Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bhetaala prasna

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపటి ఫణిబాబు

chamatkaaram

ఈ రోజుల్లో ఎక్కడో అక్కడ, తల్లితండ్రులు, వారి వారి పుత్రరత్నాలతో కలిసి ఒకే ఇంట్లో ఉండడం చూస్తూంటాము… ఒక వయసు దాటాక, పిల్లల దగ్గర ఉండడం అన్ని విధాలా మంచిదే..ఏ అత్యవసర పరిస్థితో వస్తే, కనీసం దేశంలో ఉండే పిల్లల దగ్గర ఉండాలనే ఉంటుంది. కానీ వాటిలో కూడా కొన్ని సాధక బాధకాలుంటాయి… ఎవరి దృష్టిలో వాళ్ళు తమదే రైటనుకుంటారు… ఒకరి అభిప్రాయం ఒకరితో చెప్పుకోవాలని ఇద్దరికీ అనిపించదూ.. ఈ ఇద్దరి మధ్యా నలిగిపోయేది ఆ పిల్లాడి తల్లి… తనకి కట్టుకున్నవాడూ, కన్న బిడ్డా , ఇద్దరూ ముఖ్యమే పాపం..
చెప్పాలంటే ఈ తరం పిల్లలకి తమ తల్లితండ్రులంటే చాలా ఇష్టం.వచ్చిన గొడవల్లా ఏమిటంటే ఒక్కొక్కప్పుడు ఆ ఇష్టం మరీ ఎక్కువగా చూపించేస్తూంటారు.ఉదాహరణకి,వాళ్ళ నాన్నగారి విషయమే తీసికోండి,ఆయన ఇన్నాళ్ళూ శ్రమ పడ్డారుకదా అని, ఇంక శ్రమ పెట్టకూడదనే సదుద్దేశ్యంతో, ఎప్పుడైనా ఆయన అలవాటుకొద్దీ ఏ బజారుకేనా వెళ్ళి,సరుకులో, కూరలో తెద్దామనుకుంటే, 'వద్దు డాడీ, మీరెళ్ళకండీ,ఊరికే అంతదూరం, నేను తీసుకొచ్చేస్తానూ' అంటాడు. ఈ పెద్దాయననుకుంటాడూ, 'అదిగో రిటైరయ్యాను కాబట్టి,ఇంక నా మాట చెల్లట్లేదూ అని ఓ ఫీలింగొచ్చేస్తుంది.అప్పటినుండీ, ప్రతీ విషయంలోనూ ఏవేవో ఊహించేసికొని, తనని ఎవరూ పట్టించుకోవడంలేదూ అని ఓ 'దేవదాసు' పోజు పెట్టేసికొని,ఇంక తన భవిష్యత్తంతా మంటగలిసిపోయిందీ అని ఊరికే 'ఇది' అయిపోతూంటాడు.

ఇంక అమ్మగారి విషయం తీసికుంటే-- ఇన్నాళ్ళూ ఇల్లందరికీ వంట చేయడంతోటే సరిపోయిందీ, ఇప్పుడైనా రెస్ట్ ఇద్దామనే ఉద్దేశ్యం తో ఇంట్లోకి ఓ వంట మనిషిని పెడతారు.ఆవిడ ఈ విషయం అసలు జీర్ణించుకోలేదు.తన సామ్రాజ్యాన్ని ఎవరో ఆక్రమించేశారూ అనుకుంటుంది.పిల్లలు చేసిన పని ఈవిడ సుఖం కోసమే అని గుర్తించదు.పోనీ ఎప్పుడైనా పిల్లలకీ, భర్తకీ తన చేతుల్తో ఏమైనా వండిపెడదామనుకున్నా, వంటావిడుందికదా, మీరెందుకు శ్రమ పడతారూ అంటూ కొడుకూ, కోడలూ ఆవిడని కిచెన్ లోకే రానివ్వరు.
ఎక్కడైనా ఎప్పుడైనా ఎడ్మినిస్ట్రేషన్ మారినప్పుడు ఇలాటి మార్పులు సహజమే.ఇంట్లో ఉన్న పెద్దాయనకి ఈ విషయాలు తెలుసు-ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ ఇలాటివెన్నో చూశాడు. అయినా ఇంటిసంగతి వచ్చేటప్పడికి వాటిని ఎప్రీషిఏట్ చేయలేడు.

ఇంట్లో కొడుక్కి పిల్లలున్నారనుకోండి, వాళ్ళని ఏ క్రెచ్ లోనో పెడతారు.కారణం తల్లితండ్రుల్ని శ్రమ పెట్టకోడదనే కానీ ఇంకోటి కాదు.ఒకటి చెప్పండి, ఇప్పటి 'హైపర్ ఏక్టివ్' పిల్లల్ని చూసే ఓపిక ఉంటుందా ఈ పెద్దాళ్ళకి. వాళ్ళ పిల్లల్ని పెంచారంటే అది తమ బాధ్యత కాబట్టి.ఇంకో సంగతేమంటే ఆరోజుల్లో ఎవరో ఒఖ్ఖరే ఉద్యోగానికెళ్ళేవారు, ఇప్పుడల్లా కాదే, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే కానీ, 'లక్జరీస్' సమకూర్చుకోలేరు. ఈ పెద్దాళ్ళు మాత్రం ఎన్నాళ్ళుంటారూ, ఓ పదేళ్ళు, మహా అయితే పదిహేనేళ్ళు, ఆ తరువాత ఎవరు చూస్తారూ ఆ పిల్లల్నీ?

'ఎఫోర్డ్' చేయగలరు కాబట్టి తమ పిల్లల్ని క్రెచ్ లకీ, ప్రొద్దుటినుండీ సాయంకాలం దాకా ఉండే స్కూళ్ళకీ పంపుతూంటారు.ఇదంతా పిల్లల్ని తమనుండి దూరం చేయడానికి వేసిన 'కుట్ర' అని ఈ పెద్దాళ్ళ ఏడుపూ.ఇంట్లో పెద్దాయన ఓ సంగతి 'కన్వీనియెంట్' గా మర్చిపోతూంటాడు, తను తన పిల్లల్ని తనకి కావలిసిన పధ్ధతి లోనే పెంచాడు. మరి అదే పిల్లల విషయంలోకి వస్తే ఎందుకు అలా గింజుకోవడం? తనకో న్యాయం, పిల్లలకో న్యాయం తప్పు.ఈయన తల్లితండ్రులూ ఇలాగే బాధ పడేవారేమో?ఎప్పుడైనా ఆలోచించాడా? ఏదో “ ఆయనే ఉంటే… “ అన్న సామెతలాగ, ఆ విషయం ఆలోచించుంటే అసలు గొడవే ఉండకపోను…ఈ పెద్దాయన తన దృష్టికోణం లోనే చూడ్డం వలన వచ్చిన తిప్పలివన్నీ..

ఎప్పుడైనా పెద్దాయన ఏ బజారుకో, లేదా ఏ ఫ్రెండింటికో వెళ్దామని బయలుదేరతాడు, అక్కడే ఉన్న కొడుకు,'ఎక్కడికెళ్తున్నావు డాడీ' అంటాడు. అంతే ఈయనకి చిర్రెత్తుకొచ్చేస్తుంది,'బయటకు వెళ్ళడానిక్కూడా స్వతంత్రం లేదా అనుకుంటాడు.కొడుకు ఉద్దేశ్యమేమిటంటే, దూరం వెళ్తూంటే, పోనీ కారు లో దిగబెడదామా అని.కానీ తన ఉద్దేశ్యాలన్నీ' మన్హీ మన్నే ఉంటాయి(మనస్సులోనే) వాడు తననుకున్నదేదీ బయటకూ చెప్పడూ, పోనీ చెప్పొచ్చుగా , చెప్తే వాడిసొమ్మేంపోయిందీ అని ఆ పెద్దాయన అనుకుంటాడు.ఇదిగో ఇలాటి చిన్న చిన్న విషయాల్లోనే అపార్ధాలు వస్తూంటాయి.పోనీ ఈయనేమైనా తక్కువ తిన్నాడా,ఎక్కడికెళ్తున్నాడో చెప్పొచ్చుగా. అబ్బే నన్నే అడిగే తాహతొచ్చిందా అని ఊరికే బ్లడ్ ప్రెషర్ పెంచేసికుంటాడు....

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
prize-for-best-comment