎవర్ని కలవాలి, ఎప్పుడు కలవాలి... ఈ మూడు విషయాలు ముందే రీసెర్చ్ చెయ్యాలి. సినిమా విడుదలయ్యాక కలిస్తే, నెక్స్ట్ ది మొదలయ్యే వరకూ పనేమీ ఉండదు కాబట్టి తర్వాత రమ్మంటారు. సినిమా మొదలయ్యాక కలిస్తే, ఆల్రెడీ అందరూ ఫిక్స్ అయిపోయారు తర్వాత సినిమాకి కలవమంటారు. అదీ నిజమే. కాబట్టి నాకు తెలిసినంతవరకూ 80% రైట్ టైం ఒక సినిమా ముహూర్తం అయ్యాక, షూటింగ్ మొదలయ్యే లోపు. దాదాపుగా అందరూ చెప్తారు ముహూర్తం రోజు ప్రెస్ మీట్ లో షూటింగ్ ఎప్పట్నుంచి మొదలుపెట్టేది. ఆ గ్యాప్ లోనే అందరు ఆర్టిస్టుల సెలెక్షన్, అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షన్ మేనేజర్ల నియామకాలు అన్నీ జరుగుతాయి. మిగిలిన టైం లో అవకాశాలు ఎప్పుడోగానీ రావు. ఎవరన్నా మధ్యలో మానేస్తేనో అలాగ. లేదా స్ట్రాంగ్ రికమండేషన్ ఉంటే ఎప్పుడన్నా చేరవచ్చు.

బి) టైమింగ్ : చాలామందికి ఆఫీసులున్నాయి. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లిపోకూడదు. మార్నింగ్ ఫ్రెష్ అవర్స్ లో ఏ దర్శకుడైనా, రచయితైనా క్రియేటివ్ గా ఆలోచించడానికి ఇష్టపడతారు. మనం ఉదయం ఎనిమిదింటినుంచి వెళ్లి అక్కడ కూర్చుంటే, వాళ్లకి ఇబ్బందిగా ఉంటుంది. మనని వెయిట్ చేయించిన మొహమాటమూ ఉంటుంది. ఫలితంగా చిరాకొస్తుంది. మధ్యాహ్నం 1 టు 2 లంచ్ బ్రేక్. ఆ కాసేపే ఎవరికన్నా పర్సనల్ టైం. కాసేపు రిలాక్స్ అవ్వడానికి, అన్నం తినడానికి, మిస్డ్ కాల్స్ అటెండ్ అవ్వడానికి, నెట్ లో మెయిల్స్ చూసుకోవడానికి. అప్పుడెల్తే వేస్ట్. కాబట్టి 12.30 టు 1 మధ్య కలవడం 75% ఫెయిర్ చాన్సెస్ ఉన్న టైం. ఏ వర్క్ అయినా 12.30కి స్లో అవుతుంది. ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తే బావుండును అన్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడెళితే, వెళ్ళిన వాడి మీద అభిమానం కలుగుతుంది.

సి) కాన్ఫిడెన్స్ : కలవగానే భజన చేసినట్టు ఎదుటివారిని పొగిడేస్తారు కొంతమంది. అది ఆనందం కలిగించకపోగా చిరాగ్గా ఉంటుంది. కలిసిన వెంటనే, మనం వచ్చిన పని చెప్పాలి. మనని మనం కాన్ఫిడెంట్ గా ప్రొజెక్ట్ చేసుకోవాలి. వీణ్ణి మనతో కలుపుకుంటే మనకి లాభం అని ఎదుటివాడు అనుకునేలా ఉండాలి. ఆ ముక్క మనం అనకూడదు. చివర్లో మనం ఎవర్ని కలిశామో, వారిమీద మనకెందుకు మంచి అభిప్రాయం ఉందో క్లుప్తంగా చెప్పాలి. మన పొగడ్తలు కూడా గాసిప్ న్యూస్ ల ఆధారంగా కాకుండా పబ్లిక్ లోకొచ్చిన సినిమాల ఆధారంగా మాత్రమే ఉండాలి.

ఇవన్నీ కరెక్ట్ గా ఇలాగే జరగొచ్చు. జరగకపోవచ్చు. మానవ ప్రయత్నం మనది. ఆ తర్వాత కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అన్నీ పైవాడివే (భగవంతుడివే).

ఆయనకున్న సహస్రకోటి నామాల్లో ఒక్కో సినిమా ఒక్కో పేరుతో తీస్తాడా దేవుడు. ఒక్కోసారి దాసరి నారాయణరావు అని, ఒక్కోసారి కె. రాఘవేంద్రరావు అని, కొన్నిసార్లు కె. విశ్వనాథ్ అని, రాజమౌళి అని, వినాయక్ అని, ఇలా... పేర్లు మారతాయి.

నా దృష్టిలో 'వేదాంతం' కూడా 'అదృష్టం' అంత అవసరం మనిషికి. ఒక పనిమీద మమకారంతో జీవితమంతా 'అంతం' చేసేసుకోకుండా డిటాచ్డ్ గా ఉండాలని బోధించే 'వేదా'న్నే వేదాంతం అంటాన్నేను. ఇది సినిమా పరిశ్రమలో పనికి చాలా అవసరం. వెంటవెంటనే ఇంకో సినిమా చెయ్యలేం ఇలా లేకపోతే. డెస్టినీని నమ్ముకుంటే డిప్రెషన్ కి దూరంగా ఉండవచ్చు. హార్డ్ వర్క్ ని నమ్ముకుంటే పనిలో ఎక్స్ ప్రెషన్ మెరుగుపర్చుకోవచ్చు. ఈ రెండూ మంగళసూత్రాల్లాగ మెడలో కాకుండా మెదడులో తగిలించుకుంటే మగాడిలా బ్రతకొచ్చు. లాటరీ కొనడం మానవ ప్రయత్నం. ఫ్రైజు తగలడం 'డెస్టినీ'. సినిమాల్లో స్టార్ డమ్ కూడా అంతే!





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
no height limitations for cine poets