Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prize-for-best-comment/

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

జిమ్ కార్బెట్ అభయారణ్యం 

నైనితాల్ రాష్ట్రం లో వున్న జిమ్ కార్బెట్ అభయారణ్యం మా అక్కా బావగారు అయిన గంటి మూర్తిగారు , సుజలగార్లతో కలిసి వెళ్లేం  . ఓ రోజు సుజలక్క  ఫోనుచేసి జిమ్ కార్బెట్ వెళదామా అని అడిగి వారే మా నలుగురికి ఉత్తరాంచల్ ప్రభుత్వం వారిచే నిర్వహింపబడుతున్న టూరిజం ద్వారా టూరు బుక్ చేసేరు . అలా అంతకుముందు అభయారణ్యాలను మేం సందర్శించలేదు , కాబట్టి చాలా ఉత్సాహంగా అనిపించింది . ఢిల్లీలో మాయింటి దగ్గర మమ్మల్ని తీసుకొని రెండురాత్రులు అభయారణ్యం మధ్యలో వున్న వారి గెస్ట్ హౌసులో బస , మూడోరోజు బయలుదేరి తిరిగి యింటి దగ్గర దింపడం తో టూరు ముగుస్తుంది .

ప్రొద్దున్న 9 గంటలకు మా భోజనాలు పట్టుకు బయలుదేరేం , యీ దారిలో భోజనం రచిగానే వుంటుంది గాని యేనూనెతో చేస్తారోగాని తిన్న పది నిముషాలలో వాంతులు , విరేచనాలు ఖాయం , యేదో టీ ఫరవాలేదు . కబుర్లు , హాస్యాలు , కాసేపు చిన్న కునుకులూ అయేక మధ్యాహ్నం మా భోజనాలుచేసుకొని తిరిగి మా ప్రయాణం సాగింది నాలుగు గంటలకు అభయారణ్యం చేరుకున్నాం . 265 కిలోమీటర్లు ప్రయాణించ డానికి అంత సమయమా ? అనే అనుమానం వద్దు , మేం వెళ్లింది 2002 లేక 2003 అనుకుంటా అప్పటకి హైవేలు రాలేదు , దారంతా గతుకులు , కారు ప్రయాణం గోదావరిలో తెడ్డు  ప్రయాణంలా వుండేది .

గేటు దగ్గర మాకు అక్కడ గార్డులు అక్కడ వున్నప్పుడు పాఠించవలసిన నియమాలను వివరించేరు , అభయారణ్యాన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా ప్రకటించేరు కాబట్టి పోలిథిన్ బేగులు వాడొద్దని , వేస్ట్ ని యెక్కడబడితే అక్కడ పారేయొద్దని మాకు రెండు గోనె సంచులు యిచ్చేరు . పారవేయవలసిన చెత్తను అందులో వేసి వెనుకకు వచ్చేటప్పుడు ఆ గోనె సంచులను గార్డులకు యిచ్చేయాలి . 

అక్కడ నుంచి సుమారు పదికిలోమీటర్లు అడవిలో ప్రయాణించాలి . దట్టమైన అడవి , కాకులు దూరని కారడవి అని కథలలో చదువుకున్నాం చూసేరా అలాంటి అడవన్నమాట . చాలా సన్నని రోడ్డు , వాహనాలు  చాలా మెల్లగా నడపాలి , సొంతవాహనాలను అనుమతించరు . హారన్ కొట్టకోడదు , ఒకవేళ జంతువులు అడ్డం వచ్చినా వాటంతట అవి వెళ్లేవరకు మనం మన కారులోనే వేచివుండాలి తప్ప వాటిని అదిలించే ప్రయత్నం చెయ్యకూడదు . గుంపులుగా తిరుగుతున్న దుప్పులు , మచ్చల లేళ్లు కనిపించేయి . చెట్లకి తెల్లని దిమ్మలు కట్టి వుండడం చూసి మా డ్రైవర్ను అడిగితే అతను అవి ఉప్పు దిమ్మలని , జంతువులకు ఉప్పు అవుసరం వున్నప్పుడు వాటిని నాకుతాయని , అలా కట్టకపోతే ఉప్పుకోసం గ్రామాల మీద దాడి చేస్తాయని చెప్పేడు .

ఇక్కడ మనం జిమ్ కార్బెట్ గురించి కాస్త తెలుసుకుందాం . 

ఈ అడవిలో జంతువులు , రాజులను తర్వాత ఇంగ్లీషు వారిని వేటకు యెప్పుడూ ప్రలోభ పెడుతూ వుండేవి . 1836 లో ఇంగ్లీషువారు యీ అడవిలో సేద్యం , నివాస నిర్మాణాలు నిషేధించేరు , తరువాత కాలంలో వేట నిషేధించి యీ ప్రాంతాన్ని సంరక్షిత ప్రాంతం గా ప్రకటించేరు , 1936 లో సుమారు 324 చదరపు అడుగుల అభయారణ్యంగా ప్రకటించి ఆసియా ఖండపు  ప్రధమ అతి పెద్ద అభయారణ్యంగా ప్రకటించి అప్పటి బ్రిటిష్ అధికారి హైలీ పేరుమీద దీనికి హైలీ అభయారణ్యంగా నామకరణం చేసేరు . అదే సంవత్సరంలో వేట , వృక్షాలను నరకడం నిషేధించేరు . 1954 లో ఈ అభయారణ్యానికి ' రామగంగ అభయారణ్యం' గా పేరు మార్చేరు . ఓ ఏడాది తరవాత జంతు అధ్యనకర్త , యీ అరణ్యంలో విస్తృతంగా తిరిగి యెన్నో మార్పులను సూచించిన జిమ్ కార్బెట్ అనే ఆంగ్లేయుని పేరు మీదుగా ' జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ' గా నామకరణం చేసేరు . 1991 లో ' కలఘర్ ' అడవిని కూడా జిమ్ కార్బెట్ అభయారణ్యం లో కలిపి సుమారు 520 చదరపు కిలోమీటర్ల కి విస్తరింప జేసేరు . 1994 లో లుప్తమౌతున్న ' బెంగాల్ టైగర్ ' జాతిని రక్షించేందుకు   ' ప్రోజెక్ట టైగర్ ' ని ప్రారంభించేరు . 

అదన్నమాట జిమ్ కార్బెట్ కథ .

ఈ లోపున  కనిపించిన లేళ్లని ,అడవి పందులని , పేరుతెలియని రకరకాల పక్షులని చూసుకుంటూ మా కారు చాలా మెల్లగా వెళుతోంది , ఓ దుప్పి నడుస్తూ వుంటే దానికున్న కొమ్ములు వూగుతున్నాయి బాగా పరికించి చూస్తే ఆ కొమ్ములు మెత్తగా వున్నట్లు తెలిసింది . అదేం వింత అని మా డ్రైవరుని అడిగితే దుప్పులు చెట్టుకు కొట్టుకొనో వేరే జంతువుతో పోరాడుతున్నప్పుడో లేకపోతే మామూలుగానేనో కొమ్ములు వూడిపోయి వాటిస్థానే కొత్త కొమ్ములు వస్తాయట , అలా కొత్తగా వచ్చిన కొమ్ములు యిలా గట్టి పడకుండా వుంటాయట . ఈ డ్రైవర్లు అభయారణ్యాలలో నడపడానికి  ప్రత్యేక శిక్షణ పొంది వుంటారు , వారికి జంతువుల హావభావాలతో  పరిచయం వుంటుంది . వీరే యిక్కడ గైడ్స్ గా కూడా వ్యవహరిస్తూ వుంటారు .

గెస్ట్ హౌస్ చేరేవరకు కారులోంచి కిందకు దిగకోడదు , అద్దాలు దింపకూడదు అలా పదికిలోమీటర్లు సుమారు 45 నిముషాలు ప్రయాణించి గెస్ట్ హౌసు చేరుకున్నాం . అక్కడ వున్న ఆఫీసులో తాళాలు తీసుకొని మారూముకి చేరుకున్నాం , అక్కడ నుంచికాస్త దూరంలో వున్న డైనింగ్ హాలు లో రాత్రి యేడు వరకు మాత్రమే భోజనం దొరకుతుంది అనే హెచ్చరికతో ఆరున్నరకల్లా భోజనానికి వెళ్లేం , డైనింగు హాలులో అన్ని కిటికీల అద్దాలు పగిలేవున్నాయి , వాకబు చేస్తే అడవి యేనుగలు , వుప్పు కోసం , గోధుమ పిండికోసం యిక్కడ దాడి చేస్తాయట , వాటి రాక చూడగానే యిక్కడి పనివారు కిటికీలలోంచి ఉప్పు , గోధుమ పిండి పడెస్తారట , కాస్త ఆలస్యమైనా యిలా కిటికీలను తొండాలతో కొడతాయట . 

రాత్రి నిద్ర పట్టినా పట్టకపోయినా బయటకు రావద్దని , బయట యెటువంటి శబ్దం వినిపించినా తలుపులు తెరవవద్దని గట్టిగా హెచ్చరించేరు , యిక్కడ మాంసాహారం వడ్డించరు , బయటనుంచి తెచ్చుకు తినడాన్ని కూడా నిషేధించేరు . 

చుట్టారా కంచె వేసిన పెద్ద జాగాలో కట్టిన గెస్ట్ హౌసు , రూములు నాలుగు డబుల్ రూములు రెండు సింగల్ రూములు వున్నాయి , యివి కాక కాటేజెస్ వున్నాయి , యివన్నీ యెప్పుడూ నిండే వుంటాయి , యేడాదిలో నాలుగయిదు నెలలు మాత్రమే తెరచివుంచడం వల్ల , విదేశీ పర్యాటకుల తాకిడి యెక్కువగా వుండటం వల్ల చాలా ముందుగా బుక్ చేసుకుంటే గాని యిందులో రూము దొరకదు .

భోజనం కానిచ్చుకొని మా రూములు చేరేసరికి ఆ ప్రాంతమంతా నిచ్చాటయింది . రాత్రి తొమ్మిదింటికి కరెంట్ సప్లై కూడా నిలిపేస్తారు . తొమ్మిది తరువాత కొవ్వొత్తి , అగ్గిపెట్టే గతి . వెలుతురు జంతువులను ఆకర్షిస్తుందనో యేమో , చీకట్లో మరో అరగంట కబుర్ల తరువాత యెవరిరూముకి వారు చేరుకున్నాం . ఈ గెస్ట్ హౌసు రామగంగా వొడ్డున కట్టడం వల్ల రాత్రి జంతువులు నీరు త్రాగడానికి వస్తాయి , వాటి అరుపులు నిశబ్దరాత్రిలో చెవులలో దూరి భయం కలుగజేసేయి , చాలా సేపటివరకు జంతువుల అరుపులతో భయపడ్డాం . మేం వెళ్లింది డిసెంబరు నెలలో కావడం తో చలి బాగా వుంది , భయంతో ముసుగుపెట్టి పడుకుంటే హాయిగా నిద్ర పట్టేసింది . 

మరునాడు తాపీగా తొమ్మిదింటికి లేచి స్నానాదులు కానిచ్చుకొని టిఫిను చేసి కాస్త నడుచుకుంటూ వెళ్లేసరికి జీపు సఫారీ , యేనుగు సఫారీలకి మా తోటి పర్యాటకులు వెళ్లడం చూసి మేంకూడా కనుక్కోగా ఆ రోజుకి యేనుగు సఫారీ ఫుల్ అయిపోయిందని తెలిసి మరునాడు ప్రొద్దున్నకి బుక్ చేసుకొని ఆరోజు జీపు సఫారీకి బయలుదేరేం .

జీపుకు నలుగురిని మాత్రమే తీసుకు వెళతారు , జీపు డ్రైవరుకి జంతువులు తిరుగుతున్న ప్రదేశాల గురించి సమాచారం వుంటుంది , కాబట్టి ఆ పక్కగా తీసుకువెళ్లడంతో జంతువులు కన్పించే ఆస్కారం యెక్కువ .

జీపు మమ్మల్ని అడవులోకి తీసుకు వెళ్లింది . తలకి స్కార్ఫ్ లు చుట్టుకోవద్దని వాటి రంగులకు ఆకర్షింపబడి జంతువులు ఎటాక్ చేస్తాయని స్కార్ఫ్స్ తీయించేసేరు . జీపు చాలా దట్టమైన అడవిలోకి తీసికెళ్లింది . అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు వున్నాయి . వీరు అభయారణ్యాల నిబంధనలను పాఠిస్తూ అక్కడ జీవనం సాగించాలి . ప్రకృతి యెంత బాగున్నా వికృతమైన జంతువుల మధ్య మనుగడ అంత సులభం కాదు . వికృతమైన మనుషులకన్నా జంతువులే మేలని వారికనిపిస్తుందో యేమో . 

ఈ అరణ్యంలో సుమారు 110 వృక్షజాతులు , 58 జంతుజాతులు , సుమారు 580 రకాల పక్షులు కాక ప్రాకే జంతువులు జాతులు సుమారు ఓ 25 వరకు వున్నాయట .

కొండలు , సరస్సులు , గడ్డి మైదానాలతో కూడుకొని వున్న ప్రాంతం . ఒక చోట యేదో జంతుకళేబరం కుళ్లిన వాసన వస్తే అక్కడెక్కడో పులి తిరుగుతూవుంటుందని మా జీపు డ్రైవరు ఓ పది నిముషాలు అక్కడే జీపు నిలబెట్టేడు , కాని జంతువు బయటకి రాలేదు . మధ్య మధ్యలో వున్న గ్రామాలలో గ్రామస్తులను పులి జాడ అడిగి ఆ ప్రదేశాలకు తీసుకు వెళ్లేడు . నిలువెత్తు గడ్డి మొలిచిన మైదానాలలో ప్రయాణించి రామగంగ వొడ్డుకి చేరుతుండగా నీరు తాగుతున్న రెండు జంతువులను నేను చూసేను , అవి యే జంతువులో నా మెదడు పసిగట్టే లోపున అవి గడ్డిలో కి దూరేయి . నేను మిగతా వారిని హెచ్చరించేను , వారెవరూ మా డ్రైవర్లతో సహా చూడలేదన్నారు , డ్రైవరు మాత్రం పులులని అన్నాడు , అయితే అవి దూరంగా పోలేదని గడ్డి కదలికలను బట్టి అంచనా వేసి నాద్గర అప్పట్లో కొత్తగా వచ్చిన సోని వారి హేండీ కేమ్ తో వీడియో ఆగడ్డి మైదానానికి తీసేను . ఓ అరగంట అక్కడవున్నా ఆ పులులు తిరిగి బయటకి రాలేదు . నేను చూసింది పులులనేనా ? అనే సందేహం కలిగింది , యింటికి చేరేక నేను తీసిన వీడియో వేసుకు చూస్తూ వుంటే గడ్డి మైదానంలో గడ్డి వెనకాల కూర్చొని మమ్మల్నే చూస్తున్న రెండు పులులు చాలా స్పష్టంగా కనిపించేయి . 

అలా అడవిలో తిరుగుతూ వుండగా ఓ చోట చెట్టుపైనున్న కోతి భీకరంగా అరవడం కిందన వున్న సాంబారులేడి తోకనెత్తిపెట్టి అరవడం విని మా జీపు అక్కడ ఆపి అడవిలో కుడివైపుకి చూపించి అటు వైపు చిరుతపులి వుందని డ్రైవరు చెప్పి యెటువంటి శబ్దం చెయ్యొద్దని హెచ్చరించేడు , కోతి సాంబారులేడి అరుపులు వింటూవుండగానే మా ముందునుంచి మెరుపు వేగంతో రోడ్డు దాటి యెడమవైపున్న అడవిలోకి పారిపోయింది చిరుత . కోతి సాంబారులేడి యెడమవైపుకు చూస్తూ అరవసాగేయి . అడవిలో ముందుగా కృూరజంతువుల సంచారం పసిగట్టి అవివున్న వైపు తిరిగి యిలా అరుస్తాయట , సాంబారులేడి కూడా యిలా అరిచి మిగతా జంతువులకు క్రూరజంతువుల సంచారం గురించి సమాచారం అందిస్తుందట . ప్రత్యక్షంగా అవి చూసిన మాకు ఒళ్లు గగుర్పొడిచింది . అప్పటికి మధ్యాహ్నం అవడంతో  మా బస చేరుకున్నాం . నక్కలు , వేట కుక్కలు , అడవిపందులు లెక్కలేనన్ని లేళ్లను చూసేం .

తోటి పర్యాటకులతో ముచ్చటలో సమయంలో వారికి లేళ్లు తప్ప మరేం కనిపించలేదని వారు చెప్తే మేం మా అనుభవాలు చెప్పేం . దానికి వారి కళ్లలో అసూయ కనిపించింది . 

చీకటి పడేవరకు రామ్ గంగ వైపు వేసిన కుర్చీలలో కూర్చొని జంతువులకోసం చూసేం . నక్కలు తప్ప మరేం కనిపించలేదు . ముందురోజు పులులు అక్కడ నీరు త్రాగడానికి వచ్చేయని గార్డులు చెప్పారు కాని ఆ రోజు అవి రాలేదు .

అయితే అలా అక్కడ కూర్చున్నప్పుడు కోతులను దగ్గరగా పరిశీలించే అవకాశం కలిగింది , వాటిని చూస్తున్న కొద్ది వాటికి మనిషికి వున్న పోలికలు బాగా తెలిసాయి . పిల్లలను ముద్దు చెయ్యడం , కాస్త పెద్ద కోతిపిల్ల దగ్గర చిన్న కోతి పిల్లని విడిచి పెట్టడం  , ఆ రెండిటి ఆటపాటలు అచ్చు మన పిల్లలు ఆడుకుంటున్నట్టే అనిపించింది .

మరునాడు అడవిలో యేనుగుపై తిరగడానికి ముందురోజే బుక్ చేసుకోడం తో పొద్దున్నే టీ తాగి బయలుదేరేం , యేడు నుంచి పదకొండు వరకు నాలుగు గంటల సఫారి , యేనుగు మీద నలుగురినీ కూర్చేపెట్టి జీపుకూడా వెళ్లలేని ప్రదేశానికి తీసుకు వెళ్లేడు . అక్కడ పులి అడుగుజాడలు , రెండుపులులు తిరుగాడినట్లుగా చెట్టు కొమ్మలు ఆకులు నలిగి , పులివెంట్రుకలు చెట్లకి అంటుకొని కనిపించేయి , యేదో జంతువు యొక్క అవశేషాలు కన్పించటం పులి యెక్కడనుంచైనా మీద పడుతుందేమో అనే భయం కలిగింది , యింకా లోపలకు వెళితే దూరంగా పొగమంచు చాటునుంచి అడవి యేనుగుల గుంపు కనిపించింది , చెట్లను పీకి కొమ్మలు తుంచి నానా భీభత్సం చేస్తున్నాయి . ఇంక అక్కడ వుండడం మంచిది కాదని మా మావటీడు యేనుగును వెనుకకి మళ్లించేడు .

మధ్యాహ్న భోజనం చేసుకొని ఢిల్లీకి ప్రయాణమయేం , మళ్లా దారిలో రకరకాలైన లేళ్లను చూసుకుంటూ గేటు చేరేక అక్కడ మాతో తెచ్చిన చెత్త అక్కడున్న చెత్తబుట్టలో పారేసి , గోనె సంచులు వారికిచ్చి బయలు దేరేం .

మరో మారు ముందుగా బుక్ చేసుకోకుండా వెళ్లేం , గెస్ట్ హౌసులో ఖాళీ లేక పోవడంతో మాకు మూడో గేటు లోంచి ప్రవేశించడానికి అనుమతిచ్చేరు . అక్కడనుంచి వెళితే మాకేజంతువలు కనిపించలేదు కాని అక్కడనుంచి బయటకు వెళ్తున్నప్పుడు అక్కడ వున్న గార్డ్ చీకటి పడ్డాక ఆ రోడ్డుమీంచి చాలా జంతువులు రామగంగ కి నీటి కోసం వెళ్తాయని మన కారు లో కూర్చొని వాటిని చూడొచ్చు అని , అర్దరాత్రి సమయంలో పులులు కూడా ఆ దారంటే వెడతాయని కారు రోడ్డు మీద ఆపుకొని నిశ్శబ్దంగా చూడొచ్చని చెప్పేడు . మేం చీకటి పడేవరకు అక్కడే వుండి రాత్రి అవడం తోనే వందల కొద్ది జంతువులు రోడ్డు దాటడం చూసేం అలా వెళుతునే వున్నాయి కాని పులులు మాత్రం రాలేదు అర్ధరాత్రి వరకు అక్కడ తిరగడం అంతమంచిది కాదని రామ్ నగరులో మా హొటల్ కి వెళ్లిపోయేం . 

మళ్లావారం నైనితాల్ వెడదాం అంతవరకు శలవు .      

మరిన్ని శీర్షికలు
short flim on sree sree sree ramanuja charya