Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ramalingadi telivi

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

ఇదేమీ నిద్ర గురించి కథ అని అపోహ పడకండి. ఊరికే, నిద్రపోవడంలో ఉండే రకాలూ, అందులో ఉండే సౌఖ్యాలూ వగైరా గురించి ఈ వ్యాసం. నేను ఉద్యోగంలో ఉండేటప్పుడు, మా ఫాక్టరీ 24 గంటలూ పని చేసేది , దానితో షిఫ్టుల్లో వెళ్ళవలసొచ్చేది. ఓ వారం అంతా నైట్ షిఫ్టూ రాత్రి పదింటినుంచి మర్నాడు ప్రొద్దుట ఆరున్నర దాకా. రాత్రి డ్యూటీ నాలుగేసి గంటలుండేది. మరీ నాలుగ్గంటలేనా, మిగిలిన నాలుగ్గంటలూ నిద్రేనన్న మాట అనకండి. విరామం లేకుండా,Explosives బిల్డింగులో, నిద్రకళ్ళతో పనిచేస్తే, కష్టం ,పనిచేసేవారికీ, బిల్డింగ్ కీ కూడానూ. అందుకే వంతులేసికుని, సగం మంది మొదటి హాఫ్ ( నాలుగ్గంటలు), మిగిలిన సగం మందీ సెకండ్ హాఫ్ లోనూ పనిచేసేవారు.రెండో హాఫ్ డ్యూటీ పడినవాడు, నిద్రొచ్చినా రాకపోయినా కంపల్సరీ గా షిఫ్ట్ రూం కి వెళ్ళడం, ముసుగెట్టేయడమే. అక్కడేమైనా పరుపులూ మంచాలూ ఉంటాయా ఏమిటీ, ఓ ఇటక నెత్తికింద పెట్టేసికుని, బెంచీ మీదే నిద్రపోవడం! అందుకే అంటారు నిద్ర సుఖమెరగదని !

బస్సుల్లో చూస్తూంటాము కొంతమంది ఆ బస్సు కుదుపుకి జోగుతూంటారు. జోగితే ఫరవాలేదు, పక్కవాడిమీదకు వాలి మరీ జోగుతారు. మనం కదలకూడదు, కదిలితే వాడి నిద్ర భంగం అయి, మనవైపు కొరకొరా చూస్తాడు, అక్కడికేదో వాడి సొమ్ము మనం తిన్నట్లు! కొంతమంది సుఖీ ప్రాణులుంటారు. వాళ్ళకి ఎక్కడ నిద్రపోతున్నామూ అని కాదు, ఎంతసేపు నిద్రపోవచ్చూ అనేది ముఖ్యం! బస్సవనీయండి, ట్రైనవనీయండి,ఆఫీసవనీయండి చదువుకునే టైములో పుస్తకం చేతిలో పట్టుకునేటప్పటికి, నిద్ర ముంచుకొచ్చేసేది. ఎలెట్రీ దీపాలు రాని రోజుల్లో, బుడ్డి దీపాలేగా, దానిముందర కూర్చుని చదవడం, నిద్రతో తూలడం.వెలుగు బాగా రావాలని, ఒత్తి పెంచడం, సడెన్ గా తూలినప్పుడు, నుదిటి మీదున్న వెంట్రుకలు కాలడం, దాంతో ఉలిక్కిపడి లేవడం! ఇంతలో నాన్నగారు అరవడం, ఏరా మెళుకువగా ఉన్నావా అంటూ! ఈ గొడవంతా ఎందుకంటే,రాత్రిళ్ళు చదవకపోతే, తెల్లారుఝామున లేపేస్తారు. దానికంటే ఇదే హాయి!

శలవు రోజొస్తే మాత్రం హాయిగా పొద్దెక్కేదాకా నిద్రపోవడం బాగానే ఉంటుంది. పెళ్ళైన కొత్తలో ఈ వేషాలన్నీ సాగుతాయి. ఓ పిల్లో పిల్లాడో పుట్టుకొచ్చేటప్పటికి, ఈ లగ్జరీస్ అన్నీ స్టాప్! ఆ పసిపిల్లలు, రోజంతా హాయిగా నిద్రపోయి, రాత్రిళ్ళు మొదలెడతారు ఆట పాటలు. ఏ అర్ధరాత్రి పూటో లేచిపోతారు. ఇంక తెల్లారే దాకా మనకి జాగరణే! శలవు పూటా, హాయిగా భోజనం చేసేసి, మంచం ఎక్కేసేమంటే చాలు, హాయిగా నిద్ర పట్టేస్తుంది.

ఉద్యోగంలో ఉన్నంతకాలం, పిలిస్తే పలికే నిద్రాదేవి, ఉద్యోగంలోంచి రిటైరవగానే ఎక్కడకి వెళ్ళిపోతుందో తెలియదు. కొంపలంటుకుపోయినట్లుగా, ఏ అయిదింటికో మెళుకువ వచ్చేస్తుంది. మనకంటే నిద్ర పట్టదు కానీ, ఇంట్లోవాళ్ళకేం హాయిగా నిద్రపోతారు. మనవైపు, చీకటి తొందరగా పడ్డం కారణం కాబోలు, మా రోజుల్లో తొమ్మిది కొట్టేటప్పటికల్లా పడకేసేసేవారు. తెల్లవారకట్ల అయిదయ్యేసరికి మళ్ళీ రోజు మొదలు. టెలిఫోన్లు కొత్తగా అన్ని చోట్లా వచ్చిన రోజుల్లో, అందులోనూ, ఎస్.టి.డి. సౌకర్యం కొత్తగా వచ్చిన రోజుల్లో, మాకు తెల్లవారుఝామున ఫోనొచ్చిందంటే చాలు, మనవైపునుండే అని తెలిసిపోయేది. ఇక్కడ మాకు అంటే పుణె లో ఆరున్నరయేదాకా వెలుగే రాదు. అందుకే ఎప్పుడైనా, ఏ ప్రయాణానికో వెళ్ళడానికి, ప్రొద్దుటి ట్రైన్ బుక్ చేశామా, చచ్చే గొడవ!

నిద్ర అనేది కొందరు చేసుకున్న అదృష్టాన్ని బట్టి ఉంటుంది… మన చిన్నప్పుడు చూసేఉంటాం, మమ అమ్మలు,  భోజనాలయినతరువాత,  “ ఓసారి నడుం వాలుస్తా..” అంటూ, ఆ గచ్చుమీదే, చెయ్యి తలకిందపెట్టుకుని ఓ కునుకు తీసేసేవారు..  అలాగని గాఢనిద్రేమీ కాదు..  ఆ పడుక్కున్నావిడని దాటుకుంటూ, చప్పుడు చేయకుండా, వంటింట్లోకెళ్ళి, ఏ అప్పచ్చులో లాగిద్దామని ప్రయత్నం చేసినా, అది  flop show   అయిపోయేది.. ..”  ఏమిటా చప్పుడూ ఎవరక్కడా.. “ అంటూ ఒక్కకేక పెట్టేది…  ఎంత నిద్రపోయినా ఎలర్ట్ గానే ఉండేవారు…

అలనాటి రోజుల్లో కోడికూతలే మనకి అలారాలు కదా.. అవీ టైముకే కూసేవి, మనవాళ్ళూ టైముకే నిద్ర లేచేవారు… తరవాతరవాతంటే అలారం గడియారాలూ అవీవచ్చాయి. అలాగని అలారం కొట్టగానే లేచిపోతాడనేమీ లేదు.. ఆ అలారం నొక్కేసి, జస్ట్ లేచిపోదాములే అని ఇంకో గంట నిద్రపోవడంలో ఉన్న అలౌకికానందం ఇంకెక్కడుందంటారూ?

ఎన్ని చెప్పండి ఆ నిద్రలో ఉండే సుఖం ఇంక దేంట్లోనూ ఉండదు కదూ…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
weekly horoscope september 22nd to september 28th