చిత్రం: పైసావసూల్
తారాగణం: బాలకృష్ణ, శ్రియ, ముస్కాన్ సేథి, కైరా దత్, విక్రమ్‌జీత్, కబీర్ బేడీ, అలోక్ జైన్, పృద్వీరాజ్, అలీ తదితరులు
సంగీతం: అనూప్ రుబెన్స్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్
నిర్మాణం: భవ్య క్రియేషన్స్
విడుదల తేదీ: 01 సెప్టెంబర్ 2017
క్లుప్తంగా చెప్పాలంటే
ఎవ్వరికీ భయపడని నైజం తేడాసింగ్ (బాలకృష్ణ)ది. తీహార్ జైలు నుంచి బయటకొస్తాడు. ఇంకో పక్క బాబ్ మార్లే (విక్రమ్‌జీత్) అనే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ని పట్టుకోవడానికి భారతదేశానికి చెందిన పోలీసు అధికారులు ప్రయత్నిస్తుంటారు. పోర్చుగల్‌లో ఉండి, భారతదేశంలో విధ్వంసాలు సృష్టిస్తుంటాడు బాబ్ మార్లే. ఇంకో గ్యాంగ్‌స్టర్‌తో బాబ్ మార్లేకి చెక్ పెట్టడమే కరెక్ట్ అన్న వ్యూహానికి వచ్చిన భారత పోలీసులు, తేడాసింగ్ని ఉపయోగించుకుని పని పూర్తి చేద్దామనుకుంటారు. తేడాసింగ్, మాఫియా డాన్ బాబ్ హార్లేని పట్టుకున్నాడా? ఇంతకీ తేడాసింగ్ ఎవరు? అతని కథేంటి? అన్నవి తెరపై చూడాల్సిందే.
మొత్తంగా చెప్పాలంటే
స్టంపర్‌లో చూసేశాం, ట్రైలర్లో తెలుసుకున్నాం తేడాసింగ్‌గా బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ ఎలా ఉన్నాయో. వెండితెరపై ఫుల్ సినిమాలో తేడాసింగ్‌గా బాలకృష్ణ ఏ స్థాయిలో రెచ్చిపోయి ఉంటాడు? ఆ అంచనాలకి ఆకాశమే హద్దు. అయినా ఆ అంచనాల్ని అందేసుకున్నాడు తేడాసింగ్‌గా బాలకృష్ణ. నిజంగానే బాలకృష్ణ కెరీర్లో ఇదో కొత్త తరహా పాత్ర. ఆ పాత్రని పూరి డిజైన్ చేసిన తీరు అద్భుతం. బాలకృష్ణ లాంటి సీనియర్‌తో అలవోకగా, ఓ యంగ్ హీరోతో చేయించినట్లు చేయించేశాడు దర్శకుడు. బాలకృష్ణ సైతం తన వయసుని పక్కన పెట్టి, కంప్లీట్ ఎనర్జీతో తెరపై చెలరేగిపోయారు.
హీరోయిన్లలో శ్రియ పాత్రకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత లభించింది. నటన పరంగా ఆమెకు మాత్రమే అవకాశం లభించింది. మిగతా హీరోయిన్లలో ముస్కాన్ సేత్, గ్లామర్‌కే పరిమితం కాగా, కైరా దత్ ఐటమ్ సాంగ్‌లో అందాల విందు చేసింది. మిగతా పాత్రధారుల్లో కబీర్ బేడి పాత్రకి ఓ మోస్తరు ప్రాధాన్యత దక్కింది. అతని నటన మెప్పిస్తుంది. మిగిలిన పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.
కథ కొత్తదేమీ కాదుగానీ, కథనం పరంగా పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్గా మలచేందుకు ప్రయత్నించాడు. డైలాగ్స్ బాగున్నాయి. పూరి సినిమాల్లో హీరోకి ఉండే ఓ డిఫరెంట్ యాటిట్యూడ్‌ని బాలయ్యలో చూపించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఎడిటింగ్ ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. బాలకృష్ణ పాడిన పాట 'మామా ఎక్ పెగ్ లా..' పాట బాగా అలరిస్తుంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా హెల్ప్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కొన్ని సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ అయితే సింప్లీ సూపర్బ్. బాలయ్యను ఎలా అభిమానులు చూద్దామనుకుంటారు? అన్న ఆలోచనతోపాటుగా, తన హీరో ఎలా ఉంటే అభిమానులకు నచ్చుతుంది? అని దర్శకుడు పూరి బాగా ఆలోచించినట్టున్నాడు. బాలకృష్ణతో వచ్చిన ఛాన్స్‌ని సద్వినియోగం చేసుకునే క్రమంలో పూర్తిగా హీరో మీదనే దర్శకుడు ఫోకస్ పెట్టాడు. కొన్ని డల్ సీన్స్‌లోనూ బాలయ్య ఎనర్జీతో ఆ డల్‌నెస్‌ని కవర్ చేసేశారు. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, గ్లామర్ ఇలా అన్నిటినీ మిక్స్ చేయడంతో ఫస్టాఫ్, సెకెండాఫ్ దాదాపు ఒకే పేస్‌లో వెళ్ళిపోయాయి. తెరపై బాలకృష్ణని అలా కొత్తగా చూస్తోంటే అభిమానులకి ఆ కిక్ ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే సెకెండాఫ్ చివర్లో కొంత పేస్ తగ్గడం మైనస్‌గా చెప్పుకోవాలి. ఓవరాల్‌గా సినిమా బాలయ్య అభిమానులకి కంప్లీట్ మీల్స్ అని చెప్పక తప్పదు.
ఒక్క మాటలో చెప్పాలంటే
బాలయ్య అభిమానులకి పక్కాగా 'పైసా వసూల్'
అంకెల్లో చెప్పాలంటే: 3/5
|