Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపటి ఫణిబాబు

chamatkaaram

కొంతమందికి జ్ఞాపకశక్తి అమోఘంగా ఉంటుంది. సాధారణంగా మన ఇళ్ళలో ఆడవారికి , ఎవరినైనా ఒకసారి పలకరిస్తే చాలు, జీవితాంతం గుర్తుంటారు. కానీ మగవారికి , ఆ కలిసినవారు ఓ నాలుగైదుసార్లు కలిస్తేనే కానీ గుర్తుండరు. పేరుమాట దేవుడెరుగు, కనీసం మొహంకూడా గుర్తుపట్టలేరు… ఆ జ్ఞాపకశక్తి ధర్మమేమో కానీ, చదువుల్లో కూడా ఆడవారిదే పైచెయ్యి. గుర్తుండేఉంటుంది… మన చిన్నతనంలో ఎవరికైనా పెళ్ళిసంబంధాలు వస్తే, ఆ ఇంట్లో ఉండే ఏ అమ్మమ్మగారినో, నానమ్మగారినో అడిగితే చాలు, అవతలివారి “ ప్రవర “ తో సహా చెప్పగలిగేవారు. ఇంక ఎవరివైనా పుట్టినరోజులంటారా.. . “ అప్పుడెప్పుడో గాలివానొచ్చినప్పుడు కదరా వీడు పుట్టిందీ ..” అనో, లేక “ మనింట్లో నందికేశుడి నోము పట్టినప్పుడు కదురా..” అనో… ఇలా ఆ ఫలానావాడు ఎప్పుడు పుట్టాడో, అప్పుడు జరిగిన సంఘటనలతో సహా చెప్పగల ఉద్దండులు..ఇంక వారికి సంబంధించిన చుట్టపక్కాలగురించైతే కొట్టిన పిండే.. వారి దృష్టినుండి ఏ విషయమూ తప్పించుకోలేదు …
వంశపారంపర్యమో, లేక modern Science  ప్రకారం  genetic  వలననో కానీ, ఈరోజుల్లో కూడా, ఇంటి ఇల్లాళ్ళకు ఈ సుగుణం అబ్బేసింది… చాలాసార్లు మగాళ్ళని ఇబ్బంది పెట్టేస్తూంటుంది… పెళ్ళయి ఎన్నిసంవత్సరాలు కానీయండి,, అన్ని విషయాలూ గుర్తుంటాయి.. చిత్రం ఏమిటంటే సరదాగా అన్న మాటలతో సహా..  సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తుచేస్తూంటారు… అంటే చెప్పడమన్నమాట.. ఒరేయ్ బడుధ్ధాయీ నువ్వు మర్చిపోయినా నాకు మాత్రం గుర్తుంటుందీ అని… ఇదివరకటి మాటెలాఉన్నా ఇటుపైనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్టాడూ అని గుర్తుచేయడమన్నమాట. 

ఇన్నేళ్ళ కాపరంలోనూ, మనం అవసరార్ధం వాళ్ళదగ్గర ఎన్నిసార్లు “ అప్పు “ చేసేమో, ఎగ్గొట్టిన అప్పు వడ్డీతో సహా ఎంతయిందో, జమా ఖర్చుకూడా చెప్పేటంత అద్భుతమైన జ్ఞాపకశక్తి…మనం తీర్చేదీలేదూ పెట్టేదీలేదూ.. అదో సరదా.. అయినా ఏదో ఒక దెబ్బలాటుండందే  సంసారంలో మజా ఎక్కడా?  కదా ?

మగాళ్ళ విషయం వేరు.. ఎప్పుడో ఓసారి కలుసుకుని మాట్టాడిన మనిషైనా సరే, అకస్మాత్తుగా ఇంకోసారి చూసి పలకరించినా, ఆ మనిషెవరో ఛస్తే గుర్తుకు రాదు. పాపం అవతలి మనిషి ఎంతో ఆప్యాయంగా మనల్ని పేరుపెట్టి పలకరించినా సరే. ఏదో మొత్తానికి గుర్తుతెచ్చుకుని,  “ ఎప్పుడో కలుసుకున్నాము కదండీ.. అందుకే గుర్తురాలేదూ.. “ అని ఓ సమర్ధింపోటీ.. ఒక విధంగా అదీ నిజమేనేమో.. ఈరోజుల్లో నిన్న రాత్రి తిన్నదే గుర్తుండడం లేదూ, అలాటిది ఎప్పుడో కలిసిన మనిషి నామరూపాలెక్కడ గుర్తుంటాయీ? ఏదో మొహమ్మాటానికి, ఆ అవతలి పెద్దమనిషీ, మన వయసు రీత్యా ఒప్పేసుకుంటాడు.అలాగని  అదేదో  “ డిమ్నీషియా “ యో  “ ఆల్ఝిమేర్స్ “ రోగమో వచ్చిందని కాదు, జస్ట్ జరుగుబాటు అంతే.

ఇంక  ఇంటి ఇల్లాళ్ళవిషయానికొస్తే చెప్పానుగా వారి జ్ఞాపకశక్తి గురించి.. మగాళ్ళు వేలంవెర్రిగా డబ్బులు ఖర్చుచేస్తారన్నది జగమెరిగిన విషయమే. ఆ కారణం చేత, ప్రతీనెలా ఇంటి ఖర్చులకోసం తీసికునే డబ్బులలో, కొంతసొమ్ము దాచుంచుతారు, అవసరానికి పనికొస్తుందికదా అనీ. ఆ డబ్బులెక్కడ దాచారో ఆ భగవంతుడిక్కూడా తెలియదు. అలాగని ఏదో లాకర్లలో దాస్తారనీ కాదూ.. ఏ పోపుల డబ్బాల్లోనో, ఏ చీరల మడతల్లోనో దాస్తూంటారు. వాళ్ళకి తప్ప ఇంకో ప్రాణికి తెలిసే అవకాశం లేదు. పైగా కర్మకాలి వాళ్ళు ఏ పేరంటానికైనా వెళ్ళినప్పుడు, వెదుకుదామని మనస్సు పీకి, ఇంటావిడ కబ్బోర్డు లో వెతికినా, పైకి కనిపించే , వాళ్ళ బ్యాగ్గుల్లో ఏదో తలో అరలోనూ పదిరూపాయల కాగితాలు , ఇంకో అరలో చిల్లరా తప్పించి ఇంకేమీ కనిపించవు. అసలు ఖజానా ఎక్కడుందో తలకిందులా తపస్సు చేసినా తెలియదు… ఆ కబ్బోర్డులో అటూ ఇటూ కెలకడం వలన చివరకి వీధిన పడేది మగాళ్ళే..పేరంటానికి వెళ్ళి తిరిగొచ్చి, మొట్టమొదట ఆ ఇల్లాలు పరిశిలించి చూసేది తన కబ్బోర్డే అనడంలో సందేహం లేదు.. కారణం.. “ ఏమండీ నా కబ్బోర్డులో ఏమైనా చెయ్యిపెట్టారా.. “ అంటూ , పోలీసాళ్ళలాగ ప్రశ్నిస్తుంది.  అదేమిటీ తనకెలా తెలిసిందీ అని ఆశ్చర్యపడక్కర్లేదు.. అక్కడేమీ సీసీ కెమారేలేవీ లేవు. అదంతా వారి జ్ఞాపకశక్తి మహాత్మ్యం… ఏ మడత ఎలా పెట్టారో, ఏ మడతలో ఏం పెట్టారో అన్నీ గుర్తేకదా మరి, ఆ మడత స్థానభ్రంశం పొందిందంటే తెలియదూ ? ఏమిటో మగాళ్ళే చాలా తెలివైనవారని అనుకోవడం.. అదంతా ఒఠ్ఠి భ్రమ.. అడగ్గానే ముందర తప్పించుకోడానికి ప్రయత్నమైతే చేస్తాడే.. “ నాకేం తెలుసూ.. “ అని.. అదంతా క్షణికమే.. “ చెట్టంత మనిషి  ఇంట్లో మీరుండగా, ఎవడో పైవాడెవడో ఎలా వస్తాడండీ.. పోనీ ఇంట్లో ఏవరైనా పిల్లలున్నారా అంటే, వాళ్ళందరూ రెక్కలొచ్చి ఎగిరేపోయారే.. “ అని ఓ తురపు ముక్కవేసి , మన నిర్వాకం బయటపడుతుంది…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
prize-for-best-comment