Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Paper artMaking cow Boy Boots with color paperLearn to Make Easilystep by step

ఈ సంచికలో >> శీర్షికలు >>

పుస్తక సమీక్ష: ఆపాత మధురం - -సిరాశ్రీ

book review
పుస్తక సమీక్ష: ఆపాత మధురం
రచన: డా| రాజా 
ధర: రూ.250/-
కాపీలకు: అన్ని ప్రముఖ పుస్తకవిక్రయ కేంద్రాలు 
డా| రాజా : 9948812306 / [email protected]

పాత సినిమా పాటలు నిజంగానే ఆపాతమధురం. అందుకే ఆ టైటిల్తో ప్రఖ్యాత సినీసంగీత సాహిత్య పరిశోధకులు, విశ్లేషకులు మ్యూజికాలజిస్ట్ డా| రాజా గారు ఈ పుస్తకం మన ముందుకు తెచ్చారు. రాజా గారు సినీకవులకు, సంగీత దర్శకులకు, గాయకగాయనీమణులకు, సినీసంగీతప్రియులు ఎందరికో సుపరిచితులు. వారి వ్యాఖ్యానంతో కూడిన పుస్తకం అంటే ఎందరిలోనో ఆసక్తి రేకెత్తిస్తుంది.

ఈ పుస్తకం చదివితే ఒక నాస్టాల్జియా నదిలో ఈదిన అనుభూతి, టైం మెషీన్ ఎక్కి గతంలో తేలిన భావన కలుగుతాయి. సినిమా పాట మీద బలమైన ఆసక్తితో పాటు ప్రతి పాటకు సంబంధించిన రాగఛాయల్ని, రచనా నేపథ్యాన్ని సునిశితంగా పరిశోధించడం, పరిశీలించడం... అలా పరిశీలించిన విషయాన్ని విపరీతమైన ధారణాశక్తితో అక్షరబద్ధం చేయగలగడం రాజాగారి ప్రతిభ. ఆయన వ్యాఖ్యానం నిజంగా హృదయోల్లాసం. 
5-6 దశాబ్దాల కృతం సినిమా పాట అంటే మెయిన్ స్ట్రీం సాహిత్యం కాదు అప్పట్లో. శ్రీశ్రీ, ఆరుద్ర వంటి సినీకవులు కూడా వారి వారి కవితాసంకలనాలు పుస్తకాలుగా వెలువరిస్తూ ఉండేవారు. కనుక సాహిత్య రంగంలో సినిమాపాటకి కాస్త చిన్నచూపు ఉండేది అని ఆ కాలం వాళ్లు కొందరు చెప్పగా విన్నాను. అయినా స్వచ్ఛమైన తెలుగు పదాలు, భావాలతో కూడిన ఆనాటి సినీ సాహిత్యం ఈనాడు చదువుతుంటే దండం పెట్టాలనిపిస్తుంది. తెలుగు భాషలో ఎంతో కొంత ప్రావీణ్యం సంపాదించాలంటే పాత పాటలు విని వాటిల్లోని పదాల అర్థాలు తెలుసుకుంటే సరిపోతుంది.

"ఎందుకె రాధా ఈసునసూయలు.."
"లాయిరి నడి సంద్రములోన లంగరుతో పని ఏలోయ్.."

నిజానికి "ఈసునసూయలు", "లాయిరి" వంటి పదాలు అప్పటి వ్యవహారభాషలో వాడే పదాలేమీ కావు. కవులకి ఇచ్చిన స్వేచ్ఛ వల్ల ఆ పదాలు ఇలా పాటల్లో సేదతీరాయి. అలా భాష సుసంపన్నం అయ్యేది.

ఇప్పుడలా కాదు. సినిమా పాటే మెయిన్ స్ట్రీం సాహిత్యం. ప్రాచుర్యం, ప్రాభవం వల్ల వచ్చే గౌరవం సినిమా పాటకి ఉన్నంతగా ఇతర సాహిత్యానికి లేదు. కానీ, భాషని సుసంపన్నం చేసే ఆనాటి స్వేచ్ఛ ఇప్పుడు తక్కువ అనే చెప్పాలి.  ఈ భావనలన్నీ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు కలిగాయి.

సఖి సినిమాలో వేటూరి రాసిన "స్నేహితుడా" పాటలో "సేవలు శాయవలెరా" అని వినిపిస్తుంది. ఈ "శాయవలెరా" కి మూలాలు ఎక్కడ? 1952లో వచ్చిన ఆ పాట ఏది? ఆ కథ ఏమిటి? వీటికి సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి.

"అందమె ఆనందం..." పాట తెలియని వారు ఉండరు..ఈ తరంలో కూడా. ఆ పాట వెనుక ఉన్న ఆసక్తికరమైన చిన్న చరిత్ర ఏమిటి? ఇందులో ఉంది.

అలాగే "ఏరువాక సాగారో .." పాట ఎంతమందిని ప్రభావితం చేసింది? హిందీ సినిమా సాహిత్యంలోకి "రామయ్య వస్తావయ్య" రీతిలో "చిన్నన్న" అనే పదం ఎలా చేరుకుంది? ఇటువంటి ఎన్నో విషయాల సమాహారం ఈ నిండైన పుస్తకం. కాలక్షేపానికి మొదలుపెట్టినా సినిమాపాటల చరిత్ర చదివిన అనుభూతినిస్తూ నిరక్షరాస్యులకి ఫొటొ ఆల్బం గానూ, సామాన్యులకి పాటల్పుస్తకంగానూ, సంగీతజ్ఞులకి ఒక రాగమాలికగానూ, భాషాభిమానులకి ఒక కావ్యంగానూ ఉంటుంది ఈ "ఆపాతమధురం". .

1951-55 మధ్య విడుదలై తెలుగు చలనచిత్ర చరిత్రలో సూపర్ క్లాసిక్స్ గా నిలిచిపోయిన 21 సినిమాల్లోని పాటలు 143 పేజీల్లో చాలా అందంగా కనిపిస్తాయి. పాటల సంగతి సరే. అసలు ఇదొక ఫొటో ఆల్బం. అలనాటి అరుదైన పాత సినిమా ఫొటోలు ఇందులో నిక్షిప్తం అయి ఉన్నాయి. అందుకే దీనికి "చిత్రగీతాలకు సుచిత్ర హృదయోల్లాస వ్యాఖ్యానం" అని ఉపశీర్షిక కూడా పెట్టారు. కనుక ఎలా చూసినా తెలుగు భాషాభిమానులు, సినీసంగీతాభిమానులూ పదిలంగా లైబ్రరీలో దాచుకోవాల్సిన పుస్తకం ఇది.

-సిరాశ్రీ 
మరిన్ని శీర్షికలు
prapancha telugu mahasabhalu