Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఎంసిఎ చిత్ర సమీక్ష

MCA movie review

చిత్రం: ఎంసిఎ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి 
తారాగణం: నాని, సాయి పల్లవి, భూమిక, రాజీవ్‌ కనకాల, విజయ్‌, నరేష్‌, ఆమని, ప్రియదర్శిని పులికొండ తదితరులు. 
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
దర్శకత్వం: వేణు శ్రీరామ్
నిర్మాత: దిల్ రాజు 
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ: 21 డిసెంబర్‌ 2017

క్లుప్తంగా చెప్పాలంటే

అన్నయ్య రాజీవ్‌ (రాజీవ్‌ కనకాల) అంటే, తమ్ముడు నాని (నాని)కి చాలా చాలా ఇష్టం. రాజీవ్‌కి జ్యోతి (భూమిక)తో పెళ్ళవుతుంది. పెళ్ళయ్యాక అన్నయ్య రాజీవ్‌ మారిపోయాడనీ, ఆ మార్పుకి వదిన జ్యోతి కారణమనీ నాని భావిస్తాడు. అలా ఆ ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. ఉద్యోగం చేసే జ్యోతి, విధి నిర్వహణలో చాలా స్ట్రిక్ట్‌. ఆమెకు వరంగల్‌ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఆమెకు సహాయంగా నాని వెళ్ళాల్సి వస్తుంది. దాంతో అక్కడ నాని పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఇంకో వైపున నాని, పల్లవి (సాయి పల్లవి)తో ప్రేమలో పడ్తాడు. అయితే విధి నిర్వహణలో స్ట్రిక్ట్‌గా ఉండే జ్యోతికి, స్థానికంగా ఉండే ఓ రౌడీతో గొడవ జరుగుతుంది. ఆ రౌడీ శివ, జ్యోతిని చంపేస్తానని హెచ్చరిస్తాడు. మరి నాని, తన వదినను కాపాడుకున్నాడా? రౌడీ షీటర్‌తో నాని ఎలా తలపడ్డాడు? వదిన - మరిది మధ్య అపోహలు, అపార్ధాలూ తొలగిపోయి ప్రేమాభిమానాలు పెరుగుతాయా? అన్న ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే

ఏ పాత్రలో అయినా ఒదిగిపోవడం నాని ప్రత్యేకత. పాత్ర బరువైనది కావొచ్చు, సరదా సరదాగా సాగిపోయే పాత్ర కావొచ్చు. ఏ పాత్రలో అయినా నాని సహజమైన నటనతో, ఆయా పాత్రల్లో లీనమైపోతాడు. అలాంటిది మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి పాత్రలో నాని ఇంకెంతగా చెలరేగిపోతాడో ఊహించుకోవచ్చు. ఈ సినిమాలో అదే జరిగింది. తొలి తెలుగు సినిమా 'ఫిదా'తో మంచి మార్కులేయించుకున్న సాయి పల్లవి ఈ సినిమాలోనూ తెలంగాణ అమ్మాయిలానే కన్పించి, మెప్పించింది. డాన్సుల్లో మంచి ఈజ్‌ ప్రదర్శించింది. హీరోకి ధీటుగా సినిమాలో జోరుజోరుగా కన్పించింది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది.

కొంతకాలం గ్యాప్‌ తర్వాత తెలుగు తెరపై కన్పించిన భూమిక, తనదైన నటనతో మెప్పించింది. ఆమె ప్రెజెన్స్‌ సినిమాకి అదనపు బోనస్‌. ప్రియదర్శిని, రాజీవ్‌ కనకాల బాగా చేశారు. విలన్‌గా కొత్త కుర్రాడు విజయ్‌ ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.

కథ పాతదే. కథనం పరంగానూ కొత్తదనం చూపించే ప్రయత్నమైతే చేయలేదు. డైలాగ్స్‌ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. తెలంగాణ అందాల్ని సినిమాటోగ్రాఫర్‌ అత్యద్భుతంగా చిత్రీకరించాడు. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా కనిపిస్తుంది. సంగీతం ఓకే. పాటలు వినడానికీ తెరపై చూడటానికీ బాగానే ఉన్నాయి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఓకే. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

ఓ పక్క నాని, ఇంకోపక్క సాయి పల్లవి, వీరిద్దరికి తోడు భూమిక. తెరపై ఈ ముగ్గురి పాత్రలూ నేచురల్‌గా కన్పిస్తూ ఉంటే భలేగా అన్పిస్తుంది. ఫస్టాఫ్‌ అంతా ఎక్కడా బోర్‌ కొట్టనివ్వదు సినిమా. అయితే సెకెండాఫ్‌కి వచ్చేసరికి మొత్తం మారిపోతుంది. అక్కడి నుంచి కథ గాడి తప్పుతుంది. సినిమా కాస్త భారంగా నడుస్తున్నట్లు అనిపిస్తుంటుంది. క్లయిమాక్స్‌ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. సెకెండాఫ్‌ మీద దర్శకుడు ఇంట్రెస్ట్‌ పెట్టి ఉంటే బెటర్‌ రిజల్ట్‌ వచ్చి ఉండేదే. ఫస్టాఫ్‌ వరకూ మాత్రం నాని మ్యాజిక్‌, సాయిపల్లవి అదనపు ఆకర్షణ అన్నీ బాగా వర్కవుట్‌ అయ్యాయనిపిస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే

మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌ బాగానే ఉన్నాడుగానీ!

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka